breaking news
Commission for Women
-
వెనక్కి నడవమంటున్నారా?
మహిళల భద్రత కోసమని చెబుతూ ఈమధ్య ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కొన్ని మూర్ఖపు సలహాలిచ్చింది. వాటి ప్రకారం... మగ టైలర్లు ఆడవాళ్ల దుస్తుల కొలతలు తీసుకోకూడదు; మగవాళ్లు జిమ్ముల్లో ఆడవాళ్లకు ట్రెయినర్లుగా ఉండకూడదు. వాళ్ల ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ ఇది ఇంకో రకమైన తాలిబనిజం అవుతుంది. ఎందుకంటే, ఇలాంటివి చివరకు మహిళలకు కీడే చేస్తాయి. వారి వ్యక్తిగత ఎంపికకు భంగం కలిగిస్తాయి. ఇది ఇంతటితోనే ఆగుతుందా? ఫిజియోథెరపిస్టులుగా, దంతవైద్యులుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఏమిటి? వీరందరినీ కేవలం మహిళలకు మాత్రమే సేవలందించేలా చేయాలా? అందుకే ఈ ప్రతిపాదనలు హాస్యాస్పదమైనవే కాదు, అర్థంలేనివి కూడా!మన మంచి కోసమేనని చెబుతూ కొందరు తరచూ కొన్ని పిచ్చి సూచనలు చేస్తూంటారు. వీటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఈ మధ్య ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కొన్ని మూర్ఖపు సలహాలిచ్చింది. అవి ఎంత మూర్ఖమైనవంటే మనం వాటిని గట్టిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వీటిపట్ల మౌనంగా ఉంటే, అవన్నీ సమ్మతమే అనుకునే ప్రమాదముంది.‘బహిరంగ, వాణిజ్య స్థలాల్లో మహిళల భద్రతను పెంచడం ఎలా?’ అన్న అంశంపై ఈ సూచనలు వచ్చాయి. ఉద్దేశం చాలామంచిది. కానీ ప్రతిపాదించిన సలహాలు మాత్రం నవ్వు పుట్టించేలా ఉన్నాయి. మగ టైలర్లు ఆడవాళ్ల దుస్తుల కొలతలు తీసుకోకూడదన్నది ఒకానొక సలహా. అలాంటప్పుడు పురుషులు మహిళల వస్త్రాలు కూడా తయారు చేయకూడదా? మహిళలు మాత్రమే సిద్ధం చేయాలా? బహుశా ఇది ఇకపై అమల్లోకి తెస్తారేమో! సెలూన్లలోనూ మహిళలకు క్షౌర క్రియలు చేయడం ఇకపై పురుషులకు నిషిద్ధం. అలాగే జిమ్, యోగా సెషన్లలోనూ మగవాళ్లు మహిళలకు శిక్షణ ఇవ్వడానికి అనుమతి లేదు.ఇంతటితో అయిపోయిందనుకోకండి. అన్ని పాఠశాలల బస్సు ల్లోనూ మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఉండాలన్న సలహా కూడా వచ్చింది. బహుశా పురుషులు ఎవరూ యువతులను, చిన్న పిల్లలను భద్రంగా ఉంచలేరని అనుకున్నారో... వారి నుంచి ముప్పే ఉందను కున్నారో మరి! మహిళల వస్త్రాలమ్మే చోట మహిళా సిబ్బంది మాత్రమే ఉండాలట. పురుషులను అస్సలు నమ్మకూడదన్న కాన్సెప్టు నడుస్తోందిక్కడ. మహిళలను ప్రమాదంలో పడేయకుండా పురుషులు వారికి సేవలు అందించలేరన్నమాట.ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ ఈ సలహాలు, సూచనలపై ఏమంటున్నారంటే... మహిళల భద్రతను పటిష్ఠం చేసేందుకు మాత్రమే కాకుండా, మహిళల ఉపాధి అవకాశా లను మెరుగుపరిచేందుకు కూడా వీటిని ఉద్దేశించినట్లు చెబుతున్నారు. ఈ సలహాలను ‘‘మహిళల భద్రత కోణంలోనూ, అలాగే ఉపాధి కల్పన కోణంలోనూ’’ ఇచ్చినట్టు మొహమాటం లేకుండా ఆమె చెబు తున్నారు. ఇంకోలా చెప్పాలంటే, రకరకాల ఉద్యోగాల్లో పురుషులపై నిషేధం విధిస్తున్నారన్నమాట. తద్వారా మహిళలకు కొత్త రకమైన అవకాశాలు కల్పిస్తున్నారనుకోవాలి. సరే... వీటి ద్వారా మనకర్థమయ్యేది ఏమిటి? అసలు ఏమైనా అర్థముందా వాటిల్లో? అలాటి ప్రతిపాదనలు అవసరమా? న్యాయ మైనవేనా? అనవసరంగా తీసుకొచ్చారా? మరీ నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయా? ఇప్పటివరకూ చెప్పినదాన్ని బట్టి నా ఆలోచన ఏమిటన్నది మీకు అర్థమై ఉంటుంది. కొంచెం వివరంగా చూద్దాం. మొదటగా చెప్పు కోవాల్సింది... ఈ ప్రతిపాదనల వెనుక పురుషులపై ఉన్న అప నమ్మకం గురించి! పురుష టైలర్లు, క్షురకులు, దుకాణాల్లో పనిచేసే వారి సమక్షంలో మహిళల భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్నారు. చిన్నపిల్లల రక్షణ విషయంలోనూ మనం మగ సిబ్బందిని నమ్మడం లేదంటే... వాళ్లకేదో దురుద్దేశాలను ఆపాదిస్తున్నట్లే! పైగా... ఈ ప్రతిపాదనలు కాస్తా మహిళల జీవితాల తాలూకు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేవి కూడా! తాము సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా చేస్తున్నాయి. పురుషులు బాగా రాణిస్తున్న రంగాల్లో, వారి సేవలను తాను వినియోగించు కోవాలని ఒక మహిళ నిర్ణయించుకుంటే ఈ ప్రతిపాదనల పుణ్యమా అని అది అసాధ్యమవుతుంది. ఇంకోలా చూస్తే ఇది తాలిబనిజంకు ఇంకో దిశలో ఉన్న ప్రతిపా దనలు అని చెప్పాలి. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు మహిళలను తిరస్క రిస్తున్నారు. ఇక్కడ పురుషులను మహిళలకు దూరంగా ఉంచు తున్నారు. వారి దుర్మార్గమైన మనసులను విశ్వసించకూడదు; కాబట్టి వారిని మహిళలకు దూరంగా ఉంచాలి.ఇప్పుడు చెప్పండి... ఈ ప్రతిపాదనలు వాస్తవంగా అవసరమా? ఇలాగైతే పురుషుల దుస్తులమ్మే దుకాణాల్లో మహిళలు పని చేయకూడదు మరి! మహిళా జిమ్ శిక్షకులు పురుషులకు ట్రెయినింగ్ ఇవ్వకూడదు. ఫిజియోథెరపిస్టులుగా, దంతవైద్యులుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఏమిటి? వీరందరినీ కేవలం మహిళలకు మాత్రమే సేవలందించేలా చేద్దామా?పురుష రోగులకు, వినియోగదారులకు సేవలు అందించడానికి అను మతిద్దామా? మగ శిక్షకులు, దుకాణాల్లోని మగ సేవకులను నమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు... స్త్రీలు పేషెంట్లుగా, వినియోగదారులుగా వచ్చినప్పుడు వాళ్లు ఎలా ఎక్కువ నమ్మకస్తులవుతారు?నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానో మీకు ఇప్పటికి అర్థమైందనే అనుకుంటున్నా. పురుషులు నిర్వహిస్తున్న పనులపై నమ్మకం లేకపోతే... మహిళలపై కూడా అదే అవిశ్వాసం ఉంటుంది కదా! అప్పుడు అదే ప్రశ్న కదా ఉత్పన్నమయ్యేది! పురుషులను అస్సలు నమ్మడం లేదని చెప్పడం ద్వారా ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏ రకమైన సందేశం ఇవ్వదలచుకున్నారు?కొంచెం ఆలోచించి చూడండి. మహిళల విషయంలో వివక్ష చూపేవారిని మిసోజినిస్ట్ అంటూ ఉంటారు. ఈ లెక్కన బబితా చౌహాన్‌ను మిసాండ్రిస్ట్ అనాలి. మహి ళల పట్ల వివక్ష చూపడం ఎంత తప్పో... పురుషులపై చూపడం కూడా అంతే తప్పు. అయితే మిసోజినీ గురించి మనకు కొద్దోగొప్పో పరిచయం ఉంది కానీ మిసాండ్రిస్టుల విషయం నేర్చుకోవాల్సే ఉంది. ఈ పనికిమాలిన విషయానికి మనం బబితా చౌహాన్‌కు కృతజ్ఞులుగా ఉండాలి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి సునీత రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ పదవికి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఆమె బీఆర్ఎస్ పార్టీ బీఫారం కూడా అందు కున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆమె రాజీనా మాను ఆమోదిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్స న్గా సునీతా లక్ష్మారెడ్డి 27 డిసెంబర్ 2020న నియమితులయ్యారు. ఆమె పదవీ కాలానికి ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది. అయినప్పటికీ ఎన్నికల బరిలో ఉండటంతో ఆమె రాజీనామా చేయడం అనివార్యమైంది. -
డింపుల్ చేత చెప్పిస్తేనో?!
మహిళా కమిషన్‌పై అఖిలేష్ చిన్నచూపు మహిళల పట్ల పూర్తి ఉదాసీనంగా ఉన్న రాష్ట్రంగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. అధికారిక లెక్కల ప్రకారం అక్కడ రోజుకు కనీసం ఐదు అత్యాచారాలు జరుగుతున్నాయి. అంతకన్నా హేయమైన విషయం ఏమిటంటే - అవన్నీ సాధారణంగా జరిగేవేననీ, అవి ఏ మాత్రం నివారించలేని ఘటనలనీ, రాష్ట్రంలోని ప్రతి మహిళకూ సాయుధ బలగాలను రక్షణగా నియమించలేం కదా అనీ అక్కడి రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా, అత్యంత బాధ్యతారహితంగా వ్యాఖ్యానించడం! ఇవన్నీ అలా ఉంచితే - ఆర్టీఐ చట్టం ద్వారా ఊర్వశీ శర్మ అనే ఒక సామాజిక కార్యకర్త తెలుసుకున్న వాస్తవాలను బట్టి బడ్జెట్లో మహిళా కమిషన్‌కు కేటాయించడానికి నిధులు లేవని కోత విధించిన ప్రభుత్వం, ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సొంతానికి రెండు సెవన్ సీటర్ మెర్సిడెస్ కార్లకు, రెండు ల్యాండ్ క్రూయిజర్లకు డబ్బును వెదజల్లడం మహిళల సంక్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరినీ తాజాగా దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 2011-12, 2013-14 మధ్య ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళా కమిషన్‌కు కేటాయింపులను 85 శాతం వరకు తగ్గించింది! 2011-12లో ప్రభుత్వం కమిషన్‌కు ఐదు కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక పరమైన కేటాయింపులను చేయగా, ఆ మొత్తం 2013-14 బడ్జెట్లోకి వచ్చేసరికి కేవలం 75 లక్షలకు పరిమితం అయింది. ‘‘దీన్ని బట్టి అఖిలేష్ ప్రభుత్వానికి మహిళల భద్రత పట్ల, సంక్షేమం పట్ల ఏ మాత్రం శ్రద్ధ లేనట్లు స్పష్టమౌతోంది’’అని ఊర్వశి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి నిజంగానే ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే అంతంత ఖరీదైన మెర్సిడెస్‌లు, క్రూయిజర్లు కొనుగోలు చేయడానికి నిధులు ఎక్కడివని ఆమె ప్రశ్నించారు. ‘‘నిజంగానే ఇది దిగ్భ్రాంతికరమైన విషయం’’ అని మరో కార్యకర్త నీలమ్ రంజన్ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ, ‘‘మహిళా సాధికారత విషయంలో సమాజ్‌వాది ప్రభుత్వం ఏనాడూ ఉదారంగా గానీ, ఉదాత్తంగా గానీ లేదు’’ అని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత స్వామి ప్రసాద్ మౌర్య (బహుజన సమాజ్ పార్టీ) కూడా అఖిలేష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహిళల సమస్యలు ఏ మాత్రం పట్టని విధంగా ఆయన రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. ఇలా ఉండగా, బడ్జెట్లో మహిళా కమిషన్‌కు కేటాయింపులను పూర్తిగా తగ్గించడం వల్ల రాజధానికి దూరంగా ఉన్న పూర్వాంచల్, బుందేల్‌ఖండ్ వంటి ప్రాంతాల మహిళల సమస్యలను పరిష్కరించే అవకాశం లేకుండా పోయిందని మహిళా కమిషన్ ఆవేదన వ్యక్తం చేసింది. త్వరలోనే ఈ కమిషన్ సభ్యులు వెళ్ళి, అఖిలేష్ భార్య, పార్లమెంటు సభ్యురాలైన డింపుల్ యాదవ్‌ను కలిసి మహిళల సమస్యలపై, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించనున్నారు. స్త్రీ బాధ ఇంకో స్త్రీకి మాత్రమే అర్థమౌతుందంటారు. ఆ నమ్మకంతోనే రాష్ట్రంలోని మహిళల దుఃస్థితిని డింపుల్ దృష్టికి తెచ్చే ప్రయత్నం కమిషన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. డింపుల్ కనుక వెంటనే స్పందిస్తే, మహిళల విషయంలో అఖిలేష్ ధోరణి కొద్దిగానైనా మారే అవకాశాలు లేకపోలేదు.