breaking news
commercial pilot licence
-
వహ్వా సల్వా
ప్రగతికి పరదా ప్రతిబంధకం కాదని నిరూపించింది ఆ యువతి. కృషి, పట్టుదల ఉంటే ఆర్థిక సమస్యలు అడ్డొచ్చినా అనుకున్న లక్ష్యం సాధిస్తామని చాటి చెప్పింది. పేదింట పుట్టి పైలట్‌గా ఎదిగి పది మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఆమే పాతబస్తీకి చెందిన సల్వా ఫాతిమా. 2007లో పైలట్ శిక్షణలో చేరిన ఫాతిమా... 2013లో దానిని దిగ్విజయంగా పూర్తి చేసింది. 2016లో మల్టీ ఇంజిన్ టైప్ రేటింగ్ పూర్తి చేసిన సల్వా... తాజాగా ఎయిర్‌బస్ 320 టైప్ రేటింగ్ పూర్తి చేసి కమర్షియల్ పైలట్‌గా లైసెన్స్ సాధించింది. దేశంలోనే ఈ లైసెన్స్ సాధించిన నాలుగో ముస్లిం మహిళగా ఘనత సాధించింది. సాక్షి, సిటీబ్యూరో: సల్వా తండ్రి అష్వాక్ అహ్మద్ బేకరీలో ఉద్యోగి. చార్మినార్ సమీపంలో ఇరుకు గల్లీలోని అద్దింట్లో నివాసం. ముగ్గురు పిల్లల కడుపు నింపేందుకు తల్లిదండ్రులు పడిన కష్టం సల్వాను కదిలించింది. సవాలక్ష సమస్యలు ఎదురైనా ముందుకెళ్లి.. లక్ష్యాన్ని ముద్దాడింది. ‘కొద్దిపాటి ఆదాయంతో అమ్మానాన్నలు పడే అవస్థలు చూస్తే దు:ఖం వచ్చేది. టీవీలో పైలట్‌ను చూసి.. నేనూ పైలట్ కావాలని నిర్ణయించుకున్నాను. ఆ కోరిక నాలో బలంగా నాటుకుంద’ని చెప్పింది సల్వా. ఇక అప్పటి నుంచి పైలట్‌కు సంబంధించి పేపర్లో ఎలాంటి కథనాలు వచ్చినా చదివేది. పదో తరగతి పూర్తయ్యాక ఇంటర్ మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కళాశాలలో పూర్తి చేసింది. కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయురాలు సంగీతారెడ్డి సహాయంతో తాను ఇంటర్ పూర్తి చేశానని చెప్పింది. అలా సాకారమైంది.. ప్రతి ఏడాది సియావత్ పత్రిక ఆధ్వర్యంలో ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు హాజరైన సల్వా... పత్రిక ఎడిటర్ జాహెద్ అలీఖాన్‌తో తన ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పుకుంది. ఆయన సల్వాకు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 2007లో సికింద్రాబాద్‌లోని ఏవియేషన్ అకాడమీలో చేరి శిక్షణ పూర్తి చేసుకుంది. సవాళ్లను అధిగమించి.. అంతర్జాతీయ ఏవియేషన్ షోలో విన్యాసాలు చేసి అందరినీ అబ్బురపరిచింది సల్వా. ఆమె ప్రతిభను చూసి అంతర్జాతీయ పైలట్లు మెచ్చుకున్నారు. ‘నా జీవితాశయం సాధించేందుకు ఎన్నో సవాళ్లను అధిగమించాను. ఒక పేదింటి పైలట్‌గా ఎదగడం మామూలు విషయం కాదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, అసమానతలు ఎదుర్కొన్నాను. హిజాబ్ (తలపై ధరించే వస్త్రం) కారణంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. విదేశాల్లో శిక్షణ తీసుకున్న సమయంలోనూ నేను ధరించాను. ఎవరూ అడ్డంకి చెప్పలేదు. హిజాబ్ వృత్తికి అడ్డు కాద’ని ఆమె పేర్కొన్నారు. ఇలా సాధించింది... సల్వా 2013లో సెస్నా 152 విమానాన్ని 200 గంటల పాటు, సోలో ఫ్లైట్‌ను 123 గంటల పాటు నడిపించి పైలట్ శిక్షణ పూర్తి చేసుకుంది. 2016లో బహుళ ఇంజిన్ ట్రైనింగ్‌కు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.36 లక్షలు అందజేసింది. ఈ సమయంలో ఆమె గర్భిణిగా ఉన్నారు. అయినా వెనకడుగు వేయకుండా న్యూజిలాండ్‌లో 15 గంటల పాటు బహుళ ఇంజిన్ విమానాన్ని నడిపి, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2017లో నవంబర్‌లో బహ్రెయిన్‌లో ఎయిర్‌బస్ 320 విమానాన్ని 60 గంటల పాటు నడిపి, కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించింది. ఇక జాబే.. నేను ఢిల్లీ వెళ్లి ఏవియేషన్ టైప్ రేటింగ్ సర్టిఫికెట్, కమర్షియల్ పైలట్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంది. వాటితో ఇక నేను ఏ ఎయిర్లైన్స్లోనైనా ఉద్యోగం చేయొచ్చు. నా లక్ష్య సాధనకు సహకరించిన తెలంగాణ సీఎం కేసీఆర్, జాహెద్ అలీఖాన్, కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు. -
బస్తీ మే లేడీ పైలట్!
ఈ రోజుల్లో పిల్లలంతా అయితే ఇంజనీరింగ్.. కాదంటే మెడిసిన్ చదువతామంటారు. కానీ సైదా సల్వా ఫాతిమా మాత్రం పైలట్ అవుతానంది. అది చూసి అందరూ నవ్వారు. పాతబస్తీ గల్లీ నుంచి వచ్చి, పైలట్ అవుతావా అన్నారు. అది కూడా హైదరాబాద్ పాతబస్తీలో ఓ బేకరీ కార్మికుడి కూతురు పైలట్ కావడమేంటని ఎద్దేవా చేశారు. ఆమె మాత్రం తన పట్టుదల కొనసాగించింది.. తాను అనుకున్నది సాధించి అందరికీ చూపించింది. ఆ రకంగా.. ఇంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కమర్షియల్ పైలట్ లైసెన్సు పొందిన మొట్టమొదటి ముస్లిం బాలికగా ఆమె రికార్డులు సాధించింది. హైదరాబాద్ నగరంలోని సుల్తాన్షాహి ప్రాంతానికి చెందిన ఫాతిమా.. చిన్నతనం నుంచే గాల్లో విమానం ఎగరేయాలని కలలు కనేది. తొమ్మిదో తరగతి చదివేటప్పుడు వివిధ రకాల విమానాల బొమ్మలు, వైమానిక పరిశ్రమకు సంబంధించిన కథనాలను సేకరిస్తూ ఉండేది. తరగతిలో క్లాస్మేట్లకు ఎవరికి చెప్పినా అందరూ అది అసాధ్యమనే చెప్పేవారని, కానీ అల్లా దయతో తన కల నెరవేరిందని ఫాతిమా చెప్పింది. ఆమె మలక్‌పేటలోని అజీజియా స్కూల్లో చదివింది. ఆమె తండ్రి అష్ఫక్ అహ్మద్‌కు నలుగురు పిల్లలు. వాళ్లలో ఫాతిమాయే పెద్దది. సియాసత్ ఉర్దూ పత్రిక నిర్వహించే ఎంసెట్ కోచింగ్‌కు వెళ్లినప్పుడు.. ఆ పత్రిక ఎడిటర్ జాహిద్ అలీఖాన్ ఆమె ఆశలను గుర్తించారు. విషయం తెలిసి, ఆమె పైలట్ శిక్షణకు అయ్యే ఖర్చంతటినీ భరిస్తానన్నారు. 2007లో ఆమె ఏపీ ఏవియేషన్ అకాడమీలో పేరు నమోదు చేయించుకుంది. తొలిసారి విమానం ఎగరేసినప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని.. అలనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది. ఇప్పుడు ఆమె 200 గంటలు విమానం నడిపిన అనుభవాన్ని సొంతం చేసుకుంది. కమర్షియల్ పైలట్ లైసెన్సుతో పాటు ప్రైవేటు పైలట్ లైసెన్సు, ఫ్లైట్ రేడియో టెలిఫోన్ ఆపరేటర్ లైసెన్సు కూడా పొందింది.