సీఎమ్మార్ ధాన్యం స్వాహాపై కేసు నమోదు
నాయుడుపేట టౌన్: ప్రభుత్వం అందించిన సీఎంఆర్ ధాన్యానికి తిరిగి బియ్యం చెల్లించకుండా రూ.1.32 కోట్లకు పైగా నగదు స్వాహా చేసిన ధాన్యం మిల్లు నిర్వాహకులు బొల్లినేని కుమార్స్వామి నాయుడుపై శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సివిల్ సప్లయ్స్ జిల్లా మేనేజర్ పీవీ కొండయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టణ పరిధిలోని తుమ్మూరులో వున్న శ్రీదేవి రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్లుకు 2015–16కు 6886.40 క్వింటాళ్లు ప్రభుత్వ సీఎమ్మార్ ధాన్యం సరఫరా చేశారు. అయితే ఈ ధాన్యానికి బదులుగా మిల్లు నిర్వహకులు ప్రభుత్వానికి 4613.80 క్వింటాళ్ల బియ్యం ఇవ్వాల్సివుంది. అయితే మిల్లు నిర్వాహకులు ప్రభుత్వానికి కేవలం 540 క్వింటాళ్ల బియ్యం మాత్రమే సరఫరా చేసి మిన్నకుండిపోయారు. మిగిలిన 4473.80 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయకుండా కాలయాపన చేస్తుండటంతో పలుమార్లు సివిల్ సప్లయ్స్ అధికారులు తాఖీదులు అందించినా నిర్లక్ష్యం వహించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆగస్టు, 8వ తేదిన తుమ్మూరులో వున్న మిల్లులో అధికారుల బృందంతో తనిఖీలు చేపట్టారు. అయితే మిల్లులో ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యంతో పాటు బియ్యం కూడా లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన బియ్యం తిరిగి అందించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు చేపడతామని అధికారులు హెచ్చరికలు సైతం చేశారు. అయితే ఎంతకూ మిల్లు నిర్వహకులు బొల్లినేని కుమార్స్వామి నాయుడు పట్టించుకోక పోవడంతో జిల్లా సివిల్ సప్లయ్స్ మేనేజర్ పీవీ కొండయ్య స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.