breaking news
Civils services mains
-
లక్ష్యం.. క్రమశిక్షణే విజయ రహస్యం
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ మానేసి సివిల్సే లక్ష్యంగా.. సివిల్స్‌కు ఎంపిక కావడమే లక్ష్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని మెయిన్స్‌కు ప్రిపేర్ అయిన మెరుగు కౌశిక్.. తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో సత్తా చాటారు. సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేసిన ఆయన.. ఢిల్లీలో ఎంబీఏ చేశారు. అందరూ చదివినట్లే చదివానని.. రోజుకు 8–9 గంటలపాటు ప్రిపేర్ అయినట్లు చెప్పారు. చదువుకుంటున్న సమయంలోనే సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టానని, ఆ తర్వాత ఏడాది పాటు జాబ్ చేశానని తెలిపారు. ప్రిలిమ్స్ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి మెయిన్స్ రాసినట్లు పేర్కొన్నారు. ఐఏఎస్ కావాలనేది తన లక్ష్యం అని చెప్పారు. తనకు 100లోపు ర్యాంకు వస్తుందని మాత్రం అసలు ఊహించలేదన్నారు. తన తండ్రి నిర్మాణ రంగంలో ఉన్నారని, తల్లి గృహిణి అని చెప్పారు. విధి వంచించినా... విధి వంచించినా.. విశ్వాసం ఆమెను నిలబెట్టింది. కాళ్లు కదలకపోయినా.. పట్టువిడవని సంకల్పం తనను ముందుకు నడిపింది. ఊహించని అనారోగ్యం ఇంటికే పరిమితం చేసినా.. చదువును మాత్రం ఏనాడు దూరం చేసుకోలేదు. దూరవిద్య ద్వారా చదువులు పూర్తి చేసి కుటుంబ సభ్యులు, గురువుల సహకారంతో విశాఖపట్టణానికి చెందిన హనిత వేములపాటి సివిల్స్‌లో 887వ ర్యాంక్ సాధించి సత్తాచాటారు. తాను ఆత్మవిశ్వాసంతో చదువును కొనసాగించి సివిల్స్ ప్రిపేరయ్యానని ఆమె చెప్పారు. దేశంలోనే అత్యున్నత సివిల్స్ సర్విసెస్‌కు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాత జస్టిస్... మనవరాలు సివిల్స్ ర్యాంకర్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామస్వామి మనవరాలు ఐశ్వర్య నీలిశ్యామల సివిల్స్‌లో 649వ ర్యాంకు సాధించారు. బీటెక్ పూర్తి చేసిన ఐశ్వర్య ప్రణాళికాబద్ధంగా ప్రిపేరై ర్యాంకు సాధించినట్లు తెలిపారు. తాత జస్టిస్ రామస్వామి తనను ఎంతగానో ప్రేరేపించారని, అందుకే ప్రజాసేవ చేయాలనే లక్షంతో సివిల్స్ రాశానని అన్నారు. తండ్రి సివిల్ సర్వెంట్, తల్లి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యురాలు అని, తన మామ ఐఏఎస్ అధికారి అని పేర్కొన్నారు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి : అలేఖ్య ఖమ్మం జిల్లాలో సాధారణ కానిస్టేబుల్ కూతురు అలేఖ్య. పోలీసు వృత్తిలోనూ నిజాయితీని చాటుకున్న తండ్రిని ఆమె ఆదర్శంగా తీసుకుంది. పాఠశాల విద్య నుంచే సివిల్స్ లక్ష్యంగా ఎంచుకుంది. అనుక్షణం తండ్రి ప్రోత్సాహం ఆమెకు కలిసి వచ్చింది. తన కష్టాలే ఆమెను మానసికంగా బలపడేలా చేశాయి. ఐపీఎస్ కావాలన్న లక్ష్య సాధనలో ఆమె 938వ ర్యాంకు సాధించింది. నాలుగుసార్లు సివిల్స్ విజయానికి దగ్గరగా వెళ్లిన ఆమె ఎన్నడూ నిరుత్సాహ పడలేదు. ఐదోసారి అనుకున్నది సాధించారు. ప్రతీ తల్లీదండ్రీ పిల్లలను ప్రోత్సహించాలని ఆమె చెప్పార. ప్రజా జీవితానికి చేరువగా విధి నిర్వహణ చేయాలని ఆమె కోరుకుంటున్నారు. వ్యవసాయ కూలీ కుమారుడు ఐఏఎస్‌కు.. పూడూరు: వ్యవసాయ కూలీ కుమారుడు ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్‌పల్లికి చెందిన దయ్యాల బాబయ్య, శశికళ దంపతుల కుమారుడు తరుణ్ (24) సివిల్స్‌లో 231వ ర్యాంక్ సాధించారు. 2017లో తరుణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేశారు. రాజేంద్రనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 2023లో బీటెక్ పూర్తి చేశారు. ఐఏఎస్‌కు ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని, పేదలకు సేవ చేసే అవకాశం వచ్చిందని తరుణ్ తెలిపారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తరుణ్ ఇంటికి వెళ్లి అభినందించారు. మారుమూల గ్రామానికి చెందిన తరుణ్ ఐఏఎస్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. 60 మంది తోటి కానిస్టేబుళ్ల ముందు సీఐ అవమానించారని.. చిక్కడపల్లి: ‘60 మంది పోలీసుల ముందు ఇన్స్పెక్టర్ అవమానించారు. నాపై వ్యక్తిగత కోపంతో తిట్టారు. 2013 నుంచి 2018 వరకు చేసిన కానిస్టేబుల్ జాబ్‌కు ఆరోజే రిజైన్ చేశాను. ఐఏఎస్ సాధించాలని ఆ రోజే కసితో దీక్ష తీసుకున్నాను. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను’ అని 780వ ర్యాంక్ సాధించిన ఉదయ్ కృష్టారెడ్డి చెప్పారు. తనకు ఐఆర్ఎస్ వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొ న్నారు. ఈ జాబ్‌లో చేరి ఐఏఎస్ సాధించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా గుడ్లూరు పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తనకు సీఐ చేసిన అవమానమే ఈ రోజు సివిల్స్ సాధించేందుకు దోహదపడిందన్నారు. తనకు జంతువులంటే ఎంతో ప్రేమ అని, మనుషుల కోసం 108 వాహనం ఉన్నట్లే జంతువుల కోసం దేశవ్యాప్తంగా 109 అంబులెన్స్ వాహనం కోసం తన వంతుగా ప్రయత్నం చేస్తానన్నారు. తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని నానమ్మ పెంపకంలో పెరిగానని వివరించారు. ఢిల్లీ ఐఐటీ వదిలి.. దూర విద్య చదివి... ముషీరాబాద్: నల్లగొండ జిల్లా అల్వాలకు చెందిన సత్యనారాయణరెడ్డి స్కూల్ ప్రిన్సిపల్, తల్లి హేమలత టీచర్. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నత విద్యావంతులు కావడంతో కుమారుడు పెంకేసు ధీరజ్‌రెడ్డిని ఐఐటీ చదివించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే ఐఐటీ ఢిల్లీలో సీటు సాధించారు. మొదటి సంవత్సరంలో 9.3 సీజీపీఏ సాధించి ఐఐటీ ఢిల్లీలోనే టాప్ 7లో నిలిచాడు. ఇలా సాగిపోతున్న తరుణంలో ధీరజ్రెడ్డికి చదువు పరుగు పందెంలా అనిపించింది. ఎప్పుడూ కంప్యూటర్‌తో కుస్తీ, మెకానికల్ లైఫ్ అనిపించి ఈ చదువు తనకు ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. అయినప్పటికీ కుమారుడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని తల్లిదండ్రులు నీకు నచ్చకపోతే ఐఐటీ వదిలేయమని చెప్పారు. దీంతో ఐఐటీని మధ్యలోనే ఆపేసి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే డిగ్రీ అడ్మిషన్లు అయిపోవడంతో ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్(దూర విద్య)లో బీఏ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఆ అడ్మిషన్ కేవలం డిగ్రీకి మాత్రమే.. వెంటనే సివిల్స్‌పై దృష్టి సారించాడు. తల్లిదండ్రుల్లో మాత్రం కుమారుడి భవిష్యత్తు మీద ఆందోళన మొదలైంది. 2019లో మొదటిసారి సివిల్స్ ఫలితాల్లో 0.6 మార్కులతో రాలేదు. రెండవ ప్రయత్నంలో 17 మార్కులతో, మూడవ ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లో ఫెయిలయ్యాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిoచి నాలుగోసారి 173వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు దారులు వేసుకున్నాడు. మేస్త్రీ కుమారుడికి 574వ ర్యాంక్ కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ కాలనీకి చెందిన రామారెడ్డిపేట రజనీకాంత్ ఆరో ప్రయత్నంలో 574వ ర్యాంకు సాధించారు. రజనీకాంత్ కుటుంబానిది రాజంపేట మండలం ఆర్గోండ గ్రామం. రామారెడ్డిపేట సిద్ధిరాములు, పద్మ దంపతుల రెండవ కుమారుడు. పేద కుటుంబమే. తల్లి గృహిణి కాగా, తండ్రి భవన నిర్మాణ పనులతోపాటు డ్రైవర్‌గా చేస్తారు. చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడ్డామని, కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని రజనీకాంత్ చెప్పారు. సామాన్య కుటుంబంలో పుట్టిన తమ అబ్బాయి సివిల్స్ సాధించి తమ జన్మను సార్థకం చేశాడని తల్లిదండ్రులు ‘సాక్షి’తో ఆనందం వ్యక్తం చేశారు. బీడీ కార్మికురాలి కొడుకు సివిల్స్ ర్యాంకర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ 27వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయికిరణ్ తండ్రి నందాల కాంతారావు మహారాష్ట్రలోని భివండిలో చేనేత కార్మికుడిగా పనిచేశారు. తల్లి లక్ష్మీ బీడీలు చుట్టేవారు. కాంతారావు కేన్సర్‌తో 2016లో మరణించారు. ఆ సమయంలో సాయికిరణ్ వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 2018లో క్యాంపస్ ఇంటరŠూయ్వలో క్వాల్కమ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది. బాల్యం నుంచి ఐఏఎస్ కలగా ఉన్న సాయికిరణ్ అప్పటి నుంచి ఓవైపు ఉద్యోగం చేస్తూనే ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు. క్రితంసారి విఫలమైనా.. ఈసారి మాత్రం విజయం సాధించి తన స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. పాలమూరు బిడ్డ... ప్రతిభకు అడ్డా సివిల్స్ లక్ష్యంగా నిద్రాహారాలు మానేసి చదివిన పాలమూరు బిడ్డ అనుకున్నది సాధించింది. ఆలిండియా మూడో ర్యాంకు సాధించింది. మహబూబ్‌నగర్‌కు జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి తొలి ప్రయత్నంలోనే విజయ శిఖరాలు అధిరోహించడం విశేషం. అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన సురేష్ రెడ్డి, మంజులతకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అనన్యరెడ్డి కాగా.. రెండో సంతానం చరణ్య. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్ గీతం హైసూ్కల్లో చదివిన అనన్య.. ఇంటర్ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎంతో కష్టపడి చదివి సివిల్స్‌లో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సివిల్స్ మీద దృష్టి సారించానని చెప్పారు. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు చదివానని పేర్కొన్నారు. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నానని, ఇందుకు హైదరాబాద్‌లోనే కోచింగ్ తీసుకుని పకడ్బందీగా ప్రిపేరయ్యానని చెప్పారు. అయితే ఈ ఫలితాల్లో మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదన్నారు. చిన్నప్పటి నుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. తమ కుటుంబంలో సివిల్స్ సాధించిన తొలి అమ్మాయిని తానేనని చెప్పారు. అనన్య తల్లి గృహిణి కాగా, తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి. -
జాగ్రఫీ, పర్యావరణ అంశాల సమన్వయంతో...
కలల కెరీర్ సివిల్ సర్వీసెస్ దిశగా అడుగులు వేస్తూ.. మొదటి దశ ప్రిలిమ్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని అత్యంత కీలకమైన మెయిన్స్ దశకు అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు.. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఓ అభ్యర్థి బుద్ధికుశలతను, సామాజిక, సమకాలీన సమస్యలపై అవగాహనను పరీక్షించాలన్న ఉద్దేశంతో మెయిన్స్‌లో మార్పులు చేశారు. కామన్ పేపర్సతోపాటు ఎస్సే, ఆప్షనల్‌గా జాగ్రఫీని ఎంచుకున్న అభ్యర్థులు ప్రిపరేషన్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి.. ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి, సమాధానాలు రాయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమైన అంశాలు తదితర అంశాలపై సూచనలు.. ఎ.డి.వి. రమణరాజు, సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్. మానవునికి సంబంధించి సామాజిక, ఆర్థిక, రాజకీయ, పరిపాలన, సాంస్కృతిక అంశాలన్నింటినీ ప్రభావితం చేసే విజ్ఞానశాస్త్త్రమే భూగోళశాస్త్రం. సమన్వయంతో: మారిన విధానంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ మెయిన్స పరీక్షల కోసం నిర్దేశించిన సిలబస్ అంశాలను విశ్లేషిస్తే.. జాగ్రఫీ ఆప్షనల్తో పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రయోజనాలు బహుళంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సబ్జెక్టులోని అధిక శాతం అంశాలను పేపర్-1 (ఎస్సే), పేపర్-2 (జనరల్ స్టడీస్-1-Indian Heritage and Culture, History and Geography of the World and Society), పేపర్-4 (జనరల్ స్టడీస్-3-Technology, Economic Development, Bio-diversity, Environment, Security and Disaster Management)లలో భాగంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాగ్రఫీ, పర్యావరణ విభాగాలకు సంబంధించిన అంశాలను సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. జాగ్రఫీకి సంబంధించి ఏ మూల నుంచైనా ప్రశ్నలు రావొచ్చు. జాగ్రఫీ ఆప్షనల్తో పరీక్షకు సిద్ధమవుతున్నవారికి ఈ పేపర్లో మంచి స్కోర్ సాధించడానికి వీలుంది. జాగ్రఫీ ఆప్షనల్ పేపర్-1: ఇందులో భౌతిక, మానవ భూగోళ శాస్త్రాలకు సంబంధించిన భావనలు, సిద్ధాంతాలను పొందుపరిచారు. ఇందులో సెక్షన్-ఎను పరిశీలిస్తే.. భూస్వరూప శాస్త్రానికి సంబంధించి భూ అయస్కాంతత్వం (జియోమాగ్నటిజం) ప్రాథమిక భావనలు, భూ అభినితి (జియోసింక్లైన్), భూ సమస్థితి, డబ్ల్యు.జె. మోర్గాన్ ప్రతిపాదించిన పలకవిరూపక సిద్ధాంతం ఆధారంగా భూకంపాలు, సునామీలు ఏర్పడే విధానం- విశ్లేషణ, మోరిస్, పెంక్లు ప్రతిపాదించిన భూ స్వరూప చక్ర ప్రక్రియలు, వాటి మధ్యగల తేడాలు, పోలికలు, విశ్లేషణ, అనువర్తిత భూ స్వరూప శాస్త్త్రం, వాలుల అభివృద్ధి, విశ్లేషణ, జియోహైడ్రాలజీ మొదలైన అంశాలు కీలకమైనవి. వీటిపై పరిపూర్ణ పట్టు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. శీతోష్ణస్థితి శాస్త్రానికి సంబంధించి క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ దాన్ని ప్రభావితం చేసే అంశాలు, ఊర్ద్వ ఉష్ణోగ్రతా విస్తరణ, ఉష్ణ సమతుల్యం, రుతుపవనాలు, జెట్‌స్ట్రీమ్, వాయురాశులు, వాతాగ్రాలు, సమ శీతోష్ణ మండల, ఉష్ణమండల చక్రవాతాలు, వాటి మధ్యగల తేడాలు, వర్షపాత రకాలు, విస్తరణ, కొప్పెన్, థార్న్ థ్వైట్లు ప్రతిపాదించిన ప్రపంచ శీతోష్ణ స్థితుల వర్గీకరణ, ఆయా వర్గీకరణల మధ్యగల తేడాలు, జల సంబంధిత చక్రం, అనువర్తిత శీతోష్ణస్థితి శాస్త్రం మొదలైన విశ్లేషణాత్మక దృష్టితో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సముద్ర శాస్త్రానికి సంబంధించి అట్లాంటిక్, హిందూ, పసిఫిక్ మహాసముద్రాల భూతల విభజన, సముద్రజల లవణీయత, దాన్ని ప్రభావితం చేసే అంశాలు, సముద్ర నిక్షేపాలు, ప్రవాళ బిత్తికలు, అవి విక్షాళనం చెందడానికి గల కారణాలు, సముద్ర జల కాలుష్యం, దానికి గల కారణాలు తదితరాలపై పూర్తి స్థాయిలో అవగాహన పొందడానికి ప్రయత్నించాలి. జైవిక భూగోళ శాస్త్రానికి సంబంధించి మృత్తిక వర్గీకరణ, విసృ్తతి, మృత్తిక క్రమక్షయం, నిమ్నీకరణకు గల కారణాలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అటవీ నిర్మూలన వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, సామాజిక అడవుల పెంపకం, ఆగ్రో ఫారెస్ట్రీ మొదలైన అంశాలను విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి. ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీకి సంబంధించి ఆవరణశాస్త్ర ప్రాథమిక భావనలు, పర్యావరణంపై మానవ ప్రభావం, ఆవరణ వ్యవస్థల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలు, వాటి సంరక్షణ, జీవ వైవిధ్యత సంరక్షణలో సుస్థిరాభివృద్ధి పాత్ర, నూతన పర్యావరణ విధానం, పర్యావరణ వైపరీత్యాలు, వాటి నివారణ చర్యలు మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. పేపర్-1, సెక్షన్-బి: ఇందులోని కీ లక అంశాలను పరిశీలిస్తే.. మానవీయ భూగోళ శాస్త్త్రంలోని దృక్పథాలకు సంబంధించి పర్యావరణ వాదం, పరిణామాత్మక విప్లవం, ద్వంద్వ భావన, రాడికల్, ప్రవర్తనా వాద దృక్పథాలు, ప్రపంచ సాంస్కృతిక మండలాలు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. ఆర్థిక భూగోళ శాస్త్రానికి సంబంధించి, వనరులు వాటి విస్తరణ, ఇంధన సమస్య, ప్రపంచ వ్యవసాయ మండలాలు - రకాలు, ఆహార భద్రత, దుర్భిక్షం -కారణాలు - ప్రభావాలు - నివారణ చర్యలు మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. జనాభా భూగోళ శాస్త్రానికి సంబంధించి ప్రపంచ జనాభా పెరుగుదల, విస్తరణను ప్రభావితం చేసే అంశాలు, ప్రపంచ జనాభాలో వలసలకు గల కారణాలు, ఉచ్ఛ-నిమ్న-అభిలషణీయ జనాభా భావనలు, జనాభా సిద్ధాంతాలు, ప్రపంచ జనాభా సమస్యలు, విధానాలు, పట్టణ జనాభా క్రమానుగత శ్రేణి, ప్రెమేట్ నగర భావన, రాంక్-సెజ్ నియమం, శాటిలైట్ టౌన్‌స, పట్టణ-గ్రామీణ ఉపాంతపు అంచు, పట్టణీకరణ వల్ల ఎదురయ్యే సమస్యలు, నివారణ చర్యలు మొదలైన అంశాలను విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి. ప్రాంతీయ భూగోళ శాస్త్త్రంలో ప్రాంతీయత భావన, రకాలు, ప్రాంతీయ అసమానతలకు గల కారణాలు, వాటి అభివృద్ధి వ్యూహాలు, ప్రాంతీయ ప్రణాళికలను రూపొందించడంలో పర్యావరణ సంబంధిత అంశాల పాత్ర మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. మానవ భూగోళ శాస్త్త్రంలోని నమూనాలు, సిద్ధాంతాలు, శాసనాలకు సంబంధించి మాల్ధూషియనీ, మార్ష్కియన్, జనాభా పరివర్తన నమూనాలు, క్రిష్టలర్ కేంద్ర స్థాన సిద్ధాంతం, లోస్చే, క్రిష్టలర్ సిద్ధాంతాల మధ్యగల తేడాలు, ఓస్టోవ్‌స నమూనాలోని వృద్ధి దశలు, హృదయభూమి, అంచుల భూమి సిద్ధాంతాలు మొదలైన అంశాలను చదవాల్సి ఉంటుంది. పేపర్-2: ఇందులో భారతదేశ భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ క్రమంలో అధికంగా దృష్టి సారించాల్సినవి: భారతదేశ భూభౌతిక అమరికకు సంబంధించి భారతదేశం - పొరుగు దేశాలతో ఉన్న భూ సరిహద్దు సమస్యలు, వాటి నేపథ్యం, హిమాలయ, ద్వీపకల్ప నదీ వ్యవస్థల మధ్యగల తేడాలు, భారతదేశ నైసర్గిక స్వరూపాలు, వాటి ప్రాముఖ్యత, భారతదేశ శీతోష్ణస్థితిపై రుతుపవనాల పాత్ర, దేశ భూభాగంలో రుతుపవన విస్తరణ విధానం, దాన్ని ప్రభావితం చేసే అంశాలు, భారతదేశంలో వర్షపాత విస్తరణపై ఉష్ణమండల చక్రవాతాలు, పశ్చిమ అలజడుల ప్రభావం, దుర్భిక్షం, వరదలు, భారతదేశంలో ఉద్భిజ సంపద, రకాలు తదితరాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి.. భారతదేశంలో భూగర్భ, ఉపరితల జలవనరుల పరిమాణం విస్తృతి, అవి ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి నిర్వహణ, శక్తి వనరులు, ఖనిజ వనరులు, వాటి సంరక్షణ, ఇంధన సమస్యలు మొదలైన అంశాలను చదవాలి. వ్యవసాయ రంగానికి సంబంధించి భారతదేశంలో వ్యవసాయ మౌలిక వసతులు, సాగునీటి సౌకర్యాలు, విత్తనాలు, ఎరువులు, విద్యుత్తు మొదలైన అంశాలు కీలకమైనవి. వీటిని విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. అదేవిధంగా పంటల విధానం, పంటల సరళి (క్రాప్ కాంబినేషన్), వ్యవసాయ రంగంలో హరిత విప్లవం పాత్ర దానివల్ల ఏర్పడే సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరమైన సమస్యలు, ఆగ్రో-క్లైమాటిక్ ప్రాంతాలు, ఆగ్రో - ఎకలాజికల్ రీజియన్‌స మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి. పరిశ్రమలకు సంబంధించి నూలు వస్త్త్ర పరిశ్రమ, ఇనుము-ఉక్కు, అల్యూమినియం, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ఉనికి, వాటి ఏర్పాటుకు దేశంలోని అనుకూల అంశాలు. పారిశ్రామిక నివాసాలు, పారిశ్రామిక సముదాయాలు, ప్రత్యేక ఆర్థిక మండలాలు (సెజ్‌లు), ఎకోటూరిజం మొదలైన అంశాలను చదవాలి. రవాణా, సమాచార రంగాలకు సంబంధించి జాతీయ రహదారుల అభివృద్ధి కోసం చేపట్టిన ఎన్‌హెచ్‌డీపీ ప్రాజెక్టు అమలు తీరు, బూట్ (ఆైఖీ) (బిల్డ్, ఆపరేట్, ట్రాన్సఫర్) పాత్ర , రోడ్డు రవాణా, రైల్వే రవాణా మధ్యగల పరస్పర పూరకాలు, వ్యతిరేకాలు (కాంప్లిమెంటరీ, కాంట్రడిక్టర్స) దేశ వాణిజ్యంలో ప్రధాన ఓడరేవుల ప్రాముఖ్యత, ఓడరేవుల అభివృద్ధిలో పీ3 (ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్) పాత్ర మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి. సాంస్కృతిక అంశాలకు సంబంధించి భారత సమాజంలో భాషాపరమైన, జాతి పరమైన వైవిధ్యతలు, గిరిజన ప్రాంతాలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలు మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి. జనావాసాలకు సంబంధించి భారతదేశంలో గ్రామీణ జనావాసాల రకాలు, విధానాలు, వాటి భౌతిక స్వరూపాలు, భారతీయ నగరాల భౌతిక స్వరూపాలు, విధుల పరంగా భారతీయ నగరాల వర్గీకరణ, మెట్రోపాలిటన్ ప్రాంతాలు, మురికివాడలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలు, పట్టణీకరణ వల్ల ఏర్పడే సమస్యలు, నివారణ చర్యలను విశ్లేషణాత్మక దృష్టితో చదవాలి. ప్రాంతీయ ప్రణాళికలు, అభివృద్ధికి సంబంధించి దేశంలో ప్రాంతీయ అసమానతలను రూపుమాపడంలో ప్రాంతీయ ప్రణాళికల పాత్ర, పంచాయతీరాజ్, వికేంద్రీకరణ ప్రణాళికలు, వాటర్‌షెడ్ నిర్వహణ, వెనుకబడిన ప్రాంతాలు, ఎడారి, దుర్భిక్ష, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక ప్రణాళికలు మొదలైన అంశాలను స్థూలంగా అధ్యయనం చేయాలి. రాజకీయ పరమైన దృక్పధాలకు సంబంధించి భారత సమాఖ్య విధానానికి సంబంధించిన భౌగోళిక పరమైన ప్రేరకాలు, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రాంతీయ ధోరణులు, అంతర్రాష్ట్ర అంశాలు, భారత అంతర్జాతీయ సరిహద్దుకు సంబంధించిన అంశాలు, దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతాలలో భౌగోళిక రాజకీయాలు, సీమాంతర ఉగ్రవాదం మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి. సమకాలీన అంశాలకు సంబంధించి పర్యావరణ పరమైన విపత్తులకు సంబంధించి భూపాతాలు (ల్యాండ్స్లైడ్స), భూకంపాలు, భారతదేశంలో భూకంపజోన్స, సునామీజోన్స, పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన అంశాలు, పర్యావరణ ప్రభావ నిర్ధారణ (ఇఐఎ), పర్యావరణ నిర్వహణ భావనలు, నదీ అనుసంధానం మొదలైన అంశాలను చదవాలి. పరిధి పెరిగింది గతంతో పోలిస్తే జనరల్ స్టడీస్ పేపర్లో జాగ్రఫీ సబ్జెక్టు పరిధి విస్తృతమైంది. గతేడాది కేవలం ఇండియా జాగ్రఫీని మాత్రమే సిలబస్‌లో పేర్కొంటే ఈసారి వరల్డ్ జాగ్రఫీని అదనంగా చేర్చారు. ఓ విషయం గురించి చదువుతున్నప్పుడు ఆ అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశముందో ఆలోచించి చదవాలి. అప్పుడే ప్రిపరేషన్ సఫలీకృతమవుతుంది. జాగ్రఫీలోని అంశాలకు ఆకాశమే హద్దు. అందువల్ల ప్రిపరేషన్లో భాగంగా తొలుత బేసిక్ విషయాలపై పట్టు సాధించాలి. ఆ తర్వాత ముఖ్యమైన అంశాలను, సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. సమాధానాలు ఇలా అభ్యర్థులు నేరుగా ఎస్సే రాయడానికి ఉపక్రమించడం అభిలషణీయం కాదు. ప్రశ్నను రెండుమూడుసార్లు చదివి, అర్థం చేసుకోవాలి. వాక్యాలు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. కఠిన పదబంధాలు ఉపయోగించకూడదు. అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ సిద్ధం చేసుకున్న స్ట్రక్చర్ల ఆధారంగా ఎస్సే రాయాలి. ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా రాయాలి. అవసరమైన సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఒక పేరాకు తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. గణాంకాలను సాధ్యమైనంతవరకు శాతాల్లో చూపేందుకు యత్నించాలి. వ్యాసంలో అతిముఖ్యమైన సమాచారాన్ని అండర్లైన్ చేయాలి. ఎస్సే రాయడంలో సమతూకం పాటించడం చాలా ప్రధానం. ప్రశ్నలో అడిగిన అంశానికి సంబంధించి వివిధ పార్శ్వాలు ప్రతిబింబించేలా సమాధానం రాయాలి. ఏదో ఒక కోణాన్ని మాత్రమే ప్రస్తావించి వదిలేయకూడదు. వివిధ సమస్యల పరిష్కారానికి అభ్యర్థి సూచనలు నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండాలి.