అమ్మే పట్టుపట్టకపోయుంటే...
నాన్న నన్ను పుస్తకం ముట్టనిచ్చేవారు కాదు!
చుక్కారామయ్య, విద్యావేత్త
ఇప్పుడంటే చుక్కా రామయ్య (90) ఐఐటి రామయ్యగానే అందరికీ పరిచయం. ఆయన మాజీ ఎంఎల్సి. అంతకంటే ఎక్కువగా స్వాతంత్య్ర సంగ్రామ సైనికుడు. గాంధీజీ పిలుపుతో అంటరానితనం నిర్మూలన ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. కమ్యూనిస్టులలో కలిసి కదం తొక్కారు. జైలు జీవితాన్ని అనుభవించారు. అంత పెద్ద ఉద్యమ జీవితానికి ఆయనలో స్ఫూర్తిని రగిలించిన మహోన్నత వ్యక్తి రామయ్య తల్లి నర్సమ్మ. ‘మా అమ్మ’ శీర్షిక కోసం ఆయనను కలిసినప్పుడు సాక్షి ఫ్యామీలీతో తల్లి జ్ఞాపకాలను పంచుకున్నారు.
మాది వరంగల్ జిల్లా గూడూరు గ్రామం. అమ్మ నర్సమ్మ, నాన్న అనంతరామయ్య. మొదటి భార్య ప్రసవం సమయంలో కన్నుమూయడంతో నాన్న మా అమ్మను రెండవ వివాహం చేసుకున్నారు. నాన్నకు, అమ్మకు మధ్య వయసు తేడా ఇరవై ఏళ్లకు పైగానే. నేను పుట్టేనాటికి అమ్మకు దాదాపుగా 30 ఏళ్లు. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. మా భవిష్యత్తు గురించి నాన్నకు పరిమితమైన పరిధి ఉండేది. అమ్మకు విస్తృతమైన లక్ష్యం ఉండేది. అమ్మకు నన్ను చదివించాలని ఉండేది. నాన్న మాత్రం ‘చదువుకుంటే వాడు ఊళ్లో ఉండడు, నేను పోయాక నిన్నెవరు సాదుతారే. వాడిని పౌరోహిత్యం చేసుకోనివ్వు, ఉన్న ఊళ్లోనే ఉండి నిన్ను, తర్వాత పిల్లల్ని సాదుతాడు. అయినా పిల్లల్ని చదివించడానికి నా దగ్గర డబ్బేది’ అనేవారాయన. అమ్మ ససేమిరా అంది. ఆమెకు 30 తులాలకు పైగా బంగారం ఉండేది. ‘నా కంఠి అమ్మి చదివిస్తా’నని పట్టుపట్టింది. ఆమె పట్టుదలే నా ఉన్నతికి సోపానమైంది. తనను తాను మెట్లుగా పరిచి నన్ను అందలం ఎక్కించింది అమ్మ.
‘నా కొడుకు చేసిన తప్పేంటి?’ అని అడిగింది
నాన్న 65 ఏళ్లకే పోయారు. కుటుంబాన్ని సంరక్షించవలసిన బాధ్యత ఆమె మీద పడింది. ఆమె అధైర్యపడ లేదు. నిస్పృహ చెందలేదు. హన్మకొండలోని బంధువుల ఇంట్లో ఉంచి మమ్మల్ని చదివించింది. చదువుకుంటూనే నేను సామాజిక ఉద్యమాల వైపు మళ్లాను. నా చైతన్యం మా ఇంటిని సామాజిక బహిష్కరణకు గురి చేసింది. నేను దళితవాడలకు వెళ్లడం, వాళ్లిచ్చిన నీళ్లు తాగడం ఊళ్లో వాళ్లకు నచ్చలేదు. చిన్న చెల్లి రజస్వల అయినప్పుడు మా ఇంటికి ఎవ్వరూ రాలేదు. ఆ నిరాదరణను మా అమ్మ తట్టుకోగలిగింది కానీ, చెల్లి భోరున ఏడ్చింది. అంత జరిగినా మా అమ్మ ‘నీకీ ఉద్యమాలెందుకు?’ అని నన్ను వారించలేదు. పైగా బంధువులతో ‘నా కొడుకు చేసిన తప్పేంటి? దళితుల ఇంటి నీళ్లు తాగడం తప్పని మీరనుకుంటే... మీరు విధించిన ఈ బహిష్కరణను నేను గౌరవించాల్సిన పనేలేదు’ అని కరాఖండిగా చెప్పేసింది. ఆ రోజు బహిష్కరణకు భయపడి ఆమె నన్ను ఉద్యమం వైపు అడుగులు వేయనివ్వకుండా ఆపి ఉంటే నాకంటూ ఓ వ్యక్తిత్వం, ఉనికి ఉండేవి కాదేమో!
జైల్లో నన్ను కలవడం కోసం అమ్మ ‘ధైర్యం’ చేసింది
ఉద్యమాల్లో నన్ను అరెస్టు చేసి ఔరంగాబాద్ జైల్లో పెట్టినప్పుడు నాకు టైఫాయిడ్ వచ్చింది. ఆ సంగతి తెలిసి అమ్మ నన్ను చూడడానికి వచ్చింది. పెద్ద చెల్లికి పెళ్లయింది. చిన్న చెల్లి, తమ్ముడు చిన్నవాళ్లు. వాళ్లను ఎక్కడా ఉంచలేదు, వెంట తీసుకురాక తప్పని స్థితి ఆమెది. అందరికీ టిక్కెట్టు కొనడం ఆమె శక్తికి మించిన పని. ఒక టికెట్ మీద రెలైక్కేసి పిల్లలను స్టేషన్లో దించి, మరో వైపు నుంచి బయటకు రమ్మని పంపించింది. ఆ క్షణంలో తల్లి క్షోభ ఎలా ఉండి ఉంటుందో అలోచించిన ప్రతిసారీ నాకు గుండె చెదిరినట్లవుతుంది.
జైలు నుంచి వచ్చి ఇంటి పరిస్థితి చూశాక ఏదో ఒక ఉద్యోగం చూసుకుని అమ్మకు కష్టం తగ్గించాలనుకున్నాను. అయితే నా మీద ఉన్న కేసుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం రాదు. నా పరిస్థితి చూసి ఓ స్కూలు యజమాని ఆరు నెలలు మాత్రమే అన్న షరతుతో ఉద్యోగమిచ్చారు. ఇల్లు గడవడానికి ఒక భరోసా వచ్చింది. నా ప్యాంట్లు కత్తిరించి తమ్ముడికి నిక్కర్లు కుట్టి, నాకు వరి అన్నం వండి, తాను జొన్న గట్కతో కడుపు నింపుకుని ఇంటిని గుంభనంగా లాక్కొచ్చింది మా అమ్మ.
నా వల్ల ఆమెకు గొప్ప సంతోషాలేమీ దక్కలేదు
నాకు తెలిసి అమ్మ సంతోషపడిన సందర్భాలు రెండే రెండు. తమ్ముడికి ఐఐటిలో సీటు వచ్చినప్పుడు, చిన్న చెల్లి పెళ్లప్పుడు. మా అమ్మ బతికి ఉన్నన్ని రోజులు నేను మామూలు టీచర్నే. ఐఐటి కోచింగు, ఎమ్మెల్సీ వంటివన్నీ ఆమె పోయాకే జరిగాయి. నా కారణంగా ఆమెకు బతుకు గడవడానికి భరోసా తప్ప గొప్ప సంతోషాలేమీ దక్కలేదు. ఆమెలో నాకు ఆశ్చర్యమనిపించే సంగతేమిటంటే... అంత లేమిలో కూడా ఆమె తన ఔన్నత్యాన్ని కోల్పోలేదు. తమ్ముడి పెళ్లికి వరదక్షిణ ప్రస్తావన వచ్చినప్పుడు ‘వరదక్షణ వద్దు, అమ్మాయి బుద్దిమంతురాలైతే చాలు’ అన్నది.
ఈ గౌరవాలన్నీ... అమ్మ ఇచ్చివెళ్లిన వరాలే
పెళ్లి పనులకు మనుషుల్ని పెట్టుకునే స్థోమత లేదు. అన్ని పనులూ అమ్మ ఒక్కతే చేసుకుంది. ఆ పనుల్లో ఆమె తలకు మేకు తగిలి బాగా రక్తం వచ్చింది. గాయానికి పసుపు రాసుకుని వెంటనే పనిలో పడిందామె. దేనికీ అధైర్యపడని స్వభావం ఆమె నుంచే నాకు అబ్బింది. ఆమె జీవితం ఒక సందేశంలా నాలో ధైర్యాన్ని నింపింది. చదువుతో దృష్టి విశాలమవుతుందనుకుంటాం. కానీ మా అమ్మ జీవితమే నాకు అంతటి విశాలత్వాన్ని నేర్పించింది. అంతులేని త్యాగాన్ని అలవరిచింది. ఆమె ఆచరించి చూపించిన త్యాగగుణం నాలో విలువలు నింపింది. సమాజం నుంచి గౌరవం అందుకున్న ప్రతిసారీ నాకు నాకు అమ్మ గుర్తొస్తుంది.
సంభాషణ: వాకా మంజులారెడ్డి