breaking news
Chief minister seat
-
ముఖ్యమంత్రిగా నేనే
తక్కువ స్థానాల్లో గెలుపొందినా సీఎం మార్పు ఉండదు : సిద్ధు = ఈ ఫలితాలు నా పాలనకు రెఫరెండం కాదు = హైకమాండ్ ఆశయం మేరకు సీట్లు సాధిస్తా = జేడీఎస్ అభ్యర్థులను మభ్యపెట్టలేదు = వారు స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు = ‘జాఫర్’ టికెట్ విషయంలో నా జోక్యం లేదు = అభివృద్ధిలో గుజరాత్ కంటే కర్ణాటక బెటర్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తక్కువ స్థానాల్లో గెలుపొందినా, ముఖ్యమంత్రి మార్పు ప్రశ్న ఉద్భవించబోదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సోమవారం ఆయనిక్కడ ‘మీట్ ది ప్రెస్’లో మాట్లాడారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఐదేళ్లు అధికారంలో కొనసాగాల్సిందిగా కాంగ్రెస్‌కు తీర్పునిచ్చారని అన్నారు. కనుక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తన పాలనపై రెఫరెండం కాబోదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు తేడా ఉంటుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ర్టం నుంచి అత్యధిక స్థానాలను గెలవాలన్న కాంగ్రెస్ అధిష్టానం లక్ష్యాన్ని సాధిస్తామని, 18 నుంచి 20 సీట్లలో విజయ బావుటాను ఎగుర వేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలుపొందడానికి ఇద్దరు జేడీఎస్ అభ్యర్థులను రంగం నుంచి తప్పించామనే ఆరోపణలు వాస్తవం కాదని అన్నారు. వారిద్దరూ స్వచ్ఛందంగా తప్పుకున్నారని తెలిపారు. బెల్గాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు జేడీఎస్ అభ్యర్థి తనను కలుసుకుని కాంగ్రెస్‌లో చేరుతానని చెప్పినప్పుడు, స్వాగతించామని చెప్పారు. ఉత్తర కన్నడ అభ్యర్థి ఆ పార్టీ నాయకత్వ ధోరణిపై విరక్తి చెంది తప్పుకున్నారని తెలిపారు. ఆయన కాంగ్రెస్‌లో చేరలేదని, బీజేపీకి వెళ్లారని చెప్పారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామిలపై ఆ పార్టీ అభ్యర్థులకు విశ్వాసం లేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జాఫర్ షరీఫ్‌కు టికెట్టు రాకుండా తాను అడ్డు పడ్డానని వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. అభ్యర్థులను అధిష్టానం ఎంపిక చేస్తుందని, తన ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రభావం ఏ మాత్రం లేదని, బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి సైతం మోడీ గాలి ఎక్కడా లేదని, బీజేపీ గాలి మాత్రమే ఉందని చెప్పారని గుర్తు చేశారు. గుజరాత్‌తో పోల్చుకుంటే కర్ణాటక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. తనకు వివాహమైన విషయాన్ని దాచి పెట్టిన మోడీ నిజాలు చెబుతారని ఎలా విశ్వసించగలమని ప్రశ్నించారు. కాగా బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేసిన హోం మంత్రి కేజే. జార్జ్ వెంట రౌడీ షీటర్ ఆజాం పాల్గొన్న విషయంలో పోలీసుల వైఫల్యం ఉందని తెలిపారు. గూండాలందరి గురించి హోం మంత్రికి తెలియకపోవచ్చని, అలాంటి సందర్భంలో పోలీసులు మంత్రిని అప్రమత్తం చేయాల్సి ఉండిందని అన్నారు. ఇందులో హోం మంత్రి తప్పు లేదని సమర్థించారు. -
సీఎం సీటుకు పోటాపోటీ!
* ఆశావహులందరికీ టీ-కాంగ్రెస్ జాబితాలో చోటు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన తెలంగాణ అభ్యర్థుల జాబితాలో ఆ ప్రాంత ముఖ్యులందరికీ చోటు దక్కింది. ప్రధానంగా టీ-కాంగ్రెస్‌లో సీఎం సీటును ఆశిస్తున్న నేతలందరూ బరిలో నిలిచారు. ఇప్పటికే పార్టీ పదవుల్లో ఉన్నవారందరికీ కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. అభ్యర్థుల విషయంలో సుదీర్ఘ కసరత్తు చేసిన హైకమాండ్.. ఒకేసారి 111 స్థానాలకు పోటీదారుల పేర్లను ప్రకటించి ఇకపై మార్పుచేర్పుల కసరత్తుల్లేకుండా చూసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ అధ్యక్షుడు దామోదర రాజనర్సింహలకు సహజంగానే జాబితాలో చోటు దక్కగా... టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన కె.జానారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్లకూ టికెట్లిచ్చారు. వీరంతా సీఎం రేసులో ఉన్న వారే కావడం గమనార్హం. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీకీ టికెట్లు ఖరారయ్యాయి. సోనియా విధేయుడిగా వీహెచ్, మైనారిటీ కోణంలో షబ్బీర్‌అలీ కూడా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డిలు కూడా సీఎం ఆశావహుల జాబితాలో ఉన్నవారే. ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ అధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబులు సరేసరి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తే.. అప్పుడు మొదలవుతుంది అసలు కథ!.