breaking news
Chaina Phone
-
ఎలక్ట్రానిక్స్‌లో దూసుకెళ్తున్న భారత్
ఒకప్పుడు మొబైల్ ఫోన్ అనగానే చైనాయే గుర్తొచ్చేది. డ్రాగన్ దేశం నుంచే వివిధ దేశాలకు లక్షలాదిగా మొబైళ్లు ఎగుమతి అయ్యేవి. పైగా స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ దాదాపు చైనాలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత్ ఫోన్ల తయారీలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2014–2023 మధ్య కాలంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో 23 శాతం వార్షిక వృద్ధిరేటు సాధించుకుంటూ ప్రపంచంలో రెండవ అతి పెద్ద మొబైల్ ఉత్పత్తి దేశంగా అవతరించింది. ఈ మేరకు గ్లోబల్ రీసెర్చ్ ఆర్గ నైజేషన్ ‘కౌంటర్ పాయింట్’ నివేదించింది. భారత్ దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం విజయవంతం కావడంతో దేశంలో ఫోన్ల ఉత్పత్తి భారీగా పెరిగింది. ఇండియాలో ఎలక్ట్రానిక్ రంగాన్ని బలోపేతం చేసేందుకు, ఫోన్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం 2021 ఏప్రిల్‌లో పీఎల్ఐ పథకాన్ని ప్రవేశపెట్టింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేయడంలో ఆయా సంస్థలకు రూ. 40,995 కోట్ల రాయితీలు ఈ పథకం కింద ఇచ్చింది. దీంతో స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్‌లతో పాటు పలు కంపెనీలు ఫోన్ల ఉత్పత్తిని విపరీతంగా పెంచాయి. దేశీయ మార్కెట్లో విక్రయించడంతో పాటు పలు దేశాలకు ఎగుమతులు పెరిగాయి. ఈ అనూహ్య పెరుగుదలకు యాపిల్ ఐఫోన్ల ఒప్పంద తయారీ కంపెనీలైన ఫాక్స్‌కాన్, పెగట్రాన్, విస్ట్రన్లతో పాటు శాంసంగ్ ప్రధాన కారణం. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి సాధించేందుకు ‘ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్’ (ఐసీఈఏ) సుంకాలు తగ్గించి, మార్కెట్లో పోటీ తత్వాన్ని పెంచాలని చూస్తోంది. ఉత్పత్తులను మెరుగుపరచడం, కార్మిక సంస్కరణలు చేయడం, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై దృష్టి సారించింది. 2025–26 నాటికి 600 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లు ఎగుమతి అవుతాయని భారత్ అంచనా వేస్తోంది. ఒకప్పుడు మన దేశం నుంచి మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు ఫోన్లు ఎగుమతి అవ్వగా... ప్రస్తుతం అమెరికా, నెదర్లాండ్, ఆస్ట్రియా, ఇటలీ వంటి యూరప్ దేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘పేస్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్’ (పీఎంపీ), ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్’ (పీఎల్ఐ), ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి కార్యక్రమాలను కేంద్రం ప్రారంభించి స్థానిక తయారీ సంస్థలను ప్రోత్సహించింది. 2014లో దేశీయంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 19 శాతం మాత్రమే ఉండేది. 2022 నాటికి 98 శాతం స్థానికంగా తయారు చేసిన ఫోన్లను భారత్ ఎగుమతి చేసింది. ఇప్పటికే ఇండియాలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెల్ఫోన్లు, లాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ మదర్ బోర్డులతో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో వినియోగించే మైక్రో ప్రాసెసర్లు, చిప్సెట్స్ కూడా మన దేశంలోనే తయారు చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇదే తరహాలో భారత్ ముందుకెళ్తే ఎలక్ట్రానిక్స్ రంగంలో మరింత వృద్ధి సాధించేందుకు అవకాశం ఉంది. – తాడేపల్లి విజయ్ ‘ 78424 85865 -
ప్రకంపనలు సృష్టిస్తోన్న ఐఫోన్!
వ్యాపార పరంగా ప్రస్తుతం ప్రపంచంలో హాటెస్ట్ సెక్టార్ ఏది అంటే ఎవరైనా ఠక్కున మొబైల్ రంగమని చెబుతారు. అది వాస్తవం కూడా. ఇందుకు తాజాగా ఓ ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎంఐ3 చైనా ఐఫోన్‌గా పేరుగాంచింది. ఈ ఫోన్ చైనాలో భారీ స్థాయిలో అమ్ముడయింది. ఇప్పుడు భారత్‌లో కూడా అదే రీతిన ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలైన 39 నిమిషాల్లో లక్ష ఫోన్లు అమ్ముడుపోయాయి. కొత్త తరహా ఫోన్లపై ప్రజలకు ముఖ్యంగా యువతకు ఎంత మోజు ఉందో ఈ సంఘటన తెలియజేస్తుంది. కాస్త కొత్తదనం కనిపిస్తే చాలు మొబైల్ ఫోన్ ప్రియులు స్మార్ట్ ఫోన్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. షియోమి ఎంఐ3 ఫోన్‌కు లభించిన స్పందనే ఇందుకు నిదర్శనం. చైనా 'యాపిల్'గా పేరు గడించిన షియోమీ సంస్థ తన ఎంఐ3 ఫోన్‌ను భారత్‌లో విక్రయించేందుకు ఇ-కామర్స్ పోర్టల్ ఫ్లిఫ్కార్టుతో ఒప్పందం చేసుకుంది. ఈమేరకు ఎంఐ3ని ఫ్లిఫ్‌కార్ట్ తన పోర్టలో విక్రయానికి పెట్టింది. జూన్ 22న ఎంఐ3 ఫోన్ అమ్మకానికి వచ్చిన 39 నిమిషాల్లోనే అందుబాటులో ఉంచిన స్టాక్ మొత్తం అయిపోయింది. లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి. జూలై 15 నుంచి జూలై 21 మధ్యకాలంలో ఈ ఫోన్ కోసం లక్షకు పైగా రిజిస్ర్టేషన్లు జరిగినట్టు ఫ్లిఫ్‌కార్ట్ తెలిపింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఫోన్‌ను విక్రయిస్తున్నట్లు ఫ్లిఫ్‌కార్ట్ చెబుతోంది. కొత్త స్టాక్ కోసం ప్రయత్నిస్తున్నామని, స్టాక్ రాగానే విక్రయిస్తామని, ముందుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచిస్తోంది. ఎంఐ3 ఫోన్‌కు ఇంత డిమాండ్ ఉండటానికి కారణం ఐఫోన్ 5ఎస్, గెలాక్సీ ఎస్5ల్లో ఉన్న ఫీచర్స్ కంటే మెరుగైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 5ఎస్‌లో 1.3 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ఏ7 ప్రాసెసర్ ఉంటే, ఎంఐ3లో 2.3 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఉంది. ఐఫోన్ 5ఎస్‌లో 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంటే, ఇందులో 13 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ఐఫోన్లో బ్యాటరీ 1560 ఎంఏహెచ్ కాగా, ఇందులో 3050 ఎంఏహెచ్‌గా ఉంది. ఐఫోన్ 5ఎస్ 43 వేల రూపాయలు, గెలాక్సీ ఎస్5 ధర 37 వేల రూపాయలు కాగా, ఎంఐ3 ధర15 వేల రూపాయలే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ హైఎండ్ ఫోను కన్నా ఎంఐ3లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ఇందువల్లే ఈ ఫోన్ హాట్‌కేకుగా మారింది. ఈ ఫోన్ ఆన్లైన్లో కూడా సంచలనం సృష్టించింది. ఫోన్ విడుదలకు ముందు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇస్తే 86 సెకండ్లలో లక్ష ఫోన్లను బుక్ చేసుకున్నారు. విడుదల అయిన తరువాత 39 నిమిషాలలో లక్ష ఫోన్లు అమ్ముడుపోయాయి. షియోమి కంపెనీ ప్రపంచంలోనే ఆరవ, చైనాలో మూడో అతి పెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీ. 2010లో బీజింగ్ కేంద్రంగా లీ జున్ దీనిని ప్రారంభించారు. ఈ కంపెనీ వ్యాపారం అంతా ఆన్లైన్లోనే జరుగుతోంది. అందువల్ల ఈ సంస్థ మార్కెటింగ్‌కు చాలా తక్కువగా నిధులు కేటాయిస్తుంది. ఆ రకంగా ఎక్కువ ఫీచర్స్‌తో తక్కువ ధరకు ఇవ్వగలుగుతున్నట్లు యాజమాన్యం తెలిపింది. - శిసూర్య