breaking news
central africa
-
చాద్ అధ్యక్ష భవనంపై దాడి!
ఇంజమెనా (చాద్): మధ్య ఆఫ్రికా దేశం చాద్‌లో దేశాధ్యక్ష భవనంపై దాడికి విఫల యత్నం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిని భగ్నం చేసినట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. దాడి సమయంలో అధ్యక్షుడు మహమత్ దెబీ ఇత్నో భవనం లోపలే ఉన్నట్టు ధ్రువీకరించింది. అయితే, ‘దాడిని తిప్పికొట్టాం. భద్రతా దళాల కాల్పుల్లో 19 మంది ముష్కరులు హతమయ్యారు. ఆరుగురిని బందీలుగా పట్టుకున్నాం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది‘ అని చాద్ విదేశాంగ మంత్రి అబ్దరమాన్ కౌలామల్లాహ్ తెలిపారు. రాజ్యాంగబద్ద పాలనను అమలుచేస్తున్నందుకు అభినందించేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చాద్‌కు వచ్చి అధ్యక్షుడిన కలిసిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. ఇది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ బొకో హరాం పని కావచ్చన్న అనుమానాలను తోసిపుచ్చారు. ‘జరిగింది ఉగ్ర దాడి కాకపోవచ్చు. దాడికి పాల్పడ్డ వాళ్లంతా తప్ప తాగి అన్నారు. డ్రగ్స్ మత్తులో కనిపించారు. వారంతా రాజధానికి చెందిన దారి తప్పిన యువకులే‘ అని ఆయన అన్నారు. దాదాపు 1.8 కోట్ల జనాభా ఉన్న చాద్ దేశంలో కొంతకాలంగా రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది. -
రెబల్స్‌తో పోరు.. చాద్ అధ్యక్షుడి దారుణ హత్య
ఎండ్జమీనా: మధ్య ఆఫ్రికా దేశం చాద్‌ను మూడు దశబ్దాల పాటు పరిపాలించిన అధ్యక్షుడు ఇద్రిస్ దెబీ ఇత్నో మంగళవారం హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్మీ వెల్లడించింది. రెబల్స్‌తో పోరు సందర్భంగా యుద్ధభూమిలో ఆయన మరణించినట్లు తెలిపింది. ఏప్రిల్ 11న చాద్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆయన గెలుపొందినట్లు ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన హత్యకు గురి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో, 18 నెలల ట్రాన్సిషనల్ కౌన్సిల్‌ను ఆయన కుమారుడైన మహమత్ ఇద్రిస్ ఇత్మో (37) నడిపిస్తారని ఆర్మీ ప్రకటించింది. అధ్యక్షుడి మరణానికి కారణమైన రెబల్స్ పక్క దేశమైన లిబియాలో శిక్షణ తీసుకొని వచ్చినట్లు ఆర్మీ భావిస్తోంది. ఎన్నికలు జరిగిన 11నే వారు ఉత్తర చాద్‌లోకి అడుగు పెట్టినట్లు అభిప్రాయపడుతోంది. ఇద్రిస్ దెబీ 1990లో గద్దెనెక్కారు. అప్పటి నుంచి చాద్‌ను పాలిస్తున్నారు. చదవండి: రష్యా సర్జికల్ స్ట్రైక్: 200 ఉగ్రవాదులు ఖతం -
'నా బిడ్డని చంపేయాలనిపిస్తుంది'
వాషింగ్టన్: అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో రాజధాని బాంగీ, దాని పరిసర ప్రాంతాల ప్రజలు ఇల్లు గుల్లై ఆకలిదప్పులతో అలమటిస్తుంటే శాంతియుత పరిస్థితులను నెలకొల్పాల్సిన ఐక్యరాజ్య సమితి పీస్ కీపర్లు వారి ఒంటిని గుల్ల చేస్తున్నారు. అమాయిక బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతూ వారి శరీరాలను కుళ్ల పొడుస్తున్నారు. ఫలితంగా పాపం, పుణ్యం ఏమీ తెలియని ఆ అమాయక బాలికలు పిన్న వయస్సులో తల్లులై బిడ్డల భారాన్ని మోయలేక మోస్తున్నారు. ఇలా ఒకరా, ఇద్దరా ఇప్పటికే 45 మంది బాలికలు, మహిళలు వారి అకృత్యాలకు బలయ్యారు. వారిలో 12 ఏళ్ల బాలిక కూడా ఉందని, అందుకు తమ వద్ద సరైనా సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయంటూ మానవ హక్కుల సంఘం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించిందంటే దారుణ పరిస్థితి గురించి అంచనా వేయవచ్చు. వారిలో కడుపు కాలి పేగుల కేకలు భరించలేక పట్టెడు మెతుకుల కోసమో, చిల్లర పైసల కోసం స్వచ్ఛందంగా శరీరాలను అప్పగించిన, అప్పగిస్తున్న సందర్భాలు లేకపోలేదు. అందుకే ఎక్కువ కేసులు రికార్డుల్లోకి ఎక్కడం లేదు. బాధితుల్లో ఏడుగురు మహిళలు, బాలికలను వాషింగ్టన్ పోస్ట్ ఇంటర్వ్యూ చేసింది. బాధితుల్లో ఎల్ఫిన్ అనే 14 ఏళ్ల బాలిక మీడియాతో మాట్లాడుతూ 'నేను ఒంటరిగా ఉన్నప్పుడు ముక్కుపచ్చలారని బిడ్డని చూస్తుంటే నాకు పీస్ కీపర్ సైనికుడే గుర్తొస్తాడు. అలా గుర్తు వచ్చినప్పుడల్లా నా బిడ్డ గొంతు పిసికి చంపేయాలనిపిస్తుంది. ఇలా ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు అనుకున్నాను' అని చెప్పింది. పీస్ కీపర్స్ అకృత్యాల గురించి తెలిసిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ వ్యాఖ్యానించినప్పటికీ వారిపై సరైన చర్యలు లేవు. వారి అకృత్యాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. దాదాపు వెయ్యిమంది పీస్ కీపర్లపై ఆరోపణలు వచ్చాయి. వారిలో కొంతమందిని మాత్రమే ఇప్పటి వరకు సస్పెండ్ చేశారు. పరస్పర సమ్మతితో జరిగిన సెక్స్ అంటూ కొన్ని కేసులను కొట్టి వేశారు. పీస్ కీపర్స్ బెటాలియన్ మకాం చేసిన బాంగి శివారు ప్రాంతంలోనే ఈ దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 2013లో మెజారిటీ క్రైస్తవ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మైనారిటీ ముస్లింలు తిరుగుబాటు చేయడంతో దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. ఇరు గ్రూపుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా అది అమలు కాకపోవడంతో ఐక్యరాజ్య సమితి జోక్యంతో శాంతియుత పరిస్థితుల స్థాపనకు 2014లో 12 వేల మంది పీస్ కీపర్లు బాంగీకి వచ్చారు. వారిలో 46 దేశాలకు చెందిన సైనికులు ఉన్నారు. వారిలో కాంగో దేశానికి చెందిన సైనికులే ఎక్కువ రేప్‌లకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.