breaking news
call money gang
-
కాల్‌మనీ ముఠా వేధింపులతో వృద్ధురాలి మృతి
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ నగరపాలక సంస్థలో 30 ఏళ్ల పాటు పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసిన బండి చిననూకమ్మ అనే వృద్ధురాలు కాల్‌మనీ ముఠా వేధింపులు తాళలేక మనోవేదనతో సోమవారం రాత్రి మరణించింది. వివరాల్లోకి వెళితే.. వించిపేటకు చెందిన చిననూకమ్మ భర్త నాగరాజు ఆర్టీసీలో పనిచేసేవాడు. అతడు కాల్‌మనీ వ్యాపారి రాంపిల్ల పాపారావు నుంచి కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. 2017లో అతడు మరణించగా.. భర్త చేసిన అప్పును తాను తీరుస్తానంటూ కాల్‌మనీ వ్యాపారికి చిననూకమ్మ ప్రామిసరీ నోటు రాసిచ్చింది. ఆ తరువాత కొంతకాలానికి అప్పు మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించేసింది. అయితే, కాల్‌మనీ వ్యాపారి ఆ ప్రామిసరీ నోట్లను ఆమెకు తిరిగివ్వలేదు. ఇదిలావుంటే.. గత ఏడాది జూన్ 30వ తేదీన చిననూకమ్మ రిటైరైంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ కోసం ఆమె ఎదురు చూస్తుండగా.. కాల్‌మనీ వ్యాపారి రాంపిల్ల పాపారావు ముఠాకు చెందిన పలతోటి మరియరాజు (మంగళగిరి), జాదూ నాగేశ్వరి (గుణదల) రూ.14 లక్షలు చెల్లించాల్సిందిగా చిననూకమ్మకు లీగల్ నోటీసులు పంపించారు. ఆమెకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ కూడా తీసుకోనివ్వకుండా ఆమె బ్యాంక్ అకౌంట్‌ను గతేడాది ఆగస్టులో ఫ్రీజ్ చేయించారు. అప్పటినుంచి మనోవేదనతో మంచం పట్టిన చిననూకమ్మ సరైన వైద్యం చేయించుకోలేని స్థితిలో సోమవారం ప్రభుత్వాస్పత్రిలో చేరగా.. అదే రోజు రాత్రి మృతి చెందింది. ఈ విషయమై చిననూకమ్మ కుమారుడు వడ్డాది బోన మాట్లాడుతూ.. కాల్‌మనీ ముఠా వేధింపుల వల్లే తన తల్లి మంచం పట్టి మరణించిందని వాపోయాడు. -
కట్టుబట్టలు తప్ప.. అన్నీ దోపిడీ!
► కాల్ మనీ గ్యాంగ్‌కు చిక్కితే అంతే ► ఓటర్, ఆధార్ కార్డులు కూడా వాళ్ల సొంతం ► ఆస్తి పత్రాలు పక్కాగా రాయించుకున్న వైనం ► సోదాల్లో వందల కొద్దీ డాక్యుమెంట్ల స్వాధీనం ► ప్రస్తుతానికి తూతూమంత్రంగానే దాడులు ► అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోతే.. తుస్! (సాక్షి వెబ్ ప్రత్యేకం) విజయవాడ, గుంటూరు జిల్లాల్లో జోరుగా జరుగుతున్న కాల్‌మనీ వ్యాపారంలో తవ్వినకొద్దీ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఒకసారి కాల్‌మనీ గ్యాంగ్‌లో చిక్కితే ఒక మనిషిని ఏ స్థాయిలో వేధిస్తారో ఒక్కొక్కటిగా బయటపడుతోంది. మనిషికి ఉండే కట్టుబట్టలు తప్ప ప్రతి ఒక్క వస్తువును దోచేసుకున్నారు. మంగళవారం తాజాగా గుంటూరులోని పట్టాభిపురం, అరండల్‌పేట, కొత్తపేట, పాట గుంటూరు పోలీస్స్టేషన్ల పరిధిలోని కాల్‌మనీ గ్యాంగ్‌కు చెందిన నలుగురి ఇళ్లపై దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో బయటపడిన డాక్యుమెంట్లను చూసి విస్మయం చెందారు. తీసుకున్న అప్పు కింద తనఖా పెట్టుకోవడానికి ఇంటి ఆస్తుల రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఇతర భూముల పత్రాలను తీసుకోవడమే కాకుండా ఖాళీ ప్రామిసరీ నోట్స్‌పై సంతకాలు తీసుకున్నారు. ఎప్పుడైనా, ఏ దశలోనైనా ఆ ఇంటిని వారు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి లేదా ఇతరులకు అమ్మకోవడానికి వీలుగా పత్రాలను రాయించుకునేలా బాధితుల నుంచి సంతకాలు తీసుకున్నారు. ఇవే కాదు విచిత్రమేమంటే... అప్పు తీసుకున్నవారు సమాజంలో తానూ ఒక మనిషినే అని నిరూపించుకోవడానికి ఏ ఆధారం లేకుండా ప్రతి ఒక్కటీ తమ వద్ద తనఖా పెట్టించుకున్నారు. రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు ఇలా ఒకటేమిటి... ఆ ఇంట్లో ఏముంటే వాటిని కాల్ మనీ గ్యాంగ్ తమ వద్ద తనఖా పెట్టుకున్నారు. మంగళవారం నాలుగిళ్లలో పోలీసులు దాడులు చేయగా ఆ నాలుగిళ్ల నుంచి వందలాదిగా ఇలాంటి డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ప్రతి ఇంట్లో వందల కొద్దీ డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు, ఆధార్ కార్డులు, నగలు, డబ్బు కట్టలు... ఇలా అనేకం వెలుగులోకి వచ్చాయి. వాటన్నింటినీ పోలీసులు సీజ్ చేసి నలుగురు కాల్ మనీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. అసలు దోషుల ఇళ్లవైపు చూడని పోలీసులు కాల్ మనీ కేసులు తవ్వినకొద్దీ అనేక విస్మయకర విషయాలు బయటకు వస్తుండగా, ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారులు, పాత్రధారుల వైపు పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. అధికార పార్టీకి చెందిన బడా నేతల పాత్ర ఉందని స్పష్టంగా తెలుస్తున్నా.. అటువైపు వెళ్లే సాహసం కూడా చేయట్లేదు. ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తే వారిని బెదిరిస్తున్న సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలతో.. మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా కాల్‌మనీ దౌర్జన్యాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించడమే కాకుండా మంగళవారం ఈ విషయంపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఇరకాటంలో పడతామన్న భయంతో కాల్ మనీ వ్యవహారంలో కొందరిపై తూతూ మంత్రంగా దాడులు చేయిస్తోందన్న విమర్శలున్నాయి. 'అసెంబ్లీలో ప్రతిపక్షానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకు నామమాత్రంగా కొన్ని దాడులు తప్పవు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేసులన్నింటినీ తెరవెనక్కి నెట్టేస్తారు' అని ఒక పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాలి
-
టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాలి: దేవినేని నెహ్రు
విజయవాడ: కాల్ మనీ ముఠాతో సంబంధమున్న టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రు డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలో దేవినేని నెహ్రు మాట్లాడుతూ... కాల్ మనీ డబ్బుతో విదేశాల్లో జల్సా చేస్తున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కాల్ మనీ ముఠాపై చర్యలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తే సహించమని దేవినేని నెహ్రు స్పష్టం చేశారు.