breaking news
Cage culture centers
-
‘కేజ్ కల్చర్’.. అసలేంటీ కథ..!
సాక్షి, విశాఖపట్నం: సముద్రంలో పంజరం వంటివి ఏర్పాటు చేసి వాటిలో చేపలను పెంచే విధానాన్ని కేజ్ కల్చర్‌గా పేర్కొంటారు. వీటిలో పెరిగే చేపలకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఇలాంటి కేజ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోంది. కొన్నేళ్ల నుంచి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు విశాఖ ఆర్కే బీచ్‌కు సమీపంలో సముద్రంలో కేజ్‌లను అమర్చి పరిశోధనలు సాగిస్తున్నారు. వీరు అక్కడ ఉన్న 30 కేజ్‌ల్లో వివిధ రకాల చేపలను పెంచుతున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం (పీఎంఎంఎస్వై) ద్వారా మత్స్యకారులతో పాటు వివిధ కులాల మహిళలకు ఓపెన్ సీ కేజ్ యూనిట్లను మంజూరు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలు, మత్స్యకార మహిళలకు 60 శాతం, బీసీ మత్స్యకారులకు 40 శాతం చొప్పున సబ్సిడీ ఇస్తున్నారు. ఇలా విశాఖ జిల్లాకు 18 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో జనరల్ కేటగిరీ వారికి 14, ఎస్సీలకు 4 చొప్పున కేటాయించారు. ఒక్కో యూనిట్ విలువ రూ.5 లక్షలు. ఇందులో 10 శాతం లబ్దిదారు వాటాగా భరిస్తే సబ్సిడీ సొమ్ము 40/60 శాతం) పోగా మిగిలినది బ్యాంకు రుణంగా సమకూరుస్తోంది. సబ్సిడీ సొమ్మును లబ్ధిదారునికి దశల వారీగా చెల్లిస్తారు. విశాఖ జిల్లాలో బి.రేవతి అనే మహిళకు 10 ఓపెన్ సీ కేజ్ యూనిట్లను మంజూరు చేశారు. వీటిని సీఎంఎఫ్ఆర్ఐ నిర్వహిస్తున్న కేజ్‌ల సమీపంలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేజ్‌ల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని సీఎంఎఫ్ఆర్ శాస్త్రవేత్తలే అందజేస్తారు. అంతేకాదు.. వీరి పర్యవేక్షణలోనే కేజ్‌ల్లో చేపల పెంపకం కూడా జరుగుతుంది. చేప పిల్లలు, మేత, రవాణా తదితర అవసరాలకు సీఎంఎఫ్ఆర్ఐ సహకరిస్తుంది. విశాఖలో సముద్రంలో కేజ్‌ల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. నెల రోజుల్లో వీటిలో చేపల పెంపకం ప్రక్రియ ప్రారంభమవుతుందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. కేజ్‌ల నిర్మాణం ఇలా.. ఒక్కో ఓపెన్ సీ కేజ్‌ను ఆరు మీటర్ల వ్యాసార్ధంలో, నాలుగు మీటర్ల లోతులో రబ్బరు ట్యూబ్‌లు, పీవీసీ పైప్‌లతో నిర్మిస్తారు. వీటికి ప్లాస్టిక్ డ్రమ్ములు, వెదురును కూడా ఉపయోగిస్తారు. చుట్టూ ఔటర్, ఇన్నర్ నెట్లను ఫ్రేమ్‌ల మాదిరిగా అమరుస్తారు. ఈ కేజ్‌లు కొట్టుకుపోకుండా సముద్రంలో లైన్లు, యాంకరింగ్‌కు వీలుగా చైన్లను ఏర్పాటు చేస్తారు. ఈ కేజ్‌ల్లో పండుగప్పల పెంపకం విశాఖలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కేజ్‌ల్లో పండుగప్ప రకం చేపలను పెంచనున్నారు. ప్రస్తుతం బయట మార్కెట్లో పండుగప్ప చేపలకు మంచి డిమాండ్ ఉంది. ఈ పండుగప్ప చేప పిల్లలను (3–4 అంగుళాల పొడవు) పాండిచ్చేరి సమీపంలోని సీడ్గాళిలో ఉన్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ నుంచి తీసుకొచ్చి ఈ కేజ్‌ల్లో పెంచుతారు. 10–12 నెలల్లో చేప పూర్తి స్థాయిలో (కిలో వరకు బరువు) ఎదుగుతుంది. ఇలా ఒక్కో కేజ్ నుంచి 2–3 టనునల చేపల దిగుబడి వస్తుంది. మార్కెట్లో కిలో పండుగప్ప ధర రూ.500–700 వరకు పలుకుతోంది. -
వంద కేజ్ కల్చర్ సెంటర్లు
- చేపల పెంపకానికి ఎన్ఎఫ్డీబీ అధునాతన పరిజ్ఞానమిది -కేంద్రం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాం: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తెస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈమేరకు జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీబీ) సరికొత్తగా కేజ్ కల్చర్‌ను పరిచయం చేస్తోందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో వంద కేజ్ కల్చర్ సెంటర్లను తెరిచేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని, త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సోమవారం దిల్కుషా అతిథిగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ఎఫ్డీబీ రూపొందించిన కొత్త టెక్నాలజీతో దిగుబడి బాగుంటుందని వివరించారు. ‘రాష్ట్రంలో చేపల పెంపకం ఆశించినంతగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.70కోట్లతో చేప పిల్లలను చెరువుల్లో వేసింది. కానీ పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేశాయి’ అని అన్నారు.. చేపల మార్కెట్ల ఏర్పాటుకు కేంద్రం రాష్ట్రానికి రూ.9.65 కోట్లు కేటాయించి, రూ.4.45 కోట్లు విడుదల చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను సద్వినియోగం చేసుకోవడం లేదని దత్తాత్రేయ చెప్పారు. రాష్ట్రానికి కొత్త యూనివర్సిటీ... రాష్ట్రంలో కొత్తగా ‘ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్’ ఏర్పాటు చేయనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు రెండొందల ఎకరాల భూమి కావాలని, రాష్ట్ర ప్రభుత్వం భూకేటాయింపులు జరిపిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. ఇఫ్లూ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్, స్పోకెన్ హిందీ కోర్సులను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ కోర్సులు పూర్తి ఉచితంగా అందిస్తామన్నారు. త్వరలో ఇఫ్లూ యంత్రాంగం ఐదు గ్రామాలను దత్తత తీసుకోనుందన్నారు. ఐటీఐ మల్లెపల్లిలో కొత్తగా పది ట్రేడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఇప్పటికే మారుతి–సుజుకీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.