breaking news
Braille key pad
-
ఆకట్టుకున్న అంధుల కార్ ర్యాలీ
మాదాపూర్, న్యూస్‌లైన్: అంధుల చూపే మార్గంలో కారును నడిపే ప్రక్రియ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బ్రెయిలీ లిపి బోర్డు ఆధారంగా కారు ర్యాలీ గమ్యస్థానానికి చేరుకోవడాన్ని అంతా ఆసక్తిగా తిలకించారు. ఆదివారం గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ వద్ద ఎయిర్‌సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంధుల కార్ ర్యాలీని సినీనటి మధుషాలిని ప్రారంభించారు. ఇందులో 50 కార్లు పాల్గొన్నాయి. కారులో అంధునితోపాటు ఓ డ్రైవర్ ఉంటారు. అంధుడు కారు ముందు సీట్లో కూర్చోని బ్రెయిలీ పటం ద్వారా చేసే సూచనల మేరకు డ్రైవర్ కారును నడుపుతూ గమ్యస్థానానికి చేరుకోవడం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం. సమయం, వేగం, దూరం పద్ధతి ద్వారా ఈ ర్యాలీ 50 కిలోమీటర్ల మేరకు ప్రయాణించనున్నట్లు, విజేతలకు బహుమతి ప్రదానం చేయనున్నట్టు ఎయిర్‌సెల్ రీజినల్ బిజినెస్ హెడ్ (సౌత్) హమీబక్షి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో భవన నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన నిధుల సమీకరణకు కోసం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రదర్శన చూడలేదు: మధుషాలిని కంటి చూపు లేక ప్రపంచాన్ని చూడలేని వారు తమ ప్రతిభతో కారు ర్యాలీలో పాల్గొని గమ్యస్థానాన్ని చేరడం మరుపురాని అనుభూతిని కలిగించిందని సినీ నటి మధుషాలిని అన్నారు. అంధుల కారు ర్యాలీని తాను ఇప్పటివరకు చూడలేదన్నా రు. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అసవరమన్నారు. -
ఏటీఎం సృష్టికర్త
సంక్షిప్తంగా... జాన్ షెఫర్డ్ బ్యారన్ ఏటీఎంలు వచ్చాక ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు డ్రా చేసుకోవడం తేలికయింది. వచ్చే జూలై నుంచి అంధులు కూడా సులభంగా డబ్బులు తీసుకునే విధంగా బ్రెయిలీ కీ ప్యాడ్‌తో ఏటీఎంలు రానున్నాయి. అలాగే మాట్లాడే ఏటీఎంలను బ్యాంకులు ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరం జాన్ ఆడ్రియన్ షెఫర్డ్ బ్యారన్‌ని కనీసం ఒక్కసారైనా తలుచుకోవాలి. ఏటీఎంను కనిపెట్టిన పుణ్యాత్ముడు ఆయన. ఆయన చలవ వల్లే మొట్టమొదటి ఏటీఎం 1967 జూన్ 27న లండన్‌లో తొలిసారి అందుబాటులోకి వచ్చింది. అప్పుడు దీన్ని సింపుల్‌గా క్యాష్ మెషీన్ అనేవారు. తర్వాత్తర్వాత ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్) అయింది. ఏటీఎం ని సరదాగా ఎనీ టైమ్ మనీ అనేవాళ్లూ ఉన్నారు. షెఫర్డ్... స్కాట్లాండ్ సంతతికి చెందినవాడు. పుట్టింది మాత్రం మన షిల్లాంగ్‌లో. 1925 జూన్ 23 న. అప్పట్లో షిల్లాంగ్ అస్సాంలో ఉండేది. ఇప్పుడది మేఘాలయ రాజధాని. షిల్లాంగ్‌కి ‘స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్’ అని పేరు. షెఫర్డ్ తల్లిదండ్రులు బ్రిటిషర్లు. తండ్రి విల్ఫ్రెడ్ చీఫ్ ఇంజినీర్. ఉద్యోగ రీత్యా కొన్నాళ్లు బ్రిటిష్ ఇండియాలో ఉన్నాడు. తల్లి డొరోతి ఒలింపిక్ టెన్నిస్ క్రీడాకారిణి. వింబుల్డన్ ఉమన్స్ డబుల్స్ ఛాంపియన్ కూడా. షెఫర్డ్ విద్యాభ్యాసం అంతా ఇంగ్లండ్‌లోనే జరిగింది. స్టోవ్ స్కూల్, యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బరో, ట్రినిటీ కాలేజ్.. ఇలా. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో షెఫర్డ్ కొంతకాలం వైమానిక దళంలో పనిచేశాడు. 1960లలో డిలార్యూ అనే ముద్రణ సంస్థలో పని చేస్తున్నప్పుడు తొలిసారిగా షెఫర్డ్‌కి ‘సెల్ఫ్ సర్వీసింగ్ మెషీన్’ కి సంబంధించి ఆలోచన వచ్చింది. ‘ఖాతాదారులు గంటల తరబడి బ్యాంకు క్యూలో నిలుచునే అవసరం లేకుండా, ఇరవై నాలుగు గంటలూ డబ్బు అందుబాటులో ఉండే విధంగా ఒక మిషన్‌ని కనుక్కుంటే! ఆ మిషన్‌ని బ్యాంకులో కాకుండా రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేస్తే’ అని అనుకున్నాడు. అనుకోవడమే కాదు ఆచరణలో పెట్టాడు కూడా. డిలార్యూ మేనేజింగ్ డెరైక్టర్ అయ్యాక లండన్‌లోని బార్క్లేస్ బ్యాక్‌కు అనుసంధానంగా ఏటీఎం మెషీన్‌ని ఏర్పాటు చేయించాడు. ప్రపంచంలోనే మొట్టమెదటి ఏటీఎం అది. ఏటీఎం ఇండస్ట్రీ అసోసియేషన్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు పైగా ఏటీఎంలు పనిచేస్తున్నాయి. ఏటీఎం ను కనుగొన్నందుకు బ్రిటిష్ రాచకుటుంబం షెఫర్డ్‌ను ప్రత్యేకంగా గౌరవించింది. ఏటా ఇచ్చే గౌరవ పురస్కారాలలో భాగంగా 2005లో ఆయన్ని ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ అంపైర్’ టైటిల్‌తో సత్కరించింది. ఆ తర్వాత బిబిసి కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో షెపర్డ్ మాట్లాడుతూ, ‘చాక్లెట్ వెండింగ్ మిషన్‌ని చూశాక నాకు ఈ ఏటీఎం ఆలోచన వచ్చింది’ అని చెప్పారు. అయితే ఏటీఏం కు ఆద్యులు ఎవరు అనే విషయమై కొంత వివాదం కూడా ఉంది. మొదట జేమ్స్ గుడ్‌ఫెలో దీనిని కనిపెట్టారనీ, అయితే ఆచరణలో ఆలస్యమవడం, ఈలోగా షెఫర్డ్‌కు కూడా సరిగ్గా అదే ఆలోచన వచ్చి వెంటనే రంగంలోకి దిగడంతో చరిత్రలో ఆయన నిలిచిపోయారని అంటారు. ఏటీఎంను కనిపెట్టేందుకు షెఫర్డ్‌ను పురికొల్పిన సంఘటన ఒకటి ఉంది. ఆ వేళ బ్యాంకులో డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లిన షెపర్డ్‌కు ‘‘టైమ్ అయిపోయింది’’ అన్న సిబ్బంది సమాధానం నిరుత్సాహం కలిగించింది. ఆగ్రహం కూడా తెప్పించింది. దీనికి పరిష్కారం ఏమిటి అని స్నానం చేస్తూ ఆలోచిస్తుండగా, చాక్లెట్ మిషన్ గుర్తొచ్చి, డబ్బుకి కూడా అలాంటి మిషనే ఎందుకు ఉండకూడదు అన్న పట్టింపుతో అతడు బ్యాంకు వారిని ఒప్పించి మరీ ఏటీఎం పెట్టించాడు. అలా ఈ వండర్ మిషన్లు ఈనాటికి ప్రపంచమంతా వ్యాపించాయి. షెఫర్డ్ 2010 మే 15న తన 84 ఏళ్ల వయసులో కొద్దిపాటి అనారోగ్యంతో మరణించాడు. ఆయన కుమారుడు నికోలస్ గణిత మేధావి. ప్రస్తుతం ఆయన యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జిలో ప్రొఫెసర్.