breaking news
Boarding students
-
బీసీ గురుకుల విద్యార్థులకు ఐఐటీ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: వెనుకబడ్డ తరగతుల (బీసీ) గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మహాత్మా జ్యోతిభాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల సొసైటీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) పేరిట శిక్షణ సంస్థను ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడే దీర్ఘకాలిక శిక్షణ ఇస్తే ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులతో పాటు ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు వస్తాయని భావించిన అధికారులు ఈమేరకు చర్యలు వేగవంతం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 19 బీసీ గురుకుల జూనియర్ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 5 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో ప్రతిభావంతులను గుర్తించి వారికి ప్రత్యేక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇటీవల అర్హత పరీక్ష నిర్వహించిన యంత్రాంగం 360 మందిని అర్హులుగా గుర్తించింది. ఈ విద్యార్థులను సీఓఈ కేంద్రంలో శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతారు. ఒకటి రెండురోజుల్లో తరగతులు ప్రారంభం సీఓఈని ప్రస్తుతం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ప్రారంభించనున్నారు. ఈ మేరకు హయత్‌నగర్ మండలం బాటసింగారం సమీపంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇప్పటికే అర్హులను గుర్తించిన అధికారులు, ఒకట్రెండు రోజుల్లో అక్కడ తరగతులు ప్రారంభించనున్నారు. 360 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా... ఇందులో ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌కు చెందిన 180 మంది, సెకండియర్ చదువుతున్న 180 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో సగంమంది బాలికలున్నారు. విద్యార్థులకు గురుకుల పాఠశాలలో నిర్వహించే తరగతులతో పాటు అదనపు శిక్షణ కోసం ప్రత్యేకంగా సబ్జెక్ట్ నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ప్రధాన సబ్జెక్టులకు సంబంధించి అ«ధ్యాపకులను సైతం నియమించారు. ఈ కేంద్రాన్ని రెండ్రోజుల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించనున్నారు. వారాంతంలోగా తరగతులు ప్రారంభించనున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు ‘సాక్షి’కి తెలిపారు. -
మరో సాహసానికి సై
కిలిమంజారో పర్వతారోహణకు సిద్ధమవుతున్న గురుకుల విద్యార్థులు సాక్షి, హైదరాబాద్ : కిలిమంజారో... పదిహేడు వేల అడుగుల ఎత్తు... తక్కువ ఉష్ణోగ్రతలు... బలమైన గాలులు... ఆఫ్రికాలోనే ఎత్తయిన పర్వతం ఇది. అన్నింటికీ మించి ఎప్పుడు బద్దలవుతుందో తెలియని అగ్నిపర్వతాల శ్రేణి. ఆకాశాన్ని ముద్డాడుతున్నట్టుండే ఈ పర్వత శిఖరాన్ని చూడటమే గగనం. అలాంటిది అధిరోహించడమంటే..! పెద్ద సాహసమే కదా! కానీ... దీన్ని సవాలుగా తీసుకున్నారు రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యార్థులు. టాంజానియాలోని కిలిమంజారో శిఖరాన్ని చేరి... మన జెండాను రెపరెపలాడించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎవరెస్టును ఎక్కి చరిత్ర సృష్టించిన గురుకుల విద్యార్థులు పూర్ణ, ఆనంద్ స్ఫూర్తితో... మౌంట్ రెనోక్‌ను అధిరోహించిన 32 మంది బృందంలోని వారితో పాటు ఎస్సీ, ఎస్టీ గురుకులాలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవీ)కు చెందిన విద్యార్థినులు కూడా ఈసారి జతకలిశారు. ప్రధానంగా మెదక్ జిల్లాకు చెందిన కేజీబీవీ విద్యార్థినులకు ఇందులో భాగస్వాములను చేసేందుకు కలెక్టర్ రొనాల్డ్ రాస్ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ బృందం భువనగిరిలో ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకుంది. అయితే బృందంలో సభ్యులెంతమంది ఉంటారన్నది వచ్చే నెల మొదటి వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత ఎప్పుడు వెళ్లేదీ ప్రకటిస్తారు. విభిన్న పర్వత శ్రేణి... ఆఫ్రికాలోనే ఎత్తయిన పర్వతం కిలిమంజాలరో. దాదాపు 17 వేల అడుగుల (4,900 మీటర్ల) ఎత్తులో ఉంది. దీనిలోనే మవెంజి, షిరా, కిబో అగ్ని పర్వతాలున్నాయి. ‘తెల్లపర్వతం’గా కూడా దీన్ని పిలుస్తారు. మొత్తం 7 పర్వతారోహణ మార్గాలున్నాయి. తక్కువ ఉష్ణోగ్రత, అప్పుడప్పుడు వీచే బలమైన గాలులు దీనిని ప్రమాదకరంగా మార్చే అవకాశాలున్నాయి. వారికి సమస్య కాకపోవచ్చు... పర్వతారోహణ ఇష్టపడే విద్యార్థులకు ఇది సాహస యాత్రే. కేజీబీవీకి చెందిన విద్యార్థినులతో పాటు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులను తీసుకెళ్లాలని ప్రభుత్వ ప్రతిపాదన. గతంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్టు, మౌంట్ రెనోక్లు అధిరోహించినప్పుడు వారితో నేనూ వెళ్లా. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాను. ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నందున... పగటి పూట అమిత వేడి, రాత్రిపూట చల్లగా ఉంటుంది. రెనోక్ ఎక్కిన విద్యార్థులకు ఈ పర్వతారోహణ సమస్య కాకపోవచ్చు. - శేఖర్‌బాబు, పర్వతారోహకుడు, శిక్షకుడు