breaking news
bhiwandi lok sabha constituency
-
భివండీ నుదుట తెలుగు ‘రాత’
భివండీ, న్యూస్‌లైన్: భివండీ పట్టణంలో నివాసముంటున్న వివిధ భాషల ఓటర్లలో తెలుగు ప్రజలే కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల దృష్టి తెలుగు వారి ఓటర్లపైనే ఉంది. ఇక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు తెలుగువారిని ఆకర్షించేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. భివండీ లోక్‌సభ నియోజకవర్గంలో కుణబి సమాజ ఓటర్లు 3,15,315 మంది, ఆగ్రి, కోళి కులాల ఓట్లు 2,24,376, ఆదివాసుల ఓట్లు 2,41,302, ముస్లిం వర్గాల ఓట్లు 2,41,302, ఉత్తర భారతీయుల ఓట్లు 94,000, దక్షిణ భారతీయుల ఓట్లు 72,000, మరాఠా సమాజం ఓట్లు 1,69,416, ఇతరుల ఓట్లు 37,000 మొత్తం 13,94,711 ఓట్లు ఉన్నాయి. అయితే ఈ కులాలకు సంబంధించిన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండడంవల్ల అందులో కొంత శాతం ఓట్లు వారికే పోలయ్యి మిగతావి చీలిపోయే అవకాశముంది. కాని తెలుగు సమాజం నుంచి అభ్యర్థులెవరూ ఎన్నికల బరిలో లేకపోవడం వల్ల వీరంతా ఎవరికి ఓటువేసినా బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులందరూ వీరిని దువ్వే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు వారి ఓట్లు కీలకం..... భివండీ తూర్పు, భివండీ పశ్చిమప్రాంతాల్లో సుమారు 70 వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు అత్యంత కీలకం కావడంతో ప్రధా న పార్టీలైన బీజేపీ, ఎమ్మెన్నెస్ అభ్యర్థులు తెలుగు వారిని తమ వైపు తిప్పుకోవడానికి శాయశక్తులా ‘ప్రయత్నాలు’ చేస్తున్నారు. ‘ఆదర్శ’ వ్యక్తి రావాలి భివండీని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషిచేసే నాయకుడు కావాలి, అదేవిధంగా భివండీ నుంచి ముంబై వరకు లోకల్ రైలు, రోడ్డు రవాణా సదుపాయలకు పెద్ద పీట వేయాలి. ముఖ్యంగా టెక్స్టైల్ పరిశ్రమల అభివృద్ధి కోసం కృషిచేసే వ్యక్తి కావాలి. ఎన్డీయేతోనే అభివృద్ధి 1999లో వాజ్పాయ్ ప్రభుత్వం మరమగ్గాల పరిశ్రమ ఆధునికీకరణకు రూ.25 వేల కోట్లు మంజూరు చేశారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోయింది. యూపీఏ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు, ఇంధనం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. - సిరిపురం తిరుపతి (పద్మనగర్) ధరలు తగ్గించాలి ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెంవేసే నాయకుడు కావాలి. ముఖ్యంగా భివండీలో విద్యుత్ వినియోగదారులను దోచుకుంటున్న టోరంట్ కంపెనీని తరిమికొట్టే సమర్థవంతమైన నాయకున్ని ఎన్నుకోవాలి. - పాము మనోహర్-డాక్టర్ (మానససరోవర్) పరిశ్రమలను అభివృద్ధి చేయాలి భివండీ అభివృద్ది చెందాలంటే రవాణా సదుపాయాలు, పరిశ్రమలు, ఇండస్ట్రీలు, వస్త్రపరిశ్రమ అభివృద్ధి చెందాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, ఉన్నత విద్యకు పోరాడే నాయకుడు కావాలి. - కొండాబత్తుల మహేశ్- న్యాయవాది (మార్కండేయ నగర్) తెలుగోళ్ల బాగు చూడాలి పట్టణంలో మరమగ్గాల పరిశ్రమలో అత్యధికంగా తెలుగు ప్రజలే పనిచేస్తున్నారు. వారి ప్రయోజనాలు, ఇళ్లు, ఇతర పథకాల కోసం పోరాడే వాడు కావాలి, మరమగ్గాల ఆధునీకరణ, ప్రత్యేక సంక్షేమ పథకాలు, మహిళలకు విద్య, వైద్య, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు కల్పించే నాయకుడు కావాలి. - భిమనాధిని శివప్రసాద్ (పద్మనగర్) -
భివండీ.. అభ్యర్థులు ఎవరండీ..!
భివండీ, న్యూస్‌లైన్: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి పది రోజులు కావస్తున్నా భివండీ లోక్‌సభ నియోజకవర్గంలో కీలక పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ఇంతవరకు ప్రకటించలేకపోయాయి. కాంగ్రెస్ మాత్రం గురువారం సాయంత్రం తమ పార్టీ తరఫున లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించింది. కాగా, బీజేపీలాంటి ప్రధాన పార్టీతో పాటు ఎమ్మెన్నెస్ కూడా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పట్టణంలో బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్న సీనియర్ నాయకులు అయోమయానికి గురవుతున్నారు. ఐదేళ్ల కిందట భివండీ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. దీని హద్దులో కల్యాణ్(పశ్చిమం), ముర్బాడ్, శాపూర్, భివండీ (తూర్పు), భివండీ (పశ్చిమం), భివండీ(రూరల్) ఇలా ఆరు అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. భివండీ(తూర్పు), శాపూర్ అసెంబ్లీ నియోజక వర్గాలలో శివసేన, భివండీ రూరల్ నియోజక వర్గంలో బీజేపీ, కల్యాణ్ (పశ్చిమ) నియోజకవర్గంలో ఎమ్మెన్నెస్, భివండీ (తూర్పు)లో సమాజ్‌వాదీ పార్టీలు అధికారంలో ఉన్నాయి. అయితే భివండీ లోక్‌సభ నియోజక వర్గంలో శివసేన, బీజేపీల బలం అధికంగా ఉంది. ఇక్కడి నుంచి పోటీచేసేందుకు మాజీ మంత్రి జగన్నాథ్ పాటిల్, సిట్టింగ్ ఎమ్మెల్యే మంగళ్‌ప్రభాత్ లోఢా, కార్పొరేషన్ ఘట్‌నేత నీలేష్ చౌదరి అసక్తితో ఉన్నారు. కాని పార్టీ నాయకులు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అభ్యర్థుల్లోనే కాక కార్యకర్తల్లో సైతం అసంతృప్తి నెలకొంది. పట్టణ బీజేపీ అధ్యక్షుడు మహేష్ చౌగులే, శ్యామ్ అగర్వాల్, ఘట్ నేత నీలేష్ చౌదరి తదితరులు పార్టీ ప్రధాన కార్యాలయంలో తిష్ట వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ పార్టీ సైతం సై అంటోంది. అదేవిధంగా సమాజ్‌వాదీ పార్టీ నుంచి అబూ ఆజ్మీ బరిలో దిగడానికి ఆసక్తితో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే రషీద్తాహిర్ మోమిన్తోపాటు ఇతర సీనియర్ నాయకులకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ప్రచారానికి తగినంత సమయం కావాల్సి ఉండగా అభ్యర్థుల ఎంపికలో పార్టీలన్నీ ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండటంపై ఆశావహుల్లో గందరగోళం నెలకొంది. కాగా, కాంగ్రెస్ మాత్రమే గురువారం భివండీ తరఫున విశ్వనాథ్ పాటిల్ పేరును ప్రకటించడం విశేషం. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల కాంగ్రెస్ లోకసభ అభ్యర్థుల రెండవ జాబితాను ప్రకటించింది. ఇందులో రాష్ట్రానికి చెందిన ఏడుగురు అభ్యర్థులున్నారు. వీరిలో ప్రధానంగా అఖిల భారతీయ యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైన ఎమ్మెల్యే రాజీవ్ సాతవ్‌కు హింగోలి నుంచి టికెట్ ఇచ్చారు. ఇంరా హిదాయత్ పటేల్ (అకోలా), సాగర్ మెఘే (వర్ధా), డాక్టర్ నామ్‌దేవ్ ఉసెండి (గడ్చిరోలి-చిమూర్ ), విలాస్ ఔతాడే (జాల్నా), విశ్వనాథ్ పాటిల్ (భివండీ), కల్లప్పా ఆవాడే (హాతకణంగలే)లు ఉన్నారు.