breaking news
Backlogs
-
అర్థాంతరంగా ముగిసిన భావి ఇంజినీర్ జీవితం
కాకినాడ రూరల్: నాలుగేళ్ల పాటు బీటెక్ కష్టపడి చదివినా నాలుగు సబ్జెక్టులు బ్యాక్లాగ్స్గా ఉండిపోవడం అతనిలో తీవ్ర మానసిక సంఘర్షణ దారి తీసింది. పెరిగిన మనోవేదన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొనేలా పురిగొల్పింది. ఈ విషాద ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, సర్పవరం పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కాకినాడ గుడారిగుంట శాంతనపూరి కాలనీకి చెందిన గెంగిరి దుర్గారామ్‌గోపాల్(23)ది చేపల వేట ద్వారా జీవనోపాధి సాగించే కుటుంబం. అతని తండ్రి గతంలో చనిపోగా తల్లీ, అక్క, తమ్ముడు ఉన్నారు. కోరంగి వద్ద గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో దుర్గారామ్‌గోపాల్ బీటెక్ సివిల్ బ్రాంచ్‌లో చదివాడు. గత ఏడాది ఇంజినీరింగ్ నాలుగేళ్ల కోర్సు పూర్తయింది. నాలుగు సబ్జెక్టులు బ్యాక్‌లాగ్‌గా ఉండిపోయాయి. వారం రోజుల క్రితమే హైదారాబాద్‌లో ప్రైవేట్ జాబ్‌లో చేరాడు. ఈ లోగా బ్యాక్లాగ్ పరీక్షలకు నోటిఫికేషన్ రావడంతో ఈ నెల 14వ తేదీ నుంచి జరగనున్న పరీక్షల కోసం సన్నద్ధం అయ్యేందుకు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. దుర్గారామ్‌గోపాల్ వలసపాకల గ్రామంలోని ఓయో అద్దె గదిని ఆదివారం ఉదయం తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో రాత్రి వరకు ఆరా తీసీ ఓయో గదుల బయట అతని మోటార్ సైకిల్‌ను గుర్తించి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. సోమవారం ఉదయం సర్పవరం పోలీసులు, కుటుంబ సభ్యులు వలసపాకలలోని కృష్ణుడి గుడి సమీపం వద్ద ఓయో రూమ్ తలుపులు తెరిచారు. ప్లాస్టిక్ తాడుతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రెండు రోజు లుగా ఇంటి వద్ద ఉన్న రామ్‌గోపాల్ బ్యాక్లాగ్ సబ్జెక్ట్‌లు ఉండిపోవడంతో వాటి గురించే ఆలోచించేవాడని అతని అక్క మంజూష తెలిపింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను తిరిగి రాకపోవడంతో ఆమె ఫోన్ చేసింది. సాయంత్రం నాలుగు గంటల వరకు రింగ్ అయ్యి ఆగిపోయిందని, తరువాత శవమై కనిపించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనా స్థలాన్ని ఏఎస్సై నాగేశ్వరావు, సిబ్బంది పరిశీలించి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. మంజూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీఐ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. -
మెడికల్ కాలేజి వద్ద ఉద్రిక్తత
కడప : నగర పాలక సంస్థకు బకాయి పడిన మొత్తాన్ని వసూలు చేసేందుకు మెడికల్ కాలేజికి వచ్చిన అధికారులను విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాలివీ.. వైఎస్సార్ జిల్లా కడప జిల్లా కేంద్రం సమీపంలోని ఫాతిమా వైద్య కళాశాల నగర పాలక సంస్థకు రూ.1.50 కోట్ల మేర బకాయి పడింది. ఎన్నిసార్లు నోటీసులు అందజేసినా కళాశాల యాజమాన్యం స్పందించకపోవటంతో విసుగు చెందిన అధికారులు కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కళాశాల వద్దకు వెళ్లారు. కళాశాల ఆస్తుల్ని సీజ్ చేసేందుకు యత్నించగా సిబ్బంది, విద్యార్థులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.