breaking news
Arutadi crops
-
ప్రకృతి సేద్యంతో ఆరోగ్యం, ఆదాయం!
ప్రకృతిని, శ్రమను నమ్ముకుంటే చిన్న కమతాలున్న రైతు కుటుంబాలు సైతం సుభిక్షంగా ఉంటాయనడానికి ప్రబల నిదర్శనం రజితారెడ్డి, రాజేందర్రెడ్డి రైతు దంపతులు. రసాయనాల్లేకుండా పంటలు పండించడం నికరాదాయం పెంచుకోవడం కోసం మాత్రమే కాదని.. కుటుంబ ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికీ ఇదే రాజమార్గమని వీరి అనుభవం రుజువు చేస్తోంది. నీటి వనరులు తక్కువగా ఉన్న నేపథ్యంలో వరిని ఆరుతడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. కూరగాయ పంటలతో పాటు పాడిపై కూడా ఆధార పడుతూ నిరంతర ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వాకిటి రజితారెడ్డి, రాజేందర్రెడ్డి దంపతులది సాధారణ రైతు కుటుంబం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తమ్మలోనిభావి వారి స్వగ్రామం. ఏడో తరగతి వరకు చదువుకున్న వీరికి వ్యవసాయమే జీవనాధారం. నాలుగేళ్ల క్రితం వరకు రసాయనిక వ్యవసాయం చేస్తూ చీడపీడలు, ఎరువుల ఖర్చులతో కుదేలయ్యారు. ఈ నేపథ్యంలో రజితారెడ్డి చొరవతో సొంత భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు. బంధువు ఒకరు సుభాష్ పాలేకర్ పుస్తకం తెచ్చి ఇచ్చిన తర్వాత దగ్గర్లోని ప్రకృతి వ్యవసాయదారుడు పిసాతి సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఆ స్ఫూర్తితో పాలేకర్ శిక్షణా తరగతులకు హాజరై రజితారెడ్డి గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వరి, కూరగాయలు వంటి ఆహార పంటలను సాగు చేస్తూ.. జీవామృతం, కషాయాలను స్వయంగా తామే తయారు చేసుకొని వాడుతూ.. తక్కువ ఖర్చుతోనే సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఒకరు డిగ్రీ చదువుతుండగా, మరొకరు ఏకలవ్య సేంద్రియ వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇటు పాడి.. అటు పంట.. వీరికి 4 ఎకరాల సొంత భూమి ఉంది. ఈ ఏడాది ఎకరంలో వరి, అరెకరంలో టమాటా, అరెకరంలో సొర, బీర సాగు చేస్తున్నారు. పంటలతోపాటు పాడి పశువుల పెంపకంపై కూడా దృష్టిపెట్టడం విశేషం. వీరికి ప్రస్తుతం ఐదు గేదెలు, ఒక ఆవు ఉన్నాయి. రెండెకరాల్లో పశువులకు మేత సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 7–8 లీటర్ల పాలు లీటరు రూ. 38 చొప్పున విక్రయిస్తున్నారు. పశువుల పేడ దిబ్బపై ద్రవజీవామృతం చల్లితే.. నెల రోజుల్లో పశువుల ఎరువు మెత్తని ఎరువుగా మారుతుంది. ఆ ఎరువును సాగుకు ముందు ఎకరానికి ఒకటి, రెండు ట్రాక్టర్లు వేస్తున్నారు. ఈ ఏడాది 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పాక్షికంగా సేంద్రియ పద్ధతిలో పత్తిని సాగు చేస్తున్నారు. సొంత ట్రాక్టరుతోనే రాజేందర్రెడ్డి తమ పొలాలను దున్నుకుంటారు. బీజామృతం, జీవామృతంతోపాటు వేపగింజల కషాయం, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం వంటి కషాయాలను కూడా రజితారెడ్డి స్వయంగా తయారు చేసుకొని పంటలకు వాడుతున్నారు. దంపతులు వ్యవసాయ పనులు స్వయంగా చేసుకోవడంతో ఖర్చు బాగా తగ్గింది. తమ ఆరోగ్యం, భూమి ఆరోగ్యం మెరుగవడమే కాక నికర ఆదాయం పెరిగిందని ఆమె తెలిపారు. నీటి గుంటతో వాన నీటి సంరక్షణ రజిత– రాజేందర్రెడ్డి తమ ఎర్ర నేలలో బోర్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వర్షాలు సరిగ్గా కురవని ప్రాంతం కావడంతో వాననీటి సంరక్షణపై దృష్టి పెట్టారు. ఉపాధి హామీ పథకంలో నీటి కుంట తవ్వుకున్నారు. వాన నీరు తమ భూమిలో నుంచి బయటకు పోకుండా కట్టడి చేసుకున్నారు. దీని వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం తమ బోర్లు బాగానే పోస్తున్నాయని రజితారెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఎండాకాలం తర్వాత సరైన వర్షాలు పడకపోవడం వల్ల కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని ఆమె తెలిపారు. ఉపాధి హామీ ప«థకం కింద వచ్చే జనవరిలో పంట భూమిలో వాలుకు అడ్డంగా 50 మీటర్లకు ఒక వరుస చొప్పున కందకాలు తవ్వించుకోవాలని అనుకుంటున్నామన్నారు. ఆరుతడి పద్ధతిలో వరిసాగు నీటి వనరులు తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఎకరం భూమిలో ఆరుతడి పద్ధతిలో వరిని సాగు చేస్తున్నట్లు రజితారెడ్డి తెలిపారు. పొలాన్ని 3 భాగాలుగా చేసి ఒక్కో రోజు ఒక్కో భాగానికి నీరు పెడుతున్నామన్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి తమ సొంత తెలంగాణ సోన రకం విత్తనాలు వినియోగిస్తారు. నారు 15–20 రోజుల వయసులో 20 లీటర్ల నీటి ట్యాంకుకు 30 ఎం.ఎల్. వేప గింజల కషాయం, లీటరు ఆవు మూత్రం కలిపి పిచికారీ చేస్తారు. నాటేసిన తర్వాత 20 రోజులకోసారి కనీసం 4 సార్లు జీవామృతం బోరు నీటితోపాటు పారగడతారు. నెల లోపు వేపగింజల కషాయం చల్లుతారు. ఏవైనా తెగుళ్లు కనిపిస్తే బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం పిచికారీ చేస్తారు. 15 రోజులకోసారి.. అమావాస్య, పౌర్ణమిలకు 3 రోజులు ముందు నుంచి.. వరుసగా రెండు, మూడు రోజుల పాటు పొలం గట్లపై సాయంత్ర వేళల్లో పిడకలతో మంటలు వేస్తారు. ఆ బూడిదను కూరగాయ పంటలపై చల్లుతారు. దీని వల్ల శత్రుపురుగులు నశించి, పంటలకు చీడపీడల బెడద తక్కువగా ఉంటున్నదని ఆమె తెలిపారు. 50% ఎక్కువగా నికరాదాయం రసాయనిక పద్ధతిలో వరి సాగు చేసిన రైతులతో పోల్చితే సాగు వ్యయం ఎకరానికి తమకు రూ. 5–6 వేలు తక్కువని, నికరాదాయం 50% ఎక్కువని రజితారెడ్డి తెలిపారు. గత మూడేళ్లుగా తమకు ఎకరానికి 35 బస్తాల ధాన్యం పండుతున్నదని, తామే మరపట్టించి బియ్యం అమ్ముతున్నామన్నారు. 15 క్వింటాళ్ల వరకు బియ్యం వస్తున్నాయన్నారు. క్వింటాలు సగటున రూ. 5 వేల చొప్పున రూ. 75 వేలకు తగ్గకుండా ఆదాయం వస్తున్నదన్నారు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు ఎకరానికి రూ. 50–56 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. అందులోనూ, వారికి ఖర్చు కూడా తమకన్నా ఎక్కువ కావడంతో.. తమతో పోల్చితే వారికి నికరాదాయం తక్కువగా ఉంటుందన్నారు. కూరగాయల ధర కిలో రూ. 30‡ స్థానికంగా సేంద్రియ హోటల్ నిర్వాహకుల అవసరాలకు అనుగుణంగా టమాటా, సొర, బీర పంటలను ఎకరంలో సాగు చేస్తున్నామని రజితారెడ్డి తెలిపారు. మార్కెట్ ధర ఎట్లా ఉన్నా.. ఏ సీజన్లోనైనా సొర కాయలకు రూ. 10–12 చొప్పున, బీర, టమాటాలకు కిలోకు రూ. 30 ధర చెల్లిస్తున్నారన్నారు. అడవి పందుల బెడద ఉండటం వల్ల వేరుశనగ తాము సాగు చేయటం లేదని ఆమె వివరించారు. నీటి కొరత సమస్య వల్ల కూరగాయ పంటల్లో మంచి దిగుబడులు తీయలేకపోతున్నామని, తమకు మార్కెటింగ్ సమస్య లేదన్నారు. – ముత్యాల హన్మంతరెడ్డి, సాక్షి, చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా కొందరు రైతులు అనుసరిస్తున్నారు! ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన నాలుగేళ్లలో మొదట మా కుటుంబం ఆరోగ్యం బాగుపడింది. రసాయనిక అవశేషాల్లేని ఆహారం తినటం వల్ల అంతకుముందున్న ఆరోగ్య సమస్యలు పోయాయి. భూసారం పెరిగింది. పర్యావరణాన్ని కాపాడుతున్నామన్న సంతృప్తి ఉంది. వరిని అతి తక్కువ నీటితో ఆరుతడి పద్ధతిలో సాగు చేయగలుగుతున్నాం. ఆరోగ్యదాయకమైన కూరగాయలు పండిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు అవార్డు రెండు సార్లు అందుకోవడం సంతోషంగా ఉంది. మమ్మల్ని చూసి నలుగురైదుగురు రైతులు ఇంట్లో తాము తినడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించుకోవడం ప్రారంభించడం మరింత సంతోషంగా ఉంది. మా వంటి చిన్న, సన్నకారు సేంద్రియ రైతులకు ప్రభుత్వం బ్యాంకు రుణాలను షరతులు లేకుండా ఇవ్వాలి. ప్రత్యేక రైతు బజార్లను ఏర్పాటు చేయాలి. – వాకిటి రజితారెడ్డి(99491 42122), తమ్మలోనిభావి, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా కషాయం తయారు చేస్తున్న రజిత రజిత పొలంలో బీర తోట వరి పొలాన్ని పరిశీలిస్తున్న రజిత డ్రిప్తో సాగవుతున్న టమాటా తోట -
ఆరుతడిలో సజ్జ మేలు
ఆరుతడి పంట కింద సజ్జ సాగు లాభదాయకంగా ఉందని మండల పరిధిలోని పలువురు రైతులు చెబుతున్నారు. వానలు సరిగ్గా లేకపోవడంతో తక్కువ నీటితో ఈ పంటను పండిస్తున్నామని పేర్కొంటున్నారు. ఎకరాకు 10నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉండటంతో లాభదాయకంగా ఉందంటున్నారు. - తూప్రాన్ - తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగుకు అవకాశం - ఇతర పంటలతో పోలిస్తే పని చాలా తక్కువ - లాభదాయకంగా ఉందంటున్న రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలపైనే మక్కువ చూపుతున్నారు. వానలు లేకపోవడంతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు, వాగుల్లో చుక్క నీరు కనిపిం చడం లేదు. దీంతో బోరుబావుల నుంచి వస్తు న్న కొద్దిపాటి నీళ్లతో ఆరుతడి పంటలను సాగుచేస్తున్నారు. ఈ సమయంలో మండల పరిధిలోని పలువురు రైతులు సజ్జ పంటపై దృష్టి సారించారు. మంచి లాభాలు వస్తుండడంతో మిగతా వారు కూడా దీన్ని పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్థానిక అన్నదాతలు వరి, మొక్కజొన్న పంటలను ప్రధానంగా సాగుచేస్తారు. అయితే కొన్నేళ్లుగా వర్షా లు సరిగ్గా కురువకపోవడంతో భూగర్భ జలా లు భారీగా పడిపోయాయి. దీంతో కూరగాయలు, ఆరుతడి పంటలను విరివిగా వేస్తున్నా రు. సజ్జలకు మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తుండటంతో ఘనపూర్, దమ్మక్కపల్లి, వెంకటాపూర్ అగ్రహారం, కోనాయిపల్లి(పీటీ), రం గాయిపల్లి, ధర్మారాజుపల్లి, అల్లాపూర్, ఇ మాంపూర్, రామాయిపల్లి గ్రామాల రైతులు ఈ పంటను సాగుచేస్తున్నారు. ఎకరానికి రూ.40 వేల వరకు ఆదాయం వస్తోందని చెబుతున్నారు. మండలంలోని పలు సీడ్ కంపెనీల వారు రైతులతో ఈ పంటను సాగు చేయిస్తున్నారు. లాభాలు బాగుండటంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. సాగు సమయం - ఖరీఫ్ సీజన్లో ఆగస్టు మాసంలో, రబీ సీజన్లో జనవరిలో సాగు చేయవచ్చు. - నీరు ఇంకే అన్ని నేలల్లో దీన్ని వేసుకోవచ్చు. - సజ్జల్లో డబ్ల్యూ సీసీ-75, ఐసీఎంహెచ్-451, మల్లికార్జున, ఐసీటీపీ-8203 తదితర రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. - ఎకరాకు 1.6 కిలోల విత్తనాలు సరిపోతాయి. - వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన కంపెనీలకు చెందిన విత్తనాలు వాడటం మేలు పంట దిగుబడి - పంట బాగా పండితే ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. - 90 రోజుల్లోనే చేతికి వస్తుంది కాబట్టి రైతులకు లాభదాయకంగా ఉంటుంది. - క్వింటాలు సజ్జలకు మార్కెట్ ధర రూ.4 వేల వరకు పలుకుతోంది. విత్తన శుద్ధి - విత్తనాలను మొదట ఉప్పు నీటిలో పది నిమిషాలు నానబెట్టాలి. - తేలికగా ఉండి పైకి తేలిన వాటిని తీసి పడేయాలి. - మిగిలిన వాటిని కొంత సేపు గాలిలో ఆరబెట్టి విత్తుకోవాలి. - నారుమడుల్లో విత్తనాలు వేసి మొలకెత్తిన తర్వాత పొలంలో నాటుకోవాలి మూడేళ్లుగా వేస్తున్నా ఇతర పంటలతో పోలిస్తే సజ్జ సాగు తేలికగా ఉంది. మూడేళ్లుగా ఈ పంట వేస్తున్నా. మార్కెట్లో దీనికి మం చి డిమాండ్ కూడా ఉంది. మేము పండించిన పం టను సీడ్ కంపెనీల వారు సైతం తీసుకెళ్తున్నారు. వారి సూచనలు పాటించి సాగుచేస్తున్నాం.- బాలయ్య, ఘనపూర్ సస్యరక్షణ చర్యలు - తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. - వెంటనే వాటిని గుర్తించి ఏరి కాల్చివేయాలి. - అలాగే తెగులు సోకిన కంకి నుంచి ఎర్ర రంగులో ఉన్న తేనే వంటి చిక్కటి ద్రవం కారుతుంది. - దీని నివారణకు థైరం, మాంకోజెబ్, కార్బండిజమ్ మందును నీటిలో కలిపి వారంలో రెండు సార్లు పిచికారీ చేయాలి. దుక్కి సిద్ధం చేసుకోవడం - పంట నాటేందుకు ముందు దుక్కిని బాగా దున్నుకోవాలి. - పశువుల పేడ, సేంద్రియ ఎరువులు వేసుకోవాలి. - భూమిలో సరైన తేమ ఉన్న సమయంలో మట్టి పెడ్డలు లేవకుండా పొడి దుక్కిని సిద్ధం చేసుకోవాలి. - అనంతరం కాలువలు(బోజ) కొట్టుకోవాలి. - కాలువకు ఇరువైపులా మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలి. - సరైన నీటి తడులు ఇస్తూ విత్తనం మొలకెత్తే వరకూ జాగ్రత్తగా చూసుకోవాలి. - కలుపు నివారణకు విత్తనం నాటిన నాలుగు రోజుల్లోపు అట్రాజిన్ 50శాతం పొడి మందును ఎకరాకు 500 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో పిచికారీ చేయాలి. - నెల రోజుల తర్వాత కలుపు తీసుకోవాలి.