breaking news
arun jatley
-
మోదీ కుల రాజకీయాలు చేయలేదు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు కూడా కుల రాజకీయాలు చేయలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆయన జాతీయవాదంతోనే స్ఫూర్తి పొందారని పేర్కొన్నారు. ‘కులం పేరుతో పేదలను మోసగించే వారు విజయవంతం కాలేరు. వారు కేవలం కుల రాజకీయాల పేరిట ఆస్తులు కూడగట్టారు. బీఎస్పీ–ఆర్ఎల్డీతో పోల్చుకుంటే ప్రధాని ఆస్తులు 0.01 శాతం కూడా కాదు’ అని అన్నారు. ఈ మేరకు కనౌజ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన ట్వీట్లపై జైట్లీ స్పందించారు. ‘మాయావతీ జీ, నేను చాలా వెనుకబడిన వాడిని. నన్ను కుల రాజకీయాల్లోకి లాగొద్దని చేతులు జోడించి కోరుతున్నా. 130 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం. నన్ను విమర్శించేవారు చెప్పే దాకా దేశ ప్రజలకు నా కులమేంటో తెలియదు. వెనుకబడిన కులంలో పుట్టడమనేది దేశానికి సేవ చేయడం కోసం వచ్చిన అవకాశంగా భావిస్తున్నా’ అని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ వ్యాఖ్యలపై తేజస్వి యాదవ్ ఆదివారం ‘నరేంద్ర మోదీజీ తనను తాను ఓబీసీకి చెందినవాడినని చెప్పుకుంటాడన్న విషయాన్ని నేను ఈ నెల 20నే చెప్పాను. అదే విషయం కనౌజ్ ఎన్నికల ర్యాలీలో మోదీ నిజం చేశారు’ అని ట్వీట్ చేశారు. -
నిర్ణయాత్మక మోదీనా? గందరగోళ విపక్షాలా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు దీటుగా భారతీయ జనతా పార్టీ సైతం ఆదివారం తన ప్రచార ఇతివృత్తాలను ప్రకటించింది. నిర్ణయాత్మక మోదీ, చిందరవందరగా ఉన్న విపక్షాల మధ్యే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ అని పేర్కొంది. కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్‌తో కలసి ఆర్థిక మంత్రి జైట్లీ పార్టీ నినాదాలు, ప్రచార వీడియోలను విడుదల చేశారు. ఒక కెప్టెన్ లేదా 11 మంది ఆటగాళ్లు, 40 మంది కెప్టెన్ల ప్రభుత్వాల్లో ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని జైట్లీ అన్నారు. తమ ప్రచార ట్యాగ్‌లైన్ అయిన ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ మోదీ ఐదేళ్ల పాలనాకాలంలో సాధించిన విజయాలు, తీసుకున్న కీలక నిర్ణయాల చుట్టే తిరుగుతుందని చెప్పారు. పేదలు, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ప్రచారం చేస్తామని తెలిపారు. మధ్యతరగతిపై పన్ను భారం పెంచేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని ఆ పార్టీ సలహాదారులే అభిప్రాయపడ్డారని, కానీ గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పన్నులు తగ్గించిందని అన్నారు. ఈసారి కూడా మెజారిటీ ప్రభుత్వం రావాలని, 2014లో వచ్చిన మెజారిటీతో ఎన్డీయే ప్రభుత్వం అవినీతి, నల్లధన నియంత్రణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. పన్ను పరిధిని పెంచుతూనే మోదీ ప్రభుత్వ ద్రవ్యోల్బణాన్ని తగ్గించిందని, సంక్షేమానికి వ్యయం పెంచి సామాన్యుల పన్ను భారాన్ని తగ్గించిందని తెలిపారు. -
వ్యవస్థల కంటే దేశమే ముఖ్యం
న్యూఢిల్లీ: లిక్విడిటీ పెంచడం, వడ్డీ రేట్లు సహా ప్రభుత్వం నుంచి ఆర్బీఐకి పలు డిమాండ్లు చేయడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమర్థించుకున్నారు. వ్యవస్థల కంటే దేశమే ఎంతో ముఖ్యమన్న విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ వ్యాపార సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ మాట్లాడారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఎన్నిక కావాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. అప్పుడే ఆర్థిక రంగానికి స్థిరత్వం ఏర్పడుతుందని, రక్షకుడిని మార్చాల్సిన అవసరం రాదన్నారు. ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు లేదా ఎన్నికల తర్వాత ప్రకటనలు చేయడం వేర్వేరని, దీర్ఘకాలిక విధానాలపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. -
40 వస్తువులపై జీఎస్టీ రేటు తగ్గింపు
-
వర్షాలుంటే.. వేగంగా వృద్ధి
♦ ఆర్థిక బిల్లుపై సమాధానంలో అరుణ్‌జైట్లీ ♦ రాజధానికి ఇప్పటికే రూ. 2,050 కోట్లు ఇచ్చాం ♦ పోలవరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం ♦ ప్రత్యేక హోదాపై ప్రస్తావించని ఆర్థిక మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోవడం తో ఏపీకి కష్టాలు ఎదురయ్యాయని, వాటిని ఎదుర్కొనేందుకు కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. ఏపీకి ఏ కష్టమూ రానివ్వబోమన్నారు. కేంద్ర ఆర్థిక బిల్లుపై చర్చకు గురువారం సమాధానమిచ్చిన జైట్లీ ఏపీ విషయం మాట్లాడినప్పటికీ ప్రత్యేక హోదా విషయంపై మాటెత్తలేదు. ‘‘13వ ఆర్థిక సంఘం అవిభాజ్య రాష్ట్రానికి రూ. 98,820 కోట్ల మేర నిధులు అందాయి. అన్ని రకాల గ్రాంట్లు కలిపి ఐదేళ్లలో వచ్చిన మొత్తం ఇది. ఇందులో ఏపీకి దాదాపు 52 శాతం, తెలంగాణకు 48 శాతం నిధులందాయి. అంటే ఐదేళ్ల ముందే రాష్ట్రం విడిపోయిందనుకుందాం. అప్పుడు మొత్తం ఐదేళ్లలో ఏపీ వాటా దాదాపు రూ. 52 వేల కోట్లుగా ఉండేది. ఏపీకి రాజధాని నిర్మించుకోవాలి. పోలవరం నిర్మించుకోవాల్సి ఉం ది. జాతీయ స్థాయి విద్యాసంస్థలు అనేకం తెలంగాణలో ఉండిపోయినందున ఏపీకి కొత్త గా జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఇచ్చాం. వాటన్నింటినీ నేను లెక్కించడం లేదు. 13వ ఆర్థిక సంఘం ద్వారా మీకు రూ. 50 వేల కోట్లు వచ్చాయి. అంటే ఏటా సగటున రూ. 10 వేల కోట్లు వచ్చాయి. విభజన అనంతరం తొలి ఏడాది అయిన 2014-15 కూడా 13వ ఆర్థిక సంఘం పరిధిలోదే. ఈ ఏడాది ఈ మొత్తం రూ. 14,100 కోట్లుగా ఇచ్చాం..’’ అని వివరించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం నిధులు ఏపీకి రూ. 21,900 కోట్లు ఇచ్చినట్లు జైట్లీ తెలిపారు. ఇది ఏపీ హక్కు, మేం చేసిన మేలు కాదన్నారు. ‘‘పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న రీతిలో రెవెన్యూ మిగులు కోసం రూ. 6,609 కోట్లు ఇచ్చాం. ఎస్డీఆర్ నిధులు కూడా ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇక తొలి ఏడాదికి గాను రెవెన్యూ లోటును రూ. 13,000 కోట్లుగా ఏపీ లెక్కించింది. మేం దానిని వెరిఫై చేస్తున్నాం. తుది మొత్తం ఖరారైతే ఆమేరకు చెల్లిస్తాం. ఏపీ క్లెయిం చేసుకున్న మొత్తాల్లో తక్కువగా ఇచ్చింది ఈ ఒక్క పద్దులోనే. తొలి ఏడాదిలో రెవెన్యూ లోటుకు మేం ఇప్పటివరకు రూ. 2,800 కోట్లు ఇచ్చాం. ఎందుకంటే ఈ మొత్తం మేం ఏటా వాయిదా పద్ధతుల్లో ఇవ్వాల్సి ఉంది. రాజధానికి మేం ఇప్పటికే రూ, 2,050 కోట్లు ఇచ్చాం. నీతి ఆయోగ్ ఈ మేరకు అంచనా వేసింది. కానీ ఏపీ ఇంతకంటే కొద్దిగా ఎక్కువగా అడుగుతోంది. మేం దీనిపై కూడా తుది నిర్ణయం తీసుకుంటాం. అలాగే పోలవరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాల్సి ఉంది. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మొత్తంగా రూ. 6,403 కోట్లు ఇచ్చాం’’ అని చెప్పారు. నాబార్డు కింద కేంద్రం ఏర్పాటు చేసిన ఫండ్ ద్వారా పోలవరానికి కొంత ప్రత్యేక నిధి ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించారు. పోలవరంపై వెనక్కి వెళ్లలేం... ఇంతలో బీజేడీ లోక్‌సభా పక్ష నేత భర్తృహరి మెహతాబ్ లేచి ‘పోలవరంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు మనం ఆగాలని మీకు అనిపించడం లేదా?’ అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఇతర ఎంపీలు లేచి పోలవరం ఆపాల్సిందేనంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో జైట్లీ జోక్యం చేసుకుని ‘‘అది సమస్యేమీ కాదు. ఏపీకి ఉన్న కొన్ని జిల్లాల్లో తీవ్ర కరువు నెలకొనే జిల్లాలు ఉన్నాయి. మీకు కూడా ఆ సమస్య ఉంది. రెండో సమస్య ఏంటంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఆ హామీ నుంచి మేం వెనక్కివెళ్లలేం. ఒడిస్సా ఇబ్బందులను ప్రత్యేకంగా చూస్తాం’’ అని స్పష్టంచేశారు. అయితే జైట్లీ సమాధానానికి సంతృప్తి చెందని బీజేడీ ఎంపీలు నిరసన వ్యక్తంచేస్తూ వాకౌట్ చేశారు. ‘‘ఈ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం రూపొందించింది. ఆ చట్టంలో ఈ నిబంధన ఉంటే దాని నుంచి వెనక్కి వెళ్లలేం కదా. దాన్ని అమలుచేయాలి..’’ అంటూ జైట్లీ ప్రసంగం ముగించారు. అయితే ప్రత్యేక హోదా విషయం ప్రస్తావనే లేకపోవడంతో వైఎస్సార్సీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు లేచి ప్రత్యేక హోదా విషయం ఏమైందంటూ ప్రశ్నించారు. అయితే ఆర్థిక మంత్రి దానిపై స్పందించకుండా ఆర్థిక బిల్లు సవరణలపైనే దృష్టిపెట్టారు.