breaking news
Anil Galgali
-
'ఆస్తుల వివరాలు ఇవ్వడం కుదరదు'
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి, మంత్రుల ఆస్తుల వివరాలిచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వివరాలు ఇవ్వడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. సీఎం, మంత్రుల ఆస్తుల వివరాలు ఇవ్వాలని కోరుతూ ముంబైకి చెందిన అనిల్ గాల్గానీ.. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. గత ఐదేళ్లలో సీఎం, మంత్రుల ఆస్తులు వివరాల కావాలని అందులో కోరారు. ఆస్తుల వివరాలు సమర్పించని వారిపై ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే అనిల్ గాల్గానీ అడిగిన వివరాలిచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. అడిగిన సమాచారం ఇవ్వకపోవడం పట్ల సమాచార హక్కు మాజీ ప్రధాన కమిషనర్ వజహత్ హబీబుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం మూర్కత్వంలో వ్యవహరించిందని విమర్శించారు. -
‘ఎనిమిది నెలల్లో 229 రేప్‌లు’
ముంబై: వాణిజ్య రాజధాని రేప్ రాజధానిగా మారిపోతోంది. ఈ ఏడాది ఆగస్టు వరకు నగరంలో 229 అత్యాచారాలు, ఎనిమిది సామూహిక అత్యాచారాలు జరిగాయి. ఎనిమిది నెలల్లోనే నమోదైన ఈ కేసుల్లో స్నేహితులు, ప్రేమికులు, ఇరుగుపొరుగువారే ఈ ఘాతుకాలకు పాల్పడ్డారు. సామాజిక కార్యకర్త అనిల్ గల్గలీ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన ఈ విషయాలు ముంబైకర్లను కలవరపెడుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు వరకు ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అనిల్ అన్నారు. నగర శివారు ప్రాంతం దిందోషి, బోరివలిలో మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారాలు నవంబర్‌లో రెండు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఇదిలావుండగా దేశంలో సురక్షిత నగరం ముంబై అని పోలీసులు అంటున్నారు. అనేక కేసుల్లో స్నేహితులు, ప్రేమికులు, ఇరుగుపొరుగువారే ఈ అత్యాచారాలు చేశారని తెలిపారు. ఇందుకు గతంలో జరిగిన కేసులే నిదర్శనమని ముంబై పోలీసు అసిస్టెంట్ కమిషనర్ భగవాన్ చటే అన్నారు. శక్తి మిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటనలు చోటు చేసుకోవడం చాలా అరుదు అని చెప్పారు. నగరంలో జరుగుతున్న ఇలాంటి నేరాలను సాధ్యమైనంత మేర అరికట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు.