కోచ్‌గా మారిన మజుందార్
ముంబై: రంజీ ట్రోఫీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ముంబై మాజీ కెప్టెన్ అమోల్ మజుందార్ ఇప్పుడు పూర్తి స్థాయిలో కోచ్‌గా మారనున్నాడు. వచ్చే జనవరి 3నుంచి అతను నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తాడు. 2015 వన్డే ప్రపంచ కప్‌కు అర్హత సాధించేందుకు నెదర్లాండ్స్ క్వాలిఫయర్స్‌లో పోటీ పడనుంది.
జట్టు హెడ్ కోచ్ ఆంటన్ రక్స్కు మజుందార్ సహకరిస్తాడు. గతంలో కూడా అతను అక్కడి స్థానిక జట్టు క్విక్ హేగ్ తరఫున మూడేళ్ల పాటు ప్లేయర్ కం కోచ్‌గా ఆడాడు. అయితే జాతీయ జట్టుతో అతను పని చేయనుండటం ఇదే తొలిసారి. కెరీర్లో 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అమోల్ 11,167 పరుగులు చేశాడు. ఈ రంజీ సీజన్లో ఆంధ్ర జట్టు తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడిన అనంతరం అతను అనూహ్యంగా తప్పుకున్నాడు.