ఇస్లామిక్ స్టేట్ నెం.2 నాయకుడి హతం
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో నెం.2గా ఇన్నాళ్లూ రాజ్యమేలిన ఫాదిల్ అహ్మద్ అల్ హయాలీ.. అలియాస్ హాజీ ముతాజ్ను అమెరికా వైమానిక దాడిలో హతమార్చింది. ఈనెల 18వ తేదీన అతడు ఇరాక్‌లోని మోసుల్ సమీపంలో ఓ వాహనంలో వెళ్తుండగా తమ వైమానిక దాడిలో అతడు మరణించాడని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇస్లామిక్ స్టేట్‌లో అల్ హయాలీ రెండో ముఖ్య నాయకుడు. ప్రధానంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, వాహనాలను ఇరాక్ - సిరియా దేశాల మధ్య తరలించడంలో అతడు కీలకంగా వ్యవహరించేవాడు.
అమెరికా వైమానిక దాడిలో హాజీ ముతాజ్తో పాటు.. అబూ అబ్దుల్లా అనే మరో ఉగ్రవాది కూడా మరణించాడు. ఇస్లామిక్ స్టేట్ అగ్రనాయకుడు అబూబకర్ అల్ బాగ్దాదీకి అత్యంత సన్నిహితుడైన అల్ హయాలీ ప్రధానంగా ఇరాక్, సిరియా దేశాల్లో ఈ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించేవాడని అమెరికా ప్రతినిధి ప్రైస్ చెప్పారు. గతంలో అల్ కాయిదాలో కూడా అతడు పనిచేశాడన్నారు. 2014 జూన్ నెలలో మోసుల్ నగరాన్ని ఇస్లామిక్ స్టేట్ స్వాధీనం చేసుకోవడంలో కూడా ఇతడిదే కీలకపాత్ర.