ఆటో డ్రైవర్.. పైలట్ అయ్యాడు
నిన్నటి వృత్తి ఆటో రిక్షా డ్రైవర్. నేడు ఆకాశంలో విహరించే విమానానికి పైలట్. ఆటోకు, విమానానికి మూడే చక్రాలు ఉండొచ్చు కానీ ఆటో డ్రైవర్.. పైలట్ కావడమన్నది అసాధారణ విషయం. ఆటో డ్రైవర్ నుంచి పైలట్‌గా మారి శ్రీకాంత్ పంటవానె యువతకు ఆదర్శంగా నిలిచాడు. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన శ్రీకాంత్ ఇండిగో ఎయిర్ లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ స్ఫూర్తి కథనాన్ని ఇండిగో ట్విటర్లో వెల్లడించింది. ఇండిగో మేగజైన్లో కూడా ఈ కథనం ప్రచురితంకానుంది.
శ్రీకాంత్‌ది నిరుపేద కుటుంబం. ఆయన తండ్రి సెక్యూరిటీ గార్డు. దీంతో సంపాదన కోసం శ్రీకాంత్ చిన్నతనం నుంచే ఏదో ఒకపని చేసేవాడు. స్కూలు రోజుల్లో చదువుకుంటూ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఆటోను నడిపాడు. శ్రీకాంత్‌కు టీ స్టాల్ నడిపే వ్యక్తితో ఏర్పడిన పరిచయం అతని జీవితంలో మార్పు తెచ్చింది. పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ పేద విద్యార్థుల కోసం పైలట్ స్కాలర్షిప్ పథకం అందిస్తున్నట్టు ఆయన ద్వారా శ్రీకాంత్ తెలుసుకున్నాడు. చదువులో చురుగ్గా ఉండే శ్రీకాంత్ స్కాలర్షిప్ సాధించి మధ్యప్రదేశ్‌లో ఫ్లైయింగ్ స్కూల్లో శిక్షణ పొందాడు. స్కూల్లో శ్రీకాంత్ టాపర్‌గా ఉండేవాడని ఇండిగో వెల్లడించింది. శ్రీకాంత్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందినా.. విమానయాన రంగంలో సంక్షోభం కారణంగా కొంతకాలం ఉద్యోగం కోసం వేచిచూడాల్సి వచ్చింది. ఆ సమయంలో కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. శ్రీకాంత్ చివరకు తన కలను సాకారం చేసుకున్నాడు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా చేరాడు.