breaking news
advanced systems
-
అధునాతన సిస్టమ్స్తయారీకి కేంద్రం బాసట
చెన్నై: అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా అధునాతన సిస్టమ్స్‌ను తీర్చిదిద్దడంలో పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) సహా య మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. తన ముందున్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత్ ప్రధానంగా వాణిజ్యపరంగా, అంతర్జాతీయంగా పోటీపడగలిగే టెక్నాలజీని రూపొందించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశీ పరిజ్ఞానంతో డీఐఆర్–వి (డిజిటల్ ఇండియా ఆర్ఐఎస్సీ–వి) మైక్రోప్రాసెసర్ రూపకల్పనలో అవసరమైన తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. మెయిటీ, ఐఐటీ మద్రాస్ నిర్వహించిన సింపోజియంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఇందులో 700 మంది పైచిలుకు వి ద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు పాల్గొన్నారు. -
ఆధార్‌పై అనుమానాలొద్దు!
న్యూఢిల్లీ: కేవలం రూ.500కే దేశంలో ఎవరి ఆధార్ సమాచారమైనా ఆన్లైన్లో దొరుకుతోందంటూ ‘ద ట్రిబ్యూన్’ పత్రిక ఇటీవల బయటపెట్టి సంచలనం సృష్టించింది. అలాగే కొన్ని ప్రభుత్వ విభాగాల వెబ్సైట్ల నుంచే 13 కోట్ల మంది ఆధార్ సమాచారం బట్టబయలైందంటూ కూడా గతంలో వార్తలొచ్చాయి. అసలు ఆధార్ రాజ్యాంగ బద్ధమేనా కాదా అనే దానిపై సుప్రీంకోర్టు ఐదురుగు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం నుంచి విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆధార్‌పై సామాన్యుల సందేహాలను నివృత్తి చేసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) 11 ‘తరచుగా అడిగే ప్రశ్నలు’ (ఎఫ్ఏక్యూ), వాటికి సమాధానాలను విడుదల చేసింది. ప్రశ్న: నా ఆధార్ సమాచారంలో బయోమెట్రిక్స్, బ్యాంక్ ఖాతా, పాన్, మొబైల్, ఈ–మెయిల్ తదితర వివరాలన్నీ ఉన్నాయి? నేను ఏమేం చేస్తానో యూఐడీఏఐ గమనిస్తూ ఉంటుందా? జవాబు: తప్పు. యూఐడీఏఐ దగ్గర బ్యాంకు ఖాతాలు, పాన్, మ్యూచ్‌వల్ ఫండ్లలో పెట్టుబడులు, ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సభ్యులు, కులం తదితర వివరాలేవీ ఉండవు. ప్రశ్న: కానీ నాకు బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు, షేర్ మార్కెట్, మ్యూచ్‌వల్ ఫండ్లలో పెట్టుబడులు, మొబైల్ కనెక్షన్..ఇలా ఏది కావాలన్నా ఆధార్ అంటున్నారుగా. ఆయా సంస్థలకు నా ఆధార్ నంబర్ ఇస్తే ఆ సమాచారం యూఐడీఏఐకి రాదా? జవాబు: కచ్చితంగా రాదు. మీరు ఆయా సంస్థలకు ఆధార్ సంఖ్య ఇచ్చినప్పుడు అవి మీరు వారికిస్తున్న బయోమెట్రిక్స్, మీ పేరు తదితరాలను మాత్రమే యూఐడీఏఐకి ధ్రువీకరణ కోసం పంపుతాయి. ఇతర వివరాలేవీ రావు. ఆధార్ నంబర్‌తో వేలిముద్రలు, పేరు సరిపోలితే ధ్రువీకరణ అయిపోతుంది. ప్రశ్న: ఎవరికైనా నా ఆధార్ నంబర్ తెలిస్తే, వాళ్లు నా బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయగలరు కదా? జవాబు: పూర్తిగా అవాస్తవం. కేవలం మీ ఏటీఎం కార్డు నంబర్ తెలిసినంత మాత్రాన ఎవరైనా మీ ఖాతాలోని డబ్బును ఏటీఎం ద్వారా డ్రా చేయగలరా? అలాగే ఇది కూడా అసాధ్యం. ప్రశ్న: బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించుకోవాలని ఎందుకు చెబుతున్నారు? జవాబు: మీ భద్రత కోసమే. నేరస్తులు, అవినీతిపరుల బ్యాంకు ఖాతాలను తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆధార్‌తో అనుసంధానమై ఉన్న ఖాతాల నుంచి ఎవరైనా అక్రమంగా డబ్బు తీస్తే వారి గురించి అన్ని వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. కాబట్టి మీ ఖాతాలకు మరింత భద్రత సమకూరుతుంది. ప్రశ్న: మరి మొబైల్ నంబర్లకు ఆధార్ ఎందుకు? జవాబు: ఇది కూడా మీ భద్రత కోసమే. దేశ భద్రత కోసం కూడా. నేరస్తులు, మోసగాళ్లు వినియోగిస్తున్న సిమ్ కనెక్షన్లను తొలగించడం కోసమే అనుసంధానం చేసుకోమంటున్నాం. చాలాసార్లు నేరగాళ్లు నకిలీ ధ్రువపత్రాలతో సిమ్‌లు సంపాదించి నేరాలకు పాల్పడుతున్నారు. ఆధార్‌తో అనుసంధానించడం వల్ల దీన్ని నివారించవచ్చు. ప్రశ్న: మొబైల్ కంపెనీలు నా వేలిముద్రలను సేవ్ చేసుకుని తర్వాత వాటిని వేరే పనుల కోసం వాడుకునే అవకాశం ఉంది కదా! జవాబు: ఆధార్ ధ్రువీకరణ సమయంలో మీరిచ్చే వేలిముద్రలను మొబైల్ కంపెనీలే కాదు, ఎవ్వరూ సేవ్ చేసుకోలేరు. సెన్సర్‌పై మీ వేలిముద్ర పెట్టగానే, ఆ సమాచారం ఎన్‌క్రిప్ట్ అయ్యి, సరిపోల్చడం కోసం యూఐడీఏఐకి వస్తుంది. ఆధార్ చట్టం–2016 ప్రకారం ఏవేనీ సంస్థలు మీ వేలిముద్రలను సేవ్ చేయడం శిక్షార్హమైన నేరం. ప్రశ్న: ఎన్ఆర్ఐలకు కూడా ఆధార్ ఉండాల్సిందేనా? జవాబు: లేదు. ఆధార్‌లో భారత్‌లో నివసిస్తున్న వారికి మాత్రమే. ఆధార్‌ను పొందేందుకు ఎన్ఆర్ఐలు అసలు అర్హులే కాదు. ఎన్ఆర్ఐలకు ఆధార్ లేకపోయినా అన్ని రకాల సేవలూ లభిస్తాయి. ప్రశ్న: పేదవారికి అత్యవసరమైన పింఛను, రేషన్ సరకులు తదితరాలను కూడా ఆధార్ లేని కారణంగా నిలిపేస్తున్నారు కదా? జవాబు: కచ్చితంగా లేదు. ఎవరైనా ఆధార్ కార్డు ఇంకా తీసుకోకపోతే, అలాంటి వారికి ఆధార్ సంఖ్య వచ్చే వరకు ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగానే సంక్షేమ పథకాల ప్రయోజనాలు కల్పించాల్సిందేనని చట్టంలో స్పష్టంగా ఉంది. ఒకవేళ ప్రభుత్వ సిబ్బంది ఎవరైనా ఆధార్ కచ్చితంగా కావాల్సిందేనని ఇబ్బంది పెడుతుంటే అలాంటి వారిపై పై అధికారులకు ఫిర్యాదు చేయండి. ప్రశ్న: కొన్ని సంస్థలు ఈ–ఆధార్‌ను ఒప్పుకోవడం లేదు. ఒరిజినల్ ఆధార్ కార్డు కావాల్సిందేనని అవి పట్టుబడుతున్నాయి. ఎందుకు? జవాబు: ఈ–ఆధార్ కూడా ఒరిజినల్ ఆధార్‌తో సమానమే. రెండింటిలో ఏదైనా ఒకటే. అన్ని సంస్థలూ రెండింటిలో దేన్నయినా అంగీకరించాల్సిందే. ఇంకా మాట్లాడితే ఒరిజినల్ ఆధార్ కన్నా ఈ–ఆధార్‌కే వారు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరైనా ఈ–ఆధార్‌ను ఒప్పుకోకపోతే వెంటనే పై అధికారులకు ఫిర్యాదు చేయండి. ప్రశ్న: సామాన్యులకు ఆధార్‌తో ప్రయోజనమేంటి? జవాబు: ఆధార్ అంటే 119 కోట్ల మంది భారతీయుల విశ్వసనీయమైన గుర్తింపు. ఇతర ఏ గుర్తింపు కార్డుకూ లేని విశ్వసనీయత ఆధార్‌కు ఉంది. పల్లెల నుంచి పట్టణాల్లోని మురికి వాడల వరకు ఎవ్వరినైనా అడగండి వారు ఆధార్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో. బ్యాంకు ఖాతాకు, ఉద్యోగానికి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో పొందేందుకు, రైళ్లలో ప్రయాణానికి ఇలా దేనికయినా సరే, గుర్తింపు కార్డుగా మొదటి ప్రాధాన్యత ఉన్నది ఆధార్‌కే. ప్రశ్న: ఆధార్ సమాచారం లీక్ అయ్యిందంటూ మీడియాలో వార్తలు చూశాం. నిజం కాదంటారా? జవాబు: ఆధార్ గత ఏడేళ్ల నుంచి ఉంది. ఎప్పుడూ సమాచారం లీక్ కాలేదు. ఆధార్ కార్డుదారుల సమాచారం భద్రంగా, సురక్షితంగాఉంది. ఆధార్ సమాచారం లీకయిందంటూ వచ్చిన వార్తలు అవాస్తవం. మేం ఆధార్ సమాచార భద్రత కోసం అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాం. యూఐడీఏఐ -
వ్యవసాయంలో దూర విద్య కోర్సు
దేశంలోనే తొలిసారిగా... యువరైతులను ప్రోత్సహించడమే లక్ష్యం వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడి రాజేంద్రనగర్ : చదువుకున్న యువరైతులకు వ్యవసాయరంగంలో వస్తోన్న ఆధునిక విధానాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో స్వల్పకాలిక దూరవిద్య కోర్సులను ప్రారంభిస్తున్నామని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. శనివారం రాజేంద్రనగర్ ఈఈఐ కాన్ఫరెన్స్ హాల్లో కోర్సు పాఠ్యాంశాల రూపకల్పనపై 9 జిల్లాల యువరైతులతో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి మూడు నెలలపాటు ఉండే మొదటిబ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని దూరవిద్య పద్ధతితో నిర్వహించనున్నామన్నారు. శిక్షణ కార్యక్రమంలో చేర్చాల్సిన అంశాలకు సంబంధించి ఆమె యువరైతుల నుంచి సూచనలను స్వీకరించారు. ప్రధానంగా వ్యవసాయ యాంత్రీకరణ, విత్తనోత్పత్తి, ఉద్యాన పంటలు, పూలతోటలసాగు, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగువిధానాలలో మార్పులు, భూసార పరీక్షల ప్రాధాన్యత, తుపంర, బిందుసేద్యం నిర్వహణ, నీటియాజమాన్యం, పురుగుమందులు, ఎరువుల యాజమాన్యం, చేపలపెంపకం, పశుపోషణలో అనుసరించాల్సిన ఆధునిక పద్ధతులు తదితర అంశాలపై శిక్షణ అవసరమని యువరైతులు ఆమెకు వివరించారు. వ్యవసాయరంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మొబైల్ అప్లికేషన్లు, సమాచార, ప్రసారమాధ్యమాల ద్వారా రైతులకు అందివ్వాలని వారు కోరారు. కాగా సర్టిఫికెట్ కోర్సును పూర్తిచేసినవారికి ఎలాంటి ఉద్యోగావకాశాలు లభించవని ఆమె స్పష్టం చేశారు. మూడు నెలల శిక్షణ కార్యక్రమానికి సంబంధించి పాఠ్యాంశాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ర్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందిస్తుందన్నారు. రానున్న రోజుల్లో యంగ్ఫార్మర్స్ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించే చేస్తున్నామన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్ వి. ప్రవీణ్‌రావు మాట్లాడుతూ... వ్యవసాయ సాగుపద్ధతులపై రైతులకు నైపుణ్యం పెంపొందించడానికి ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. కోర్సు రూపకల్పనకు సంబంధించిన అంశాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ డి.రాజిరెడ్డి వివరించారు. అంతకుముందు తొమ్మిది జిల్లాల నుంచి వచ్చన 77 మంది యువరైతులను 5 గ్రూపులుగా విభజించి పాఠ్యాంశాలపై వారినుంచి సలహాలను స్వీకరించారు.