breaking news
Adikmet Division
-
నీ పని కావాలంటే.. ఫ్లోర్‌కు రూ.2 లక్షలు ఇవ్వాలి !
సాక్షి,ముషీరాబాద్( హైదరాబాద్): ఓ ఇంటిని నిర్మిస్తున్న యజమాని నుంచి అంతస్తుకు రెండు లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని అడిక్‌మెట్ డివిజన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ సి.సునిత ప్రకాష్‌గౌడ్, ఆమె కుమారుడు తరుణ్ మాట్లాడిన ఆడియో, వీడియోలు వైరల్‌గా మారాయి. శుక్రవారం ఈ ఆడియో, వీడియోలు నియోజకవర్గంలో తీవ్ర చర్చానీయాంశం అయ్యాయి. ► నల్లకుంట కూరగాయల మార్కెట్ రోడ్డులో నైషదం సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి నూతన భవనం నిర్మిస్తున్నారు. కొందరు స్థానికులు అక్రమ నిర్మాణం అని జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేసి భవనాన్ని సీజ్ చేశారు. అయితే తన భవనాన్ని సీజ్ చేసిన విషయాన్ని స్థానిక అడిక్‌మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్‌కు సత్యనారాయణ మూర్తి ఫోన్ చేసి పనులు ఆపించారని మీ కుమారుడు తరుణ్ ఫ్లోర్‌కు రెండు లక్షల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాడని నేను కూడా బీజేపీలో ఉన్నానని అన్నాడు. దీనికి సమాధానంగా ఏమైనా ఉంటే బాబుతో మాట్లాడుకోండి అంటూ ఫోన్‌ను కుమారుడికి ఇవ్వడంతో.. ఈ విషయాలు మమ్మీ మాట్లాడదు నేనే మాట్లాడుతాను అని తరుణ్ చెప్పడం ఆడియో విన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ► దీంతో పాటు రాంనగర్ చౌరస్తాలోని కార్యాలయానికి రమ్మని పిలిపించి ఫ్లోర్‌కు ఎంతిస్తారని తరుణ్ అడగడం.. దానికి ఇంటి యజమాని మూడు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పగా అందుకు తరుణ్ నాలుగున్నర లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం, అదే వీడియోలో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ ఉద్యోగి రాజయ్య కూడా ఈ చర్చల్లో పాల్గొనడం స్పష్టంగా కనిపించింది. ఈ విషయం రెండు ఆడియోలు, ఒక వీడియో రూపంలో బయటకు రావడం కళకళం రేపింది. ► జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్ఎస్ అడిక్‌మెట్ కార్పొరేటర్ బి.హేమలత భర్త జయరాంరెడ్డి ఓ బిల్డింగ్‌కు సంబంధించి డబ్బుల విషయంపై మాట్లాడుతున్న ఆడియో బయటకు రావడం దానిని ప్రతిపక్షంలో ఉన్న అడిక్‌మెట్ డివిజన్ బీజేపీ నాయకుడు ప్రకాష్‌గౌడ్ వైరల్ చేశారు. ఇప్పుడు పాత్రలు మారాయి. ఇటీవల కరోనాతో ప్రకాష్‌గౌడ్ మరణించగా.. కార్పొరేటర్ అయిన ఆయన భార్య సునీత, కుమారుడు తరుణ్‌లు ఇదే ఆడియో, వీడియోలో అడ్డంగా దొరకడం గమనార్హం. అలాగే ఇటీవల రాంనగర్ కార్పొరేటర్ కె. రవిచారి కూడా అదే డివిజన్‌కు చెందిన ఓ బీజేపీ నాయకుడిని దూషించిన ఆడియో వైరల్ కావడంతో ముషీరాబాద్ నియోజకవర్గంలో కార్పొరేటర్ల ఆడియో, వీడియోలు బయటకు రావడం పరిపాటిగా మారిపోయింది. దురుద్దేశంతోనే ఆరోపణలు నైషధం సత్యనారాయణ మూర్తి నల్లకుంట కూరగాయల మార్కెట్లో నిర్మిస్తున్న భవనం అక్రమమని స్వయానా ఆయన సోదరుడు, వదిన నాకు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేయమని వారికి సూచించాను. ఈ విషయం టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా తెలుసుకున్న సత్యనారాయణ మూర్తి మాపై కక్ష పెంచుకున్నారు. కావాలనే ఫోన్‌కాల్‌ను రికార్డు చేసి దురుద్దేశంతో వైరల్ చేశారు. డబ్బులు అడిగిన మాట అవాస్తవం. రాజకీయ దురుద్దేశ్యంతోనే ఇలాంటి తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. – సునిత ప్రకాష్‌గౌడ్, అడిక్‌మెట్ కార్పొరేటర్ -
ఎదురొచ్చిన ఎన్నికకు కలిసొచ్చిన భార్య!
అడిక్‌మెట్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న మహేందర్‌పై రిజర్వేషన్లు నీళ్లు చల్లాయి. డివిజన్‌ను జనరల్ మహిళకు కేటాయించడంతో కంగుతిన్నాడు. ఇంతలో కాబోయే భార్య రూపంలో అదృష్టం వెదుక్కుంటూ వచ్చింది. ... మహేందర్ గత నెల 20న ఆ డివిజన్‌కు చెందిన శాంతిప్రియతో నిశ్చితార్థం చేసుకుని... ఫిబ్రవరి 12న పెళ్లికి సిద్ధమయ్యాడు. రిజర్వేషన్లతో తన కలలు కల్లలైనందున.. కాబోయే భార్యనే పోటీకి దింపితే ఎలా ఉంటుందని ఆలోచించి... పార్టీ పరిశీలకులకు బయోడేటాను అందచేశాడు. అడిక్‌మెట్ డివిజన్ లలితానగర్ కమ్యూనిటీ హాలుకు వచ్చిన పరిశీలకులు ఇది తెలుసుకుని ఎదురొచ్చిన ఎన్నికలకు కలిసొచ్చే భార్య దొరికిందంటూ చమత్కరించారు. - ముషీరాబాద్