breaking news
absurd rules
-
డాన్స్ బార్లకు ఊరట
ముంబై: మహారాష్ట్రలోని డాన్స్ బార్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇప్పటివరకు పాటిస్తున్న పాత నిబంధనలనే కొనసాగించాలని ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధనల అమలు చేయడానికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. లైసెన్స్ కలిగిన డాన్స్ బార్లు పాత నిబంధనలనే కొనసాగించాలని స్పష్టం చేసింది. డాన్స్ బార్లను రాత్రి 11.30లకు మూసి వేయాలని, మద్యం విక్రయించరాదని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సర్కారు నిబంధనలను జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నాగప్పన్ లతో కూడిన బెంచ్ తప్పుబట్టింది. డాన్స్ బార్లలో మద్యం విక్రయించకూడదనుకుంటే రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించాలని ప్రభుత్వానికి సూచించింది. బార్, డాన్స్ లైసెన్స్ కలిగినవారిని మద్యం అమ్మకూడదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. మహిళల గౌరవం కాపాడానికి ప్రయత్నం చేయాలని కోరింది. డాన్స్ బార్లలో సీసీ కెమెరాలు పెడితే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టు అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. -
డాన్స్ బార్లపై ఆంక్షలు వద్దు: సుప్రీం
హోటళ్లు, రెస్టారెంట్లు మళ్లీ డాన్స్ బార్లను తెరవకుండా ఉండేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వాటి మీద పనికిమాలిన, అర్థరహితమైన, కఠినమైన ఆంక్షలు విధిస్తోందని సుప్రీంకోర్టు మండిపడింది. డాన్స్ బార్లకు అనుమతిస్తూ ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 2014లో చేసిన చట్టాన్ని గత సంవత్సరం అక్టోబర్ 15న కొట్టేసింది. అయితే, డాన్స్ బార్లను నిర్వహించాలంటే అధికారులు 26 నిబంధనలు పెడుతున్నారని, వాటిలో ఐదింటిని అమలుచేయడం అసాధ్యమని రెస్టారెంట్లు, హోటళ్ల యజమానుల సంఘం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎస్కే సింగ్‌లతో కూడిన ధర్మాసనానికి ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు ఒక్క డాన్స్ బార్‌కు కూడా అధికారులు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అన్ని సీసీటీవీ కెమెరాల లైవ్ఫీడ్ను సమీపంలోని పోలీసు స్టేషన్లకు ఇవ్వాలని అంటున్నారని అసోసియేషన్ తరఫు న్యాయవాది జయంత్ భూషణ్ చెప్పారు. కేవలం నలుగురు డాన్సర్లే ఉండాలంటున్నారని, అలాగే డాన్స్ ఫ్లోర్‌కు, ప్రేక్షకులకు మధ్య బారికేడ్లు పెట్టాలన్నారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజిని నెలరోజుల పాటు దాచాలంటున్నారని, పోలీసులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వాలని చెబుతున్నారని అన్నారు. దీంతో వ్యక్తి స్వేచ్ఛమీద దాడి చేసేలా ఈ నిబంధనలు ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. డాన్స్ బార్లో మద్యం తాగుతూ రిలాక్స్ అవ్వాలని ఎవరైనా అనుకుంటారని, అలాంటి సమయంలో తనను వీడియో తీయడాన్ని వాళ్లు ఇష్టపడకపోవచ్చని.. అలాంటి వాళ్లను ఎందుకు వీడియోలో చూపిస్తారని ప్రశ్నించింది. అలాగే తినే అలవాటు విభిన్నంగా ఉన్నవాళ్లు కూడా తమను వీడియో తీయడానికి అభ్యంతరం చెబుతారని స్పష్టం చేసింది. కాగా, లేనిపోని హింసను నివారించేందుకే ఈ నిబంధనలు పెట్టారని సమర్థించుకోడానికి అదనపు సాలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ ప్రయత్నించగా. సుప్రీంకోర్టు తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం మండిపడింది.