ఇంతకీ పాత నోట్లను ఏం చేస్తారో తెలుసా?

ఇంతకీ పాత నోట్లను ఏం చేస్తారో తెలుసా? - Sakshi

ఇప్పటివరకు అంతా కొత్త నోట్లను తీసుకోవడంలోనే బిజీబిజీగా ఉన్నారు. తమ దగ్గర కొద్దో గొప్పో ఉన్న పాత నోట్లను ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నారు. బ్యాంకులలో డిపాజిట్ చేసి.. కొత్త 2000, పాత 100 రూపాయల నోట్లు తీసుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది గానీ, ఇంతకీ పాతనోట్లను ప్రభుత్వం ఏం చేయబోతోందన్న విషయం మాత్రం ఇప్పటివరకు ఎక్కడా చర్చకు రాలేదు. దీనిపై సామాన్య మానవులకే కాదు.. ఆర్థికవేత్తలు, బ్యాంకర్లకు కూడా పెద్దగా అవగాహన లేదు. ఇంతకుముందైతే.. చినిగిపోయిన, పాడైన నోట్లను మార్చడం కోసం వాటిని రిజర్వు బ్యాంకుకు పంపేవారు. కానీ ఇంతకుముందు ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో నోట్లను ఉపసంహరించుకోవడం జరగలేదు. 
 
దాంతో.. ఇప్పుడు ఈ నోట్లను ఏం చేస్తారన్న విషయం గురించి కూడా ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దేశంలో ఇంతకు ముందు ఎప్పుడూ ఈ స్థాయిలో నోట్ల ఉపసంహరణ, కరెన్సీ నోట్ల రద్దు జరగలేదని ప్రముఖ ఆర్థికవేత్త ఎన్ఆర్ భానుమూర్తి చెప్పారు. ఇప్పుడు ఈ నోట్లను కాల్చేయాలా, ఏం చేయాలన్న విషయాన్ని రిజర్వుబ్యాంకే నిర్ణయించాలని తెలిపారు. సాధారణంగా అయితే ఇలాంటి నోట్లను కాల్చేస్తారని.. కానీ ఇప్పుడు మాత్రం వాటిని ముక్కలు ముక్కలుగా చించేస్తారని రిజర్వు బ్యాంకు మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు. రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయం ముంబైలో ఉండగా.. దేశంలోని 31 ప్రాంతాలలో శాఖలున్నాయి. ఈ శాఖల స్థాయిలోనే నోట్ల చించివేత జరుగుతుందని భావిస్తున్నారు. 
 
దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం నగదులో 85 శాతం 500, 1000 రూపాయల నోట్లే ఉంటాయని అంచనా. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో ఉన్న నగదును ఎలా హ్యాండిల్ చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఉన్నందువల్ల ఎప్పటిలాగే ముక్కలుగా చేస్తారా, లేక కాల్చేస్తారా అనేది కూడా ఇంకా స్పష్టం కాలేదు.  
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top