రాష్ర్ట విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరిస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌నేతల యోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరిస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సీఎం వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విభజన జరగకుండా కుట్ర చేస్తున్నారనే అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండ్రోజుల్లో వారంతా సమావేశమై సీఎం విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
ఆ తరువాత తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసి కిరణ్‌ను తప్పించాలని కోరుతూ సంతకాల సేకరణ జరిపి అధిష్టానం పెద్దలకు పంపాలని భావిస్తున్నారు. అతనికి పిచ్చి పట్టిందని, అందుకే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి దుయ్యబట్టారు. డిప్యూటీ సీఎం సన్నిహితులు చెబుతున్న సమాచారం మేరకు కొద్దిరోజుల్లోనే కిరణ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం.. రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని తెలుస్తోంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన పీసీసీ అధ్యక్షుడు బొత్స అంతకంటే ముందుగానే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సీమాంధ్ర ప్రజల సానుభూతి పొందే పనిలో పడ్డారని అభిప్రాయపడుతున్నారు.