రాజస్థాన్‌కు దేశమంతా ఓటర్లే! | Migrants move Rajasthan to vote | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌కు దేశమంతా ఓటర్లే!

Nov 25 2013 1:58 AM | Updated on Sep 2 2017 12:57 AM

రాజస్థాన్‌కు దేశమంతా ఓటర్లే!

రాజస్థాన్‌కు దేశమంతా ఓటర్లే!

పోలంపెల్లి ఆంజనేయులు ఎన్నికల సమయంలో జిల్లా కేంద్రాలకో, రాజధానికో వలస వెళ్లిన ఓటర్లను పిలిపించుకోవడం సర్వసాధారణం.

ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారికి అభ్యర్థుల పిలుపు
హైదరాబాద్ సహా పలు నగరాల నుంచి రానున్న ఓటర్లు
వలస వెళ్లిన ఓటర్ల కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు బుక్ చేసిన అభ్యర్థులు

 
 రాజస్థాన్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి : పోలంపెల్లి ఆంజనేయులు ఎన్నికల సమయంలో జిల్లా కేంద్రాలకో, రాజధానికో వలస వెళ్లిన ఓటర్లను పిలిపించుకోవడం సర్వసాధారణం. రాజస్థాన్‌లో మాత్రం ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ ఓటర్లనూ పిలిపించుకుంటున్నారు. ఇక్కడి అభ్యర్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరీ ప్రచారం సాగిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందే రాజస్థాన్ ప్రజలు బతుకుతెరువు కోసం దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం మొదలైంది. అలా వెళ్లిన వారిలో చాలామంది వ్యాపారాలు చేసుకుంటూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎక్కడికక్కడ స్థిరపడిపోగా, వారి వద్ద పనుల కోసమో, చిరు వ్యాపారాల కోసమో ఇప్పటికీ రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి వస్తూనే ఉన్నారు.
 
  హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ తదితర మెట్రో నగరాలతో పాటు విశాఖపట్నం, వరంగల్, విజయవాడ వంటి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సైతం రాజస్థానీలు జీవనం సాగిస్తున్నారు. వారిలో వేలాది మంది సొంత గ్రామాల్లో ఓటర్లుగా నమోదై ఉండటంతో, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం కోసం దేశమంతా పర్యటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజస్థాన్‌లోని నాగోర్, జాలోర్, శేఖావాటి వంటి పలు జిల్లాల్లో దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడ్డ ఓటర్లు ఉన్నారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుంటే, దాదాపు సగం నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ తమ ఓటర్లను స్వస్థలాలకు పిలిపించుకుంటున్నారు. కొందరు అభ్యర్థులు గ్రామాల్లోని పెద్దమనుషులు, బంధువుల ద్వారా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ తమ ఓటర్లను ఆహ్వానిస్తుండగా, మరికొందరు ఫోన్‌ల ద్వారా, ఇంకొందరు స్వయంగా వెళ్లి మరీ డిసెంబర్ 1న జరగనున్న ఎన్నికల్లో ఓట్లేసేందుకు రమ్మని పిలుస్తున్నారు.
 
 ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మందికి పైగానే రాజస్థానీ ఓటర్లు
 ఆంధ్రప్రదేశ్‌లో రాజస్థానీ ఓటర్లు లక్ష మందికి పైగానే ఉన్నారు. జంటనగరాల్లోనైతే వీరి సంఖ్య చాలా ఎక్కువ. గోషామహల్ నియోజకవర్గంలో వీరి ప్రాబల్యం అధికం. ఇక్కడ ఉంటున్న వారిలో దాదాపు 20 వేల నుంచి 40 వేల మందికి రాజస్థాన్‌లో ఓటు హక్కు ఉన్నట్లు అంచనా. సిద్ధిఅంబర్ బజార్, బేగంబజార్, సుల్తాన్‌బజార్‌లలో రాజస్థానీలకు ప్రత్యేకంగా కాలనీలు ఉన్నాయి. సికింద్రాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లోనూ వీరి సంఖ్య ఎక్కువే. రాష్ట్రవ్యాప్తంగా రాజస్థాన్‌లో ఓటు హక్కు ఉన్న వారి సంఖ్య లక్షకు పైగానే ఉంటుందని బీన్‌మల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రాథోడ్ తరఫున ప్రచారానికి వచ్చిన సుల్తాన్‌బజార్ మాజీ కార్పొరేటర్ ఎం.శంకర్ యాదవ్ ‘సాక్షి’కి చెప్పారు. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. ముంబై, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, పాట్నా, రాంచీ తదితర నగరాలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని పల్లెలు, పట్టణాల్లోనూ రాజస్థానీయులు జీవనం సాగిస్తున్నారు. దేశంలో వారు ఎక్కడ జీవనం సాగిస్తున్నా, సొంత ఊళ్లలో తమ ఓటును కాపాడుకుంటూ వస్తున్నారు.
 
 దేశ నలుమూలలా ప్రచారం
 రాణీవాడ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారాయణ సింగ్ దేవల్ ఇటీవలే హైదరాబాద్ వెళ్లి మార్వాడీ సంఘం వాళ్లతో సమావేశమయ్యారు. ఈనెల 29, 30 తేదీల్లో హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేకంగా రెండు రైళ్లు బుక్ చేశారు. ఓటున్న వారంతా ఆ రైళ్లలో రాణీవాడ రావాలని, పక్క నియోజకవర్గాల్లోని వారు కూడా రావాలని ఆహ్వానించారు. ఆయనకు దగ్గరి బంధువు అయిన మహరాజ్‌గంజ్(ప్రస్తుత గోషామహల్) మాజీ ఎమ్మెలే ్య ప్రేమ్‌సింగ్ రాథోడ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ప్రేమ్‌సింగ్ రాథోడ్ జాలోర్ జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాల్లో తనకున్న పరిచయాలను ఓట్లుగా మలిచేందుకు రెండు రోజుల కిందటే ఇక్కడకు వచ్చి, బీజేపీ అభ్యర్థులతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాను హైదరాబాద్ ఎన్నికల్లో పోటీచేసినా, రాజ స్థాన్ నుంచి తనకు సన్నిహితులైన వారు అక్కడకు వచ్చి ప్రచారం చేస్తారని, తాను కూడా అలాగే ఇక్కడకు వచ్చానని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement