హైదరాబాద్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ | IPL-10: SRH thrilling victory on Kings Punjab | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ

Apr 17 2017 11:44 PM | Updated on Sep 5 2017 9:00 AM

ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు థ్రిల్లింగ్‌ విక్టరీ కొట్టింది.

హైదరాబాద్‌: ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు థ్రిల్లింగ్‌ విక్టరీ కొట్టింది. భువనేశ్వర్‌ కుమార్‌ (4-0-19-5) అద్భుత ప్రదర్శనతో కింగ్స్‌ పంజాబ్‌ తోకముడిచింది. చివరి ఓవర్‌ వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై 5 పరుగుల తేడాతో హైదరాబాద్‌ గెలిచింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌.. మనన్‌ ఓరా(50 బంతుల్లో 95 పరుగులు) విజృంభణతో దాదాపు గెలుపువాకిట నిలిచింది. కానీ హైదరాబాద్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో 19.4 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్‌ అయింది.

పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌లలో మనన్‌ ఓరా(95) మినహా ఏ ఒక్కరూ రాణించలేదు. హైదరాబాద్‌ బౌలర్లలో భువీ 5, రషీద్‌ ఖాన్‌ 2, సిద్ధార్థ్‌ కౌల్‌, మొహమ్మద్‌ నబీ, హెన్రిక్స్‌లు తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

హైదరాబాద్ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్(70 నాటౌట్;54 బంతుల్లో7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు.  ఓపెనర్ గా వచ్చిన వార్నర్ కడవరకూ క్రీజ్ లో ఉండి ఒంటరి పోరాటం చేశాడు. ఆ తరువాత నమాన్ ఓజా(34;20 బంతుల్లో2 ఫోర్లు, 1 సిక్స్) కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇక మిగతా వారు విఫలం కావడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.


గత రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలై తీవ్ర ఒత్తిడిలో ఉన్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ఆరంభించింది. శిఖర్ ధావన్, వార్నర్ లు నిలకడగా ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. అయితే ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ను అందుకున్న కింగ్స్ బౌలర్ మోహిత్ శర్మ హైదరాబాద్ కు షాకిచ్చాడు. ఓ చక్కటి బౌన్సర్ తో శిఖర్(15) ను బోల్తా కొట్టించాడు. లెగ్ స్టంప్ వైపు వచ్చిన ఆ బౌన్సర్ ను శిఖర్ హుక్ చేయబోయి సాహాకు దొరికేశాడు. దాంతో 25 పరుగుల వద్ద హైదరాబాద్ తొలి వికెట్ ను కోల్పోయింది. ఆపై హెన్రిక్స్(9), యువరాజ్ సింగ్(0)లు వరుసగా అవుట్ కావడంతో హైదరాబాద్ కష్టాల్లో పడింది. ఆ తరుణంలో నమాన్ ఓజాతో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఈ జోడి 60 పరుగుల  జోడించిన తరువాత ఓజా నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. ఇక ఆపై వార్నర్ కు సహకారం లభించకపోవడంతో హైదరాబాద్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. కింగ్స్ బౌలర్లలో మోహిత్ శర్మ,అక్షర్ పటేల్ లు తలో రెండు వికెట్లు సాధించగా, సందీప్ శర్మ,కరియప్పలకు చెరో వికెట్ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement