అనుమోలు రామకృష్ణ, పుల్లెల గోపీచంద్‌కు పద్మభూషణ్ | anumolu ramakrishna gets padma bhushan | Sakshi
Sakshi News home page

అనుమోలు రామకృష్ణ, పుల్లెల గోపీచంద్‌కు పద్మభూషణ్

Published Sun, Jan 26 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

అనుమోలు రామకృష్ణ, పుల్లెల గోపీచంద్‌కు పద్మభూషణ్

అనుమోలు రామకృష్ణ, పుల్లెల గోపీచంద్‌కు పద్మభూషణ్

కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాలను శనివారం ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలు చేసిన 127 మందికి ఈ అవార్డులను అందించనున్నారు.

ఏడుగురు తెలుగువారికి పద్మశ్రీ
‘పద్మ’ అవార్డుల ప్రకటన.. ఇద్దరికి పద్మవిభూషణ్
కమల్‌హాసన్‌కు పద్మభూషణ్
 
 
 న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాలను శనివారం ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలు చేసిన 127 మందికి ఈ అవార్డులను అందించనున్నారు. ఈ పురస్కారాల్లో 2 పద్మ విభూషణ్, 24 పద్మ భూషణ్, 101 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. మార్చి, లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. పద్మ పురస్కారాలు లభించిన తెలుగువారిలో.. పద్మభూషణ్ పొందిన  దివంగత అనుమోలు రామకృష్ణ( సైన్స్, ఇంజనీరింగ్), పుల్లెల గోపీచంద్(క్రీడలు- బ్యాడ్మింటన్) సహా 9 మంది ప్రముఖులున్నారు.  పద్మవిభూషణ్ పురస్కారం మహారాష్ట్రకు చెందిన డాక్టర్ రఘునాథ్ ఎ.మషేల్కర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), బి.కె.ఎస్. అయ్యంగార్ (యోగా, ఇతరము) లకు లభించింది.
 
  పద్మభూషణ్ అవార్డ్ లభించిన ఇతర ప్రముఖుల్లో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్, దివంగత న్యాయమూర్తి జె.ఎస్.వర్మ, ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయని బేగం పర్వీన్ సుల్తానా, సాహితీవేత్త రస్కిన్ బాండ్, తమిళ రచయిత వైరముత్తు తదితరులున్నారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్, సీనియర్ నటుడు పరేశ్‌రావల్, క్రికెటర్ యువరాజ్ సింగ్, సినీ రంగానికి చెందిన సంతోష్ శివన్, సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ .. తదితరులను పద్మశ్రీ వరించింది.  ప్రవాసాంధ్రుడు డాక్టర్ వంశీ మూట (మెడిసిన్- బయోమెడికల్ రీసెర్చ్)కు ఎన్‌ఆర్‌ఐ విభాగంలో పద్మశ్రీ లభించింది.
 
 డా. అనుమోలు రామకృష్ణ (పద్మభూషణ్)(మరణానంతరం)
 
 పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన డాక్టర్ అనుమోలు రామకృష్ణకు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు. 1939 డిసెంబర్ 20న జన్మించిన రామకృష్ణ ప్రాథమిక విద్యాభాసం కొవ్వూరులోనే కొనసాగింది. విశాఖపట్నంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన రామకృష్ణ.. స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్సీ చెన్నైలోని గుండిలో పూర్తి చేశారు. 1962లో ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఈసీసీ) ద్వారా ఆయన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. ఈసీసీ తర్వాత ఎల్ అండ్ టికి పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా మారింది. వివిధ స్థాయిల్లో పనిచేసిన తర్వాత 1992లో ఆయన ఎల్ అండ్ టీ డెరైక్టర్ల బోర్డులో డెరైక్టర్ అయ్యారు. తర్వాత ఈసీసీ నిర్మాణ విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. సిమెంటు కర్మాగారాలు, రహదారులు భవనాలు, పోర్టులు, విమానాశ్రయాలు తదితరాలను ఈయన నాయకత్వలో ఈసీసీ నిర్మించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలు ఆయనకు గౌరవ డాక్టరేట్‌లను అందించాయి. కాంక్రీట్ డిజైన్ అవార్డుతోపాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను రామకృష్ణ పొందారు.  గత ఏడాది ఆగస్టు 20న రామకృష్ణ మృతి చెందారు.
 
 పద్మశ్రీ పొందిన తెలుగువారు
 1. మొహ్మద్ అలీ బేగ్ (ఆర్ట్-థియేటర్) ఆంధ్ర ప్రదేశ్
 2. డాక్టర్ రామారావు అనుమోలు (సోషల్ వర్క్) ఆంధ్రప్రదేశ్
 3. డాక్టర్ మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్ (సైన్స్, ఇంజనీరింగ్) ఆంధ్రప్రదేశ్
 4. డాక్టర్ గోవిందన్ సుందరరాజన్ (సైన్స్, ఇంజనీరింగ్) ఆంధ్రప్రదేశ్
 5. రవికుమార్ నర్ర (ట్రేడ్ ఇండస్ట్రీ) ఆంధ్రప్రదేశ్
 6. డాక్టర్ సరబేశ్వర్ సహార్య (వైద్యం, సర్జరీ) ఆంధ్రప్రదేశ్
 7. ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ (సాహిత్యం, విద్య) ఆంధ్రప్రదేశ్
 
 పద్మ భూషణ్ పొందిన ప్రముఖుల జాబితా-(తెలుగువారిని మినహాయించి)
 ప్రొఫెసర్ గులాం మహ్మద్ షేక్ (ఆర్ట్- పెయింటింగ్) గుజరాత్; బేగం ప్రవీన్ సుల్తానా (ఆర్ట్-శాస్త్రీయ గానం) మహారాష్ట్ర; టి.హెచ్. వినాయక్‌రామ్ (ఆర్ట్- గాత్రం కళాకారుడు) తమిళనాడు; కమల్‌హాసన్ (ఆర్ట్-సినిమా) తమిళనాడు; జస్టిస్ దల్వీర్ భండారీ (ప్రజా వ్యవహారాలు) ఢిల్లీ; పద్మనాభన్ బలరామ్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్) కర్నాటక; ప్రొఫెసర్ జయేష్‌త్రాజ్ జోషి (సైన్స్, ఇంజనీరింగ్) మహారాష్ట్ర; డాక్టర్ మాడప్ప మహదేవప్ప (సైన్స్, ఇంజనీరింగ్) కర్నాటక; డాక్టర్ తిరుమలాచారి రామసామి (సైన్స్, ఇంజనీరింగ్) ఢిల్లీ; డాక్టర్ వినోద్ ప్రకాశ్ శర్మ (సైన్స్, ఇంజనీరింగ్) ఢిల్లీ; డాక్టర్ రాధాకృష్ణన్  కొప్పిల్లి (సైన్స్, ఇంజనీరింగ్) కర్నాటక; డాక్టర్ మృత్యుంజయ్ ఆత్రేయ (సాహిత్యం ,విద్య) ఢిల్లీ; అనితా దేశాయ్  (సాహిత్యం, విద్య) ఢిల్లీ; డాక్టర్ ధీరూభాయ్ థాకర్ (సాహిత్యం, విద్య) గుజరాత్; వైరముత్తు రామస్వామి తేవర్ (సాహిత్యం, విద్య) తమిళనాడు; రుస్కిన్ బాండ్ (సాహిత్యం, విద్య) ఉత్తరాఖండ్; లియాండర్ పేస్ (క్రీడలు-టెన్నిస్) మహారాష్ట్ర; విజేంద్ర నాథ్ కౌల్ (సివిల్ సర్వీస్) ఢిల్లీ; దివంగత జగదీశ్ శర్మ వర్మ (ప్రజా వ్యవహారాలు) ఉత్తర ప్రదేశ్; ప్రొఫెసర్ అనీసుజ్జమన్ (సాహిత్యం, విద్య) బంగ్లాదేశ్; ప్రొఫెసర్ లాయడ్ రుడోల్ఫ్, ప్రొఫెసర్ హెచ్.రుడోల్ఫ్ (సంయుక్తంగా)(సాహిత్యం, విద్య) యూఎస్‌ఏ; డాక్టర్ నీలం క్లెర్ (మెడిసిన్, నియోనాటాలజీ) ఢిల్లీ.
 
 
 పద్మశ్రీ’లు...
 
 డాక్టర్ సరబేశ్వర్ సహర్యా
 మూత్రపిండాల శస్త్రచికిత్స నిపుణుడైన డాక్టర్  సహార్యా హైదరాబాద్‌లోని కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (కిమ్స్) ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఆయన అనేక కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేశారు. ఈయన 1945 ఏప్రిల్ ఒకటో తేదీన అస్సాం రాష్ట్రం డరంగ్ జిల్లా మంగల్‌డాయి అనే మారుమూల గ్రామంలో జన్మించారు. నిరుపేద కుటుంబానికి చెందిన సహరయ్య ఈబీసీ స్కాలర్‌ఫిప్పుతో 1967లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఛండీఘర్‌లో జనరల్ సర్జరీలో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేశారు. విదేశాలకు వెళ్లి వచ్చిన తరువాత  ఆయన మూత్రపిండాలు, క్లోమ గ్రంధి మార్పిడి శస్త్రచికిత్సలను ప్రయోగాత్మకంగా చేపట్టారు. 1981లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో వైద్యుడిగా చేరారు. మహావీర్, నిమ్స్ ఆస్పత్రుల్లో పని చేశారు.
 
 డాక్టర్ ఎం వైఎస్ ప్రసాద్(సైన్స్, ఇంజనీరింగ్)
 పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన మలపాక సూర్యనారాయణ, భాస్కరమ్మ దంపతుల మూడవ కుమారుడైన ప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. 1953 మే 4వ తేదీన మొగల్తూరులో పుట్టిన ప్రసాద్ 1968లో మొగల్తూరు పెన్మత్స రంగరాజా జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదివారు. కాకినాడ జేఎన్‌టీయూలో ఇంజనీరింగ్ విధ్యనభ్యసించారు. అనంతరం తిరువనంతపురంలో ఇస్రో కేంద్రంలో జూనియర్ సైంటిస్ట్‌గా ఉద్యోగజీవితం ప్రారంబించారు. ఇస్రోలో దేశ విదేశాల్లో అనేక హోదాల్లో పనిచేశారు. చంద్రయాన్-1 ప్రయోగంలో కీలకపాత్ర పోషించిన ప్రసాద్ ఇటీవల మార్స్ ఉపగ్రహ ప్రయోగంలోనూ ముఖ్యభూమిక పోషించారు.
 
 నర్రా రవికుమార్(ట్రేడ్, ఇండస్ట్రీ)
 వాణిజ్యం, పారిశ్రామిక రంగంలో చేసిన సేవకు గానూ నర్రా రవికుమార్(51)కు పద్మశ్రీ లభించింది. ఎల్‌ఎల్‌ఎం చదివిన రవికుమార్ డిక్కి ఆర్గనైజేషన్ ద్వారా సామాజిక సేవ చేస్తున్నారు.
 
 కొలకలూరి ఇనాక్(సాహిత్యం)
 సాహిత్యరంగంలో గుంటూరు జిల్లా వాసి డాక్టర్ కొలకలూరి ఇనాక్‌ను పద్మశ్రీ వరించింది.  చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన ఇనాక్ రామయ్య, విశ్రాంతమ్మ దంపతులకు 1939, జూలై 1న జన్మించారు. ఇనాక్ ఇప్పటివరకు 72 గ్రంథాలు రచించారు. వాటిలో ఊరబావి, సూర్యుడు తలెత్తాడు, కట్టడి, కొలుపులు, కాకి వంటి కథాసంపుటాలు, మునివాహనుడు, దిక్కులేనివాడు, ఇడిగో క్రీస్తు తదితర నాటికలు ఉన్నాయి. ఆది ఆంధ్రుడు, త్రిద్రవ పతాకం, చెప్పులు వంటి కవితా సంపుటిలను వెలువరించారు. ‘నిబిడిత సిద్ధాంతం’ పేరిట ఆధునిక సాహిత్య విమర్శన సూత్రాన్ని ప్రతిపాదించారు.
 
 డాక్టర్ సుందరరాజన్( సైన్స్, ఇంజనీరింగ్)
 సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రంగంలో విశేష సేవలందించిన డాక్టర్ గోవిందన్ సుందరరాజన్‌కు పద్మశ్రీ లభించింది. లోహ శాస్త్రంలో వినూత్న ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించి ఉత్తమ ఫలితాలను రాజన్ సాధించారు. ముఖ్యంగా మిసైల్, ఉపగ్రహాల తయారీకి వినియోగించే లోహాలు వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా రూపొందించడంలో ఆయన ప్రయోగాలు ఉపయోగపడ్డాయి. లేజర్‌తో లోహాలను కత్తిరించే పరిజ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేశారు. 1953లో తమిళనాడులోని మధురై సమీప గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం మెటీరియల్స్ రీసెర్చి సొసైటీ ఆఫ్ ఇండియా (ఎంఆర్‌ఎస్‌ఐ) అధ్యక్షునిగా, ఇండియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ (బెంగళూరు) ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.
 
 మహ్మద్ ఆలీబేగ్ (నాటకరంగం)
 హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఆలీబేగ్(42)కు నాటకరంగంలో అందించిన సేవలకు గానూ ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. తండ్రి పేరుతో‘ఖాదర్ అలీబేగ్ థియేటర్ ఫౌండేషన్’ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 200పైగా రంగస్థల నాటకాలను ప్రదర్శించారు. సొంత దర్శకత్వంలో 10కిపైగా నాటకాలను ప్రదర్శించారు. ఆయన స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన ‘కులీ’ః దిలోంకా షాహ్ జాదా’ ప్రదర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement