పత్తాలేని టీ–ప్రైమ్‌..! | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 25 2017 3:15 AM

Where is the T-prime

సాక్షి, హైదరాబాద్‌: ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఇతర మైనారిటీ సామాజిక వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కరువైంది. ఉత్పాదక రంగంలో అట్టడుగున కార్మికులుగా గణనీయ సంఖ్యలో ఉన్న ఈ సామాజిక వర్గాల ప్రజలు ఈ స్థాయిని అధిగమించి పారిశ్రామికవేత్తలుగా ఎదగలేకపోతున్నారు. మైనారిటీ వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీ, ప్రోత్సాహకాలు అందించేందుకు ఎలాంటి పథకం లేకపోవడంతో ఈ వర్గాల నుంచి పారిశ్రామికవేత్తలు తయారు కావట్లేదు. దళిత, గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీ, ప్రోత్సాహకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2014 నవంబర్‌ 2న ‘తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రాం ఫర్‌ రాపిడ్‌ ఇంక్యూబేషన్‌ ఆఫ్‌ దళిత్‌ ఎంట్రప్రెన్యూర్స్‌(టీ–ప్రైడ్‌)’అనే కార్యక్రమాన్ని ప్రకటించింది. మైనారిటీ సామాజిక వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇదే తరహా ప్రోత్సాహం అందించేందుకు త్వరలో‘తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రాం ఫర్‌ రాపిడ్‌ ఇంక్యూబేషన్‌ ఆఫ్‌ మైనారిటీస్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ (టీ–ప్రైమ్‌) అనే కొత్త పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ దాదాపు 9 నెలల కింద అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పథకం ద్వారా మైనారిటీ వర్గాల పారిశ్రామికవేత్తలకు దళిత, గిరిజనులతో సమానంగా రాయితీ, ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. టీ–ప్రైమ్‌ విధాన రూపకల్పన బాధ్యతలను మైనారిటీల సంక్షేమశాఖకు అప్పగించింది. ఇప్పటికీ ముసాయిదా విధానాన్ని ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపలేదు. పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కాదు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా టీ–ప్రైమ్‌ అమల్లోకి వచ్చే సూచనలు కన్పించట్లేదని పరిశ్రమల శాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  

ప్రోత్సాహం లేక నిరుత్సాహం.. 
ప్రస్తుతం అమల్లో ఉన్న సాధారణ రాయితీ విధానం కింద మైనారిటీ వర్గాల పారిశ్రామికవేత్తలకు రూ.20 లక్షలకు మిం చకుండా గరిష్టంగా 15 శాతం వరకు మాత్రమే పెట్టుబడి రాయితీ లభిస్తోంది. టీ–ప్రైమ్‌ అమల్లోకి వస్తే మైనారిటీ వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు రూ.75 లక్షల వరకు గరిష్టంగా 35 శాతం పెట్టుబడి రాయితీని ప్రభుత్వం అందించనుంది. ఐదేళ్ల వరకు విద్యుత్‌ బిల్లులు, స్టేట్‌ జీఎస్టీ వాటాతో పాటు పలు రకాల పన్నులను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ పరిశ్రమల యజమానులకు చెల్లిస్తుంది. టీ–ప్రైమ్‌ను అమల్లోకి తెస్తే ఇలాంటి ఎన్నో ప్రత్యేక ప్రోత్సాహకాలు మైనారిటీ వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందనున్నాయి. అయితే, టీ–ప్రైమ్‌ విధాన రూపకల్పనలో జరుగుతున్న జాప్యంతో మైనారిటీ వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు. 

పరిశ్రమల శాఖ అభిప్రాయాన్ని కోరాం 
టీ–ప్రైమ్‌ ముసాయిదా రూపొందించి పరిశ్రమల శాఖ అభిప్రాయాన్ని కోరాం. అక్కడి నుంచి సలహాలు, సూచనలు అందాక ముసాయిదాకు తుది రూపునిచ్చి ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తాం. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే అమల్లోకి తీసుకొస్తాం. 
    –ఉమర్‌ జలీల్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి

Advertisement
Advertisement