ఈసారి బడ్జెట్ 1,10,500 కోట్లు | Telangana government presents over Rs 1,10,500 crore | Sakshi
Sakshi News home page

ఈసారి బడ్జెట్ 1,10,500 కోట్లు

Mar 11 2015 1:16 AM | Updated on Aug 10 2018 8:13 PM

ఈసారి బడ్జెట్ 1,10,500 కోట్లు - Sakshi

ఈసారి బడ్జెట్ 1,10,500 కోట్లు

రాష్ట్ర తొలి పూర్తిస్థాయి బడ్జెట్ నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.

* నేడు అసెంబ్లీలో 2015-16 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి ఈటెల రాజేందర్
* ప్రణాళిక వ్యయం రూ. 52,200 కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ. 58,300 కోట్లు
* కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్లు కలిపి రూ. 18,000 కోట్లు వస్తాయని అంచనా
* రెండోసారీ భారీ బడ్జెట్టే.. మిగులు ఖాయం
* మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం
* బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తొలి పూర్తిస్థాయి బడ్జెట్ నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. తొలి ఏడాది పది నెలలకు బడ్జెట్ తయారు చేసిన టీఆర్‌ఎస్ సర్కారు... ఈసారి పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను రూపొందించింది. ఐదు నెలల వ్యవధిలోనే రెండోసారి రెండో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడం గమనార్హం. బుధవారం ఉదయం పది గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ప్రవేశపెడతారు. మంగళవారంనాటి అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం సచివాలయంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం 2015-16 బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపారు.
 
 భారీ అంచనాలు..
 తొలి ఏడాది తరహాలోనే.. 2015-16 బడ్జెట్‌పైనా భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సారి రూ. 1,10,500 కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. అందులో ప్రణాళికా వ్యయం కింద రూ. 52,200 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 58,300 కోట్లను పొందుపరిచినట్లు సమాచారం. ద్రవ్యలోటు ఉన్నప్పటికీ గత బడ్జెట్ తరహాలోనే మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. 14వ ఆర్థిక సంఘం దేశంలో రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తావించింది. అదే అంశాన్ని ్రపతిబింబించేలా సర్కారు కొత్త బడ్జెట్ తయారు చేసింది.
 
 అంచనాల్లో మార్పులు..
 నిరుటి బడ్జెట్‌లో భూముల అమ్మకం, క్రమబద్ధీకరణ ద్వారా రూ. 6,500 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. కానీ దానిద్వారా కేవలం రూ. 120 కోట్ల ఆదాయం రావడం బెడిసికొట్టింది. వచ్చే ఏడాది క్రమబద్ధీకరణ ద్వారా కేవలం రూ. 2,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వ వాణిజ్య సంస్థల నుంచి వచ్చే వడ్డీలు, గనులు, పరీక్ష రుసుములు, పాఠ్య పుస్తకాల విక్రయాలు, నీటి సరఫరా నుంచి వచ్చే మొత్తాలు, యూజర్ చార్జీలతో పాటు భూముల అమ్మకం పన్నేతర రాబడుల్లోనే (నాన్ ట్యాక్స్ రెవెన్యూ) ఉంటాయి. గత ఏడాది రూ. 13 వేల కోట్లకుపైగా ఉన్న పన్నేతర రాబడి అంచనా ఈసారి కొంతమేరకు తగ్గుముఖం పట్టనుంది. రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మంది పింఛన్‌దారులు ఉన్నారు.
 
  పెరిగిన వేతన సవరణ ప్రకారం పింఛన్ల వ్యయం కూడా భారీగా ఉండబోతోంది. 2015-16లో తెలంగాణలో పన్నులు, పన్నేతర ఆదాయం ద్వారా రూ. 57,426 కోట్ల రెవెన్యూ ఆదాయం వస్తుందని, రెవెన్యూ ఖర్చు రూ. 56,607 కోట్లు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం ఇటీవలి నివేదికలో వెల్లడించింది. ఈ లెక్కన రూ. 818 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని లెక్కలేసింది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాతో ఈ మిగులు రూ. 15 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. తాజా బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అదే తీరుగా మిగులును చూపించే అవకాశముంది. కానీ ఆదాయ వ్యయాల్లో ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు అప్పులు, ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పెంపు, రాష్ట్రంలో పన్నుల పెంపు, సమర్థంగా పన్నులు వసూలు చేయక తప్పని పరిస్థితి ఉండటంతో... కొత్త బడ్జెట్ ఆసక్తి రేపుతోంది.
 
 సంక్షేమమే ధ్యేయం..

 బంగారు తెలంగాణ సాధన ధ్యేయంగా ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా రాష్ట్ర సర్కారు ఈ సారి కూడా సంక్షేమానికే పెద్దపీట వేయనుంది. దానితో పాటు పల్లెల ప్రగతి, వ్యవసాయం, నిరుద్యోగులకు ఉపాధి కల్పన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. గత ఏడాది టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 1,00,637 కోట్లతో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అందులో రూ. 301.02 కోట్ల రెవెన్యూ మిగులును చూపించింది. అయితే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు ఢోకా లేకున్నా కేంద్రం నుంచి ఆశించినన్ని నిధులు రాకపోవటంతో అంచనాలు తప్పాయి.
 
 కేంద్రం నుంచి పన్నుల వాటాతో పాటు గ్రాంట్ల ద్వారా దాదాపు రూ. 30 వేల కోట్లు వస్తాయని భావించగా... కేంద్రం నుంచి వచ్చిన నిధులు రూ. 9,000 కోట్లు దాటలేదు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి వెసులుబాటుకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవటంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల అప్పులు తెచ్చింది. గతంలో ఉన్న అప్పుతో కలిసి ఇది రూ. లక్ష కోట్లకు చేరింది. ఈ వాస్తవాన్ని గుర్తించిన సర్కారు ఈసారి బడ్జెట్‌ను ఆచరణాత్మకంగా రూపొందించింది. రాష్ట్రంలో సొంత పన్నులు, పన్నేతర రాబడి దాదాపు రూ. 60 వేల కోట్లు దాటుతుందని... వీటికి తోడు కేంద్రం నుంచి పెరిగిన పన్నుల వాటా, గ్రాంట్లు కలిపి రూ. 18 వేల కోట్లు వస్తాయనే అంచనాలున్నాయి. దీంతోపాటు మరో రూ. 15 వేల కోట్లు అప్పుగా తెచ్చుకునే అవకాశముంది. మరోవైపు అప్పులపై వడ్డీలకు, బాండ్ల అమ్మకం ద్వారా తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లించేందుకు దాదాపు రూ. 7 వేల కోట్లకుపైగా కేటాయించబోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement