తల్లిదండ్రి.. కడపు మాడిస్తే కటకటాలే..

protection laws for elderly - Sakshi

వృద్ధులకు అండగా రక్షణ చట్టాలు

అమ్మానాన్నను వీధిపాలుజేస్తున్న తనయులు

 ఆదరించాలని పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు

చిట్యాల (నకిరేకల్‌) : ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో సంతానానికి తల్లిదండ్రులు భారమవుతున్నారు. తమను పెంచి పెద్ద చేసి.. ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను వీధిన పడేసి.. తమ స్వార్థం చూసుకుంటున్నారు. వారు సంపాదించిన ఆస్తి పాస్తులను అనుభవిస్తూ.. నిర్ధాక్షిణ్యంగా ఇంటి బయటికి గెంటేస్తున్నారు. కొందరు వృద్ధాశ్రమాల్లో చేర్పించి.. చేతులు దులుపుకుంటున్నారు. ఒకవేళ ఇద్దరు కొడుకులు ఉంటే.. వంతువారీగా చూసుకోవడమో.. లేదా వారిద్దరినే.. ఒంటæరిగా వదిలేయడమో చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వృద్ధులు బతుకుదెరువు కోసం.. యాచకులుగా మారుతున్నారు. ఇటీవల సూర్యాపేట, చందంపేట, మునుగోడు ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇలాంటి కొడుకుల పని పట్టేందుకు వృద్ధులకు చట్టాలు అండగా ఉన్నాయి.

కుమారులు తల్లిదండ్రులను పోషించాల్సిందే.. లేకపోతే కటకటాల పాలవడం ఖాయం. మమ్ములను అదరించడం లేదని ఎవరైనా వృద్ధులు అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తే.. వారికి న్యాయం చేసేందుకు డివిజన్‌స్థాయిలో ట్రిబ్యునల్స్‌ సిద్ధంగా ఉన్నాయి. డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓలకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫ్రిసైడింగ్‌ అధికారిగా ఆర్డీఓ ఉంటారు. ఆయన సమక్షంలో విచారణ జరుగుతుంది. సంబంధిత తహసీల్దార్‌ను క్షేత్రస్థాయిలో విచారణకు ఆర్డీఓ ఆదేశిస్తారు. ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేస్తారు. ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులకు న్యాయం జరిగి.. సమస్య పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో బాధితులే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళ సంఘాలు ఆర్డీఓకు ఫిర్యాదు చేయవచ్చు. సమస్య డివిజన్‌ స్థాయిలో పరిష్కారం కాకుంటే జిల్లాస్థాయిలో 
కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

అధికారుల చొరవతో.. ఆదరణ
ఈ నెల 3వ తేదీన మునుగోడులో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు నారగోని ముత్యాలు, మంగమ్మను కుమారులు నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపారు. ఆస్థిని పంచుకున్న కుమారులు వారి పట్టించుకోకుండా వదిలేశారు. ఈ ఘటన పత్రికల్లో రావడంతో.. అధికారులు వారి కుమారులను పిలిపించి తగిన ఆదరణ దక్కేలా చర్యలు తీసుకున్నారు. 

భారమైన వృద్ధ తండ్రి..
సూర్యాపేట క్రైం : వృద్ధాప్యంలో తండ్రికి కడుపునిండా బువ్వ పెట్టి కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమారులే చూసుకోకపోవడంతో.. ఆ వృద్ధుడు యాచకుడిలా మారాడు. సూర్యాపేటలోని 27వ వార్డు మామిళ్లగడ్డకు చెందిన కంబాలపల్లి లింగయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన వయసు ప్రస్తుతం 80 ఏళ్లకు పైబడిపోయింది. కుమారులు సాకలేమని చేతులెత్తేశారు. దీంతో దిక్కుతోచని లింగయ్య అదే ప్రాంతంలో లింగయ్య యాచకుడిగా మారాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో లింగయ్య ఇటీవల సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సరిగ్గా ఆరు నెలల క్రితం కుమారులు సరిగా చూసుకోకపోవడంతోనే అనారోగ్యంతో తన భార్య చనిపోయిందని లింగయ్య కన్నీరుమున్నీరయ్యాడు. తనకు కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుందని తనకు ఎలాగైనా న్యాయం చేయాలని ఆ వృద్ధుడు వేడుకుంటున్నాడు. 

కన్న పేగు కాదంది.. అధికారులు పొమ్మండ్రు
చందంపేట (దేవరకొండ) : వద్ధాప్యంలో ఆసరాగా ఉంటారన్న కొడుకులు చీదరించారు. కనీసం ఇంట్లో ఉండేందుకు కూడా వీల్లేదని తేల్చారు.. ఓ వైపు భార్య అనారోగ్యంతో బాధపడుతుడడంతో.. ఆ తండ్రి కలెక్టర్‌ వద్దకు వెళ్లినా అక్కడా చేదు అనుభవమే ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే.. చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామానికి చెందిన తంగెళ్ల మల్లారెడ్డి వయస్సు 75 సంవత్సరాలు. ఈయన ఇద్దరు కొడుకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండడంతో వృద్ధుడైన మల్లారెడ్డికి పింఛన్‌ అందజేయడం లేదు. తనను కొడుకులు సాకడం లేదని మల్లారెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదును చేశాడు. తమను సాకనప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ఏంటి.. చేయకుంటే ఏంటని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నాడు. అధికారులు స్పందించి ఆ వద్ధునికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. 

శిక్షలు ఇలా..
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కుమారులు ఉద్ధేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తే వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007 ప్రకారం శిక్షలు ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం ఈ ఆరోపణ నిర్ధారణ అయితే రూ.ఐదు వేల జరిమానాగానీ మూడు నెలల జైలు శిక్షగానీ విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి బక్కోసారి రెండు శిక్షలూ అమలయ్యే అవకాశం ఉంది. జైలు శిక్ష పొడిగించే అవకాశం ఉంది. సంపాదన లేనివారు, సంతానం లేని వృద్ధులు సైతం తమ ఆస్తులు అనుభవిస్తున్న వారి నుంచి పోషణ ఖర్చులు పొందే హక్కును చట్టంలో పొందుపర్చారు. కుమారులు ఉద్యోగస్తులైతే వారి వేతనంలో కోత విధించి తల్లిదండ్రులకు అందించే విధంగా ఏర్పాటు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఉద్యోగస్తులకు సైతం తగిన శిక్షలు ఉన్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top