ఉద్యోగీ.. నువ్వే భరించు..!

Medical department negligence on employee Health Services Scheme - Sakshi

ఉద్యోగుల ఆరోగ్య సేవల పథకంపై వైద్య శాఖ నిర్లక్ష్యం 

అత్యవసర మందులు లేని వెల్‌నెస్‌ సెంటర్లు 

అన్ని మందులు ఇవ్వలేమని నోటీసు బోర్డు 

ఇబ్బంది పడుతున్న 11 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు 

పర్యవేక్షణ మరిచిన ఈహెచ్‌ఎస్‌ విభాగం అధికారులు 

షుగర్‌ లెవెల్స్‌ పెరగకుండా ఉండేందుకు వైద్యులు జైడోజింగ్‌ ఇంజక్షన్‌ రాశారు. నెలకు నాలుగు అవసరం. వెల్‌నెస్‌ సెంటర్లలో ఇవ్వడంలేదు. ఒక్కో ఇంజక్షన్‌కు రూ.1,300 పెట్టి బయటి షాప్‌లో కొంటున్నాను. ఇక ఈహెచ్‌ఎస్‌తో ఉపయోగం ఏముంది.   
 – వై.మురళీధర్, రిటైర్డ్‌ ఉద్యోగి 

డాక్టర్లు రాసే మందులివ్వడంలేదు. నాకు 500 ఎంజీ డోసు ట్యాబ్లెట్లు రాశారు. మందులు 1,000 ఎంజీ డోసువి ఇచ్చారు. ఎక్కువ డోసు ఎలా వాడతామని అడిగితే.. ఏమీ చేయలేమని అంటున్నారు.
    – ఆర్‌.వెంకటనారాయణ, ప్రభుత్వ ఉద్యోగి 
– సాక్షి, హైదరాబాద్‌

..వీరిద్దరే కాదు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్ల దుస్థితి ఇదీ. ఉద్యోగుల ఆరోగ్య సేవల పథకాని(ఈహెచ్‌ఎస్‌)కి నిర్లక్ష్య పు జబ్బు పట్టడంతో కనీస వైద్య సేవలూ ఉద్యోగులకు అందే పరిస్థితి ఉండటం లేదు. వైద్య సేవల కోసం వెల్‌నెస్‌ సెంటర్లకు వెళ్లిన వారికి మందులు ఇవ్వడం ఆపేస్తున్నారు. ‘కొన్ని మందులు అందుబాటులో లేవు. అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని ఖైరతాబాద్‌లోని వెల్‌నెస్‌ మందుల కౌంటర్లలో నోటీసు పెట్టా రు. ఇదేమిటని రోగులు అడిగితే.. తామేమీ చేయలేమని సిబ్బంది సమాధానమిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవట్లేదు. దీంతో ఉద్యోగులు బయట మార్కెట్‌లో ఖరీదైన మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆరోగ్య సేవల పథకాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి. 

పర్యవేక్షణ లేక.. 
ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టుకు ప్రత్యేకంగా సీఈవో ఉన్నారు. ఈహెచ్‌ఎస్‌/జేహెచ్‌ఎస్‌కు మరో సీఈవో ఉన్నారు. వీరిద్దరి విధుల విష యంలో ప్రభుత్వపరంగా స్పష్టత లేకపోవడం తో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో కె.మనోహర్‌కు ఈహెచ్‌ఎస్‌ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి ఈహెచ్‌ఎస్‌ నిర్వహణ మరింత అధ్వానంగా మారింది. పర్యవేక్షణ లేకపోవడంతో వైద్య సేవలు అందడంలేదు. మందుల సరఫరా అరకొరగా జరుగుతోంది. దీంతో వెల్‌నెస్‌ సెంటర్లకు వచ్చే ఉద్యోగుల సంఖ్య బాగా తగ్గింది. జనవరి వరకు నగరంలోని వెల్‌నెస్‌ సెంటర్లకు సగటు న ప్రతి రోజు వెయ్యి మంది ఉద్యోగులు వచ్చేవారు. ఇప్పుడు ఈ సంఖ్య 300కు తగ్గింది. వైద్య సేవలు, మందులు అందుబాటులో లేక పోవడం వల్లే ఈ స్థితి వచ్చిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈహెచ్‌ఎస్‌ను క్రమంగా నిర్వీ ర్యం చేసి పూర్తిగా తొలగించే యత్నాల్లో భాగం గా వైద్యారోగ్య శాఖ వెల్‌నెస్‌ సెంటర్లను పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. 

అంతా అయోమయం.. 
ఉద్యోగులు, జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈహెచ్‌ఎస్‌/జేహెచ్‌ఎస్‌ను ప్రారంభించింది. ఈహెచ్‌సీలో 8,32,085 మంది ఉద్యోగులు, 3,06,125 మంది పెన్షన్‌దారులు, 32,210 మంది జర్నలిస్టులు నమోదయ్యారు. 2016 డిసెంబర్‌ 17న ఈహెచ్‌ఎస్‌ సేవలు మొదలయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లో వెల్‌నెస్‌ సెంటర్‌ను ప్రారంభించింది. అదే నెల 19 నుంచి ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందం అమలులోకి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని వనస్థలిపురం, వరంగల్, సంగారెడ్డిలో వెల్‌నెస్‌ సెంటర్లను ప్రారంభించింది. ఓపీ సేవలను, పరీక్షలను, మందులను ఉచితంగా అందిస్తోంది. వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా అవసరమైన వారికి చికిత్స కోసం ఎంపిక చేసిన ఆస్పత్రులకు సిఫారసు చేస్తున్నారు. ఈహెచ్‌ఎస్‌ సేవల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 ఆస్పత్రులు ఉన్నాయి. అయితే కీలకమైన ఈహెచ్‌ఎస్‌ నిర్వహణ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top