ఐసీజేఎస్‌తో న్యాయవిచారణ వేగిరం  

Judicial Inquiry Speedup With ICJS - Sakshi

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ 

ఐసీజేఎస్‌ను డీజీపీ కార్యాలయంలో ప్రారంభించిన చీఫ్‌ జస్టిస్‌ 

కేసులు, చార్జిషీట్ల వివరాలు ఆన్‌లైన్‌లో నేరుగా కోర్టులకే.. 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఆపరేబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌ (ఐసీజేఎస్‌)తో న్యాయవిచారణ మరింత వేగవంతమవుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ అన్నారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఐసీజేఎస్‌ సర్వీసును ఆయన సోమవారం డీజీపీ కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పోలీసులు, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్, ప్రాసిక్యూషన్ల మధ్య సమాచారం ఆన్‌లైన్‌లో వేగంగా బదిలీ అవడం వల్ల నేరదర్యాప్తు, విచారణ, తీర్పులు మరింత వేగవంతమవుతాయని అన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఐసీజేఎస్‌ను అమలు చేయడం చారిత్రకఘట్టమని అభివర్ణించారు. ఐసీజేఎస్‌ సేవలు రాష్ట్రమంతా విస్తరించాలన్నారు. పోలీస్‌స్టేషన్లు, కోర్టుల మధ్య డేటా బదిలీకి సహకరించిన తెలంగాణ పోలీసులను, ఈ–కోర్టు బృందాలను అభినందించారు. 

సత్వర న్యాయం: డీజీపీ 
డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కోర్టులు, దర్యాప్తు సంస్థల మధ్య డేటా బదిలీ వల్ల న్యాయ విచారణ త్వరగా పూర్తవుతుందని, సామాన్యుడికి సత్వర న్యాయం చేకూరుతుందన్నారు. దర్యాప్తు అధికారుల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు ఈ–కమిటీ సభ్యుడు గోస్వామి, అడిషనల్‌ డీజీ (టెక్నికల్‌ సర్వీసెస్‌) రవిగుప్తా, కరీంనగర్‌ డిస్ట్రిక్స్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి అనుపమాచక్రవర్తి, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యుషన్‌ వైజయంతి పాల్గొన్నారు. 

కరీంనగర్‌ నుంచి డెమో.. 
రాష్ట్ర పోలీసు శాఖ వరంగల్‌లో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టింది. 2018 డిసెంబర్‌ 15న జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఐసీజేఎస్‌ సేవలను ప్రారంభించారు. ఇది విజయవంతమయ్యాక కరీంనగర్‌ను ఎంచుకున్నారు. సోమవారం కరీంనగర్‌ త్రీటౌన్‌ నుంచి కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, హుజూరాబాద్‌ జేఎఫ్‌సీఎం రాధిక డెమోను వివరించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్లు కోర్టుల మధ్య ఎఫ్‌.ఐ.ఆర్, చార్జిషీటు ఇతర కేసుల వివరాలను రియల్‌టైమ్‌ ఎక్స్‌చేంజ్‌ డేటా ఎలా ట్రాన్స్‌ఫర్‌ ద్వారా పంపవచ్చో వివరించారు. అదే సమయంలో కోర్టు రిఫరెన్స్‌ నంబర్‌తోపాటు రసీదును కూడా కేటాయించడం గమనార్హం. 

ఈ విధానం వల్ల..
- ఈ విధానంలో 15,000 ఠాణాలు, 5,000 మంది సూపర్‌వైజరీ పోలీస్‌ అధికారులు, అనేక ప్రాసిక్యూషన్, లీగల్‌ ఏజెన్సీలు అనుసంధానమవుతాయి. 
అధికారుల పారదర్శకత, జవాబుదా రీతనం పెంచుతుంది. 
ఐదు వ్యవస్థల నడుమ రియల్‌టైమ్‌ విధానంలో డేటాబదిలీ జరుగుతుంది. 
అధికారులు మరింత మెరుగ్గా కేసుల పర్యవేక్షణ చేయగలుగుతారు. 
దీని ద్వారా పోలీసు– పౌరుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. 

తెలంగాణనే ఎందుకు? 
కేసుల దర్యాప్తులో సాంకేతికపరంగా తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారు.  ప్రతికేసు దర్యాప్తు సీసీటీఎన్‌ఎస్‌తో అనుసంధానించి ఉంది. పోలీసుశాఖ ఇప్పటికే ఎఫ్‌ఎస్‌ఎల్, కోర్టులు, ఫింగర్‌ప్రింట్‌ బ్యూరో దర్యాప్తు, జువనైల్‌ జస్టిస్‌ విభాగాల ను సమీకృతం చేసింది. అందుకే కేంద్ర హోంశాఖ ఐసీజేఎస్‌ అమలు కోసం తెలంగాణను ఎంపిక చేసింది. తొలుత వరంగల్‌లోని 45 పోలీస్‌ స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేసి విజయవంతమయ్యారు. సోమవారం నుంచి కరీంనగర్‌ 3వ టౌన్‌లో ఐసీజేఎస్‌ సేవలను ప్రారంభించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top