రాజధాని చుట్టూ పరిశ్రమల హారం | Industry denominator to arrange all over new capital | Sakshi
Sakshi News home page

రాజధాని చుట్టూ పరిశ్రమల హారం

May 27 2015 1:17 AM | Updated on Sep 3 2017 2:44 AM

రాజధాని చుట్టూ పరిశ్రమల హారం

రాజధాని చుట్టూ పరిశ్రమల హారం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సరిహద్దుగా ఉన్న నాలుగు జిల్లాల్లో 28 కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కొత్తగా 28 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సర్కారు కసరత్తు  
నాలుగు జిల్లాల్లో 47,976 ఎకరాల సేకరణ

 
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సరిహద్దుగా ఉన్న నాలుగు జిల్లాల్లో 28 కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో 47,976 ఎకరాల్లో కొత్త పార్కుల ఏర్పాటు చేయనుంది. ఈ పార్కుల్లో మౌలిక సౌకర్యాల ఏర్పాటు బాధ్యతను ప్రభుత్వమే తీసుకోనుంది. ఇప్పటికే భూమిని గుర్తించిన చోట మౌలిక సౌకర్యాల కల్పనకు రూ. 200 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 148 పారిశ్రామిక పార్కులు ఉండగా కొత్తగా ఏర్పాటయ్యే పార్కుల్లో అత్యధికం రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోనే ఉండనున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా గట్టులో సుమారు 5 వేల ఎకరాల్లో ప్రతిపాదించిన సోలార్ పార్కును కొత్త పారిశ్రామిక పార్కుల జాబితాలో చేర్చారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో 12,613 ఎకరాల్లో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటును గతంలోనే ప్రతిపాదించారు. భూ సర్వే కొలిక్కిరావడంతో భూసేకరణ కోసం ఇటీవల రూ.1.25 కోట్లను పరిశ్రమల శాఖ టీఎస్‌ఐఐసీ ఖాతాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.    
 - సాక్షి, హైదరాబాద్
 
 ఏడాదిలోపు కసరత్తు కొలిక్కి
 నూతన పారిశ్రామిక విధానం అమలుకు ప్రభుత్వం జూన్ 7న ముహూర్తం నిర్ణయించిన నేపథ్యంలో కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటును వేగవంతం చేయాలని టీఎస్‌ఐఐసీ నిర్ణయించింది. నూతన విధానం నియమావళి ప్రకారం కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి టీఎస్‌ఐఐసీ ద్వారానే భూ బదలాయింపు జరుగుతుంది. పారిశ్రామిక పార్కుల అభివృద్ధి కోసం టీఎస్‌ఐఐసీకి ప్రభుత్వం ఇప్పటికే 1.60 లక్షల ఎకరాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో వివిధ దశల్లో ఉన్న పార్కుల ఏర్పాటు ప్రక్రియను ఏడాదిలోగా కొలిక్కి తెస్తామని టీఎస్‌ఐఐసీ అధికారులు వెల్లడించారు. గతంలో ఏర్పాటైన పారిశ్రామిక పార్కుల్లో కేటాయింపులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేయనివారిపైనా దృష్టి సారించారు. నిర్దేశిత గడువులోగా పరిశ్రమలు ప్రారంభించని వారికి నోటీసులు జారీ చేసి అనుమతులు రద్దు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement