మున్సిపాలిటీ నామినేషన్ల స్వీకరణ సోమవారం ప్రారంభమైంది. మొదటి రోజు నవమి కావడం, దాఖలుకు గడువు ఉండటం, పలు పార్టీల్లో అభ్యర్థులు కొలిక్కి రాకపోవడంతో నామినేషన్ల పర్వం మందకొడిగా సాగింది. మొదటి రోజు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి.
మొదలైన బల్దియా నామినేషన్ల స్వీకరణ
నామినేషన్లు ఇలా..
సాక్షి, మంచిర్యాల :
మున్సిపాలిటీ నామినేషన్ల స్వీకరణ సోమవారం ప్రారంభమైంది. మొదటి రోజు నవమి కావడం, దాఖలుకు గడువు ఉండటం, పలు పార్టీల్లో అభ్యర్థులు కొలిక్కి రాకపోవడంతో నామినేషన్ల పర్వం మందకొడిగా సాగింది. మొదటి రోజు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతుండగా నాలుగు మున్సిపాలిటీల్లో ఒక్క నామినేషన్ కూడా రాలేదు. నిర్మల్‌లో నాలుగు, ఆదిలాబాద్‌లో ఒక్క నామినేషన్ మాత్రమే వచ్చాయి. ఆరు మున్సిపాలిటీల్లో 435 దరఖాస్తులు అమ్ముడు పోయాయి. జిల్లాకేంద్రమైన ఆదిలాబాద్‌లో 210 దరఖాస్తులు అమ్ముడుపోయినా ఒక్కటే నామినేషన్ దాఖలైంది. కొన్నిచోట్ల ఆయా నాయకుల మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఏ వర్గానికి ఎన్ని బీ-ఫారాలు ఇవ్వాలనేది తేలలేదు. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌లోని ముగ్గురు ముఖ్య నాయకుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అభ్యర్థులు ఖరారు కాలేదు. కాగా మొదటిరోజు నామినేషన్ల దాఖలును సంబంధిత ఆర్డీవో, కమిషనర్, సీఐలు పర్యవేక్షించారు.
ఆంక్షల కొరడా..
బరిలో దిగే అభ్యర్థి నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితోపాటు ఆయనను బలపరిచే ఇద్దరు వ్యక్తులు మాత్రమే కార్యాలయంలోకి రావాలనే కొ త్త నిబంధనను ఈసారి విధించారు. దీంతోపాటు నామినేషన్ దాఖలుకు ర్యాలీగా రావడంపై ఆంక్షలు విధించారు. ర్యాలీగా వచ్చే సమయంలో ఒక్కో మనిషికి రూ.200 చొప్పున ఎన్నికల ఖర్చుగా చూపిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల వ్యయాన్ని లెక్కించే అధికారులు రహస్యంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని అధికారులు తెలిపారు. దీం తో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి తమ బలాన్ని చాటుకుందామని భావించిన నాయకుల ఆశలు అడియాసలు అయ్యాయి. నే టి నుంచి ప్రారంభమైన నామినేషన్ల దాఖలు పర్వం ఈనెల 14వరకు కొనసాగనుంది.
శుభ ముహూర్తం కోసం ఎదరుచూపు
12వ తేదీ బుధవారం ఏకాదశి, పుష్యమి నక్షత్రం కావడంతో శుభవారం, శుభ తిథి ఉండి అన్ని విధాలుగా బాగా ఉండటంతో ఆ రోజు నామినేషన్‌లు భారీ సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉంది. 13వ తేదీ గురువారం ఘాతవారం అనే సెంటిమెంట్‌తోపాటు నక్షత్రం కూడా కలిసిరాక పోవడంతో ఆ రోజు నామినేషన్లు తక్కువ సంఖ్యలో నమోదు కావచ్చు. ఇక చివరి రోజు 14వ తేదీ శుక్రవారం త్రయోదశి, మాగ నక్షత్రం కావడంతో అన్ని విధాలుగా బ్రహ్మండమైన రోజు ఉన్నందున ఆ రోజు పెద్ద సంఖ్యలోనే నామినేషన్ దరఖాస్తులు నమోదు అయ్యే అవకాశం ఉంది.