అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంచాలి 

 Electoral expenditure observer Ordered To Keep Surveillance On Spendings Of The Loksabha Candidates - Sakshi

లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిశీలకుడు విజయ్‌అగర్వాల్‌ 

సాక్షి, భూపాలపల్లి: ఏప్రిల్‌ 11వ తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి పైసాను లెక్కించి, వారి ఖర్చుల్లో జమ చేయాలని వరంగల్‌ లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిశీలకులు విజయ్‌అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వరంగల్‌ లోక్‌సభ పరిధిలో నిభూపాలపల్లి, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల పరిధిలో వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నుంచి నియమించబడిన విజయ్‌అగర్వాల్‌ శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించి ఎన్నికల ప్రచార ఖర్చులను లెక్కించడానికి సంబంధిత అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

జిల్లా రెవెన్యూ అధికారి, లోక్‌సభ ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికారి వెంకటాచారి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా విజయ్‌అగర్వాల్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రతీ అభ్యర్థి రూ. 70 లక్షలు వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు లోబడి ముందస్తూ అనుమతితోనే ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే అభ్యర్థులు చేసే ఖర్చులను పరిశీలించి లెక్కించడానికి ఏర్పాటు చేసిన బృందాన్ని సమర్థవంతంగా పనిచేసి ప్రతీ పైసాను లెక్కించి అభ్యర్థి ఖర్చులో జమ చేయాలన్నారు.

అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో భద్రపరిచిన ఈవీఎం, వీవీప్యాట్‌ల అవగాహన, మోడల్‌ పోలింగ్‌ కేంద్రంను పరిశీలించి ఈవీఎంల పనితీరును చెక్‌ చేశారు. డీపీఆర్వో చాంబర్‌లోని ఎంసీఎంసీ కేం ద్రంను తనిఖీ చేసి పత్రికలు, కేబుల్‌ నెట్‌వర్క్‌లో  ప్రచురితం, ప్రసారమయ్యే ప్రతి అడ్వర్‌టైజ్‌మెంట్‌ను లెక్కించాలన్నారు. అలాగే పెయిడ్‌ న్యూస్‌లను జాగ్రత్తగా గుర్తించి వాటి విలువను లెక్కించి అభ్యర్థుల ఖర్చుల్లో జమ చేయాలని ఆదేశించారు.  భూపాలపల్లి డీఎస్పీ కిరణ్‌కుమార్, జిల్లా పౌరసంబంధాల అధికారి బి రవికుమార్, స్పెషల్‌బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ వేణు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top