బెట్టింగ్‌..రంగా

Districtwide Betting Has Been Going On Over The Current Election Results. - Sakshi

ఎన్నికల ఫలితాలపై పందెం

అభ్యర్థుల గెలుపోటములపై పందెంరాయుళ్ల చాలెంజ్‌లు 

జిల్లా బరిలో కీలక అభ్యర్థులు.. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటలో హరీశ్‌రావుకు లక్ష మెజార్టీపైనా పందేలు

రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందనే దానిపైనా బెట్టింగ్‌

ప్రస్తుత ఎన్నికల ఫలితాలపై జిల్లావ్యాప్తంగా బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం గెలుపు ఎవరిదనే మాటే అందరి నోటా వినిపిస్తోంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకాలు స్ట్రాంగ్‌ రూముల్లో భద్రంగా ఉన్నాయి. ఫలితాల కోసం మరో 24గంటలు ఎదురు చూడాల్సిందే. జిల్లాలో మాత్రం ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఎవరికి వారు గెలుపోటములపై తమ తమ అంచనాలతో జోరుగా విశ్లేషిస్తున్నారు. ఫలితాలపై జోరుగా పందెం కొనసాగుతోంది.  

సిద్దిపేటజోన్‌ :  ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది?  ఏ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయి? అనే అంశాలపై పందేలు కాస్తున్నారు. ముఖ్యంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పరస్పరం బెట్టింగ్‌ కాస్తున్నారు. రూ. 5 వేల నుంచి రూ. లక్ష వరకు  తమ స్థాయికి తగ్గట్టుగా బెట్టింగ్‌ కాస్తున్నట్లు సమాచారం. మరి కొందరు విహార యాత్రలు, విందులు, వినోదాలు ఇచ్చేలా పందెం కాస్తున్నారు. తాము పెట్టిన సొమ్ముకు రెట్టింపుగా రాబట్టుకునేందుకు పందెంరాయుళ్లు ఆసక్తిని కనబరుస్తున్నారు.

జిల్లాలో కీలకమైన స్థానాలు
ప్రధానంగా జిల్లాలో కీలకమైన స్థానాలు ఉండడం, అధికారంలో, పార్టీలో కీలక వ్యక్తులుగా ఉన్న వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కావడంతో బెట్టింగ్‌ రాయుళ్లు పందెం కాసేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదెవరు అనే అంశం మొదలుకొని నియోజకవర్గంలో   గెలుపు ఎవరిదనే అంశంపై బెట్టింగులు కాస్తున్నారు. వివిధ రకాల ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్‌ సర్వేలు, సోషల్‌ మీడియా పోస్టింగులను బేస్‌ చేసుకొని బెట్టింగ్‌ కాస్తున్నట్లు సమాచారం.

జాతీయ చానళ్ల ఎగ్జిట్‌ పోల్‌ సర్వేకు భిన్నంగా  లగడపాటి రాజగోపాలు సర్వే వివరాలు పేర్కొనడంపై యువతలో ఆసక్తి నెలకొంది. ఫలానా పార్టీ , ఫలానా అభ్యర్థి విజయం సాధిస్తారని, ఫలానా పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని, నియోజకవర్గాల వారిగా ఫలానా అభ్యర్థికి  వచ్చే మెజార్టీపై ఎవరికి వారు తమ అంచనాలకు అనుగుణంగా పందెంలో డబ్బులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. 

గజ్వేల్‌లో గెలుపుపై భారీగా..
జిల్లాలోని గజ్వేల్‌ నియోజకవర్గంలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ బరిలో ఉండడం, ఆయనకు పోటీగా కూటమి అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి నిలిచిన క్రమంలో ఈసారి పోటీ రసవత్తరంగా ఉందన్న సోషల్‌ మీడియా ప్రచారాన్ని చూసి యువత  పెద్ద ఎత్తున  బెట్టింగ్‌ కాస్తున్నట్లు సమాచారం. రూ. 10 వేల నుంచి రూ. 5లక్షల వరకు గజ్వేల్‌ నియోజకవర్గంలో బెట్టింగ్‌కు దిగడం విశేషం. దుబ్బాక నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములపై, మెజార్టీపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బెట్టింగ్‌ కాస్తున్నట్లు తెలిసింది.

మరోవైపు పొరుగునే ఉన్న జనగామ నియోజకవర్గ పరిధిలోని  రెండు మండలాలు చేర్యాల, కొమురవెల్లిలో బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. అక్కడ  బరిలో ఉన్న వారిలో ఒకరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, మరొకరు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు కావడం విశేషం. అదేవిధంగా హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు గెలుపోటములు, ప్రధానంగా మెజార్టీ పైనే బెట్టింగ్‌ జరుగుతుండడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా జరిగే బెట్టింగ్‌ ప్రక్రియ సహజంగా పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెలకు కూడా పాకుతోంది. ఆయా మండలాల్లోని కీలక నేతలు, కార్యకర్తలు, అభిమానులు బెట్టింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు.

సిద్దిపేట స్పెషల్‌.. లక్ష మెజార్టీపైనే పందెం 
ఉమ్మడి జిల్లాలో సిద్దిపేట ప్రస్తుతం స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. గతంలోనే  సిద్దిపేట అభ్యర్థి హరీశ్‌రావు రికార్డు స్థాయిలో రెండు సార్లు భారీ మెజార్టీని సాధించి రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించారు. ఇదే సమయంలో సాధారణ ఎన్నికలు రావడం, షెడ్యూల్‌ విడుదల నుంచి లక్ష మెజార్టీ లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రచారాన్ని  నిర్వహించాయి. పోలింగ్‌ ప్రక్రియ ముగియడం, అందరి అంచనాలకు అనుగుణంగానే పోలింగ్‌ శాతం పెరగడంతో ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో మెజార్టీపై చర్చ జోరుగా సాగుతోంది.

ఓట్లేసి 72 గంటలు దాటినా  ఇప్పటికీ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ. అది లక్ష మెజార్టీ పైనే.  ప్రధానంగా హరీ«శ్‌ గెలుపు అంశాన్ని పక్కన బెట్టి స్వంత పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీల్లోని నేతలు, కార్యకర్తలు, అభిమానులు ముఖ్యంగా యువతలో మెజార్టీ ప్రధాన అంశంగా జోరుగా బెట్టింగ్‌ సాగుతున్నట్లు సమాచారం.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top