డెంగీ హైరిస్క్‌ జిల్లాలు 14  

Dengue High Risk Districts was 14 - Sakshi

5 జిల్లాల్లో మలేరియా అత్యధికంగా నమోదు

సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించిన సర్కారు

రేపు పలు జిల్లాల కలెక్టర్లతో వైద్య ఆరోగ్య మంత్రి ఈటల సమీక్ష

డెంగీ, మలేరియా నివారణకు గిరిజన ప్రాంత అధికారులతో భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 14 డెంగీ హైరిస్క్‌ జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే మలేరియా హైరిస్క్‌ జిల్లాలను ఐదింటిని నిర్ధారించింది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, వరంగల్‌ రూరల్, కరీంనగర్, భూపాలపల్లి, రంగారెడ్డి, మహబూబాబాద్, వరంగల్‌ అర్బన్, మేడ్చల్, నిజామాబాద్‌ జిల్లాల్లో అత్యధికంగా డెంగీ హైరిస్క్‌గా ఉన్నట్లు నిర్ధారించారు. ఇక మలేరియా హైరిస్క్‌ జిల్లాల్లో జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్‌ ఉన్నాయి. ఏడాదికేడాది డెంగీ కేసులు రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్నాయి. 2012లో 962 డెంగీ కేసులు నమోదు కాగా, 2018లో ఏకంగా 6,362 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ ఏడాది మే నెల వరకు సీజన్‌ లేని సమయంలోనే 756 కేసులు నమోదయ్యాయి. అయితే మలేరియా కేసులు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయని సర్కారు నివేదిక తెలిపింది. 2015లో 11,880 మలేరియా కేసులు నమోదు కాగా, గతేడాది కేవలం 1,792 కేసులే నమోదయ్యాయి. చికున్‌గున్యా కేసులు 2012లో 94 కేసులు నమోదు కాగా, గతేడాది ఏకంగా 1,063 నమోదు కావడం గమనార్హం. 

రేపు కలెక్టర్లతో మంత్రి సమీక్ష...
వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణ కోసం ప్రభుత్వం దృష్టి సారించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలం ప్రబలే సీజనల్‌ వ్యాధులపై కేంద్రీకరించింది. ప్రధానంగా పది ఏజెన్సీ జిల్లాల్లో మలేరియా, డెంగీతో పాటు సీజనల్‌ వ్యాధులను అదుపులో ఉంచేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. శుక్రవారం సీజనల్‌ వ్యాధులు తీవ్రంగా ఉండే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచి ర్యాల, నిర్మల్, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్‌ కర్నూలు, ములుగు జిల్లా కలెక్టర్లు, ప్రాజెక్టు ఆఫీసర్లు, ఐటీడీఏ అధికారులు, జిల్లా వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ సమావేశం కానున్నారు.

వర్షాకాలం నేపథ్యంలో ముం దస్తుగా చేపట్టాల్సిన ప్రణాళికపై జిల్లా కలెక్టర్లకు మంత్రి దిశానిర్దేశం చేస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ముందుగా దోమల నివారణకు పంచాయతీరాజ్, విద్య, ఇరిగేషన్, మైనింగ్, ఐసీడీఎస్, మత్యశాఖ అధికార యంత్రాంగంతో సమన్వయ పరిచి చర్యలు తీసుకోనున్నారు. యాంటీ లార్వా ఆపరేషన్‌ చేపట్టనున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే వేక్టర్‌ బోర్న్‌ వ్యాధులైన చికెన్‌ గున్యా, యెల్లో ఫీవర్, డెంగీ, జికా, ఫైలేరియా లాంటి కేసుల వివరాలను కూడా ఈసారి సేకరించి, అవి ప్రబలకుండా అధికార యంత్రాంగంనివారణ చర్యలు తీసుకుంటారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top