బూజు దులిపారు!

City residents response to waste collection - Sakshi

వ్యర్థాల సేకరణకు నగరవాసుల స్పందన 

మైకులతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రచారం 

10 రోజుల్లో 235 మెట్రిక్‌ టన్నుల సేకరణ 

ఎక్కువ మొత్తంలో ఫర్నిచర్‌..తరువాత ఈ–వేస్ట్‌  

త్వరలోనే డెబ్రిస్‌ సేకరణకు స్పెషల్‌ డ్రైవ్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ నగరంలో పనికిరాని చెత్తనంతా నాలాల్లో పారబోయడం ఓ అలవాటు. అందుకే వానొచ్చినప్పుడల్లా రోడ్లు చెరువులవుతాయి. రోడ్లపై మోకాలి లోతు నీళ్లు చేరతాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం.. నాలా (వరద కాలువ)ల్లోనే వ్యర్థపు సామగ్రి వేస్తుండటం. ఈ పనికి రాని చెత్తలో పరుపులు, దుప్పట్ల నుంచి నిర్మాణ వ్యర్థాల దాకా అనేక రకాలున్నాయి. గ్రేటర్‌వాసులు తమకు పనికి రాదనుకున్న చెత్తనంతా నాలాల్లోనే పారబోస్తున్నారు. ఇక, ప్లాస్టిక్‌ వ్యర్థాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  

‘గ్రేటర్‌’ ఐడియా 
నగరంలో రోజు రోజుకూ పెరిగిపోతోన్న ఈ సమస్య పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ కొత్త ఆలోచన చేసింది. ప్రజలు వ్యర్థాలను ఎక్కడ వదిలించుకోవాలో తెలియక, పాత సామాన్లు కొనేవారి దాకా వెళ్లలేక, సమీపంలోనే ఉన్న నాలాల్లో వేస్తున్నారని గుర్తించింది. ప్రజల చెంతకే వెళ్లి.. ఈ వ్యర్థాలను సేకరిస్తే..?. ఈ క్రమంలోనే పది రోజుల పాటు రీసైక్లథాన్‌ పేరిట ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు నిరుపయోగ వస్తువుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రేటర్‌ పరిధిలోని 30 సర్కిళ్ల పరిధిలో వెరసి 360 ప్రాంతాల్లో వీటిని స్వీకరించే కార్యక్రమం చేపట్టారు. ఆసక్తి కలిగిన అధికారులు ప్రజల వద్దకే వాహనాల్లో వెళ్లి.. మైకుల ద్వారా ప్రచారం చేసి ‘మీ ఇంటి దగ్గర్లోనే వాహనం ఉంది. పనికి రాని సామాన్లు తెచ్చి అందులో వేయండి’అంటూ పిలుపునిచ్చారు.  

పనికొచ్చేవి రీసైక్లింగ్‌.. 
మొత్తానికి అధికారుల పిలుపునకు ప్రజలు స్పందించారు. అంతోఇంతో అవగాహన కలిగిన వారు పాత సామాన్ల బూజు దులిపి తెచ్చిచ్చారు. సమీపంలోని సేకరణ కేంద్రాల్లోనూ ఇచ్చారు. పది రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 235 మెట్రిక్‌ టన్నుల సామగ్రి పోగు పడింది. వీటిని జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలించారు. ఇందులో పనికొచ్చే వాటిని రీసైక్లింగ్‌ చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల నాలాల్లో పడే వ్యర్థాలు తగ్గనున్నాయని భావిస్తున్నారు.  

ఫర్నిచర్, చిరిగిన దుస్తులు, ప్లాస్టిక్‌.. 
సేకరణ కేంద్రాలకు అందిన నిరుపయోగ వస్తువుల్లో ఎక్కువ మొత్తంలో విరిగిన ఫర్నిచరే ఉంది. ఆ తర్వాత పాత, చిరిగిన దుస్తులు, దుప్పట్లు వంటివి ఉన్నాయి. ప్లాస్టిక్‌ కూడా పెద్ద పరిమాణంలోనే ఉంది. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు సైతం 6 మెట్రిక్‌ టన్నులకు పైగా ఉన్నాయి. గ్రేటర్‌ పరిధి లోని ఆరుజోన్లలో ఎల్‌బీనగర్‌ ప్రజలు ఈ కార్యక్రమానికి బాగా స్పందించారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌ జోన్‌ నిలిచింది. వ్యర్థాల సేకరణకు స్థానిక జోనల్, డిప్యూటీ కమిషనర్లు సైతం ఎంతో కృషి చేశారు.  

3–4 నెలలకోసారి అమలు.. 
పది రోజుల్లో వెరసి 235 మెట్రిక్‌ టన్నుల నిరుపయోగ వస్తువులు పోగుపడ్డాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు అలవాటుపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఇకముందూ కొనసాగిస్తామని, ప్రతి 3–4 నెలలకోసారి నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. త్వరలో నాలాల్లో సమస్యగా మారిన డెబ్రిస్‌ (నిర్మాణ, కూల్చి వేతల వ్యర్థాల) సేకరణకు 10 రోజుల స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top