ప్రచారం.. పోటాపోటీ!

All Party Election Campaign In Nalgonda - Sakshi

జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు రోజుకో మండలాన్ని చుట్టి వస్తున్నారు. ఇంకా సీటు ఖరారు కాకున్నా కాంగ్రెస్‌ అభ్యర్థులు సైతం ప్రచారంలో మునిగి పోయారు. ఇంటింటి ప్రచారాలు, కాలనీల సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలతో అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. 

సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాసనసభ ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో ఒకింత ముందున్నారు. నలభై రోజుల కిందటే జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థులను ప్రకటించింది. సుమారు నెల రోజు లపాటు కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి రాజకీయాలు నడిచినా, అధినాయకత్వం చొరవ తీసుకుని వారిని దారికి తెచ్చుకుం ది. దీంతో ఇప్పుడు అంతా కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ఇంకా తన అభ్యర్థులను ప్రకటించకున్నా, టికెట్‌ తమకే వస్తుందన్న విశ్వాసం ఉన్న నాయకులు సైతం ప్ర చారం చేసుకుంటున్నారు. బీఎల్‌ఎఫ్‌ కూడా తన అభ్యర్థులను ప్రకటించడంతో వారిలో కొందరు ప్రజలను కలవడంలో నిమగ్నమయ్యారు.

ప్రధానంగా జిల్లా కేంద్రమైన నల్లగొండలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు నల్లగొండలో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌కు, టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌కు మారుతున్నవారు అధికమయ్యారు. తొలుత కాంగ్రెస్‌లో ఉండి, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు తిరిగి తమ సొంతగూడు కాంగ్రెస్‌ బాటపట్టారు. అదే సమయంలో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లోకి వస్తు న్న వారి సంఖ్యా తక్కువేం లేదు. దీంతో కండువా మార్పిళ్ల కార్యక్రమం జోరందుకుంది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకుల కప్ప గంతుల ఆట మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారం చేయగా, కాంగ్రెస్, టీడీపీలు నకిరేకల్‌ నియోజకవర్గంలో, సీపీఎం మిర్యాలగూడలో ప్రచారంలో ఉన్నాయి.

నల్లగొండలో టీఆర్‌ఎస్‌..ఇంటింటి ప్రచారం
జిల్లాలో ఒకింత హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది ఒక్క నల్లగొండలోనే. ఇక్కడ అభ్యర్థిత్వం ప్రకటించకున్నా, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారం షురూ చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌ రెడ్డి సైతం నియోజకవర్గం చుట్టివస్తున్నారు. కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి పట్టణంలో బైక్‌ ర్యాలీ జరిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతిగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌ రెడ్డికి మద్దతుగా ఆదివారం డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ ప్రచారం చేయగా, సోమవారం నల్లగొండ మున్సిపాలిటీలో పది, పదకొండు వార్డుల పరిధి ఉన్న పానగల్‌లో ఇంటింటి ప్రచారం చేశారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. పానగల్‌ వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేసి ప్రచారం మొదలుపెట్టారు. సోమవారం రాత్రి పది గంటల దాకా ఈ ప్రచారం సాగింది.

ప్రజల్లో  అభ్యర్థులు
మరో వైపు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతున్నారు. టికెట్లు ప్రకటించకున్నా, కొందరు కాంగ్రెస్‌ నేతలు సైతం ప్రచారం చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి చౌటుపల్‌లో ప్రచారం చేయగా, కాంగ్రెస్‌ నాయకుడు, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇదే నియోజకవర్గంలోని నాంపల్లిలో ప్రచారం చేశారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు జరిగాయి. దేవరకొండ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి రవీంద్ర కుమార్‌ చందంపేట మండలంలో తిరిగారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో సాగర్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య, మిర్యాలగూడ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎన్‌.భాస్కర్‌రావు మిర్యాలగూడ రూరల్‌ మండలంలో తిరగగా, టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేత అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి పట్టణంలో ప్రచారం చేశారు.

సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి సైతం ప్రచారం చేశారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి వేముల వీరేశం రామన్నపేట మండలంలో తిరిగారు. కాంగ్రెస్‌ నాయకుడు చిరుమర్తి లింగయ్య, నకిరేకల్‌ పట్టణంలో ప్రచారం చేశారు. తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్‌ శాలిగౌరారంలో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్‌తో మహాకూటమి పొత్తులో భాగంగా నకిరేకల్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న టీడీపీ నేత పాల్వాయి రజనీకుమారి చిట్యాల మండలంలో ప్రచారం చేశారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ప్రచారంతో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top