-
రేవంతే బీజేపీలోకి.. ఆ మాట అనలేదా?: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘రుణమాఫీ అంశంపై క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తాం. రెండు రోజుల్లో వివరాల సేకరణ ప్రారంభిస్తాం. కలెక్టర్లలకు, సీఎస్‌కు డేటా ఇస్తాం. మా ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ కోసమే మేము డేటా ఇస్తున్నాం. మా హరీష్ రావు ఆఫీసుపై దాడి చేశారు. అటెన్షన్ డైవర్షన్ కోసం ఇలా చేస్తున్నారు. ఎల్లుండి నుంచి డేటా సేకరణ మొదలు పెట్టి వారం రోజుల్లో పూర్తి చేస్తాం. 973 ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల్లో మా చైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారు.. వారి నుంచి వివరాలు సేకరిస్తాం. మొదట వినతిపత్రాలు ఇస్తాం.. రాజకీయం చేయకుండా ముందు రిప్రజెంటేషన్ ఇస్తాం. సాక్షి పత్రిక చాలా చక్కటి వార్త రాసింది. 50 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం 22 లక్షల రైతులకే పరిమితం చేశారు. కేవలం 40 శాతం మాత్రమే రుణ మాఫీ అయ్యింది. ఇంకా సుమారు 28 లక్షల మంది రైతులకు రుణ మాఫీ జరగలేదు. క్షేత్ర స్థాయిలో రిపోర్టులు సేకరించి కలెక్టర్లకు ఇస్తాం.. ఆ తర్వాత సచివాలయంలో ఇస్తాం. హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయం ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తి మీద దాడి చేసిన వాళ్లపై ఎందుకు కేసులు పెట్టలేదు. ముఖ్యమంత్రికి సంబంధించిన మీడియా ప్రతినిధులు ఒక ఐపీఎస్ అధికారిని కొట్టినంత పని చేశారు. ఫాక్స్ కాన్ సంస్థలో లక్ష ఉద్యోగులు కల్పిస్తామని గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఫాక్స్ కాన్ సంస్థ ఒక దశ పూర్తి అయ్యింది. 25 వేల మందికి ఉద్యోగాల కల్పన రాబోతుంది. సీతారామ ప్రాజెక్టు మాదిరిగా ఫాక్స్ కాన్ రిబ్బన్ కట్ చేసి మేమే చేశామని చెబుతారు. మాకు కేంద్ర మంత్రి పదవులు కూడా రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారు.రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి..‘ప్రధానమంత్రి మోదీ అంటే ఎందుకు భయమో దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితులు వద్ద బయట పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే. త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో తన బృందంతో చేరడం ఖాయం. నేను పుట్టింది బీజేపీలోనే.. చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి, అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నేను కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. అదే జెండా కప్పుకొని చనిపోతానని మోదీతో చెప్పింది? వాస్తవమా కాదా రేవంత్ చెప్పాలి?. ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి.మహిళా కమిషన్ నోటీసులపై..నాకు మహిళా కమిషన్ నుంచి ఈ మెయిల్ వచ్చింది. కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాను. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు వెళ్తా. చట్టాన్ని గౌరవిస్తాను. 8 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగిన దాడులు, బాధితుల వివరాలు అన్ని తీసుకొని వెళ్తా. ఏం చర్యలు తీసుకున్నారో అడుగుతా. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహిళలపై జరిగిన దాడి వివరాలు కూడా అందిస్తాను’’ అని అన్నారు. -
బీఆర్ఎస్ పోరుబాట.. కాంగ్రెస్‌పై యాక్షన్ ప్లాన్ రెడీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రుణమాఫీ అంశంగా రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా మోసం చేసిందని ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పై పోరుబాటకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్దమవుతోంది.ఇక, తెలంగాణలో రుణమాఫీ కాని రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు తెలంగాణభవన్‌లో రుణమాఫీ పోరుబాట యాక్షన్ ప్లాన్‌పై కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అసలు రూపం బయటపడింది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో 17వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఎంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక, రైతుభరోసా ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.కాగా, ఏలేటీ మహేశ్వర్ రెడ్డి శనివారం అసెంబ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ.. స్పెషల్ డ్రైవ్ పెడుతున్నారు అంటే.. అందరికీ రుణమాఫీ కాలేదని ఒప్పుకుంటున్నారు కదా?. మీరు చెప్పిన గ్రామానికే వెళ్దాం. అక్కడ రైతులను అడుగుదాం. సీఎం రేవంత్ మీరు వస్తారా? లేక మీ వ్యవసాయశాఖ మంత్రి వస్తారా? రండి. రైతులందరికీ రుణ మాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. లేదంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా?. కేవలం 17వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఎంటో చెప్పాలి. తీసుకున్న రెండు లక్షల రుణానికి నాలుగు ఐదు వేల వడ్డీ అయ్యిందని రుణమాఫీ కాలేదని గ్రామాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు.రుణమాఫీ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ విలీనం అని రేవంత్ కొత్త డ్రామా ఆడుతున్నారు. బీజేపీ ఏం చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం డైవర్ట్ పాలిటిక్స్. బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ ఎందుకు ఒప్పుకుంటుంది?. అంత అవసరం మాకేముంది?. పూర్తి రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలి. కాంగ్రెస్ అసలు రూపం బయటపడింది. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగాన్ని మోసం చేసింది. అన్ని దేవుళ్ళ మీద ఒట్టు వేసి రైతులందరికీ రుణమాఫీ చేస్తానని రేవంత్ చెప్పారు. తెలంగాణలో 60 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరందరికీ రుణమాఫీ కావాలంటే రూ.49వేల కోట్లకుపైగా డబ్బులు అవసరం. ఏరోజు వరంగల్‌లో సభ పెడతారో చెప్పండి. ఆ సభలో రుణమాఫీ చేయని రైతులతో సభ నిండుతుంది. రుణమాఫీ అయిన అర్హుల జాబితాను బయట పెట్టండి. పెట్టుబడి సహాయాన్ని రుణమాఫీకి ఉపయోగించారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదు.. ఎప్పటి లోపు ఇస్తారు?. రైతు భరోసా ఇవ్వకుండా ఎన్నికలకి ఎలా వెళ్తారు?. రుణమాఫీ చేయలేదు కాబట్టి రేవంత్ కట్టుకథలు ఆడుతూ ఎమ్మెల్యేల ఆఫీసుల మీద దాడులు చేయిస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కాంగ్రెస్ చిల్లర వేషాలకు భయపడం: జగదీష్ రెడ్డి
సాక్షి, నల్లగొండ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అలాగే, ఇది కాంగ్రెస్ చేసిన పనే అంటూ తీవ్ర ఆరోపణలు చేశారుకాగా, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి శనివారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల చిల్లర వేషాలకు మేము భయపడం. ఎంతో మంది రాక్షసులకు తరమికొట్టాం. రుణమాఫీ విషయంలో అన్నదాతలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని పక్కదారి పట్టించేలా ఈ దాడులు మొదలు పెట్టింది. రుణమాఫీ విషయంలో రైతులను నమ్మించి గొంతు కోశారు.సీఎం రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. బీజేపీతో రేవంత్ దొంగ సంబంధాలు పెట్టుకున్నాడు. బీజేపీతో రేవంత్ కుమ్మకయ్యాడు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు పెద్ద దొంగలా బీజేపీతో ములాఖత్ అయ్యావు. రాష్ట్రంలో హింస ప్రేరేపించేలా రేవంత్ ప్రయత్నం చేస్తున్నాడు. అన్నదాతలను దొంగల్లాగా క్రియేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. జిల్లాలో అన్ని పార్టీల్లానే మేం ఆఫీసును కట్టుకున్నాం. మా పార్టీ ఆఫీసును కులుస్తా అనడం సమంజసం కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
రుణమాఫీపై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్
సాక్షి,హైదరాబాద్: ‘తెలంగాణలో ఏ ఊరికైనా వెళ్లి రుణమాఫీ జరిగిందా లేదా అనే చర్చ పెడదాం. సంపూర్ణ రుణమాఫీ అయిందని తేలితే నేను దేనికైనా సిద్ధం. నా సవాల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమేనా’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణభవన్‌లో శనివారం(ఆగస్టు17) జరిగిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘రూ.31 వేల కోట్లని చెప్పి రూ.17 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా ఎగనామం పెట్టారు. రూ.14 వేల కోట్లు కోత పెట్టారు. రైతులను నిట్టనిలువునా ముంచారు. పంచపాండవుల కథలా కాంగ్రెస్ రుణమాఫీ ఉంది’అని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. హరీశ్‌రావు ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు.. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం.. కుల్లం కుల్లా రైతులను అడుగుదాంసిద్దిపేట మండలం తడకపల్లిలో రుణమాఫీకి అర్హులు 720 మంది రైతులు కాగా.. రుణమాఫీ అయ్యిందికేవలం 350 మంది రైతులకేరుణమాఫీ పై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు లక్షా 16 వేల 460 మంది రైతులు ఫిర్యాదు చేశారుమాట తప్పింది రేవంత్రెడ్డినాడు కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారురేవంత్ నాడు మాట నిలబెట్టుకున్నారా ? రైతుల నెత్తిన టోపీ పెడుతున్నారు రేవంత్ రెడ్డిఅధికారం దక్కించుకోవడానికి మోసం.. వచ్చిన అధికారం కాపాడుకోవడానికి రేవంత్ మోసం చేస్తున్నారు ఆగష్టు 20వ తేది వచ్చింది ఇప్పటి వరకు రైతు భరోసా పై నిర్ణయం తీసుకోలేదు రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టి రుణ మాఫీ సగం చేశారు రుణ మాఫీ పై శ్వేత పత్రం విడుదల చేయాలినీటి పారుదల, అప్పుల మీద శ్వేత పత్రాలు పెట్టిన రేవంత్‌రెడ్డి.. రుణ మాఫీ పై ఎందుకు శ్వేత పత్రం విడుదల చేయడం లేదుసాక్షి పత్రికలో వచ్చిన రుణం తీరలే అన్న వార్త కథనాన్ని చూపిన హరీష్ రావురేవంత్ రెడ్డి పరిపాలన లో ప్లాప్ తొండి చేయడంలో తోపుబూతులు తిట్టడంలో టాప్ రంకెలు వేస్తే అంకెలు మారిపోవు పాలకుడిగా రేవంత్ రెడ్డి పాపాలు మూట కట్టుకున్నారు దేవుళ్ళ మీద ఒట్ట్లు పెట్టారు.. తెలంగాణ ప్రజలకు శాపం కావొద్దని కోరుకుంటున్న అన్ని దేవాలయాల దగ్గరకు వెళ్ళి తెలంగాణ ప్రజలకు పాపం తగలవద్దని కోరుకుంటున్న దేవుళ్ళను పాపాల రేవంత్ రెడ్డిని క్షమించమని కోరుకుంటా ముఖ్యమంత్రి నన్ను తాటిచెట్టులా పెరిగావని నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు రుణ మాఫీ పై రేవంత్ ది ప్లాప్ షో భౌతిక దాడులకు పురి గొల్పుతున్నారు రేవంత్ గాడ్ ఫాదర్లకే భయపడలేదు చావాలని కోరుకుంటున్న వారు.. రేపు మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తారేమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు రైతుల పక్షాన పోరాటం చేస్తాం రుణ మాఫీ పై బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం త్వరలో ప్రకటన చేస్తాం -
కాంగ్రెస్VSబీఆర్ఎస్..సిద్దిపేటలో హైటెన్షన్
సాక్షి,హైదరాబాద్: సిద్దిపేట పట్టణంలో శనివారం(ఆగస్టు17) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంపు ఆఫీసుపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. దాడిని నిరసిస్తూ క్యాంప్‌ఆఫీస్‌ముందు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. హరీశ్‌రావుపై వెలసిన ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు చింపివేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోటీగా నగరంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ హై టెన్షన్‌కు దారితీసింది.కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ హై టెన్షన్‌కు దారితీస్తోంది. దీంతో పట్టణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్..తన సిద్దిపేట క్యాంప్‌ఆఫీస్‌పై శుక్రవారం(ఆగస్టు16) అర్ధరాత్రి వేళ కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు శనివారం హరీశ్‌రావు ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమని పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని, వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఊహాజనితం
సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఊహాజనితం, అది జరగదు’అని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. ‘ఇది కాంగ్రెస్ విషప్రచారం. బీజేపీలో అలాంటి చర్చ లేదు. దీనిపై పార్టీలో ఎలాంటి ప్రస్తావన లేదు’అని తెలిపారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈటల స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రుణమాఫీ పూర్తిగా జరిగిందని ప్రభుత్వం ప్రకటించడం బక్వాస్, బుకాయిస్తున్నారు’అని మండిపడ్డారు. ‘అబద్ధపు ప్రచారంతో రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.రుణమాఫీ పూర్తిగా కాలేదని దమ్ముంటే ఒప్పుకోవాలి. బ్యాంకర్ల లెక్కల ప్రకారం రూ.72 వేల కోట్ల వరకుÆ రుణమాఫీ చేయాల్సి ఉండగా.. ఎన్నికల ముందు రేవంత్ రూ.63 వేల కోట్లు అని హామీఇచ్చారు. విధివిధానాల పేరుతో ఆ మొత్తాన్ని రూ.34 వేల కోట్లకు కుదించారు. ఇప్పుడు 22 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసి, పూర్తి చేశామని చెప్పుకుంటున్నారు. ఒక్క ఘట్కేసర్ సొసైటీలోనే 1,200 మంది రైతులకు రూ.9 కోట్ల రుణాలలో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు.కానీ వందలకోట్ల ప్రజాధనంతో కేసీఆర్ తరహాలోనే ప్రచారాలు చేసుకుంటున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’అని ఈటల ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం, ఉన్నతాధికారులు హంగామా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ‘హైడ్రా పేరుతో జరుగుతున్న డ్రామా ఆపాలి. ఎఫ్టీఎల్లో ఉన్న పట్టాభూముల్లో నిర్మాణాలు కూల్చవద్దు. నీళ్లు రాకుండా ఏర్పాటు చేయాలి. చిత్తశుద్ధి ఉంటే ఇకపై నిర్మాణాలు జరగకుండా చూడాలి. అక్రమకట్టడాల విషయంలో కఠినంగా ఉంటాం అని చెప్పుకుంటున్నారు. వాళ్లు ఏమి చేస్తున్నారో ఆ చిట్టా మా వద్ద ఉంది. డ్రామాలు ఆపితే మంచిది’అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.రక్షాబంధన్ కార్యక్రమానికి గవర్నర్‌కు ఆహ్వానం: ఈనెల 18న ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు ఉప్పల్ భగాయత్‌లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న రక్షాబంధన్ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఈటల రాజేందర్ ఆహ్వానించారు. -
‘టీపీసీసీ కొత్త అధ్యక్షుడిపై’ నిర్ణయం తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికా ర్జునఖర్గేను కోరారు. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీలో ఖర్గేతో రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీకి కొత్త «అధ్యక్షుడిగా ఎవరిని నియ మించినా కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ చెప్పినట్టు సమాచారం.త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర ఆంశాలపైనా చర్చించినట్టు తెలిసింది. పదవుల భర్తీల్లో భాగంగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా అవకాశా లపైనా మంతనాలు జరిపినట్టు సమాచారం. రైతు రుణమా ఫీ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించనున్న కృతజ్ఞత సభ, సచివాలయంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై కూడా చర్చించి, ఆహ్వానించినట్టు తెలిసింది. అనంతరం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధానకార్యదర్శి కేసీ.వేణుగోపాల్ తోనూ రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.రేవంత్‌తో సింఘ్వీ భేటీసాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా సింఘ్వీని ప్రకటించాక మొదటిసారి ఉభయులూ సమావేశమయ్యారు. సెప్టెంబర్ 3న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ఈ నెల 21న నామినేషన్ దాఖలు సహా వివిధ అంశాలపై లోతుగా చర్చించినట్టు అభిషేక్ మను సింఘ్వీ ట్వీట్ చేశారు. -
గవర్నర్‌గా కేసీఆర్.. కేంద్ర మంత్రిగా కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ ప్రాతిపదికన విలీనం జరగాలన్న అంశంపై ఆ రెండు పారీ్టలు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చాయని.. కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడమే ఒప్పందమని పేర్కొన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లానని.. అక్కడ కలసిన ప్రతి కంపెనీ, ప్రతినిధి పెట్టుబడి పెడతారన్న గ్యారంటీ ఏమీ లేదని చెప్పారు.శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ అక్కడ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు సంచలన కామెంట్లు చేశారు. తనపై వచి్చన ఆరోపణలపైనా స్పందించారు. రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందనుకుంటున్నా. ఈ విషయాన్ని కొన్ని సందర్భాల్లోనే కేటీఆర్ ఖండిస్తున్నారు. వివిధ స్థాయిల్లో బేరసారాలు సాగిస్తున్నారు. రాజ్యసభ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.అంతిమంగా కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కేంద్రమంత్రి, హరీశ్‌రావు లీడర్ ఆఫ్ ది అపోజిషన్.. ఇది ప్రాధాన్యత క్రమం. కవిత బెయిల్‌కు నలుగురు రాజ్యసభ సభ్యులు (ఫోర్ ఎంపీస్ ఈక్వల్ టు కవిత బెయిల్). నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలను బీజేపీలో చేర్చితే కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల కోసమే వెళ్లా.. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లానే తప్ప ప్రచారం కోసం కాదు. ప్రభుత్వం మారింది. కాబట్టి కొత్త ప్రభుత్వం విధానాలు వివరించి పెట్టుబడులు ఆకర్షించేందుకే విదేశాలకు వెళ్లాం. విదేశాల్లో కలసిన ప్రతి ప్రతినిధి పెట్టుబడి పెడతారన్న గ్యారంటీ ఏమీ లేదు. మాది పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులతో పోటీకాదు. నేను ప్రపంచ స్థాయిలో పోటీపడాలనుకుంటున్నా. అమెరికా, దక్షిణ కొరియా, తైవాన్ తదితర దేశాలు చైనా తర్వాత మరో దేశం కోసం వెతుకుతున్నాయి. వారు చైనా ప్లస్ వన్ ఇండియా అని భావిస్తున్నారు. కానీ చైనా తర్వాత తెలంగాణ అని నేనంటున్నా. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాను. నా కుటుంబానికి ఏవైనా పదవులిచ్చానా? సోదరులు, కుటుంబమే నా బలం. వారిపై ఆరోపణలు సరికాదు. నాది పెద్ద ఫ్యామిలీ, మొత్తం 150 మంది ఉన్నారు. అది నా బలం. ప్రభుత్వంలోగానీ, పారీ్టలోగానీ వారెవరికీ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. వాళ్లు (బీఆర్ఎస్, బీజేపీ) ఎలా నా సోదరులను బద్నాం చేస్తారు? 30 ఏళ్లుగా నా సోదరులు విదేశాల్లో ఉంటున్నారు. కేటీఆర్ 2000వ సంవత్సరంలో విదేశానికి వెళ్లారు. నా సోదరులు 1992, 93లోనే వెళ్లారు. నేను సీఎం కాక ముందు నుంచే అక్కడ వ్యాపారం చేస్తున్నారు.నేను సీఎం అయ్యానని వాళ్లు చేతులు కట్టుకుని కూర్చోవాలా? ప్రభుత్వంలో, పారీ్టలో, ఇంకేదైనా వ్యవహారంలో.. నా సోదరులు, కుటుంబ సభ్యులు తలదూర్చారా? వారికి ఏమైనా పదవులు, బాధ్యతలు ఇచ్చానా? వారి కంపెనీలకు నేను రాయితీలు ఇచ్చానా? సోదరుడు ఆ్రస్టేలియా వెళ్లాడని ఆరోపిస్తున్నారు. డబ్బులున్నాయి. టికెట్ కొనుక్కుని వెళ్లాడు. ప్రభుత్వం డబ్బులు, ప్రోటోకాల్ ఏమైనా తీసుకున్నాడా? పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలను ఆహా్వనిస్తున్నాం. తెలంగాణ వ్యక్తిని ఆహా్వనిస్తే తప్పేంటి? ఇక కేసీఆర్ సొంతంగా విమానం కొనుక్కొవచ్చు కానీ.. నేను ఖరీదైన చెప్పులు కొనుక్కోవద్దా? ఏపీకి రాజధానే లేదు.. వాళ్లకు అడ్రస్ తెలియదు మోదీ, చంద్రబాబుల దగ్గర హైదరాబాద్ లేదు. వాళ్లకు అహ్మదాబాద్, విజయవాడ ఉన్నాయి. నా దగ్గర హైదరాబాద్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడుందనేది వారికే (బాబుకు) తెలియదు. ఏపీకి రాజధానే లేదు. రాజధాని అడ్రస్ వారికే తెలియదు. చంద్రబాబు నాయుడు నా గురువు కాదు.. నన్ను ఆయన నాయకుడిని చేయలేదు. నేను నాయకుడిని అయ్యాకే టీడీపీలో చేరాను. జిల్లా పరిషత్ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యరి్థగా విజయం సాధించా. అప్పట్లో టీడీపీ ప్రతిపక్షంలో చాలా బలహీనంగా ఉంది. అలాంటి సమయంలో నేను టీడీపీలో చేరా. అలా ఎలివేట్ అయ్యాను. విపక్ష నేతల జోలికి వెళ్తే కష్టమే.. విపక్ష నేతలను జైల్లో వేస్తే ఏం జరుతుందో చెప్పడానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలే నిదర్శనం. కేసీఆర్ నన్ను జైల్లో వేశారు. ఆయన నౌకరీ పోయింది. వైఎస్ జగన్ చంద్రబాబును జైల్లో వేశారు. ఆయన నౌకరీ పోయింది. ఇది సింపుల్ పాలసీ. దీనిని ఢిల్లీవారు (ఎన్డీయే సర్కారు) కూడా అర్థం చేసుకోవాలి. వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన రోజే అసెంబ్లీలోనే ఆ తీర్పుకు లోబడి నియామకాలు చేపడతామని ప్రకటించాం. సుప్రీంకోర్టు తీర్పును క్షుణ్నంగా పరిశీలించాలని ఇప్పటికే సంబంధిత మంత్రికి, కమిటీకి సూచించాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రధాని మోదీ మందకృష్ణ మాదిగను ఆలింగనం చేసుకోవడం తప్ప ఏమీ చేయలేరు. వర్గీకరణను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాల నిర్ణయమే. కులగణన చేస్తే తప్పేంటి? మేం కులగణన చేస్తే తప్పేంటి? ఎవరి శాతం ఎంతో తెలిస్తే వచ్చే నష్టమేంటి? ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలిస్తే వారికి అంత రిజర్వేషన్లు లభిస్తాయి. ఇది విద్య, ఉద్యోగాలకు సంబంధించిన విషయం.. రాజకీయ రిజర్వేషన్ల కోసం కాదు. కాంగ్రెస్‌లో వి.హనుమంతరావును మించిన విశ్వాసపాత్రుడు ఎవరూ లేరు. అందుకే ఆయనకు గతంలో మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా అధిష్టానం అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వాళ్లకే పదవులు ఇస్తాం..’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
అరకొర రుణమాఫీ.. ఆపై దుర్భాషలా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రక టించిన రేవంత్‌రెడ్డి ప్రభు త్వం అరకొరగా అమలు చేసిందని ఇదే విషయాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై సీఎం నోరు పారేసుకుని దుర్భాషలాడతారా అని బీఆర్ఎస్ మాజీమంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి తీవ్రంగా విమ ర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ నేత ఇంతియాజ్ ఇషాక్‌తో కలసి నిరంజన్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.రుణమాఫీ తోపా టు ఆరు గ్యారంటీలను రేవంత్ చెప్పిన గడువు లోగా అమలు చేస్తే పదవికి రాజీనామా చేస్తాన ని హరీశ్ అన్నారని అయితే రేవంత్ మాత్రం రుణమాఫీ అమలు పూర్తయిందని దబాయిస్తు న్నారని మండిపడ్డారు. ఆగస్టు 15 నాటికి రైతు లందరికీ రూ.31వేల కోట్ల రుణమాఫీ జరుగు తుందని చెప్పి, ప్రస్తుతం రూ.17వేల కోట్లకే ఎందుకు పరిమితం చేశారని నిలదీశారు. రాష్ట్రంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీశ్‌రావును రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. రుణమాఫీపై బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు ఇప్పటివరకు 1,11,027 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. -
రేవంత్‌పై చీటింగ్ కేసు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ‘రుణమాఫీ అంటూ రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చీటింగ్కేసు నమోదు చేయాలి. కొడంగల్‌లో మీడియా సమక్షంలో వందశాతం రుణమాఫీ జరిగినట్టుగా రేవంత్ నిరూపిస్తే రాజకీయాలను వది లేస్తా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లు నియోజకవర్గాల్లో రుణమాఫీ అంశాన్ని పరిశీలించి రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. రూ.2లక్షల రుణమాఫీ సంపూర్ణంగా జరగకపోతే అవసరమైతే కోర్టుకు కూడా వెళతాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే కేపీ.వివేకానందలతో కలిసి శుక్రవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..‘రుణమాఫీపై దగా, మోసం చేసిన రేవంత్ సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళితే చెడుగుడు ఆడటం ఖాయం. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ అతిపెద్ద మోసం చేసింది. రుణమాఫీకి తొలుత రూ.40వేల కోట్లు అవసరమని ప్రకటించడం, ఆ తర్వాత రూ.31వేల కోట్లు కావాలని కేబినెట్ తీర్మానించడం, బడ్జెట్లో రూ.26వేల కోట్లు ప్రతిపాదించడం, చివరకు 22లక్షల మందికి రూ.17,934 కోట్ల మేర మాత్రమే మాఫీ చేయడం రైతులను మోసగించడమే. ప్రచార ఆర్భాటమే.: ‘రుణమాఫీలో నిబంధనల పేరిట కోతలు విధించి చిల్లర ప్రచారంతో రేవంత్ రంకెలు వేస్తూ హరీశ్‌రావు రాజీనామా చేయాలంటున్నాడు. కేవలం 46శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. రేవంత్ చేస్తున్న మోసాలకు గిన్నిస్ బుక్ నిర్వాహకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రేవంత్ ప్రసంగం ఆయన అసహనానికి అద్దం పడుతోంది. ఇటీవలి కాలంలో ఆయన చేస్తున్న ప్రసంగాలు, వాడుతున్న భాష చూస్తే రేవంత్ మానసిక సంతులనం దెబ్బతిన్నట్టుగా కనిపిస్తోంది.రేవంత్ కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళితే మంచిది. రుణమాఫీ అయ్యిందంటూ కొంతమంది చిల్లరగాళ్లు పోస్టర్లు పెట్టారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సవాలు చేసినట్టుగా సంపూర్ణ రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలు జరిగిందా. సాక్షాత్తూ సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్రం దివాలా తీసిందని చెబుతుండటంతో పెట్టుబడులు తరలివెళుతున్నాయి. ఎన్నికల హామీలు నెరవేర్చని రేవంత్ ఎనిమిదినెలల కాలంలో 19 సార్లు ఢిల్లీకి వెళ్లాడు. ఇంకా ఎన్నిసార్లు వెళ్లాల్సి వస్తుందో కూడా తెలియదు. ప్రాంతీయ పారీ్టలపై అధ్యయనం: ‘ఉద్యమ పారీ్టగా 24 ఏళ్ల క్రితం ప్రస్థానం ప్రారంభించి పదేళ్లపాటు అధికారంలో కొనసాగాం. ప్రతిపక్షపాత్ర తొలిసారి పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీని మరింత దృఢంగా చేసేందుకు ప్రాంతీయ పారీ్టల పనితీరుపై అధ్యయనం చేస్తాం. డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బిజూజనతాదళ్ వంటి పార్టీల నిర్మాణాన్ని పరిశీలించేందుకు సెప్టెంబర్‌లో నాతోపాటు కొందరు సీనియర్ నేతలు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తాం. మంచి ఎక్కడ ఉన్నాసరే స్వీకరించి ఇక్కడ పార్టీ బలోపేతానికి వినియోగించుకుంటాం. ఆరీ్టసీలో మహిళల ప్రయాణంపై నేను యథాలాపంగా మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాను. రేవంత్‌కు అదే సంస్కారం ఉంటే అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం.. కేటీఆర్ పీసీసీ చీఫ్: బండి సంజయ్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రాజకీయాలపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందన్నారు. కేటీఆర్‌ను పీసీసీ చీఫ్ అవుతారని జోస్యం చెప్పారు. అలాగే, కవిత బెయిల్‌పై కావాలనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.కాగా, కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం తథ్యం. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతం. కవిత బెయిల్‌కు, బీజేపీకి ఏం సంబంధం?. బీఆర్ఎస్ పార్టీది ముగిసిన అధ్యాయం. ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదు. బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. అతి త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమవడం తథ్యం.బీఆర్ఎస్ను వీలీనం చేసుకుంటే బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వం. ఆమ్ ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే సిసోడియాకు బెయిల్ వచ్చిందా?. బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ న్యాయస్థానాలపై బురదచల్లుతురా?. కవిత బెయిల్ విషయంలో కావాలనే బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?. నువ్వు కొట్టినట్లు చేయ్.. నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయ స్థానం పరిధిలోని అంశం.సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాళేశ్వరం సహా అనేక అంశాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్‌లను జైలుకు పంపాలి. కేసీఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేయాలి. లేనిపక్షంలో దాగుడుమూతలాడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణ పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. -
రేవంత్ తప్పుల చిట్టా రెడీ.. హైడ్రా ఓ హైడ్రామా: ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ చేస్తున్న తప్పులపై చిట్టాపద్దు సిద్ధం చేస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న రుణమాఫీ పెద్ద బోగస్ అంటూ ఘాటు విమర్శలు చేశారు.కాగా, మాల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ తప్పులను అవసరం వచ్చినప్పుడు ప్రజల ముందు లెక్కలతో సహా బయటపెడతాం. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ బోగస్. రుణ మాఫీ చేయని రైతులకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నాను. ఎఫ్టీఎల్ భూములు ప్రభుత్వ భూములు కావు.హైడ్రా పేరుతో చేస్తున్న ప్రభుత్వ హైడ్రామా చేస్తోంది. కట్టిన ఇళ్లను ఎందుకు కూల్చివేస్తున్నారు. ఎఫ్టీఎల్లో భూములున్న వారికి ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలి. బీజేపీలో స్తబ్ధత లేదు.. ఎన్నికల సమయంలో చూపించాల్సిన దూకుడు చూపిస్తాం. సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పెద్ద అబద్ధం. ఇదంతా తప్పుడు ప్రచారం. బీజేపీలో అలాంటి చర్చ జరగలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రేవంత్‌కు కేటీఆర్ సవాల్.. కొడంగల్‌లో కొత్త పంచాయతీ..
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, కొండగల్‌లో ఒక్క రైతుకు అయినా రుణమాఫీ జరిగినట్టు చెబితే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్.. సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు.కాగా, కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘భారతదేశంలో అతిపెద్ద మోసం గురించి చెప్తున్నాం. తెలంగాణలో రుణమాఫీ పేరుతో దారుణమైన దగా చేశారు. రుణమాఫీ బోగస్, మిలీనియం ఆఫ్ ది జోక్. అన్నదాతలను నిండా ముంచారు. రైతులను మోసం చేసిన రేవంత్‌పై చీటింగ్ కేసు పెట్టాలి. రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ప్రతీ రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. కానీ, అనేక కొర్రీలు పెట్టి రుణమాఫీ చేయలేదు. రైతులకు ద్రోహం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అర్హులైన రైతుల్లో చాలా మందికి రుణమాఫీ కాలేదు. అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగున్నారు. ఆగస్టు 15 కల్లా రెండు లక్షల రుణమాఫీ కాలేదు. మోసం కాంగ్రెస్‌లో రక్తంలోనే ఉంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసారు. రైతులను తడి గుడ్డతో గొంతు కోశాడు రేవంత్ రెడ్డి. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ తెలంగాణ లో ఉందని మాకు తెలియక ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా.. మీరు నిజంగా రుణమాఫీ నిజంగా చేసి ఉంటే మీ నియోజకవర్గం కొడంగల్‌కు వెళ్లాం. అక్కడ ఏ ఒక్క రైతుకు అయినా రుణమాఫీ చేసినట్టు చెబితే నేను నా పదవికి రాజీనామా చేస్తాను. రుణమాఫీ సక్సెస్ అయినట్టు నిరూపిస్తే రాజీనామాకు రెడీ. రాజకీయ సన్యానం తీసుకుంటాను. ఈ సవాల్‌కు రేవంత్ సిద్దమేనా? అని ప్రశ్నించారు.అలాగే, నేను మహిళపై యథాలాపంగా మాట్లాడాను. చెల్లెల్ని అక్కల్ని క్షమించాలి అని అడిగాను. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలను రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై క్షమాపణ చెప్తారా?. సెప్టెంబర్‌లో ప్రాంతీయ పార్టీల బలోపేతంపై కొన్ని రాష్ట్రాల్లో పర్యటన చేయబోతున్నాం. డీఎంకే లాంటి పార్టీల పని తీరుపై పరిశీలిస్తాం. నాతో పాటు మా పార్టీ నేతలందరూ వస్తారు. ఏపీలోని వైఎస్సార్సీపీ పార్టీలను కూడా పరిశీలిస్తాం అంటూ కామెంట్స్ చేశారు. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం: సీఎం రేవంత్
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై ఢిల్లీలో శుక్రవారం(ఆగస్టు16) మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుంది. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్‌రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్‌గా పదవులు తీసుకుంటారు. బీఆర్ఎస్కు ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు. వీళ్లంతా బీజేపీలో విలీనం తర్వాత కవితకు బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఇస్తారు’అని రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
రాజీనామా ఏది..? హరీశ్‌రావుపై వెలసిన ఫ్లెక్సీలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుపై హైదరాబాద్ నగరంలో శుక్రవారం(ఆగస్టు16) ఫ్లెక్సీలు వెలిశాయి. రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే అంటూ ఫ్లెక్సీల్లో హరీశ్‌రావును ప్రశ్నించారు. ఫ్లెక్సీలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేర్లున్నాయి. కాగా, ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని గతంలో హరీశ్‌రావు ప్రకటించారు. తుదివిడత రూ.2 లక్షల రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా హరీష్‌రావు రాజీనామా అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం వైరా సభలో ప్రస్తావించారు. మొత్తం 3 విడతల్లో రూ. 2లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇరువురి చేత మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ హాజరయ్యారు.పెద్దల సభకు ఉద్యమ సారథికోదండరాం సార్‌గా సుపరిచితుడైన ముద్దసాని కోదండరాం స్వగ్రామం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్. 1955 సెప్టెంబర్ 5న ముద్దసాని వెంకటమ్మ, ఎం.జనార్దన్ రెడ్డి దంపతులకు జన్మించారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ , ఓయూలో పీజీ (పొలిటికల్ సైన్స్), జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం చేరగా.. 1981లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉద్యోగం రావడంతో పీహెచ్డీ మధ్యలో ఆపేశారు. ఆదివాసీల సమస్యలపై దివంగత హక్కుల నేత బాలగోపాల్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావుతో కలిసి పని చేశారు.ఓయూలో ప్రొఫెసర్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన కోదండరాం..దివంగత ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సహా అనేక మంది ప్రముఖ తెలంగాణవాదులతోనూ కలిసి పనిచేశారు. ఉద్యమ సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్‌గా అన్ని పార్టీలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకం చేయడంలో క్రియాశీలంగా పని చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి బీఆర్ఎస్ విధానాలతో విభేదించారు. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట 2018 మార్చి 31వ తేదీన తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేశారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ కాంగ్రెస్‌తో కలిసి పని చేసింది. అదే క్రమంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో జత కట్టారు. దీనితో పాటు ఉద్యమ నేపథ్యం, ప్రొఫెసర్‌గా ఆయన అందించిన సేవలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. జర్నలిజంలో విశేష కృషి జర్నలిజంలో విశేష సేవలందించిన ఆమేర్ అలీఖాన్ (సియాసత్ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ కుమారుడు) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీసీఏ, తరువాత సుల్తాన్–ఉల్–ఉలూమ్ కాలేజీ ఆఫ్ బిజినెస్ అడ్మిని్రస్టేషన్ నుంచి ఎంబీఏ చేశారు. ప్రస్తుతం సియాసత్‌లో న్యూస్ ఎడిటర్‌గా ఉన్న ఆయన..ప్రతిక కర్ణాటక రాష్ట్రానికి విస్తరించేందుకు విశేష కృషి చేశారు. పలు అంతర్జాతీయ ఈవెంట్లను కవర్ చేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిల వెంట విదేశీ పర్యటనలకు వెళ్లారు.మైనారిటీల్లో విద్య, నైపుణ్యాన్ని వృద్ధి చేయడానికి, నిరుద్యోగుల కోసం కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇప్పించేవారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సియాసత్ ప్రస్తుతం ఖతర్ దేశానికి కూడా విస్తరించింది. 1973 అక్టోబర్ 18న హైదరాబాద్‌లో జన్మించిన అమేర్ అలీ ఖాన్‌కు ఉర్దూతో పాటు ఇంగ్లి‹Ù, హిందీ, అరబిక్, తెలుగు భాషలు తెలుసు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. -
మహిళలపై వ్యాఖ్యలు.. విచారం వ్యక్తం చేసిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఫ్రీ బస్సు స్కీమ్‌కు సంబంధించి మహిళలపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం (ఆగస్టు16) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘గురువారం పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’అని కేటీఆర్ ట్వీట్లో క్లారిటీ ఇచ్చారు. కాగా, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఫ్రీ బస్సు స్కీమ్‌పై మాట్లాడారు.నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ..నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు.— KTR (@KTRBRS) August 16, 2024బస్సుల్లో ఎల్లిపాయల పొట్టు తీసుకోవడం కాకపోతే కుట్లు, అల్లికలు కూడా పెట్టుకోండి. ఒక్కొక్కరికి ఒక్కో బస్సు పెట్టి బబ్రేక్డ్యాన్సులు కూడా వేసుకోండి’ అని కేటీఆర్ అనడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ దిష్టిబొమ్మల దహనానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. -
అలాగైతే.. మా ఆడబిడ్డ జైల్లో ఉండేదా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని, చీకట్లో ఒప్పందాలు చేసుకున్నామని ప్రచారం చేస్తున్నారు. మాకు వాళ్లతో ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ 150 రోజులుగా జైల్లో ఉండేదా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కవిత సోదరుడిగా న్యాయవాదులతో మాట్లాడేందుకు, అక్కడి విషయాలు తెలుసుకునేందుకు ఢిల్లీకి వెళ్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి బీజేపీతో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందాల వల్లే ఆ పార్టీ నేత ఒక్కరు కూడా జైల్లో లేడు. కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టిన నాటి నుంచి పార్టీ మాయం కావాలని కోరుకుంటున్నవారు అనేకమంది ఉన్నారు. అలాంటి వారే కనుమరుగయ్యారు తప్ప 24 ఏళ్లుగా పార్టీ విజయవంతంగా కొనసాగుతోంది. మరో 50 ఏళ్లు కూడా కొనసాగేలా బలంగా తయారు చేసుకుందాం’అని మాజీమంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంచి రేవంత్ ఖాతాలో..చెడు కేసీఆర్ ఖాతాలో ‘మంచిని తన ఖాతాలో వేసుకుని, చెడును మాత్రం కేసీఆర్ ఖాతాలో వేయడం, కేసీఆర్ చేసిన పనులను తన క్రెడిట్‌గా చెప్పుకోవడం రేవంత్‌కు అలవాటు అయింది. కేసీఆర్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టును తామే కట్టినట్లుగా రిబ్బన్ కటింగ్‌లు చేస్తున్నారు. కానీ ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీల విషయంలో రేవంత్ మాట తప్పిన తీరును యువత, రైతులు, మహిళలు, వృద్ధులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. పీఆర్ స్టంట్లతో ప్రజలను రేవంత్ ఎక్కువకాలం గందరగోళానికి గురి చేయలేరు. అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడతారు. మనం కూడా వాటిని ఉప ఎన్నికల్లో ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండదు. కొందరు సీనియర్ నాయకులకు పార్టీ మేలు చేసినా వెళ్లిపోయారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ ఉప ఎన్నిక రావడం ఖాయం..’అని కేటీఆర్ అన్నారు. పాలనలో రేవంత్ సోదరుల జోక్యం ‘ప్రజలు ఎన్నుకుంటే పదవుల్లోకి వచ్చిన మాపై కుటుంబ పాలన అని నిందలు వేశారు. తప్పుడు ప్రచారం చేశారు. కానీ రేవంత్ సోదరులు ఏ హోదాలో పాలనలో జోక్యం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నిండా ఆయన సోదరులే కనిపిస్తున్నారు. ఓ తమ్మునితో రేవంత్ అమెరికాలో ఒప్పందం చేసుకుంటే, మరో తమ్ముడు ఆ్రస్టేలియాలో పర్యటిస్తున్నాడు. రేవంత్ బావమరిది సృజన్ కంపెనీకి రూ.1,000 కోట్ల టెండరు పనులు అప్పగించారు..’అని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో బస్సుల్లో తన్నుకున్నారా? ‘బస్సులో ఎల్లిపాయలు ఏరితే తప్పా అని మంత్రి సీతక్క అంటోంది. తప్పని మేం అనలే.. కుట్లు, అల్లికలు కూడా తప్పుకాదు. అందుకే బస్సులు పెట్టారని మాకు తెలియదు. ఎక్కువ బస్సులు లేక తన్నుకుంటున్నరని అన్నాం. మనిషికో బస్సు పెట్టండి. అందులో కుట్లు, అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు చేయండి. కేసీఆర్ పాలనలో బస్సుల్లో తన్నుకున్నారా?.’అని మాజీమంత్రి ప్రశ్నించారు. స్వాతంత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే మహోన్నత వ్యక్తుల పోరాటం, త్యాగాలు, పట్టుదల ఫలితంగా దేశానికి వచ్చిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని కేటీఆర్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో గురువారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారత స్వాతంత్య్ర పోరాటం కుల, మత, వర్గాలన్నింటికీ అతీతంగా జాతి యావత్తును ఒక్క తాటిపై నిలిపిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
మాట నిలబెట్టుకున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ 2022 మే 6న వరంగల్ గడ్డపై రైతు డిక్లరేషన్ ప్రకటించిందని.. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గురువారం ఒకేరోజు రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేసి చూపిస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్‌రావు మాట నిలబెట్టుకోవాలని సవాల్ చేశారు. రేవంత్ గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ పంపులను ప్రారంభించారు. తర్వాత ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన రైతాంగ సభలో పాల్గొని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 2004లో తెలంగాణ ఇచ్చారు. ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ వరంగల్ డిక్లరేషన్‌లో రుణమాఫీ ఇస్తామని వాగ్దానం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టువదలని ప్రయత్నంతో రైతుల రుణమాఫీ పూర్తయ్యేలా చేసి రాహుల్‌గాంధీ మాట నిలబెట్టారు. జూలై 18న మొదలుపెట్టి అతి తక్కువ సమయంలో రుణమాఫీ చేశాం. ఇప్పటికే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, పేదలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచుతామన్న హామీలు అమలు చేశాం. వైఎస్ దళితులు, గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే.. డబుల్ బెడ్రూంల పేరిట కేసీఆర్ మోసం చేశారు. బీఆర్ఎస్ బతుకు బస్టాండే.. మా సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఉన్నవి లేనివి మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ మోసం చేస్తోందని కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా ఇంకా బుద్ధి మారలేదా? తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్మితే ఒక్క సీటైనా ఇచ్చేది. మీ పార్టీ పరిస్థితి హీనంగా దివాలా తీసి బతుకు బస్టాండ్ అయింది. అడవి పందులు తిన్నంత తిని ఊరుకోకుండా పంట పొలాలను సర్వనాశనం చేస్తాయి. అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులు చేయగలిగినంత దోపిడీ చేసి ఊరుకోకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తీలు కట్టేందుకే మేం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రీడిజైనింగ్ పేరుతో భారీ దోపిడీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందించే ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు ఖర్చు పెడితే సరిపోయే సమయంలో రీడిజైనింగ్ పేరిట అంచనాలను రూ. 18 వేల కోట్లకు పెంచి మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు ప్రజలను దోపిడీ చేశారు. కేసీఆర్ పాలన అంతా అంచనాలు పెంచుడు, నిధులు మెక్కుడు మీదనే ఉండేది. దోపిడీ గురించి తెలిసిపోతుందనే భయంతోనే సీతారామ ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను కేంద్రానికి సమర్పించకుండా పదేళ్లు కాలయాపన చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి.. అనుమతులు తెచ్చాం. ‘సీతారామ’తో 7 లక్షల ఎకరాలకు నీళ్లు.. భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ప్రతిపాదనతో ఈరోజు సీతారామ ప్రాజెక్టు నుంచి నీరు పొంగింది. కృష్ణా జలాలు ఖమ్మం జిల్లాకు అందకపోతే గోదావరి జలాలను తీసుకువచ్చి కాల్వల్లో పారించాలనే ఆలోచన ముందుకెళ్తున్నాం. ఇంకో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తేగానీ ‘సీతారామ’ప్రాజెక్టు పూర్తవదు. 2026 ఆగస్టు 15లోపు ప్రాజెక్టు పూర్తిచేసి ఖమ్మం జిల్లాలో 7లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. దీనికితోడు పాలమూరు–రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలమై రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుంది..’’అని రేవంత్ చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు పోరిక బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మూడు పంపులు.. ముగ్గురితో ప్రారంభం.. హెలికాప్టర్ ద్వారా పూసుగూడెం చేరుకున్న సీఎం రేవంత్, మంత్రులు అక్కడ పైలాన్‌ను ఆవిష్కరించారు. తర్వాత పంపుహౌస్ కంట్రోల్ రూమ్‌కు చేరుకుని మోటార్లు స్విచాన్ చేశారు. మొదటి పంపును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రెండో పంపును సీఎం రేవంత్‌రెడ్డి, మూడో పంపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే సీతారామ ప్రాజెక్టుతో భద్రాద్రి జిల్లాకు అన్యాయం జరుగుతోందంటూ బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ ఎంఎల్ (మాస్‌లైన్) ఆధ్వర్యంలో నిరసనలకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. -
కేటీఆర్ ‘రికార్డింగ్ డ్యాన్స్’ వ్యాఖ్యలు జుగుప్సాకరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళలపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పంచాయతీరాజ్, మహిళా సంక్షేమశాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆర్టీíసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చు’ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని గురువారం ఓ ప్రకటనలో ఆమె ఖండించారు. ‘మీ తండ్రి మీకు నేర్పిన సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారా? ఆడవాళ్లంటే మీకు గౌరవం లేదు. మహిళలను కించపరిచే విధంగా బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో ఉన్న బురదకు నిదర్శనం. పదేళ్లుగా హైదరాబాద్‌లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది’ అని సీతక్క మండిపడ్డారు. ‘మహిళలు ఆర్థికంగా ఎదగాలనే వారి కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాం’ అని స్పష్టం చేశారు. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృథా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి? అని ఆమె కేటీఆర్‌ను ప్రశ్నించారు. ‘ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు.ఉచిత బస్సు ప్రయాణం ఆలోచన మీకు రాలేదు. పదేళ్లు మీరు చేయలేదు. మేము చేస్తే దాని మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ’అని సీతక్క ధ్వజమెత్తారు. -
ఇది ముమ్మాటికీ రైతులకు ద్రోహమే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీకే రూ.17 వేల కోట్లు ఖర్చు అయితే, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రూ.17,900 కోట్లతోనే రూ.2 లక్షల రుణమాఫీ ఎలా సాధ్యం అయ్యిందో ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి వివరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ మొత్తం రెట్టింపు అయినప్పుడు లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సిందిపోయి తగ్గడం కాంగ్రెస్ మోసపూరిత విధానానికి నిలువెత్తు నిదర్శనమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఇది ముమ్మాటికీ రైతులకు ద్రోహం చేయడమేనన్నారు. వరికి బోనస్ పథకంలా.. రుణమాఫీ కూడా బోగస్ అని విమర్శించారు. చారాణా రుణమాఫీకి బారాణా ప్రచారం అని ఎద్దేవా చేశారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును రైతన్నలతో కలిసి ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు. -
అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది
సాక్షి, హైదరాబాద్: దిగజారుడు భాషలో నోటికొచ్చినట్లు బీఆర్ఎస్ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్ధాలు నిజాలైపోవన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు హితవు చెప్పారు. రుణమాఫీపై మాటతప్పి, తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఎం అవాకులుచెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి స్థాయికి తగినట్టు ప్రవర్తించడం లేదనే విషయాన్ని రేవంత్ ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని హరీశ్‌రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చరిత్రలో ఇంతగా దిగజారిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరని విమర్శించారు. అబద్ధం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్ ప్రవర్తన ఉందన్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బీఆర్ఎస్పై, తనపై విమర్శలకు దిగారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి రూ.40 వేల కోట్ల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నది రేవంత్‌రెడ్డేనని పేర్కొన్నారు. తర్వాత అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపారని, ఆగస్టు 15 వరకు రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికల్లో ఊదరగొట్టి, ఇప్పుడు రూ.13 వేల కోట్లు కోత పెట్టారన్నారు. అయినా ఎవరూ నమ్మడం లేదని, ప్రతి ఊరి దేవుడి మీద రేవంత్ ప్రమాణాలు చేశారని చెప్పారు.మోసమే తన విధానం..‘సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్ధమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం అనే విధంగా రేవంత్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకున్నారు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో మొదటి దఫాలో 35 లక్షల మంది రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తేనే దాదాపు రూ.17 వేల కోట్లు అయ్యిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా, రూ.17,869 కోట్లు మాత్రమే అవుతాయా? అని ప్రశ్నించారు. ఈ ఒక్క విషయంతోనే ఈ రుణమాఫీ పచ్చి అబద్ధమని తేలిపోతోందన్నారు.రుణమాఫీ పేరుతో దగా చేశారని స్పష్టంగా తేలిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏట్లో దూకి ఎవరు చావాలి? అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి రైతు ద్రోహానికే కాక దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డారన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి, మాట తప్పిన ఆయన చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. కానీ ఆయనకు ఆ సంస్కారం లేదని, రేవంత్‌లో ఉన్నది వికారమే తప్ప, సంస్కారం కాదని విమర్శించారు.ముఖ్యమంత్రి స్థాయిలో మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో, ఆ పాప ఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని తాను ఆందోళన చెందుతున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ చేసిన తప్పుకు, దైవ ద్రోహానికి తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నట్లు హరీశ్ చెప్పారు. -
‘మూసీ కంటే రేవంత్ నోరే కంపు’.. బీఆర్ఎస్ నేతల కౌంటర్
సాక్షి,హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరాలో జరిగిన రైతు రుణమాఫీ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ‘సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. టీవీ ముందు కూర్చున్న రాష్ట్ర ప్రజలు కూడా తలదించుకులే ఉంది. హరీష్ రావు గురించి కూడా ఏదేదో మాట్లాడారు. రుణమాఫీపై హరీష్ రావు ముక్కు నేలకు రాయాలని అన్నారు. ఇప్పుడు రెండు లక్షల రుణం మాఫీ కాలేదు.. కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చి ముక్కు నేలకు రాయాలి. మీరిచ్చిన హామీలపై నిలదీస్తూనే ఉంటాం. హరీష్ రావు పైన కూడా వాడకూడని భాషతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేరు తీయకుండా రేవంత్‌రెడ్డికి నిద్ర పట్టదు.సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే.. భద్రాద్రి రాముడి సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ‘బహిరంగ సభలో పచ్చి భూతులు మాట్లాడారు.. కాంగ్రెస్‌లో ఉన్న మంత్రులు కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 30 వేల ఉద్యోగాలు కాదు.. 30 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ప్రాజెక్ట్ కట్టింది మేమే అన్నట్టు కాంగ్రెస్ తీరు ఉంది. ఒక మంత్రి నీళ్ళు జల్లుకోవడం, మరో మంత్రి పూలు జల్లడం. ఇదంతా కేసిఆర్ ప్రాజెక్ట్ నిర్మించటం వల్లే. కష్టపడి నీళ్ళు తెచ్చామని చెప్పుకోవడానికి వారికి సిగ్గుండాలి. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ కాగితాలకే పరిమితం చేసింది మీరు కాదా?. రైతు రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారు’ అని ధ్వజమెత్తారు.ముందు రేవంత్ నోరును ప్రక్షాళన చేయాలి..సీఎం రేవంత్‌రెడ్డి ఏమాత్రం సిగ్గు లేకుండా హరీష్ రావుపై అసభ్య విమర్శలు చేశాని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. ‘దేవుళ్ళను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి. సూటిగా చెప్పు రూ. 31 వేల కోట్ల రుణ మాఫీ చేశావా లేదా?. కేవలం రూ. 17 వేల కోట్లు మాత్రమే అకౌంట్లలో వేశావ్. సిగ్గుంటే సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేయాలి. 2018లో రేవంత్‌ను కొడంగల్‌లో హరీష్ రావు చిత్తు చిత్తుగా ఓడించారు. హరీష్ రావును విమర్శలు చేసే స్థాయి రేవంత్‌కు లేదు. మూసి కంటే కంపు రేవంత్ నోరు. ముందు రేవంత్ నోరును ప్రక్షాళన చేయాలి’అని మండిపడ్డారు.