breaking news
-
కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగాం: మంత్రి పొన్నం
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా సెక్రటేరియట్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించనుంది.ప్రభుత్వం తరపున ఆహ్వాన ప్రతికను అందించేందుకు ఇప్పటికే కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్‌తో పాటు బీజేపీ కేంద్ర మంత్రులు ప్రభుత్వం తరపున ఆహ్వానాన్ని అందించేందుకు వారి సమయం కోరినట్లు మంత్రి పొన్నం చెప్పారు.కాగా,సెక్రటేరియట్లో తెలంగాణతల్లి విగ్రహ ఏర్పాటు స్థలంపై బీఆర్ఎస్ తొలినుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోట తెలంగాణతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణతల్లి విగ్రహంలో చేసిన మార్పులపైనా బీఆర్ఎస్ గుర్రుగా ఉంది. -
మంచి చెడుల మేళవింపు.. రేవంత్ ఏడాది పాలన!
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు ఏడాది. గత ఏడాది అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది మొదలు రేవంత్ పెద్ద ఒడిదుడుకులు లేకుండానే పాలన సాగించడం ప్రధాన విజయమని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడి పాలనతో పోలిస్తే రేవంత్ చాలా మెరుగున్న భావన ఏర్పడుతుంది. అక్కడలా ఇక్కడ మరీ అరాచక పరిస్థితులు లేవు. ప్రత్యర్థులపై ఇష్టారీతి దాడుల్లేవు. అధికారంలో ఉన్న నేతల మాదిరిగా పచ్చి అబద్దాలు చెప్పడం లేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎలాగొలా అమలు చేయాలన్న తాపత్రయం తెలంగాణలో కనిపిస్తోంటే.. ఏపీలో సూపర్‌సిక్స్ హామీలను ఎలా ఎగవేయాలా అన్న మోసపూరిత ధోరణి కనిపిస్తోంది. అలాఅని రేవంత్ ప్రభుత్వం అంతా సక్రమంగా చేస్తోందని చెప్పలేము. లోటుపాట్లు ఇక్కడా ఉన్నాయి. ప్రజల్లో కొంత అసంతృప్తి కూడా వాస్తవమే. హైదరాబాద్ వంటి కీలకమైన ప్రాంతంలో రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడినట్లే కనిపిస్తోంది.ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని పాజిటివ్ పాయింట్లు, కొన్ని నెగిటివ్ పాయింట్లు ఉంటాయి. రేవంత్ ప్రభుత్వం సాధించిన విజయాలు ఎక్కువా? లేక అపజయాలు ఎక్కువా అన్న పోలికకు అప్పుడే వెళ్లజాలం. కానీ ప్రజలు అంచనా కట్టడం సహజం. కేసీఆర్ పాలనతో పోల్చి చూసుకోవడం కూడా మామూలే. ముందుగా రేవంత్ కు సానుకూలంగా ఉన్న అంశాల గురించి చూద్దాం...గ్రూపు కుమ్ములాటలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీలో ఏడాది కాలంలో అలాంటివి జరక్కుండా రేవంత్ ప్రభుత్వాన్ని నడిపారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు కూడా ప్రస్తుతానికి రేవంత్‌తో కలిసి నడుస్తున్నారు. సందర్భానుసారంగా రేవంత్ వారి మాటకు విలువిస్తూ కలుపుకుని పోతున్నట్లు కనిపిస్తోంది. గతంలో రేవంత్ పై విమర్శలు చేసిన కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడు ఆయనకు అనుకూలంగా మాట్లాడుతుండడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ ప్రచార ప్రకటనలలో ఉప ముఖ్యమంత్రి భట్టి ఫోటోకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ ప్రకటనలలో ఎక్కువసార్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడాన్ని చాలామంది బహిరంగంగానే చర్చిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో గతంలో మాదిరి సీఎంలను మార్చడానికి అధిష్టానం సిద్దంగా లేకపోవడం రేవంత్‌కు కలిసి వచ్చే అంశం. రేవంత్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్క అని ఒకప్పుడు వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ నేత కేటీఆరే.. ఇప్పుడు ఐదేళ్లు ఉంటే ఉండవచ్చని అంటూండటం గమనార్హం.ప్రజలలో కూడా ప్రభుత్వానికి అదే రీతిలో సానుకూలత ఉందా? దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హైదరాబాద్ కు దక్షిణాన ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్దికి సంకల్పించడం, స్కిల్ యూనివర్శిటీ, చెరువుల సంరక్షణకు చర్యలు, మూసి నదీతీర అభవృద్ది, పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని కొనసాగించడం మొదలైనవి ప్రభుత్వపరంగా చెప్పుకోదగిన అంశాలు. అదే టైమ్‌లో హైడ్రా కూల్చివేతలు, మూసీ వివాదం, లగచర్లలో జిల్లా కలెక్టర్‌పై ప్రజల దాడి, ఫార్మా హబ్ భూ సేకరణ నోటిఫికేషన్ వంటివి ప్రభుత్వానికి చికాకు తెచ్చిపెట్టాయి.కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో కొన్నిటిని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. పూర్తయ్యాయా? లేదా? అన్నది ఇంకో చర్చ. రైతులకు రూ.రెండు లక్షల వరకూ రుణమాఫీ చాలావరకు చేసినట్లే కనబడుతోంది. ఇంకా కొంతమందికి కాకపోయినా, ప్రభుత్వపరంగా ఈ లక్ష్యాన్ని నెరవేర్చాలన్న సంకల్పం కనబడుతుంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్ ప్రయాణం హామీని నెరవేర్చారు. వంట గ్యాస్ సిలిండర్లను రూ.500లకే ఇస్తామన్న హామీ అమలుకూ శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ బీమాను రూ.పది లక్షలకు పెంచారు. విద్యుత్తు వినియోగం నెలకు 200 యూనిట్లు వినియగించే కుటుంబాలకు ఉచిత కరెంట్ హామీని కూడా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వీటన్నింటిలో మహిళల ఉచిత బస్ ప్రయాణమినహా మిగిలినవి ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదని అనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేసినట్లు చెబుతున్న హామీలకన్నా, అమలు చేయని హామీలే ఎక్కువగా ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కరమైన అంశం. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, మరో విపక్షమైన బీజేపీలు పదే,పదే ఆ హామీలను గుర్తు చేస్తుంటాయి. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చేసిన వాగ్దానం గురించి! రైతుబంధు పథకం కింద గత ప్రభుత్వం రూ.పది వేలు ఇవ్వడానికి సిద్దపడితే ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టింది. ఆ సందర్భంలో తాము అధికారంలోకి రాగానే దానికి మరో ఐదువేలు జత చేసి ఇస్తామని రేవంత్ చెప్పారు. అది ఎంతవరకు అమలు అయింది చెప్పలేని పరిస్థితి. వ్యవసాయ కార్మికులకు రూ.12 వేల చొప్పున ఇస్తామని అన్నారు. వరి ధాన్యానికి బస్తాకు రూ.500ల బోనస్ ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు సన్న రకానికే ఇస్తామని అంటున్నారన్నది విపక్షాల విమర్శ. పేదలకు ఇళ్ల స్థలాల, రూ.ఐదు లక్షల సాయంపై త్వరలో లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రులు చెబుతున్నారు.ఇతర అంశాలను చూస్తే రేవంత్ కొన్ని కొత్త ఆలోచన లు చేశారు. వాటిలో ఫ్యూచర్ సిటీ ముఖ్యమైనది. హైదరాబాద్ కు దక్షిణాన అంటే శ్రీశైలం రోడ్డులో కొత్త నగరం అభివృద్ది చేస్తామని చెప్పారు. తద్వారా హైదరాబాద్ ను నలువైపులా అభవృద్దికి చర్యలు తీసుకుంటామని ప్రయత్నాలు ఆరంభించారు .అంతవరకు బాగానే ఉంది. అయితే ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాదిరి కాకుండా వాస్తవ అభివృద్ది జరగవలసి ఉంది. స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు మంచిదే. కాకపోతే కొన్ని పారిశ్రామిక సంస్థల నుంచి విరాళాలు తీసుకోవడం వివాదం అవుతోంది. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిచ్చిన విరాళాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు.హైదరాబాద్‌లో వరదలకు కారణం అవుతున్న చెరువుల కబ్జాలను తొలగించాలని ప్రత్యేకంగా హైడ్రా అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు. అది మంచి ఉద్దేశం అయినప్పటికీ, అనాలోచితంగా ఎక్కడబడితే అక్కడ కోట్ల రూపాయల విలువైన భవనాలను కూల్చివేయడం పెను వివాదమైంది. దీనిపై ప్రజలలో మొదట ఆసక్తి కలిగినా, ఆ తర్వాత జరిగిన కూల్చివేతలతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. పేదల ఇళ్లు పోవడంతో వారు రోడ్డున పడవలసి వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం కూల్చివేతల వేగం తగ్గించినా, జరగవలసిన నష్టం జరిగిపోయిందని చెప్పాలి. దీని ప్రభావం రియల్ ఎస్టేట్ మార్కెట్ పై కూడా పడింది. స్థలం లేదా అపార్ట్మెంట్ కొనాలంటేనే జనం భయపడుతున్నారని ఈ రంగంలోని వారు చెబుతున్నారు. కేటీఆర్ జన్వాడ జన్వాడ్ ఫార్మ్ హౌస కూల్చాలన్న తలంపుతో ఈ పర్వం ప్రారంభం అయిందన్న అభిప్రాయం ఉంది. కాని అది చివరికి ప్రభుత్వానికే ఇబ్బందిగా మారింది.మూసీ సుందరీకరణ అంశాన్ని రాజకీయ పక్షాలన్నీ సమర్థించినా, తదుపరి ఇళ్ల కూల్చివేతల సర్వే జరిగే సరికి, తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆశయం మంచిదే అయినా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ప్రభుత్వంపై ప్రజలలో అనుమానాలు రేకెత్తాయి. తన నియోజకవర్గం కొడంగల్ లోని లగచర్ల వద్ద ఫార్మా కంపెనీలకు స్థలం ఇవ్వాలని తలపెట్టగా, అక్కడ స్థానికంగా వ్యతిరేకత వచ్చింది. ఆ క్రమంలో జిల్లా కలెక్టర్ పై కూడా దాడి చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డిని, కొతమంది ఆందోళనకారులను అరెస్టు చేసినా, అంతిమంగా వారి డిమాండ్ ప్రకారం ప్రభుత్వ భూ సేకరణ నోటిఫికేషన్ ను మార్చేసుకుంది. ఇతర పరిశ్రమల స్థాపనకు ప్రయత్నాలు ఆరంభించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ నోటి దురుసుతో మాట్లాడుతూ రెచ్చగొట్టే యత్నం చేశారు. అయినా కేసీఆర్ ఒకటి, రెండుసార్లు మినహా అసలు స్పందించడం లేదు. విపక్షంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే దూకుడుగా ఉన్నారని అంటారు. అదే ప్రభుత్వంలోకి వచ్చాక కూడా చేస్తే దుందుడుకు స్వభావం పోలేదని అంటారు. ఈ విషయాన్ని రేవంత్ గుర్తు ఉంచుకుంటే మంచిది.కేసీఆర్ ప్రభుత్వం ఎంతకాదన్నా తెలంగాణపై గట్టి ప్రభావాన్ని చూపింది. హైదరాబాద్ ను విశేషంగా అభివృద్ది చేయడం కాని, విద్యుత్ సమస్యను తీర్చడం కాని, కొత్త సచివాలయం, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కాళేశ్వరం వంటి ప్రాజెట్టులు చేపట్టడం కాని నిర్దిష్ట కార్చారణ చేశారన్నది నిజం. వీటిలో కొన్ని లోటుపాట్లు, ఆరోపణలు ఉండవచ్చు. అయినా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు.కాళేశ్వరం, విద్యుత్ ప్లాంట్ల విషయంలో న్యాయ విచారణ కమిషన్ లు వేశారు. వాటివల్ల ఎంత పలితం ఉంటుందో చెప్పలేం. రేవంత్ కూడా ఒక ముద్ర వేసుకోవాలని చూస్తున్నప్పటికీ అది అంత సులువుగా లేదు. అలవికాని హామీలు ఇచ్చిన నేపథ్యంలో వాటిని అమలు చేయలేక, కొత్త స్కీములు తెస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని రేవంత్ సర్కార్ యత్నాలు చేస్తోందా అన్న భావన ఉంది.. ఇక్కడ ఒక్కమాట చెప్పాలి.తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షం బలంగా ఉండడం వల్ల ప్రజాస్వామిక వాతావరణం మరీ ఎక్కువగా దెబ్బతినలేదు. సోషల్ మీడియాపై ఏపీలో మాదిరి తీవ్ర స్థాయిలో దాడులు జరగడం లేదు. అయినా ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, హరీష్ రావులను అరెస్టు చేసిన తీరు, పిచ్చి కేసులు పెడుతున్న వైనం విమర్శలకు గురి అవుతోంది. అందుకే ఇందిరమ్మ సంక్షేమ రాజ్యమా? ఇందిరమ్మ ఎమర్జన్సీనా అని బీఆర్ఎస్ ధ్వజమెత్తుతోంది. ఇటీవలి కాలంలో మాటలు తూటలు ఎక్కువగా కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే పేలుతున్నాయి. తద్వారా బీజేపీకి స్పేస్ దొరకడం కష్టం అవుతోంది. రేవంత్ తన ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకు పెరుగుతోందో ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి. లేకుంటే అంతా బాగుందని భ్రమ పడితే ఏమవుతుందో చెప్పడానికి పలు ఉదంతాలు ఉన్నాయి. రేవంత్ కు అయినా, మరెవ్వరికైనా ఒక్క సలహా ఇవ్వాలి.ద్వేషంతో రాజకీయం చేస్తే వారికే నష్టం వస్తుంది. తమకు ఉపయోగమా? కాదా?అన్నది ఆలోచించాలి తప్ప కక్షతో ఉన్న వ్యవస్థలను చెడగొట్టి, పగ, ప్రతీకారాలతో రాజకీయాలకు పాల్పడితే ప్రజలకు మేలు జరగదు సరికదా పాలకులు కూడా అప్రతిష్టపాలవుతారు. ఏపీలో ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును రేవంత్ గురువుగా అంతా చెప్పుకుంటారు. చంద్రబాబు ప్రభుత్వం మాదిరి మరీ చెడ్డపరు తెచ్చుకోకుండా ఉంటే మంచిది.ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది కనుక రేవంత్ కు ఆల్ ద బెస్ట్ చెబుదాం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అసలు ఆ విగ్రహం ఎవరిది?: కేటీఆర్ కీలక కామెంట్స్
సాక్షి,హైదరాబాద్:ప్రజాసమస్యలపై శాసనసభలో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో శుక్రవారం(డిసెంబర్ 6) జరిగిన అంబేడ్కర్ వర్థంతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా? కాంగ్రెస్ తల్లి విగ్రహాన్నా? విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం మాకు మ్యాటర్ కాదు..తెలంగాణ తల్లి మాకు మ్యాటర్.తెలంగాణ తల్లి విగ్రహం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదు.అసెంబ్లీలో లగచర్ల, గురుకులాలు,వ్యవసాయ సంక్షోభవం,ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తాం.అసెంబ్లీ,మండలి సమావేశాలు కనీసం నెల రోజులు నిర్వహించాలి. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ప్రభుత్వాలు మారినపుడల్లా గత ప్రభుత్వం నిర్ణయాలు మారాలా? ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన భారతమాత రూపాన్ని వాజపేయి మర్చలేదు. నాలుగేళ్ళ తర్వాత రాజీవ్ రాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటోంది.కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి నోటికి హద్దు,అదుపు లేకుండా పోయింది.సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నాడు. రేవంత్ చెప్తే..కేసీఆర్ నేర్చుకోవాల్సిన పరిస్థితిలో లేరు.మర్యాద రేవంత్ అడుక్కుంటే రాదు..ఇచ్చి పుచ్చుకోవాలి.కేసీఆర్‌ను గౌరవిస్తేనే..రేవంత్ రెడ్డిని ఆయన కుర్చీని గౌరవిస్తాం.125అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ నిర్లక్ష్యం చేస్తున్నాడు. హైకమాండ్ నుంచి వచ్చిన డైరెక్షన్‌తోనే అంబేద్కర్,పీవీ విగ్రాహాలను రేవంత్ పట్టించుకోవడం లేదు.తనను యూపీలో తిరగనివ్వడం లేదని మెత్తుకుంటోన్న రాహుల్ గాంధీ..తెలంగాణలో ఏం జరుగుతుందో ముందు తెలుసుకోవాలి.తెలంగాణలో నడిచేది ఇందిరమ్మ పాలన కాదని, ఇందిరమ్మ ఎమర్జెన్సీ నడుస్తోంది’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. -
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. హరీశ్‌రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు పెట్టడానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం(డిసెంబర్6) ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు పార్టీ శ్రేణులు భారీగా నిరసనకు హాజరవనున్నారు.ఈ నిరసన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలను వారి ఇళ్ల వద్దే హౌస్ అరెస్టులు చేస్తున్నారు.పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. కాగా, గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, హరీశ్‌రావు, పల్లారాజేశ్వర్రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కౌశిక్‌రెడ్డికి అర్ధరాత్రి నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వగా హరీశ్‌రావు, పల్లారాజేశ్వర్రెడ్డిలను పోలీసులు సాయంత్రం విడుదల చేశారు. మాజీ మంత్రి హరీవ్‌రావు హౌస్ అరెస్టు..మాజీ మంత్రి హరీశ్‌రావును కోకాపటలోని తన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ధర్నాలో పాల్గొనకుండా అడ్డుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులపై హరీశ్‌రావు ఫైర్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించారు.ధర్నాకు వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం అప్రజాస్వామికమని వ్యాఖ్యఎమ్మెల్సీ కవిత హౌస్ అరెస్ట్ ఎమ్మెల్సీ కవితన బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.ధర్నాకు వెళ్లకుండా పోలీసులు కవితను అడ్డుకున్నారు. కవిత ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు.తెలంగాణభవన్‌కు చేరుకున్న కేటీఆర్.. భారీగా పోలీసులుబీఆర్ఎస్ హైదారబాద్ నగర ఎమ్మెల్యేలను, నేతలను ఇళ్లలో నుంచి బయటికి రాకుండా పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు.మరోపక్క తెలంగాణభవన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు.తెలంగాణభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుగా తెలంగాణభవన్‌కు చేరుకుని ఇక్కడిక నుంచి ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు వెళ్లాల్సి ఉంది.కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హౌస్ అరెస్ట్..బీఆర్ఎస్ నిరసనకు వెళుతున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను శుక్రవారం ఉదయమే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొంపల్లిలోని దండెమూడి ఎంక్లేవ్లోని కేపీ వివేకానంద్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు.కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం హౌస్ అరెస్ట్ఏం తప్పు చేశామని హౌస్ అరెస్టు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించిన మాధవరంప్రోటోకాల్ ప్రకారం అభివృధి కార్యక్రమాలకు పోలీసులను పిలిచానా స్పందించరుబీఆర్ఎస్ కార్పొరేటర్టు, నాయకులను మాత్రం హౌస్ అరెస్టు చేస్తారుఉదయాన్నే పోలీసులు ఇంటికి వచ్చి తమ పనులకు వెళ్లకుండా.. అడ్డుకోవడం దారుణంముషీరాబాద్, అంబర్‌పేట ఎమ్మెల్యేల నిర్బంధం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌లను క్వార్టర్స్‌లోనే నిర్బంధించిన పోలీసులు ఇదీ చదవండి: కౌశిక్‌రెడ్డి అరెస్టు..10 గంటల హైడ్రామా -
HYD: కౌశిక్‌రెడ్డికి అర్ధరాత్రి బెయిల్
సాక్షి,హైదరాబాద్:బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ సీఐని దుర్భాషలాడిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం(డిసెంబర్5)అర్ధరాత్రి ఒంటిగంటకు కొత్తపేటలోని జడ్జి నివాసంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు ప్రవేశపెట్టగా జడ్జి బెయిల్ మంజూరు చేశారు.రూ.5వేల పూచీకత్తుతో కౌశిక్‌రెడ్డికి బెయిల్ ఇచ్చారు.కౌశిక్‌రెడ్డికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా జడ్జి నివాసం వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్,రాగిడి లక్ష్మారెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులతో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. కౌశిక్‌రెడ్డిని గురువారం ఉదయం ఆయన ఇంటివద్ద బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసినప్పుడు హైడ్రామా జరిగింది. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగి అడ్డుకోవడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం విడుదల చేశారు. ఇదీ చదవండి: కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత -
వేసవిలో ప్రాణహిత శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్లతోపాటు అంచనాలను సవరించి వచ్చే వేసవిలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఎన్నికల హామీ మేరకు ఈ టర్మ్‌లోనే ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించే అంశాన్ని పునఃపరిశీలిస్తున్నామని.. నిపుణుల సలహా మేరకు ముందుకెళ్తామని అన్నారు. గత డిజైన్లు, నీటి లభ్యతను పునఃసమీక్షించి బరాజ్‌ను తప్పనిసరిగా కడతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేపటితో (డిసెంబర్ 7) ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఏడాది కాలంలో సాధించిన ప్రగతి, పాలనా విశేషాలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘కాళేశ్వరాన్ని’ సాధ్యమైనంత వరకు వాడుకుంటాం... తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగానే ఉండాలనే రాజకీయ దురుద్దేశాలు మాకు లేవు. ప్రాజెక్టును ఏ మేరకు ఉపయోగంలోకి తీసుకురాగలమో అంతవరకు తీసుకొస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక కోసం నిరీక్షిస్తున్నాం. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచనల మేరకు బరాజ్‌లను రక్షించుకోవడానికి గ్రౌటింగ్ పనులను అధికారులు చేయడంపై ఎన్డీఎస్ఏ అభ్యంతరం తెలపడం వాస్తవమే.మేడిగడ్డ బరాజ్ కుంగినందున అన్నారం, సుందిళ్ల బరాజ్లనైనా వాడుకోవచ్చా? అని ఎన్డీఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌ను అడిగా. మూడు బరాజ్‌లకు సికెంట్ పైల్స్ వాడటంతో వాటి భద్రతపై అనుమానాలున్నాయని.. క్లియరెన్స్ ఇవ్వలేమని ఆయన బదులిచ్చారు. దీనిపై డిసెంబర్ ఆఖరిలోగా పరిశీలించి చెప్తామన్నారు. ‘కాళేశ్వరం’లేకున్నా రికార్డుస్థాయి దిగుబడి.. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లలో చుక్క నీళ్లు నిల్వ చేయకపోయినా గత వానాకాలంలో 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండటం దేశంలోనే రికార్డు. ధాన్యం అమ్మకాలతో రైతులు రూ. 35–40 వేల కోట్లు ఆర్జించారు. సన్నాలకు పరిమితి లేకుండా రూ. 500 చొప్పున 1,87,532 మంది రైతులకు బోనస్ ఇచ్చాం. యాసంగిలో సన్నాలకు బోనస్ కొనసాగిస్తాం. దొడ్డు వడ్లనూ కొంటాం. పాత, కొత్త ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక కమీషన్లు వచ్చే పనులకే ప్రాధ్యాతనిచి్చంది. మేము సాగునీటి ప్రాజెక్టులను ఏ, బీ కేటగిరీలుగా విభజించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సత్వరమే సాగునీరు ఇచ్చే పనులను చేస్తున్నాం. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, డిండి, దేవాదుల, గౌరవెల్లి, ఎస్సారెస్పీ, అచ్చంపేట లిఫ్టుతోపాటు కొత్తగా చేపట్టిన కొడంగల్–నారాయణపేట ప్రాజెక్టులను ఈ టర్మ్‌లోనే పూర్తిచేస్తాం. నా ప్రధాన బాధ్యతగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులను రెండేళ్లలో పూర్తిచేస్తా. జాతీయ విధానం ఆధారంగా లోయర్ మానేరు, మిడ్‌మానేరు ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపు పనులను ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్నాం. తర్వాత అన్ని ప్రాజెక్టుల్లో చేపడతాం. సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్రాభివృద్ధికి నిధులు సమీకరిస్తారని నమ్ముతున్నా.. బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ. 22,160 కోట్లు కేటాయిస్తే అందులో రుణాలు, వడ్డీల చెల్లింపులు పోగా మిగిలిన రూ. 11 వేల కోట్లను ప్రాజెక్టులపై ఖర్చు చేస్తున్నాం. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాజెక్టులకు, రాష్ట్రాభివృద్ధికి సరిపడా నిధులు సమీకరిస్తారని నమ్మకం ఉంది. అన్ని జిల్లాలూ సమానమే.. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రాజెక్టులకే ప్రాధ్యాత ఇస్తున్నామన్న ఆరోపణలు అవాస్తవం. కరీంనగర్లో గౌరవెల్లి ప్రాజెక్టుకి రూ. 500 కోట్లు ఇచ్చాం. చిన్నకాళేశ్వరం పూర్తి చేస్తున్నాం. పెద్దపల్లిలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తున్నాం. మాకు అన్ని జిల్లాలు సమానమే. గత సర్కారు చుక్క నీటినీ సాధించలేదు.. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి వాటాలపై రాజీ ప్రసక్తే లేదు. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల ఉమ్మడి ఏపీ వాటాలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులను అంగీకరిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి లిఖితపూర్వకంగా సమ్మతి తెలిపింది. తాజాగా అందుకు అంగీకరించబోమని.. 70 శాతం పరీవాహక ప్రాంతంగల తెలంగాణకే 70 శాతం జలాలను కేటాయించాలని కేంద్రంతో కోట్లాడుతున్నాం. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క–సారక్క ప్రాజెక్టులకు చుక్క నీటి కేటాయింపులను కూడా గత సర్కారు సాధించలేదు. మా ప్రయత్నాలతో సీతారామకు 67 టీఎంసీల కేటాయింపులు తుది దశకు చేరాయి. శ్రీశైలంపై 10 రోజుల్లో సుప్రీంకు... (బాక్స్ ఐటెమ్) శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు, ఇతర మార్గాల ద్వారా ఏపీ అక్రమంగా నీళ్లు తరలిస్తుండడంపై వారం 10 రోజుల్లో సుప్రీం కోర్టులో కేసు వేయబోతున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యంతోనే నాగార్జునసాగర్‌పై నియంత్రణ సీఆర్పీఎఫ్ చేతుల్లోకి వెళ్లిందని ఎమ్మెల్సీ కె.కవిత చేసిన ఆరోపణలు అర్థరహితం. సాగర్‌ను తిరిగి కైవసం చేసుకోవడానికి చట్టప్రకారం అన్నీ చేస్తాం. ఇంజనీర్ల పదోన్నతులపై హైకోర్టులో స్టే తొలగిన వెంటనే నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరిస్తాం. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల్లో భారీ సంస్కరణలు తీసుకొస్తున్నాం. జనవరి లేదా ఫిబ్రవరిలో రేషన్‌కార్డులకు సన్న బియ్యం.. రైతులు సన్నాలను అధిక ధరకు ధాన్యం వ్యాపారులకు అమ్ముకోవడం సంతోషకరం. రేషన్‌కు కొరత లేకుండా అవసరమైన సన్న బియ్యాన్ని సమీకరిస్తాం. మేము అధికారంలోకి వచ్చేసరికి సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పులు రూ. 58,623 కోట్లు ఉండగా 10 నెలల్లో రూ. 11,600 కోట్లను కట్టేశాం. సంస్కరణల్లో భాగంగా మరో రెండు పంటల నాటికి మిల్లర్ల నుంచి 100 శాతం బ్యాంకు గ్యారంటీ అడుగుతాం. డిఫాల్టర్ల నుంచి చట్టపరమైన చర్యలతో రికవరీ చేస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు పూర్తయ్యాక రేషన్‌కార్డుల జారీకి మళ్లీ కసరత్తు ప్రారంభిస్తాం. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీని జనవరి లేదా ఫిబ్రవరిలో మొదలుపెట్టే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో... తెలంగాణ ప్రజాకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. వన్ మ్యాన్ షో.. వన్ ఫ్యామిలీ షో అన్నట్లుగా పాలన సాగింది. నిలువెల్లా అహంకారం, నియంత్రతృత్వ ధోరణి, అవినీతితో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నాటి సర్కార్ నీరుగార్చింది. మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శాసనసభ గౌరవాన్ని పెంపొందించాం. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. సమర్థంగా శాఖలను పరుగెత్తిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రులకు గౌరవం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటుంది. బీఆర్ఎస్ అతిచేస్తోంది.. మేము అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు. ఇదైపోయింది... అదైపోయిందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదు. మూసీ ప్రాజెక్టులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా కుంభకోణం అనడం అతి. బీజేపీ, బీఆర్ఎస్ ఉద్యోగ, ఉపాధి కల్పనలో పదేళ్లు విఫలమయ్యారు. 10 నెలల్లోనే 55 వేల ఉద్యోగాలిచ్చాం. నిన్న ఇంకా 9 వేల ఉద్యోగాలు భర్తీ చేసినా ఏడుపే. పదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టునూ భర్తీ చేయలేదు. మేము 11 వేల మంది టీచర్లను నియమించాం. నీటిపారుదల శాఖలో 687 మంది ఏఈఈలను భర్తీ చేశాం. -
హరీశ్‌రావు అరెస్టు..10 గంటల హైడ్రామా
గచ్చిబౌలి/ బంజారాహిల్స్/ సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అరెస్టుతో గచ్చిబౌలి ఠాణా అట్టు డికింది. పార్టీ మరో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేస్తారనే సమా చారంతో గురువారం ఉదయం కొండాపూర్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన హరీశ్‌ను గచ్చిబౌలి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు బంజారాహిల్స్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం కౌశిక్‌రెడ్డి ఇంటికి వచ్చిన మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకుని రాయదుర్గం పీఎస్‌కు తీసుకెళ్లారు. అయితే హరీశ్‌రావు అరెస్టుతో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్‌స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు. మరోవైపు హరీశ్‌రావును పరామర్శించేందుకు ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణుల తరలిరావడం, భారీయెత్తున బలగాల మోహరింపుతో గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి, పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడంతో 50 మందికి పైగా నాయకులను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.కాగా హరీశ్‌రావును ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8.30 వరకు పీఎస్‌లోనే ఉంచిన పోలీసులు ఆ తర్వాత విడుదల చేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పోలీస్‌స్టేషన్‌లో హరీశ్‌రావును పరామర్శించారు.ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీస్ రాజ్యం హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డిలను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు..ఎమర్జెన్సీని తలపించేలా పోలీస్ రాజ్యం నడుస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఫిర్యాదును తీసుకోని ప్రభుత్వం కేసులు పెట్టడం అన్యాయం అని అన్నారు. తెలంగాణ సమాజం అణచివేతను సహించదని, తమ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు.ప్రజల పక్షాన ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, నిర్బంధించడం ప్రభుత్వానికి తగదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. హమీలు అమలు చేయడం చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి, అక్రమ అరెస్టులతో గొంతులు మూయాలని ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. సీఐని బెదిరించారనే ఆరోపణలపై కౌశిక్‌రెడ్డి అరెస్టు పోలీసు విధులను అడ్డుకోవడమే కాకుండా అంతు చూస్తానంటూ బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రను బెదిరించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. కొండాపూర్‌లోని కోలా లగ్జారియా విల్లాస్‌లో ఉంటున్న ఆయన్ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సీఎం రేవంత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డిలపై ఫిర్యాదు చేసేందుకు బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన కౌశిక్‌రెడ్డి..తనతో వాగ్వివాదానికి దిగడమే కాకుండా పోలీసు వాహనానికి తన కారును అడ్డుగా పెట్టి విధులకు ఆటంకం కలిగించారని ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు.దీంతో బీఎన్ఎస్ సెక్షన్లు 57, 126 (2), 127 (2), 132, 224, 333, 451 (3), 191 (2) రెడ్‌విత్ 190, 3(5) కింద కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్టు చేశారు. ఉదయం ఇంట్లో ఉన్న కౌశిక్‌రెడ్డి బయటకు రాకపోవడంతో, తమకు సహకరించాలని లేనిపక్షంలో తామే బలవంతంగా లోపలికి రావాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఆయన తలుపులు తీశారు. అప్పటికే లోపల ఉన్న హరీశ్‌రావును తొలుత అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన కానును సీజ్ చేశారు.పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు వివేక్‌గౌడ్, సంజయ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పరామర్శించారు. కౌశిక్‌రెడ్డి అరెస్టు విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, రాకేష్‌రెడ్డి తదితరులను అరెస్టు చేసిన పోలీసులు రాయదుర్గం, నార్సింగి పీఎస్‌లకు తరలించారు. -
సీఎం రేవంత్ పగ పట్టారు: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పగ, ప్రతీకారాలతో పనిచేస్తోదంటూ మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. గురువారం రాత్రి గచ్చిబౌలి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ, ఎఫ్ఐఆర్లు పోలీస్‌స్టేషన్ నుంచి కాదు.. గాంధీభవన్ నుంచి వస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు.రేవంత్‌రెడ్డి పాలనపై దృష్టి లేదు. అక్రమ కేసులు, అక్రమ సంపాదనపైనే ఆయన దృష్టి. ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. వందరోజుల్లో హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్‌పై సంతకాలు చేసి. ప్రజల కాళ్లా వేళ్లా పడి ఓట్లు వేయించుకున్నారు. ఆ హామీలు అమలు చేయాలని మేం అడుగుతున్నాం.. తప్పా?. రేవంత్‌రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అవ్వాతాతలకు 4వేల పెన్షన్ ఇస్తానన్నావ్ ఎప్పుడిస్తావ్?. మూసీలో పేదల ఇళ్లు కూలగొట్టొద్దన్నారు. ఇది సూచన కాదా?. సూచనలు తీసుకునే సోయి నీకు లేదు. గల్లీ నాయకుడిలా, ముఠా నాయకుడిలా కక్షతో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారు’’ అంటూ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, అంతకు ముందు మాజీ మంత్రి హరీష్‌రావును విడుదల చేయాలంటూ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొన్ని గంటల పాటు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న హరీశ్‌రావును ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు, బీఆర్ఎస్నేతలు కలిశారు. కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించకుండా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగిన తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదీ చదవండి: హైకోర్టులో హరీష్ రావుకు ఊరట -
ఏడాది పాలనలో 55వేల ఉద్యోగాలను భర్తీ చేశాం: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్ : కాంగ్రెస్ ఏడాది పాలనలో 55వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏడాది పాలనపై కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలనలో 55వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఉన్నాయా? అని వ్యాఖ్యానించారు. ..‘తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రావాలనే సంకల్పంతో ఆరుగ్యారెంటీలను అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలతో పోటీ పడి ఆర్టీసీ ఉద్యోగులు ఆరుగ్యారెంటీల నుంచి ప్రయాణికుల్లో అవగాహన కల్పించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలకు బ్రాండ్ అంబాసీడర్లుగా ఆర్టీసీ ఉద్యోగులు పనిచేయబట్టే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది...అలాంటి బ్రాండ్ అంబాసీడర్లయిన ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పరిష్కరిస్తూనే ఉంటుంది. గత ప్రభుత్వంలో నష్టాల్లో ఉన్న సంస్థను కాంగ్రెస్ మహాలక్ష్మీ పథకం ప్రవేశపెట్టడంతో గతేడాది నవంబర్ నెల నుంచి ఈ ఏడాది నవంబర్ నెల వరకు సుమారు 113కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు...ఆర్టీసీ అభివృద్ది దిశగా నడిపిస్తున్నాం. రూ.4వేల కోట్లను ఆర్టీసీకి బదిలీ చేశాం. కేసీఆర్ పాలన లో ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ ఇప్పుడు అదే ఆర్టీసీ లాభాల్లో నడుస్తోంది. ప్రజాపాలనకు ఏడాది పూర్తయిన సందర్బంగా రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను గుర్తు చేయాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆరు గ్యారెంటీలలో భాగంగా డిసెంబర్ 9న ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశాం. ఇది ఆర్టీసీని పునరుజ్జీవింప చేసింది...ఇది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగును నింపే కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిది. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ అయినా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న నేనైనా బాధ్యతాయుతంగా రవాణా కార్మికుల ఆకాంక్షలను గౌరవించాల్సిందే.కానీ ఆనాడు ఆర్టీసీ కార్మికులు చనిపోయినా పరామర్శించని పరిస్థితి. ఈనాడు కీలకమైన అంశాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతీ ఆడబిడ్డ ప్రతీ నెలా 5 నుంచి 7 వేలు ఆదా చేయగలుగుతున్నారు.పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలను రూ.500లకే గ్యాస్ సిలిండర్.. పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం. ప్రతీ నెలా ఒక కుటుంబానికి 10వేలు ప్రయోజనం పొందేలా పథకాల అమలు జరుగుతోంది. రాష్ట్రంలో 25లక్షల 35 వేల రైతు కుటుంబాలకు మొదటి ఏడాదిలోనే 21కోట్లతో రైతు రుణమాఫీ చేశాం.వరి వేసిన వారికి గిట్టుబాటు ధరతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తున్నాం. 1కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించింది. దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు.. అందుకే రైతులు సన్నాలు పండించండి. తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో, రేషన్ షాపుల్లో, మధ్యాహ్న భోజనాలకూ సన్నబియ్యం అందిస్తాం. ఈ నేలలో పండిన పంటనే మన బిడ్డలకు అందిస్తాం. బియ్యం రీసైక్లింగ్ మాఫియాను కూకటి వేళ్లతో పేకలిద్దాం.నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్లు పారిపోతే.. కోర్టుల్లో కేసులు పరిష్కరించి మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉందా. ఏ లక్ష్యం కోసం అమరుల ప్రాణ త్యాగం చేశారో.. ఆ లక్ష్య సాధనలో భాగంగా తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాం. ఇందులో ఒక్క తల తగ్గినా నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా.నగరంలో కాలుష్య నియంత్రణలో రవాణా శాఖది కీలక పాత్ర. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ కు పంపాల్సిన బాధ్యత మీపై ఉంది..ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉంది.. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీపై ఉంది.రాబోయే రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడుతాం.హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుకునేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో ఒక ప్రణాళిక రూపొందించండి..నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చాల్సిన బాధ్యత మనపై ఉంది.మూసీకి గోదావరిని అనుసంధానం చేసి మూసీని అభివృద్ధి చేస్తాం.అవసరమైతే కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకునైనా సరే హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని పారదోలుతాం.హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా నిలబెట్టేందుకు కృషి చేస్తాం’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
Harish Rao Arrest: గచ్చిబౌలి పీఎస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్‌రావును విడుదల చేయాలంటూ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న హరీశ్‌రావును ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు, బీఆర్ఎస్నేతలు కలిశారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు(శుక్రవారం) బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొనున్నారు.ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తూ.. రేవంత్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని బీఆర్ఎస్ మండిపడుతోంది. కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించకుండా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావు, జగదీష్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇక, ఇదే సమయంలో కౌశిక్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని క్రైం నెంబర్ 1127/ 2024 కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ క్రమంలో బుధవారం కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. దీంతో, హరీష్, జగదీష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. -
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత ఇళ్లు ఉంటే పేదలు ఆత్మగౌరవంతో, ఉన్నతంగా బతుకుతారని అన్నారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి పేదలకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.తెలంగాణ సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. ఇళ్లకు సంబంధించి విధి విధానాలు సరళీకృతం చేస్తూ యాప్ రూపొందించాం. ఈ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. ఐటీడీఏ ప్రాంతాల్లో కోటాతో సంబంధం లేకుండా జనాభా ప్రాతిపదికన ఇళ్ల ప్రక్రియ జరుగుతుంది.ఇందిరమ్మ ఇళ్లపై ఉన్న లోన్స్ తీర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా 7 వేల మందికి రుణ విముక్తి కలుగుతుంది. అర్హుల జాబితాను తయారు చేసి కేంద్రానికి పంపుతాం. మొదటి ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను పంపిణీ చేయబోతున్నాం. 3500 ఇండ్లతో సంబంధం లేకుండా ఆదివాసులకు ప్రత్యేక కోటా ఉంటుంది. 2004 నుంచి 14 వరకు వైఎస్సార్ హయంలో 25లక్షల 4వేల ఇండ్లను పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరిగింది. ప్రతీ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ కట్టబోతున్నాం ప్రజలు వచ్చి చూడవచ్చు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభానికి ఆహ్వానం పంపుతున్నాం. పొన్నం ప్రభాకర్ వెళ్లి వారిని పిలుస్తారు. కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపిస్తున్నాం. 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్ ప్రాంతంలో పండుగ వాతావరణం ఉంటుంది. పేదలకు భూములపై హక్కు కల్పించింది ఇందిరమ్మే. ఏ ఊరికి వెళ్లినా ఇందిరమ్మ కాలనీ ఉంటుంది. రుణ విముక్తి చేయడం ద్వారా పేదలకు ఇళ్లపై హక్కు కల్పించాం. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి పేదలకు ఇళ్లు కట్టిస్తాం. కేసీఆర్ రద్దు చేసిన హౌసింగ్ బోర్డును పునరుద్దరిస్తాం. బీఆర్ఎస్ ప్రాధాన్యత వారి సొంత భవనాలు, పార్టీ కార్యాలయాలే. బీఆర్ఎస్ పాలనలో బస్తీ బస్తీలో బెల్టు షాపులు ఉండేవి. రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడితే ఇప్పుడు పరిస్థితేంటి?. బీఆర్ఎస్ పాలనలో వేల ఎకరాలు అప్పనంగా అమ్మేశారు. అద్బుతంగా ఉపన్యాసాలు ఇచ్చారు తప్ప ఇళ్లను ఇవ్వలేదు. ప్రతిపక్షాలు మాకు సహకరించాలి.. సూచనలు చేయాలి. కేసీఆర్ మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి.. మాకు సూచనలు ఇవ్వండి. తెలంగాణ రైజింగ్ అని మనం అనకూడదా?. మీ చతురత చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
సూటుకేసులు మీకు.. అరెస్టులు మాకు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. అలాగే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల అరెస్ట్ అప్రజాస్వామికం.. వారిని వెంటనే విడుదల చేయాలని కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు !పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు !పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు !గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు !ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు !ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు !ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు !ప్రజలపై కేసులు.. ప్రజాప్రతినిధులపై కేసులుకేసులు .. కేసులు .. కేసులు.. కాసులు మీకు-కేసులు మాకుసూటుకేసులు మీకు .. అరెస్టులు మాకుమాజీ మంత్రులు మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గార్లతోపాటు మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,నాయకుల అరెస్ట్ లు అప్రజాస్వామికం..తక్షణం విడుదల చెయ్యాలి...జాగో తెలంగాణ జాగో’ అంటూ కామెంట్స్ చేశారు ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు !పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు !పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు !గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు !ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు !ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు !…— KTR (@KTRBRS) December 5, 2024 ఎమ్మెల్యే @KaushikReddyBRS ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని తెలిసి ఏసీపీ పరార్... సీఐ పారిపోతారు... ఎంత అధికార పార్టీకి ఊడిగం చేస్తే మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేను అధికారికంగా మీ ఆఫీసులోనే కలిసేందుకు కూడా భయమా? పట్టుకొని నిలదీస్తే... అక్రమ కేసులా? ఇదెక్కడి రాజకీయం? ఇదేనా ప్రజా…— KTR (@KTRBRS) December 5, 2024 -
కౌశిక్ రెడ్డిపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌తో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు. పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఆయన గొడవ పడే విధంగా వ్యవహారించాడు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేకపోయే సరికి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారు. ఇన్ని రోజులు పట్టించుకోని వారిని కూడా ఇప్పుడు బయటకు తీసుకువస్తున్నారు.కేసీఆర్‌ను కేటీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిజంగా రాజీనామా చేశారు. మంత్రి వెంకట్‌రెడ్డి గురించి గంధపు చెక్కల వ్యాపారి ఒకరు అగౌరవంగా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుంది. ఇష్టం వచ్చినట్టు ఎవరినా మాట్లాడినా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎవరైనా సరే.. చూస్తూ ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ అధికారాన్ని ఉపయోగించుకోలేదు.. మేము ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టే ఉత్సవాలు చేసుకుంటున్నాం.ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు చెబుతున్నా.. సలహాలు, సూచనలు చేయండి అంతే కానీ అర్ధం పర్థం లేని విమర్శలు ఎందుకు. మా నాయకుల మీద చిలువలు పలువలుగా మాట్లాడితే ఊరుకోము. మీ లాగా మేము అక్రమ అరెస్ట్ చేయదలుచుకుంటే ఒక్కరూ కూడా మిగలరు. ఫోన్ ట్యాపింగ్‌లో మీ హస్తం లేకపోతే అధికారులను దేశాలు ఎందుకు దాటిస్తున్నారు. మీరు చేసేది మంచి అయితే విదేశాల నుండి యూ ట్యూబ్‌లు ఎందుకు నడిపిస్తున్నారు.గతంలో ఉన్నట్లు ఇప్పుడు రాజకీయ సంస్కృతి లేదు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పని చెప్పండి అంతే కానీ లేని పోనీ విమర్శలు చేయకండి. ప్రతిపక్షాలు అంటే జనాలు ఆహ్వానించాలి కానీ జనాలు కేటీఆర్‌ను దగ్గరికి రానివ్వడం లేదు. మేము మళ్ళీ అధికారం లోకి వస్తాము. సంవత్సర కాలం ఓర్చుకున్నాము ఇక ఓర్చుకోము. ఏది పడితే అది మాట్లాడితే క్షమించము. మా పాలన చూసి వాళ్ళు ఓర్చుకోలేక పోతున్నారు. అధికారులు అధికార పార్టీకి తగ్గట్టుగా పని చేస్తారు. ఇప్పటి వరకు యూ ట్యూబ్‌ల విషయంలో చేసిన తప్పులు ఇక చేయము. గతంలో తెలంగాణ తల్లి బొమ్మని దొరసాని లాగా సృష్టించారు. గతంలో కవిత ఫేస్ లాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. మేము మన తెలంగాణ ప్రజల ఆత్మని ఆవిష్కరిస్తున్నాము’ అని కామెంట్స్ చేశారు. -
మాజీ మంత్రి హరీష్‌రావు, కౌశిక్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావు, జగదీష్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఇదే సమయంలో కౌశిక్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని క్రైం నెంబర్ 1127/ 2024 కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ క్రమంలో బుధవారం కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. దీంతో, హరీష్, జగదీష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..‘తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనే నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకడుతారు, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తరు?. ఇదేం విడ్డూరం. ఇదెక్కడి న్యాయం? ఇదేం ప్రజాస్వామ్యం?. రేవంత్ మీ పాలన మార్పు మార్కు ఇదేనా?. రాజ్యాంగాన్ని కాపాడుదామని రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతడు. నువ్వేమో తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటవు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం. నీ వెంట పడుతూనే ఉంటాం’ అంటూ విమర్శలు చేశారు. ఇందిరమ్మ రాజ్యమా...? ఎమర్జెన్సీ పాలనా?ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు.ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.ఈ దుర్మార్గాన్ని… pic.twitter.com/aXvinFpkqY— Harish Rao Thanneeru (@BRSHarish) December 5, 2024 -
సంక్రాంతికి గ్రామానికో రెవెన్యూ అధికారి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి లోపు రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని, తద్వారా రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ స్వలాభం కోసం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను గత ప్రభుత్వం రద్దు చేయడంతో గ్రామాల్లోని ప్రభుత్వ భూముల రక్షణ, రెవెన్యూ శాఖతో ప్రభుత్వానికి సమన్వయం విషయంలో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ధరణి పోర్టల్‌ను సరళీకృతం చేస్తామని, ఇప్పుడున్న 33 మాడ్యూల్స్ స్థానంలో 11–13 మాడ్యూల్స్ మాత్రమే ఉంచుతామని చెప్పారు. పహాణీల్లో ఇప్పటివరకు ఒక్కటే కాలమ్ ఉందని, ఇక నుంచి 12 లేదా 13 కాలమ్స్ పెడతామని, భూముల పుట్టు పూర్వోత్తరాలన్నింటినీ నమోదు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..5 లక్షలకు పైగా ధరణి దరఖాస్తులకు పరిష్కారంఅధికారంలోకి రాగానే ధరణి ప్రక్షాళన ప్రారంభించాం. ఏడాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షలు, ఈ ఏడాదిలో వచ్చిన 2.60 లక్షల దరఖాస్తులు కలిపి 5 లక్షలకు పైగా దరఖాస్తులను పరిష్కరించాం. ఇంకా 60–70 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ధరణి పునర్నిర్మాణ కమిటీని నియమించాం. 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చట్టం ముసాయిదాను ప్రజల్లో చర్చకు పెట్టాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దేశానికి రోల్ మోడల్‌గా ఉండేలా బిల్లు ప్రవేశపెడతాం. అటవీ, రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్ భూముల సరిహద్దు వివాదాలు వచ్చాయి. వీటిని సర్వే చేసి డీ మార్కింగ్ చేస్తాం. ఏ శాఖ భూములు ఆ శాఖకు ఇచ్చేస్తాం. పార్ట్–బీలో ఉన్న భూముల సంబంధిత సమస్యలను పరిష్కరిస్తాం. అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. బీఆర్ఎస్ హయాంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు తీసేసుకుంటాం. జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న సరైన దరఖాస్తులను త్వరలోనే పరిష్కరిస్తాం.వైఎస్ స్ఫూర్తితో ఇందిరమ్మ ఇళ్ల పథకంహైడ్రా కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయని, రియల్ ఎస్టేట్ దెబ్బతిందన్న వార్తల్లో వాస్తవం లేదు. ఈ ఏడాది ఆరు నెలల కాలంలో 6–7 శాతం మేర రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. మూసీ ప్రక్షాళన విషయానికొస్తే.. ప్రజలు నివసించే ప్రాంతాల జోలికి ఇప్పుడే వెళ్లబోం. ఇళ్లు తక్కువ ఉండి ప్రజలు లేనిచోట్ల ముందు అభివృద్ధి చేస్తాం. ఆ అభివృద్ధిని ప్రజలకు చూపించి వారిని ఒప్పించి మిగిలిన చోట్ల ముందుకెళతాం. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలో 18.56 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందించారు. ఆ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లను కేటాయిస్తున్నాం. కనీసం 400 చ.అ.లకు తగ్గకుండా వంట గది, టాయిలెట్‌తో కూడి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇది వచ్చే నాలుగేళ్లు కొనసాగుతుంది.కేంద్ర యాప్ తయారీలో ఆలస్యం వల్లే జాప్యంఇందిరమ్మ లబ్ధిదారుల వివరాల నమోదులో కేంద్రం రూపొందించిన యాప్‌ను వాడుతున్నాం. ఆ యాప్ సిద్ధమైతే తప్ప లబ్ధిదారుల వివరాల నమోదు సాధ్యం కాదు. ఆ యాప్ తయారీలో కేంద్ర జాప్యం వల్ల ఈ పథకం గ్రౌండ్ అవటంలో ఆలస్యం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి 1.52 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచి 96 వేలే పూర్తి చేసింది. మిగతా వాటిని కూడా పూర్తి చేసి నిరుపేదలకిస్తాం. రూ.187 కోట్లతో డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం. బాంబు పేలడమంటే జైల్లో పెట్టడం కాదుఅధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ అరాచకంగా, అక్రమంగా వ్యవహరించింది. ఇందుకు సంబంధించి 10–12 అంశాలపై సమాచారం తీసుకుంటున్నాం. బాంబులు పేలడమంటే ఎవరినో జైల్లో పెట్టడం కాదు. ఇందిరమ్మ రాజ్యంలో కక్ష సాధింపు చర్యలుండవు. ఉద్దేశ పూర్వకంగా ఏ వ్యక్తిని, కుటుంబాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. కానీ ఈ–రేస్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, విదేశాలకు నిధుల సరఫరా, ఫోన్ ట్యాపింగ్ లాంటి విషయాల్లో తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. తప్పని తేలితే శిక్ష తప్పదు. నేనూ ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే. బట్ట కాల్చి మీద వేయడమే బీఆర్ఎస్ పని. నా ఇంట్లో ఈడీకి దొరికిన డబ్బులు లెక్కపెట్టేందుకు వేలసంఖ్యలో కౌంటింగ్ మెషీన్లు తీసుకెళ్లారని చెప్పారు. ఈడీ అనే వ్యవస్థతో సంబంధముండే పార్టీతోనే కదా వారు అంటకాగింది. ఆ పార్టీని అడిగి నా ఇంట్లో ఎన్ని డబ్బులు దొరికాయో తెలుసుకోవచ్చు కదా. ఈ–రేస్ వ్యవహారం తెరపైకి రాగానే ఢిల్లీకి వెళ్లి ఎవరు ఎవరి కాళ్లు పట్టుకున్నారో అందరికీ తెలుసు. ప్రభుత్వంలోకి వచ్చాక నేను ఒక్క గజం భూమి కొనుగోలు చేశానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. మా పార్టీలోకి చేరికలు ఆగలేదు. కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్ఎస్ నేతల క్యూ చాలా పెద్దగా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ ఉండరు. ఆ పార్టీలో జబ్బలు చరుచుకుంటున్న వాళ్లు, 1, 2 స్థానాల కోసం పోటీలు పడుతున్న వాళ్లు కూడా ఉండరు. స్వేచ్ఛగా పని చేసుకుంటూ ఆనందంగా ఉన్నా..ఏడాది పాటు కీలక శాఖలకు మంత్రిగా పనిచేయడం సంతృప్తినిచ్చింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డి పెట్టిన పార్టీలో చేరి ఎంపీనయ్యా. ఐదేళ్లు ప్రజలకు సేవ చేశా. తర్వాతి ఐదేళ్లూ మాజీ సీఎం పుణ్యాన ప్రజలతో కలిసి అరణ్యవాసం చేశా. ఆ తర్వాత అదే ప్రజల దీవెనలు, ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యంలో సముచిత స్థానంలో ఉన్నా. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా పనిచేసుకుంటూ ఆనందంగా ఉన్నా. భవిష్యత్తులో ప్రజలకు మరింత మంచి చేసేందుకు నా వంతు ప్రయత్నిస్తా. -
పదేళ్లలో కోటి మంది మహిళలు 'కోటీశ్వరులు': రేవంత్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాబోయే పదేళ్లలో ఆర్టీసీ, సోలార్ విద్యుత్ కేంద్రాలు, ఐకేపీ కేంద్రాలు తదితర అన్ని రంగాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా కోటిమందిని కోటీశ్వరు లుగా మార్చేవరకు తాము విశ్రమించబోమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఆడబిడ్డల ఓట్లతోనే విజయం సాధిస్తామన్నారు. గత పదేళ్లకాలంలో ఒక్క విమానాశ్రయం కట్టలేదని, కానీ తాము రామగుండం, వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను కడతామని తెలిపారు. గత ప్రభుత్వం యువతకు ఉద్యోగాలివ్వలేదు కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలొచ్చాయని విమర్శించారు. తమ ఇందిరమ్మ పాలనలో ఏడాదిలోనే 55,143 మందికి ఉద్యోగాలిచ్చామని, ఇదే వేదికపై 8,084 మందికి నియామక పత్రాలు అందజేస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్ 10 వరకు తాము చేసిన పనులన్నీ చెప్పుకుంటామన్నారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి చూపించామని, దీనిపై ప్రధాన మోదీ, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి తమతో చర్చకు రావాలని సవాల్ చేశారు. కేటీఆర్, హరీశ్‌లను అచ్చోసిన ఆంబోతుల్లా సమాజంలోకి కేసీఆర్ వదిలిండని, తెల్లారిలేస్తే సోషల్ మీడియాలో తమపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా బుధవారం పెద్దపల్లిలో యువవికాసం పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.బలమైన కుర్రాడు ఒక్క రోజులో పిల్లాడిని కనలేడుగా..‘రూ.లక్ష కోట్లు వెచ్చించి కేసీఆర్ కాళేశ్వరం కడితే కూలింది. మేం 50 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టులేవీ చెక్కు చెదరలేదు. కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క ఎత్తకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. అందులో పెద్దపల్లి అగ్రగామిగా నిలిచింది. గతంలో వర్సిటీలు నిరాదరణకు గురయ్యాయి. మేం 10 వర్సిటీలకు వీసీలను నియమించాం. శాతవాహన వర్సిటీకి లా, ఇంజనీరింగ్ కాలేజీలు మంజూరు చేస్తున్నాం. డీఎస్సీ పిలిచి 11 వేల టీచర్ కొలువులిచ్చాం. చెప్పినవన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఇందిరా పార్కు వద్ద మూసేసిన ధర్నా చౌక్ తెరిపించాం. మా ప్రమాణ స్వీకారం రోజునే ప్రగతిభవన్ ముళ్ల కంచెను తొలగించాం. ప్రగతిభవన్‌లో ప్రతివారం చిన్నారెడ్డి ప్రజల ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తున్నారు. పేద పిల్లలకు 40% కాస్మెటిక్, డైట్ చార్జీలు పెంచాం. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను పరిష్కరించుకుంటాం. ప్రతిదానికీ ఒక విధానం ఉంటుంది. బలమైన కుర్రాడికి పెళ్లి చేసినంత మాత్రాన.. ఒక్కరోజులో పిల్లాడిని కనలేడుగా..’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.పదేళ్లలో ఉద్యాగాలెందుకు ఇవ్వలేదు? ‘కవితమ్మ ఎంపీగా ఓడిపోతే 3 నెలల్లో ఎమ్మెల్సీని చేశారు. సంతోష్‌కు రాజ్యసభ, ఎంపీ ఎ్ననికల్లో ఓడిన వినోద్‌కు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ ఇచ్చారు. అదే పదేళ్లలో ఎందుకు ఉద్యోగాలివ్వలేదు. ఇందుకోసమేనా తెలంగాణ విద్యార్థులు బలిదానం చేసింది? కొలువుల్లేక దాదాపు 35 లక్షల మంది ఉపాధి కూలీలుగా, అడ్డా కూలీలుగా మారారు. వందలాది బలిదానాలు, లక్షలాదిమంది కేసులు ఒక్క కుటుంబం కోసమా? తెలంగాణ ప్రజల కోసమా? 80 వేల పుస్తకాలు చదివిన మీకు నిరుద్యోగుల కష్టం అర్థం కాలేదా? అందుకే మేం ఆలోచన చేసి 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఆత్మహత్యలు చేసుకోవద్దని యువ వికాసం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం..’ అని సీఎం పేర్కొన్నారు. కొందరు విష ప్రచారం చేస్తున్నారు..‘పెద్దపల్లి జిల్లా ప్రజల వెన్నుదన్నుల వల్లే ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. కేసీఆర్ పదేళ్ల కాలంలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు. కనీసం తనలా ఎకరానికి రూ.కోటి ఆదాయం ఎలా తీయాలో నేర్పలేదు. నాడు ఎస్సారెస్పీ నీటి కోసం అరెస్టయిన విజయరమణారావు కల నేడు ఫలించింది. ఇవాళ ఆ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది. పెద్దపల్లి జిల్లాకు రూ.1,030 కోట్లతో ఆర్అండ్బీ, పీఆర్ పనులు, ఆర్టీసీ డిపో వచ్చాయంటే అందుకు కారణం మీ అభిమాన విజ్జన్న, శ్రీధర్‌బాబులే. వాస్తవానికి ఈ పనులు కావాలని మంత్రి శ్రీధర్‌బాబు మమ్మల్ని అడగలేదు..బెదిరించారు (నవ్వులు). తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి కరీంనగర్, ఆదిలాబాద్‌కు నీరిస్తాం. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాం. కొందరు తమకు భవిష్యత్తు లేదన్న భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారు చేసే విష ప్రచారాన్ని డిసెంబరు 10 వరకు తిప్పికొట్టి చరిత్ర తిరగరాస్తాం. నరేంద్ర మోదీ 14 ఏళ్లు గుజరాత్ సీఎంగా ఉన్నారు. 11 సంవత్సరాల నుంచి పీఎంగా ఉన్నారు. గుజరాత్లో తొలి ఏడాదిలో 55వేల ఉద్యోగాలు ఇచ్చారా? చర్చకు సిద్ధమా? మోదీకి ప్రత్యేక విమానం పెడతాం. సచివాలయంలో చర్చ పెడతాం..’ అని సీఎం సవాల్ చేశారు. మద్దతు ధర, బోనస్ ఇస్తున్నాం..‘రైతులకు ఎమ్మెస్పీ ఇవ్వడమే కాదు.. 66 లక్షల ఎకర్లాలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి మేం కట్టిన ప్రాజెక్టులతోనే సాధ్యమైంది. ఆనాడు ఐకేపీ కేంద్రాలు తెరవమంటే ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు.. వరి వేసుకుంటే ఉరే అని కేసీఆర్ చెప్పారు. నేడు ఇందిరమ్మ రాజ్యంలో మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నాం. రైతుబంధు రూ.7,625 కోట్లు ఇచ్చాం. రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీతో ఈ ప్రభుత్వం చరిత్రను తిరగరాసింది. గుజరాత్లో రైతు రుణమాఫీ చేశారా? చర్చకు సిద్ధమేనా?..’ అని రేవంత్ ప్రశ్నించారు.కులగణనలో కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదు?‘రాహుల్‌గాంధీ పిలుపుతో కులగుణన చేపట్టాం. 95 శాతం పూర్తి చేశాం. కులగణనలో కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదు? బీసీ దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే.. కేసీఆర్ కుటుంబం ఎందుకు దూరంగా ఉంది. మేం ప్రతిపక్షంలో ఉన్నపుడు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనలేదా? బీసీ సంఘాలు ఆలోచించాలి. బీసీ కులగణనలో పాల్గొనని వారిని సామాజికంగా బహిష్కరించాలి..’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 9న ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది.ప్రతీ రోజూ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయని నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కారు సిద్ధం చేస్తోంది. పంచాయతీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. నూతన ఆర్ఓఆర్ చట్టం, కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్, పలు కొత్త చట్టాలు అసెంబ్లీలో చర్చించనున్నట్లు తెలిసింది. -
ప్రతిపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొడతాం: సీఎం రేవంత్
సాక్షి, పెద్దపల్లి జిల్లా: ఉద్యోగాల కోసం మొదలైన పోరాటం.. ఉద్యమంగా మారి తెలంగాణ తెచ్చుకునేలా చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పెద్దపల్లిలో యువ వికాస సభలో మాట్లాడుతూ.. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి నినాదంతో ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇప్పటివరకు 56 వేల మందికి నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. మీ అందరి అభిమానంతోనే ముఖ్యమంత్రి అయ్యానని.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అంటూ రేవంత్ పేర్కొన్నారు.పదేళ్లు మోసం చేసినోళ్లే ఇప్పుడు..‘‘పదేళ్లు మోసం చేసినోళ్లే ఇప్పుడు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. పదినెలల పాలనపై వాళ్లు చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకోసం?. ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించేందుకే తెలంగాణ తెచ్చుకున్నామా?. కేసీఆర్ కుటుంబంలో అందరికి పదవులు వచ్చాయి. కవిత ఓడిపోతే మూడు నెలల్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు...ఉదయం లేస్తే ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు. శాసనసభకు వచ్చి కేసీఆర్ సలహాలు ఇవ్వొచ్చుకదా?. పదేళ్లలో నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగ పత్రాలు ఇవ్వలేదు? పరీక్షలు వాయిదా వేయాలంటూఐ కృత్రిమ ఉద్యమం సృష్టించారు. ధర్నా చౌక్ ఎత్తేసి నిర్బంధం విధించారు. గతంలో ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేసే పరిస్థితి ఉండేదా?’’ అంటూ రేవంత్‌ప ప్రశ్నించారు.కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు రేవంత్ సవాల్‘‘కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు సవాల్ విసురుతున్నా.. 25 ఏళ్లలో మోదీ గుజరాత్లో మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా... ? చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. 25లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్లు రుణమాఫీ కోసం విడుదల చేసిన చరిత్ర మాది. గుజరాత్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశారా ఎవరు చర్చకు వస్తారో రండి. ఒక్కరోజులోనే ఎవరూ అద్భుతాలు సృష్టించరు.. ప్రజలు మాకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు...పది నెలలు కూడా ఓపిక పట్టకుండా దిగిపో దిగిపో అంటున్నారు.. వాళ్ల దుఃఖం దేనికో అర్థం కావడంలేదు. పదేళ్లు సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో కేసీఆర్ ముందుకు వచ్చి సూచనలు ఇవ్వాలి. కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ ఎందుకు పాల్గొనడంలేదు?. మీరు బీసీ వ్యతిరేకులా.. బీసీలకు దక్కాల్సిన వాటా ఇవ్వడం ఇష్టం లేదా? బీసీ సంఘాలు ఆలోచన చేయండి. కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయండి’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 20 మంది అనుచరులపై కూడా కేసు నమోదైంది. విధులను అడ్డగించడంతో పాటు బెదిరింపులకు దిగారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఫిర్యాదు చేసేందుకు కౌశిక్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.అయితే, తాను వెళ్లకముందే ఏసీపీ వెళ్లిపోవడం పట్ల కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బంజారాహిల్స్ ఏసీపీ నన్ను మూడు గంటలకు ఫిర్యాదు తీసుకోవడానికి రమ్మన్నారు. నేను వెళ్లకముందే ఏసీపీ వెళ్లిపోయారు. సీఐ మా ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు’’ అంటూ మండిపడ్డారు.‘‘నా ఫోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఇంటిలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు ఇచ్చాను. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేస్తే హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న నేను ఫిర్యాదు చేస్తే రేవంత్ రెడ్డిపై వెంటనే కేసు పెట్టాలి. రేవంత్ రెడ్డి పాపాలకు భూకంపం వస్తుంది. బంజారాహిల్స్ ఏసీపీ, సీఐ ప్రవర్తన తీరు సరిగ్గా లేదు. పోలీసులు ఎందుకు అతి చేస్తున్నారు...పోలీసులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కాంగ్రెస్ మానకొండూరు ఎమ్మెల్యే చెప్పారు. ప్రభుత్వం అధికారుల ఫోన్లను ట్యాప్ చేస్తుంది. కరీంనగర్ సీపీ ఫోన్ ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ నేతల అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవిత, సంతోష్ రావు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’ అని కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. -
‘రాహుల్ గాంధీకి ఉత్తరం రాస్తా.. నీ బండారం బయటపెడతా’
సాక్షి, తెలంగాణ భవన్ : ‘రాహుల్ గాంధీకి ఉత్తరం రాస్తా.. నీ బండారం బయటపెడతా’ అంటూ సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌తో తలపడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు,కేసులకు వెరవకుండా సింహాల్లా పోరాడుతున్న నాయకులు వారి పోరాటాన్ని మరో నాలుగేళ్లు కొనసాగించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అనంతరం, ‘‘కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏమున్నది గర్వ కారణం అంటే..రేవంత్ రెడ్డి లక్ష కోట్ల అప్పులు కొత్తగా చేశారు. రేవంత్ బ్రదర్సేమో కోట్లకు పడగలెత్తారు. రాష్ట్రం అధోగతి పాలైంది. ప్రజలు తిప్పల పాలైన మాట వాస్తవం. ఏడాది రేవంత్ పాలన, కాంగ్రెస్ పాలన అంటే గుర్తుకొచ్చేది లక్ష కోట్ల అప్పులు, దారుణ ఘాతుకాలు, తప్పులు. ఏడాది పాలనలో ఏం సాధించారని అడిగితే..చెప్పడానికి ఏమీలేవు. అందుకే ముఖ్యమంత్రి తన తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తున్నారు...తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పదవికే కళంకం తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా బాగుపడ్డారా? అంటే అనుముల బ్రదర్సే. వాళ్లకే లాభం జరిగింది. రాష్ట్రానికి వెయ్యి కోట్ల పెట్టుబడులు ఇచ్చే స్థాయికి అనుముల బ్రదర్స్ ఎదిగారని ప్రజలు అనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఫోర్బ్స్ జాబితాలో రిచెస్ట్ బ్రదర్స్ ఎవరంటే అనుముల బ్రదర్స్ వస్తారేమో..అదానీని కూడా దాటేస్తారేమో అని ప్రజలు అనుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు...ఏడాది పాలనలో రేవంత్‌రెడ్డి చేసింది ఏందంటే.. పొద్దున్నే లేస్తే కేసీఆర్ మీద తిట్లు.. దేవుళ్ల మీద ఒట్లు. రాష్ట్ర ప్రతిష్ట పెంచాల్సింది పోయి.. దివ్యంగా ఉన్న రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపణలు చేసిన దివాళా కోరు సీఎం ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. కొత్త పరిశ్రమలు కాదు.. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఇవాళ కొత్త స్లోగన్ పెట్టుకున్నాడు.. తెలంగాణ రైజింగ్ అని అంటున్నారు. తెలంగాణ రైజింగ్ కాదు.. అనుముల బ్రదర్స్ రైజింగ్. అదానీతో పోటీ పడుతూ ఆస్తులు పోగేసుకుంటున్నారంటే వాళ్లు అనుముల బ్రదర్స్. అందుకే అనుముల బ్రదర్స్ రైజింగ్.. తెలంగాణ ఫాలింగ్ ఇది పక్కా. ..పన్నెండు నెలల పాలన మొత్తం అసత్యాలు, అటెన్షన్ డైవర్షన్ స్కీంలు తప్ప ఏం చేశారు. అప్పులు.. అప్పులు అంటూ మీ అసమర్థతను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోం. వదిలి పెట్టం. ఏడాది పాలన పూర్తయితే సాధించిన విజయాల గురించి చెప్పుకోవాలి. ఆరు గ్యారెంటీల మీద చర్చ జరగొద్దని.. అప్పులు అంటూ కారుకూతలు కూస్తున్నావు. అప్పుల మీద కాదు.. మీరిచ్చిన హామీల మీద చర్చలు జరగాలి’’ అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. -
రోశయ్య వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్‌గా మారింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య నిబద్ధత, సమర్థత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్‌గా ఆవిష్కృతమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆర్థిక క్రమశిక్షణ పాటించారు కాబట్టే రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పడిందన్నారు. మాజీ సీఎం రోశయ్య మూడో వర్ధంతి సందర్భంగా హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.. రోశయ్య చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఏ రోజు కూడా తనకు ఈ పదవి కావాలని రోశయ్య అడగలేదని.. పార్టీ పట్ల నిబద్దత, క్రమశిక్షణ వల్లనే పదవులు వచ్చాయని తెలిపారురోశయ్య ఉన్నప్పుడు నెంబర్-2 ఆయనే.. నెంబర్ 1 మాత్రమే మారేవారని సీఎం పేర్కొన్నారు. నెంబర్ 2లో ఉన్నా.. ఆయన ఎప్పుడూ తన పైన ఉన్నవారిని దాటిపోవాలని అనుకోలేదని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి.. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి అని రోశయ్య చెప్పారని గుర్తు చేశారు. ‘చుక్క రామయ్య,ప్రొఫెసర్ నాగేశ్వర్, రోశయ్య లాంటి వారి మధ్య శాసనమండలిలో ఎమ్మెల్సీగా మాట్లాడేందుకు నేను భయపడ్డాను. నీటి పారుదల శాఖ పైన మండలిలో నేను మాట్లాడినప్పుడు నన్ను తన ఛాంబర్‌కు పిలిపించుకొని ప్రోత్సహించారు. ప్రతిపక్ష సభ్యుడినైనప్పటికి మండలి గౌరవం పెంచాలన్న ఉద్దేశంతో రోశయ్య నన్ను ఆనాడు ప్రోత్సహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని రోశయ్య నాకు సూచించారు. చట్టసభల్లో అనాటి స్పూర్తి కొరవడింది.ప్రతిపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. రోశయ్య కుటుంబం రాజకీయాల్లో లేదు. సీఎంగా, గవర్నర్ గా,వివిధ హోదా ల్లో 50 యేళ్ల పైగా రాజకీయాల్లో గొప్పగా రాణించారు. తమిళనాడు గవర్నర్‌గా ఎవరు వెళ్లినా వివాదాల్లో కూరుకుపోతుంటారు. కాని రోశయ్య అక్కడ వివాదాలు లేకుండా రాణించారు. అ నాటి ముఖ్యమంత్రులకు రోశయ్య కుడి భుజంలా వ్యవహారించడం వల్లనే వారు సమర్థంగా పనిచేశారు. రోశయ్య లాంటి సహచరులు ఇప్పుడు లేకపోవడం పెద్ద లోటు.ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నల నుంచి ప్రభుత్వాన్ని రోశయ్య కంచె వేసి కాపాడేవారు. నెంబర్ 2 స్థానంలో రోశయ్య ఉండాలని ఆ నాటి ముఖ్యమంత్రులు కోరుకున్నారు. ముఖ్యమంత్రి స్థానం కోసం ఏ నాడు రోశయ్య తాపత్రయపడలేదు. పార్టీ పట్ల ఆయన నిబద్ధత కారణంగానే క్లిష్ట సమయంలో రోశయ్యను ముఖ్యమంత్రి చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారు. రోశయ్య నిబద్దత కారణంగానే అన్ని హోదాలు ఆయన ఇంటికి వచ్చాయి. సభలో సమస్యలను వ్యూహాత్మకంగా ఎదుర్కొవాలంటే రోశయ్య ఉండాలనే ముద్ర ఆయన బలంగా వేశారు. రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉంది.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి. ఆర్య వైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుంది.రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఇస్తాం. నేను హైదరాబాద్ వ్యక్తినని గతంలో రోశయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం. రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమాజానికి మంచి స్పూర్తి ఇచ్చినట్లైవుతుంది.’ అని తెలిపారు. -
అభ్యర్థుల ఎంపిక ఆచితూచి!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ల తరఫున బరిలో దిగే అభ్య ర్థుల ఖరారు తర్వాతే కార్యరంగంలోకి దిగాలని భావిస్తోంది. త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ (రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్)లో రెండింటిని గెలిచి సత్తా చాటాలని ఆ పార్టీ ముఖ్యనేతలు పట్టుదలగా ఉన్నారు. కరీంనగర్–ఆదిలాబాద్ –నిజామాబాద్–మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రులు (ఒక్కో సీటు), వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోనే 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యే సీట్లు గెలిచి ఉత్తర తెలంగాణలో కమలనాథులు సత్తా చాటిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకొని పట్టభద్రులు, టీచర్లలోనూ బీజేపీకి ఆదరణ ఉందని రుజువు చేయాలని ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఖరారు విషయంలోనూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తన పట్టును నిరూపించేందుకు సిద్ధమైన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ముందుకు కదలాలని కాషాయదళం భావిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పో టీ చేసే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి..ఆ పార్టీ అభ్యర్థులు కూడా రంగంలోకి దిగితే త్రిముఖ పోటీ లో ఎలాంటి మార్పులొచ్చే అవకాశాలుంటాయనే దానిపైనా దృష్టి సారించింది. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో పోటీకి బీఆర్ఎస్ విముఖంగా ఉంటే... కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి మూడింటిలో రెండు ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకోవాలనే పట్టుదలతో బీజేపీ ముఖ్యనేతలున్నారు. అన్ని పార్టీల కంటే ముందే అని అనుకున్నా...అన్ని పార్టీల కంటే ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి ప్రచారం ముమ్మరం చేయాలని తొలుత బీజేపీ నాయకత్వం భావించింది. అయితే ఆ తర్వాత వ్యూహం మార్చుకుంది. బలమైన ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలిపేందుకు పార్టీపరంగా ప్రాథమిక కసరత్తు జరిగినా ప్రస్తుతం అది నిలిచిపోయింది. వచ్చే ఏడాది మార్చి 29తో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఆ లోగానే ఈ స్థానాలకు ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది.బీజేపీలో ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. పట్టభద్రుల టికెట్ కోసం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథరావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, గత ఎన్నికల్లో ఈ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి పోటీచేసిన సుగుణాకరరావు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీకి విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మామిడి సుధాకర్‌రెడ్డి, అనంతరెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పార్టీకి పట్టుండడంతోపాటు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మంచి ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకున్నందున ముందుగానే అభ్యర్థుల ప్రకటన మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖమ్మం–నల్లగొండ–వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ టికెట్ కోసం పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి, సంఘ్ పరివార్‌కు చెందిన టీపీయూఎస్ నాయకుడు సాయిరెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. -
న్యూయార్క్‌తో పోటీ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాలు కాలుష్యం, ట్రాఫిక్ జామ్‌లతో నివాసయోగ్యం కాకుండా పోతున్నాయని.. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకుండా ఉండాలంటే నగర అభివృద్ధితోపాటు మూసీ ప్రక్షాళన జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాలుష్యాన్ని తొలగించలేని పరిస్థితితో అడవుల్లోకి వెళ్లి మళ్లీ ఆది మానవుల్లా బతకాలా? ఆధునిక నగరంలో అధునాతనంగా జీవించాలా? అన్నది ఆలోచించుకోవాలని కోరారు. నాలుగున్నరేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తే... ప్రపంచ పెట్టుబడులకు వేదికగా అద్భుత నగరం రూపుదిద్దుకుంటుందని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన టోక్యో, న్యూయార్క్, సింగపూర్ నగరాలతో పోటీపడతామని ప్రకటించారు. కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ రైజింగ్’పేరిట హెచ్ఎండీఏ మైదానంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు రూ.7 వేల కోట్ల విలువైన పనులకు సీఎం రేవంత్ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మాట్లాడారు. సీఎం ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘మూసీలో పారిశ్రామిక వ్యర్థాలు, మనుషులు, పశువుల కళేబరాలు కొట్టుకొస్తున్నాయి. అలాంటి మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీలకు కనీస అవగాహన లేదా? హైదరాబాద్ ప్రపంచంతో పోటీపడాలంటే రీజనల్, రేడియల్ రోడ్లు, ఫ్లైఓవర్లు, ఎస్టీపీలు, కృష్ణా, గోదావరి జలాలు, మెట్రో విస్తరణ అవసరం. వాటికి రూ. లక్షన్నర కోట్లు కావాలి. ఆ నిధులు నాలుగున్నరేళ్లలో ఖర్చు చేస్తే అద్భుత నగరంగా, ప్రపంచ పెట్టుబడులకు వేదికగా అవుతుంది. ఇందుకు కేంద్రం సహకరించాలి. నగర అభివృద్ధి అంతా కాంగ్రెస్‌తోనే.. హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్‌సిటీకి శిలాఫలకం వేస్తే... టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నిర్మాణం పూర్తిచేసి ఐటీ కంపెనీలు తెచ్చారు. తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ఐటీ కంపెనీలను కొనసాగించడమేకాక ఔటర్ రింగ్ రోడ్‌ను, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌ను, ఫార్మా కంపెనీలను తెచ్చారు. దీనితో రియల్ ఎస్టేట్, పరిశ్రమలు పెరిగాయి. పి.జనార్దనరెడ్డి కృషితో నగరానికి తాగునీళ్లు వచ్చాయి. రాష్ట్ర ఖజానాకు 65శాతం ఆదాయం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే.. నాటి సీఎంల ముందుచూపుతోనే వస్తోంది. న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం. ఇందుకు అవసరమైన దాదాపు 40–50 వేల ఎకరాల భూమికిగాను దాదాపు 15 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సహకరించాలి. ఇబ్రహీంపట్నంలో 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో వెజిటబుల్, ఫ్రూట్ మార్కెట్లు, డెయిరీ, పౌల్ట్రీ, మీట్.. ఇలా అన్ని ఉత్పత్తులు ఒకేచోటికి తెస్తాం. కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. గప్పాలతోనే పదేళ్లు గడిపారు గత ప్రభుత్వంలో సీఎం గప్పాలతోనే పదేళ్లు గడిపారు. హుస్సేన్‌సాగర్‌ను శుద్ధిచేస్తామని మురికికూపంగా మార్చారు. ఆ పార్టీ వాళ్లు సెల్ఫీలు తీసుకునే, ట్విట్టర్లో పెట్టుకునే శిల్పారామం, ట్యాంక్‌బండ్ కూడా కాంగ్రెస్ అభివృద్ధి చేసినవే. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని విష ప్రచారం చేశారు. గత ప్రభుత్వం ఉన్న 2023 ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కంటే.. తమ ప్రభుత్వం వచ్చాక అదే సమయంలో 29శాతం అభివృద్ధిని రియల్ ఎస్టేట్ రంగం సాధించింది. మంచి చెబితే అమలు చేస్తాం బీఆర్ఎస్ గతంలో చేసింది అంతా అప్పులు, తప్పులే. అధికారం పోయాక జ్ఞానోదయమై ఏవైనా సూచనలు చేస్తామంటే అభ్యంతరం లేదు. మేం చేసేది నచ్చకపోతే... వారి విధానాలేమిటో, ఎన్ని నిధులు అవసరమో చెప్పాలి. అవి సహేతుకమైతే, ప్రజలకు ఉపయోగపడేవే అయితే భేషజాలు లేకుండా అమలుచేస్తాం. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉప సంఘం వేస్తున్నాం. అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. బీఆర్ఎస్, బీజేపీ వారి ప్రతిపాదనలు పంపాలి. అడ్డుకుంటామంటే కుదరదు మేం ఏది చేస్తామన్నా ప్రతిపక్షాలు అడ్డుకుంటామంటే కుదరదు. మా మీద కోపంతో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను శిక్షించవద్దు. హైదరాబాద్ నగరమే మన ఆదాయం, జీవన విధానం, ఆత్మగౌరవం. దీన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్టే. అందుకే ఏ రకంగానైనా కాపాడుకుంటాం. అందుకోసం విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తాం. టోక్యో, న్యూయార్క్, సింగపూర్ నగరాలతో పోటీపడతాం..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే దానం నాగేందర్, అధికారులు పాల్గొన్నారు. పారిశుధ్య కార్మీకురాలితో సీఎం కరచాలనం.. ‘హైదరాబాద్ రైజింగ్’కార్యక్రమానికి వచ్చిన సీఎం రేవంత్.. వేదికపైకి వెళ్లే ముందు అక్కడున్న పారిశుధ్య కార్మికులతో మాట్లాడి, భద్రత కిట్స్‌ను పంపిణీ చేశారు. ఒక కార్మికురాలితో కరచాలనం చేసి, స్థితిగతులను తెలుసుకున్నారు. అక్కడికి వచ్చిన దివ్యాంగులను పలకరించారు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పు కిషన్రెడ్డీ... ‘‘గుజరాత్లో సబర్మతి ఫ్రంట్‌కు చప్పట్లు కొట్టిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఇక్కడ మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. మూసీలో మునిగినా, అందులో ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోబోం. ప్రక్షాళన చేసి తీరుతాం. ప్రధాని మోదీ దగ్గర ఏటా రూ.40 వేల కోట్ల బడ్జెట్ ఉంటుంది. అందులోనుంచే సబర్మతి ఫ్రంట్తోపాటు గుజరాత్‌కు గిఫ్ట్ సిటీ, బుల్లెట్ రైలు తీసుకెళ్లారు. మరి నువ్వు తెలంగాణకు ఏం తెచ్చావు? మోదీ గుజరాత్‌కు నిధులు తీసుకెళ్తుంటే గుడ్లప్పగించి చూస్తున్నారా? మెట్రో విస్తరణకు రూ.35 వేల కోట్లు కావాలి. రీజనల్‌రింగ్ రోడ్డుకు మరో రూ.35 వేల కోట్లు కావాలి. మోదీ గుజరాత్, బెంగళూరు, చెన్నైలకు ఇస్తారుగానీ.. హైదరాబాద్‌కు ఎందుకివ్వరు? నా ప్రశ్నలకు సమాధానం చెప్పు కిషన్రెడ్డీ... మీరు నిధులు తెస్తారా లేక గుజరాత్‌కు వలసపోతారా? సికింద్రాబాద్ ఎంపీగా ట్రాఫిక్ చిక్కులు తీర్చేందుకు, మెట్రో విస్తరణకు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి నీ యాక్షన్ ప్లాన్ ఏంటి? కేంద్ర మంత్రిగా, ఎంపీగా నీ ప్రతిపాదనలేవో ప్రజలకు జవాబు చెప్పు. ఎన్ని నిధులు తెస్తావో చెప్పు. రాష్ట్రానికి రూ.లక్షన్నర కోట్లు తీసుకురా. 10 లక్షల మంది ప్రజలతో మోదీని, నిన్ను సన్మానించే జిమ్మేదారి నాది’’ మూసీ వెంట గుడిసె వేసుకుని ఉండి చూడు – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి భట్టి సవాల్ ‘‘మూసీ పరీవాహక ప్రాంతంలో ఒకరోజు నిద్రపోవడం కాదు.. అక్కడే గుడిసె వేసుకుని కుటుంబంతో సహా నివసించి చూపించు..’’అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. ప్రజలను మభ్యపెట్టడానికి ఒకరోజు మూసీ వద్ద నిద్రపోయి తర్వాతి నుంచి విలాసవంతమైన ప్యాలెస్‌లో ఉండటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ‘హైదరాబాద్ రైజింగ్’కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మూసీని జీవనదిగా మార్చాలని ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని భట్టి మండిపడ్డారు. బీఆర్ఎస్ మూసీ ప్రాజెక్టుపై సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొడుతూ, కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ తరహా కాలుష్యం ముప్పు హైదరాబాద్‌కు రాకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సీఎం చేసిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలివే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.3,446 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. జల మండలి ఆధ్వర్యంలో రూ.669 కోట్లతో నిర్మించిన మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్టీపీల)ను, తాగునీటి సరఫరా కోసం రూ.45 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నిర్మించిన 19 రిజర్వాయర్లను ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పలు జంక్షన్ల సుందరీకరణ పనులను కూడా ప్రారంభించారు. ఇక హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో రూ.1,500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. కృత్రిమ మేధ అనుసంధానంతో కొత్త ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్‌వేర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. -
మొసలి కన్నీరు కార్చొద్దు.. కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో “హైదరాబాద్ రైజింగ్” ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్ది, న్యూయార్క్ లాంటి నగరాలతో సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.‘‘ప్రజలు ఏకోన్ముఖమై రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుని ఇవ్వాళ్టికి ఏడాది. వచ్చే ఏడాదికి భవిష్యత్ ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అంటే రాష్ట్రానికే కాదు.. ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ. నగరంలో తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కృష్ణా జలాలనే కాదు.. గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌ది. కాంగ్రెస్ ముందుచూపుతో వ్యవహరించడం వల్లే హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య పరిష్కారమైంది...హైదరాబాద్‌కు మెట్రోను తీసుకొచ్చేందుకు ఆనాడు కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కృషి వల్లే హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చాయి. రూ.35 వేల కోట్లతో 360 కి.మీ తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి రేడియల్ రోడ్లు నిర్మించి నగరాన్ని మరింత అభివృద్ధి చేయనున్నాం. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ లో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది...40 నుంచి 50 వేల ఎకరాల్లో ప్రపంచంలోని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ట్యాంక్ బండ్‌ను మురికి కూపంగా మార్చారు. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానని ప్రజలను మోసం చేశారు. పదేళ్లలో నగరానికి కావాల్సిన శాశ్వత అభివృద్ధిని గత ప్రభుత్వం విస్మరించింది. ఢిల్లీ నగరం పూర్తిగా కాలుష్యమయమైంది.ముంబైలో వరదలు వస్తే నివసించలేని పరిస్థితి. చెన్నైలోనూ వరదలు వస్తే గందరగోళ పరిస్థితి. బెంగుళూరులో గంటలకొద్దీ ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక కలకత్తాలో ఉన్నన్ని సమస్యలు ఎక్కడా లేవు. దేశంలో ఏ నగరాన్ని చూసినా సమస్యలమయమే. ఆ నగరాల నుంచి మనం నేర్చుకోవాలి. హైదరాబాద్ నగరం అలా మారకుండా జాగ్రత్త పడాలి. అందుకే హైదరాబాద్ నగరంలో మూసీ పునరుజ్జీవనం జరగాలి.నగరంలో వరదల నియంత్రణకు రోడ్లపై వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మిస్తున్నాం. నగరంలోని 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని అధికారులకు ఆదేశించాం. ఎంత మంది ఎంత విష ప్రచారం చేసినా.. రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేసినా మేం వెనక్కి తగ్గేది లేదు. ఏప్రిల్ 1, 2023 నుంచి నవంబర్ 30, 2023 వరకు మీరు గమనించండి. మేం అధికారంలోకి వచ్చిన తరువాత ఏప్రిల్ 1, 2024 నుంచి నవంబర్ 30, 2024 వరకు మా పాలనకు తేడా చూడండి. మా పాలనలో 29 శాతం ఎక్కువ అభివృద్ధి జరిగింది. రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది తగ్గలేదు. ఇది మా నిబద్ధతకి నిదర్శనం. హైడ్రా చెరువుల ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు పుట్టించింది.10 వేల కోట్లు తీసుకురా.. భూమి నేను చూపిస్తా: భూమి కిషన్‌రెడ్డికి కౌంటర్మూసీ వద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు.. మోదీ కంటే మంచి పేరు వస్తుందనే ఆయన మా కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారంటూ ముఖ్యమంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు మూసీలో పడుకున్నా.. మూసీలో మునిగి ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మీకు చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి మూసీ ప్రక్షాళనకు రూ.25 వేల కోట్లు నిధులు తీసుకురావాలి.పేదలపై మొసలి కన్నీరు కార్చొద్దు.. చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు తీసుకురా భూమి నేను చూపిస్తా.. పేదలకు మంచి అపార్ట్ మెంట్స్ కట్టిద్దాం.. మంచి భవిష్యత్ ఇద్దాం. మోదీ గుజరాత్‌కి గిఫ్ట్ సిటీ తీసుకుపోయిండు. నువ్వు తెలంగాణకు ఏం గిఫ్ట్ తెచ్చినవ్?. రెండో సారి కేంద్రమంత్రి అయిన నువ్వు రాష్ట్రానికి ఏం నిధులు తీసుకొచ్చినవ్? సమాధానం చెప్పాలి. నగరంలో మెట్రో విస్తరణకు రూ.35 వేల కోట్లు అవసరం ఉంది.. మీరు ఎన్ని నిధులు తెస్తారో చెప్పండి. గుజరాత్ మెట్రోకు, చెన్నైకి మెట్రోకు నిధులు ఇచ్చారు.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు ఇవ్వరు..?..హైదరాబాద్‌కు తాగు నీటికి కోసం గోదావరి జలాల తరలించడానికి రూ.7 వేల కోట్లు కావాలి.. కేంద్రం నుంచి నువ్వు ఎంత తెస్తావ్.. రీజనల్ రింగ్ రోడ్డుకు, రేడియల్ రోడ్లకు రూ.50 వేల కోట్లు కావాలి. కేంద్రం నుంచి నువ్వు ఎన్ని నిధులు తెస్తావ్?. నితిన్ గడ్కరీ దగ్గర మన ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి.. మీరు ఎన్ని నిధులు ఇప్పిస్తారో జవాబు చెప్పాలి.. మోదీ గుజరాత్‌కు తీసుకెళ్తుంటే గుడ్లు అప్పగించి చూస్తారా?. మూసీలో పడుకోవడం కాదు.. మోదీని తీసుకొచ్చి మూసీని చూపించు... పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందొ..మూసీ అభివృద్ధి ఎందుకు అడ్డుకుంటున్నారు?.. హైదరాబాద్ మరో ఢిల్లీ కావాలా?. మనం ఈ మురికి కూపంలో మగ్గాల్సిందేనా? తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి.. లక్షన్నర కోట్లతో హైదరాబాద్ నగరం అద్భుతమైన నగరంగా మారుతుంది. ప్రపంచం పెట్టుబడులకు హైదరాబాద్ వేదిక కావాలంటే.. ఇవన్నీ జరగాలి.. ఇవన్నీ జరగాలంటే కేంద్రం సహకరించాలి. మీరు నిధులు తెస్తారా? గుజరాత్‌కు వలస వెళతారా? తేల్చుకోండి’’ అంటూ కిషన్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.