breaking news
-
కేంద్రం సాయం చేసేలా సహకరించండి: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించి మొత్తం రూ.1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి కావల్సిన చేయూతపై కిషన్‌రెడ్డితో చర్చించారు. ట్రిపుల్ ఆర్, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తో పాటు హైదరాబాద్, వరంగల్‌లో సీవరేజీ, భూగర్భ డ్రైనేజీ, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలను ప్రస్తావించారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై ఢిల్లీ వచ్చిన సీఎం..గురువారం సాయంత్రం కిషన్‌రెడ్డితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ భేటీల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, గడ్డం వంశీ, సురేశ్ షెట్కార్, అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ అనుమతులు ఇప్పించండి ‘ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,367.62 కోట్లు. ఆర్ఆర్ఆర్తో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలు, ఇండ్రస్టియల్ హబ్‌లు, లాజిస్టిక్ పార్కులు, రిక్రియేషన్ పార్కులు వంటివి అభివృద్ధి అవుతాయి. ఆర్ఆర్ఆర్కు సంబంధించి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయండి. మెట్రో ఫేజ్–2 సంయుక్తంగా చేపట్టేలా చూడండి మెట్రో ఫేజ్–2లో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్–పటాన్చెరు, ఎల్బీ నగర్–హయత్‌నగర్ మధ్య మొత్తం 76.4 కి.మీ మేర నిర్మించనున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50: 50 వాటాతో దీనిని చేప్టటేందుకు సహకరించాలి. ‘మూసీ’కి అనుమతులు, నిధులు కావాలి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాం. దీనితో పాటు గాంధీ సరోవర్ నిర్మాణం, మూసీ సీవరేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణం ఇతర పనులకు రూ.14,100 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేశాం. ఈ మేరకు అనుమతులు, నిధుల మంజూరుకు సహకరించాలి.· మూసీ పునరుజ్జీవంలో భాగంగా గోదావరి నీటిని మూసీకి తరలించేందుకు, గోదావరి నుంచి నగరానికి 15 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తరలించేందుకు రూ.7,440 కోట్లతో ప్రణాళికలు రూపొందించాం. ఆ మొత్తం విడుదలకు సహకరించాలి. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీకి ప్రణాళిక రూపొందించాం. రూ.4,170 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రణాళికను అమృత్–2 లేదా ప్రత్యేక పథకం కింద చేపట్టేలా చూడండి. సింగరేణి సంస్థ దీర్ఘకాలం పాటు మనుగడ కొనసాగించేందుకు గాను గోదావరి లోయ పరిధిలోని బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించండి..’ అని కిషన్‌రెడ్డిని సీఎం కోరారు. ఆర్ఆర్ఆర్ అనుమతులు వెంటనే ఇవ్వండి ‘ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (159 కి.మీ) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలి. ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్‌తో అనుసంధానించే ఎన్‌హెచ్–765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది. అయితే మిగిలిన 62 కిలోమీటర్లు అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉంది. అటవీ, పర్యావరణ శాఖల నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకం ఎదురవుతోంది. దీనివల్ల కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కాబట్టి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు బడ్జెట్లో నిధులు మంజూరు చేయండి. ఇది నిర్మిస్తే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాల మధ్య 45 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. హైదరాబాద్–విజయవాడ డీపీఆర్ త్వరగా పూర్తి చేయండి హైదరాబాద్–విజయవాడ (ఎన్‌హెచ్–65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయండి. వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వండి. పర్వత్‌మాల ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి దేవాలయం, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వేలను ఏర్పాటు చేయండి. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయండి. నల్లగొండ జిల్లాలో ఎన్‌హెచ్–65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయండి..’ అని నితిన్ గడ్కరీతో భేటీలో రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి ‘ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కృతజ్ఞతలు. కానీ రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా కేటాయించలేదు. కేంద్రీయ విద్యాలయాలతో పాటు నవోదయ పాఠశాలలు లేని జిల్లాలకు వాటిని కేటాయించండి. డీమ్డ్ యూనివర్సిటీల ప్రకటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అయినప్పటికీ.. ఇటీవల కేవలం కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలను గుర్తిస్తున్నారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఓసీ కూడా తప్పకుండా తీసుకునేలా చూడండి..’ అని ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి కోరారు. నేడు ఏఐసీసీ నేతలతో సీఎం భేటీ! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల ¿భర్తీ వంటి అంశాలపై చర్చించవచ్చని సమాచారం. -
మిలిటెంట్ తరహాలో ముందుకు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఇకపై దూకుడుగా పోరాటాలు చేపట్టా లని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నిర్ణయించింది. కొత్త ప్రభుత్వం కుదురుకుని పనిచేసేందుకు సరిపడా సమయం ఇచ్చా మని భావిస్తోంది. ఇక ముందు పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని.. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిన మంచిని వివరించాలని నిర్ణయించింది.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని.. బీఆర్ఎస్ దీనిని అనుకూలంగా మలుచుకోవాలని నేతలు, కార్యకర్తలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీ కేడర్‌ను, ప్రజలను భాగస్వాములను చేస్తూ రేవంత్ ప్రభుత్వం తీరుపై ‘మిలిటెంట్ తరహా దూకుడు పోరాటాలు చేయాల’ని ఇటీవల జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీలో సూచించినట్టు తెలిసింది. పార్టీ విధానాలపై ఫోకస్.. కాంగ్రెస్ విధానాలను నిరంతరం విమర్శించడం వల్ల అధికారం కోల్పోయానే బాధతో విమర్శలు చేస్తున్నట్టుగా ప్రజలు భావించే అవకాశం ఉందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే దూరదృష్టితో పదేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలు వెనుక ఉన్న తాతి్వకతను కూడా ప్రజలకు విడమరిచి చెప్పాలని సూచించినట్టు సమా చారం. ‘‘హైదరాబాద్‌లో భారీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతులివ్వడం ఇక్కడి ఆర్థిక పటిష్టతను ప్రజలకు చాటి చెప్పాం. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని భారీ ఫార్మాసిటీ ఏర్పాటుకు భూసేకరణ చేశాం. గత ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం వెనుక అనేక శాస్త్రీయ కోణాలు ఉన్నాయి. వాటిని సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో అసెంబ్లీలో, బయటా పార్టీ నేతలు విడమరిచి చెప్పాలి..’’అని పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది.ప్రభుత్వ తప్పులను ఎండగట్టడం, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కేవలం ప్రెస్మీట్లు, పత్రికా ప్రకటనలకు పరిమితం కాకుండా... సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని సూచించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తు న్న ప్రజా వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా ఏమీ మారడం లేదని, దీనిని బీఆర్ఎస్ అందిపుచ్చుకోవాలని పేర్కొన్నట్టు సమాచారం. అసెంబ్లీ వేదికగా ఒత్తిడి పెంచి..: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వేదికగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తొలిరోజున అదానీ–రేవంత్ దోస్తీ అంటూ టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సభ జరిగే మిగతా రోజుల్లోనూ ఏదో ఒకరకమైన వ్యూహంతో అసెంబ్లీకి వచ్చి ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలని నిర్ణయానికి వచి్చ నట్టు తెలిసింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ వాయిదా తీర్మానం ఇవ్వడం, లేదా స్వల్పకాలిక చర్చకు పట్టుబట్టడం దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ ఇచ్చిన 6గ్యారంటీలకు అసెంబ్లీతో చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరైనా ఎలాంటి చర్చల్లో పాల్గొనే అవకాశం లేదని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.సంస్థాగత అంశాలపై ఫోకస్.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో హైదరాబాద్, వరంగల్‌లలో కాకుండా అన్ని జిల్లాలనుంచి రాకపోకలకు అనువుగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. ఉద్యమకాలంలో నిర్వహించిన తరహాలో భారీ జనసమీకరణతో పార్టీ సత్తా చాటేలా సభ ఉంటుందని ఇటీవల తనను కలిసిన పార్టీ నేతలతో కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. ఇక వచ్చే ఏడాది పొడవునా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యవర్గాల ఏర్పాటు, సంస్థాగత శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. యువత, మహిళలకు చేరువ కావడం లక్ష్యంగా కార్యక్రమాలనిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. -
కిషన్‌రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కిషన్‌రెడ్డి నివాసానికి వచ్చిన సీఎం.. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు తదితర ప్రాజెక్టులకు నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సింగరేణికి బొగ్గు గనులు తదితర అంశాలపై కేందమంత్రితో సీఎం చర్చించారు. అనంతరం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.కాగా, ఏఐసీసీ పెద్దలను కూడా సీఎం రేవంత్ కలిసే అవకాశముంది. కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్లో చోటు కోసం అధిష్టానం పెద్దల చుట్టూ ఆశావహలు చక్కర్లు కొడుతున్నారు.రంగారెడ్డి నుంచి తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కలిశారు. బీసీ వర్గం నుంచి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అవకాశం కోరుతున్నారు. ఆదిలాబాద్ నుంచి తనకు ఛాన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ అడుగుతుండగా, మరో వైపు.. ఎస్సీ కోటాలో మంత్రి పదవి కోసం వివేక్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదీ చదవండి: జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం -
కాంగ్రెస్‌ను చంపేస్తారా?.. ఏఐసీసీ కార్యదర్శిపై జగ్గారెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇన్ఛార్జ్లు పార్టీని చంపేయాలని చూస్తున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి ఓ ఫంక్షన్లో ఏఐసీసీ కార్యదర్శిపై ఆయన మాటల దాడి చేశారు. ఇంతకీ మీరు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా..? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా..? అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.మెదక్ జిల్లా కూడా నేనే చూస్తున్నానంటూ విష్ణు చెప్పగా, పార్టీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీ కూడా ఉన్నారా.. వేరే రాష్ట్రం పోయారా..?. అధికార పార్టీ అంటే ఎలా ఉండాలి? మీరేం చేస్తున్నారో అర్థం అవుతుందా? అంటూ జగ్గారెడ్డి నిలదీశారు. కొత్త వాళ్లకు పదవులు సిఫార్సు చేస్తున్నారు. వారు ఫైనల్ అయ్యే వరకు కూడా మాకు తెలియడం లేదంటూ కార్యదర్శికి జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: లగచర్ల రైతుకు సంకెళ్లు.. సీఎం రేవంత్ సీరియస్ -
రేవంత్.. ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్.. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా అని ప్రశ్నించారు. అలాగే, కాకిలెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా? అంటూ మండిపడ్డారు. అధికారం కోసం అబద్దాలు .. అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటిసాకులు అంటూ ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..రేవంత్.. మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా?మీ మాటలు అబద్ధం.. మీ చేతలు అబద్ధం..అర్దసత్యాలు..అభూతకల్పనలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు!కాకిలెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా?50 వేల కోట్లు, 65 వేల కోట్లు వడ్డీలు అని అవాస్తవాల వల్లింపు ఎవరి కోసం?RBI Handbook of India States బట్టి తెలంగాణ అప్పు ఎంత వుందో తేటతెల్లమవుతుంది!ఢిల్లీకి మూటలు మూసేందుకా? నీ జేబు నింపుకునేందుకా? అబద్ధానికి అంగు లాగీ వేస్తే రేవంత్ అని మళ్లీ నిరూపించుకున్నారు!Lies, more lies and nothing but LIES! అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో ప్రకటనలు కాదు.. పథకాల అమలు కావాలి.కోతలు కాదు, కూతలు కాదు.. చేతలు కావాలి.అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని ఊదరగొట్టారు..ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.అర్హుల కోసం, అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అని సభలు, సమావేశాలు పెట్టారు.ఏడాదిగా రైతుబంధు మీద కొండను తవ్వి ఎలుకను పట్టలేదు.. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఊసేలేదు.అధికారం కోసం అబద్దాలు .. అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటిసాకులు.పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలను .. ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పుల పాలు చేశారుఇప్పటికైనా కల్లు తెరవండి ..వర్షం కురుస్తుందో ? లేదో ?సాగునీరు అందుతుందో ? లేదో ?కరంటు వస్తుందో ? లేదో ?పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో ? లేదో తెలియకున్నాభూమిని నమ్మి సేద్యం చేసి .. ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలకు భరోసా ఇవ్వండిఅమ్మల విషయంలో అన్నదాతల విషయంలో వివక్ష చూపకండి..పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకకండిజై కిసాన్.. జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు. -
‘చేతి’కి ఓటేస్తే.. చేతగాని సీఎంను రుద్దారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు తెలంగాణ ముఖ్యమంత్రి పంపుతున్న మూటలపై ఉన్న శ్రద్ధ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాటలపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. రాష్ట్రంలో చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను ప్రజల నెత్తిన రుద్దారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణను ఆగమాగం చేసిందని, అస్తిత్వాన్ని కూడా దెబ్బతీస్తోందని ఆరోపించారు. సీఎం మతిలేని నిర్ణయాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. గత పదేళ్లలో ప్రగతిపథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం.. ఇప్పుడు అధోగతి పాలవుతుంటే కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని ఉద్దేశించి కేటీఆర్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. లేఖలో కేటీఆర్ పేర్కొన్న అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘విషమే తప్ప విషయం లేని సీఎం చేతిలో ఏడాది పాలనలో తెలంగాణ బతుకు ఛిద్రమవుతున్నా కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర వహిస్తోంది. కాంగ్రెస్‌ను నమ్మితే రైతుకు గోస తప్ప భరోసా లేదని తొలి ఏడాది పాలనలోనే తేలిపోయింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యో గాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులతో ఫొటోలకు పోజులు కొట్టి అడ్రస్ లేకుండా పోయిన మీరు కూడా కాంగ్రెస్ చేసిన మోసంలో భాగస్వాములేనని యువత బలంగా నమ్ముతోంది. ఎన్నికల ప్రచారంలో ఆడబిడ్డలకు అరచేతిలో వైకుంఠం చూపించి నిలువునా మోసం చేశారు. హైడ్రా, మూసీ పేరిట నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేసిన పాపం మీ కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తలుపుతట్టే ఏకైక గడపగా తెలంగాణ భవన్ నిలిచింది. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు అన్నట్టుగా సాగుతున్న మీ పాలన తీరు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాధనాన్ని లూటీ చేసిన సర్కారుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి చరిత్రను లిఖించింది. తెలంగాణ తల్లి దివ్య స్వరూపాన్ని అవమానించి, ప్రజలపై కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సచివాలయం, అమరవీరుల స్తూపం మధ్య తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో మీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బలవంతంగా ప్రతిష్టించారు. రేవంత్ చేసిన కుటిల చర్యలకు ప్రతిస్పందనగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గుర్తులు తెలంగాణలో చెరగడం ఖాయం. అసలైన తెలంగాణ చరిత్ర, సంస్కృతిని, ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన, తెలంగాణ సమాజంపైన ఉంది. ఆ విగ్రహాలను గాంధీ భవన్‌కు సాగనంపుతాం ప్రజల ఆశీస్సులతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిర, రాజీవ్ గాందీ, ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి సంస్థ పేరును మార్చుతాం. సచివాలయం ముందు ఏర్పాటుచేసిన కాంగ్రెస్ తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహాలను మీ పార్టీ కార్యాలయం గాందీభవన్‌కు సకల మర్యాదలతో సాగనంపుతాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ తరహా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్‌ను సీఎం ఇకనైనా మానుకోవాలి. మేం పదేళ్లలో పెంచిన రాష్ట్ర సంపదను దోచుకుని, ఘనమైన తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను చెరిపేస్తామంటే సహించేది లేదు’’ అని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. -
జరగబోయేది అదే.. రాహుల్‌కు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీకి అందే మూటలపై తప్ప.. మీరిచ్చిన మాటపై శ్రద్ధ లేదా?. తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా?’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు.‘‘నమ్మి అధికారమిస్తే ఆగం చేయడమే కాక.. అస్థిత్వాన్ని దెబ్బతీస్తారా?. గ్యారెంటీలకు దిక్కులేదు, 420 హామీలకు పత్తాలేదు, డిక్లరేషన్లకు అడ్రస్ లేదు!. అన్నదాతల నుంచి ఆడబిడ్డల వరకూ అందరూ బాధితులే. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక వర్గం వరకూ వంచితులే. ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా నిర్బంధం.. సకల రంగాల్లో సంక్షోభం. మేము పదేళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప పేర్లు మార్చలేదు’’ అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.‘‘మేము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా?. ఈ నీచ సంస్కృతికి సీఎం ఫుల్ స్టాప్ పెట్టకపోతే జరగబోయేది అదే! అంటూ లేఖలో కేటీఆర్ హెచ్చరించారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS లేఖ♦️చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారు.♦️ఢిల్లీకి అందే మూటలపై తప్ప.. మీరిచ్చిన మాటపై శ్రద్ధ లేదా?♦️తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా? ♦️నమ్మి అధికారమిస్తే… pic.twitter.com/D4Nt9d8yDf— BRS Party (@BRSparty) December 11, 2024ఇదీ చదవండి: ఏం చేశాం.. ఏం చేద్దాం? -
కేటీఆర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ‘నేను స్పీకర్‌ని. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. బీఆర్ఎస్ ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు. నేను స్పీకర్ కావడానికి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్ స్పీకర్‌పై ఈ రకమైన వాఖ్యలు చేయడం సరైంది కాదు. బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోంది. శాసన సభలో ప్రతిపక్షానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవడం లేదు’అని వ్యాఖ్యానించారు. అంతకుముందు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీరుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారు. మొదటి రోజే మమ్మల్ని లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారు. మా పార్టీ శాసనసభ్యుల అక్రమ పార్టీ ఫిరాయింపుల పైన నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారు. గత శాసనసభ సమావేశాల్లోనూ మా పార్టీ సభ్యుల గొంతు నోక్కేల వ్యవహరించారు. మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు. మా శాసన సభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్త శాసనసభ్యులు ఉన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా రేపటి నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరిస్తున్నాము. ఇప్పటికైనా స్పీకర్ పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. తాజాగా, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ పై విధంగా వ్యాఖ్యానించారు. -
తెలంగాణలో ఉత్తమ శాసనసభ వక్త అవార్డు: శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ అంటే అందరిదీ.. ఏ ఒక్క పార్టీకి చెందినది కాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన నేతలందరూ సభకు హాజరయ్యే సంప్రదాయం కొనసాగించాలని కోరారు. సిద్ధాంతపరంగా బేధాలున్నప్పటికీ.. సభలో ఎవరి పాత్ర వాళ్లు పోషించాలన్నారు.శాసనసభ వ్యవహారాలపై తెలంగాణ శాసనసభ, మండలి సభ్యులకు బుధ, గురువారాల్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘మొదటి సారి ఎన్నికైన శాసనసభ్యులు 57 మంది శాసన సభలో ఉన్నారు. శాసన సభ అందరిది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో మరొక పార్టీదో కాదు. ఈ ట్రైనింగ్ సెషన్స్ కోసం అందరికీ ఆహ్వానం పంపించాము.పాత రోజుల్లో సిద్ధాంత పరంగా భేదాభిప్రాయాలు ఉన్నా సభలో ఎవరి పాత్ర వారు పోషించారు. నేను మొదటిసారి ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. నేను నాలుగోసారి సభలో ఉన్నప్పుడు పీఏసీని ప్రతిపక్షానికి ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు అందరూ శాసనసభకు హాజరయ్యే సాంప్రదాయం కొనసాగించాలి. ఎమ్మెల్యేగా గెలిచి సభ రాకుండా దూరంగా ఉండకండి. పార్లమెంట్లో ఎలాగైతే ఉత్తమ పార్లమెంటేరియన్ ఇస్తున్నారో అదే విధంగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు ఇవ్వాలని స్పీకర్‌ను కోరుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ..‘చట్టాలను రూపొందించే హక్కు శాసన సభ్యులకు ఉంటుంది. గతంలో శాసనసభ సమావేశాలు ఉంటే సినిమా రిలీజ్ వాయిదా వేసుకునే వారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ మాదిరిగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు పరిశీలన చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు.తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ..‘గాలివాటం రాజకీయాలు ప్రారంభం అయినప్పటికీ కొత్త వాళ్ళు మళ్ళీ గెలవడం లేదు. మొదటిసారి ఎన్నికై రాజకీయాల్లో సక్సెస్ అయ్యే వారి శాతం 25శాతమే. కొందరు నాయకులు గెలిచాక ప్రజలతో మమేకం కావడం లేదు. ఎమ్మెల్యేకు కోటరీ వల్ల ప్రజలు స్వయంగా ఎమ్మెల్యేను కలిసే అవకాశం ఎక్కువగా ఉండదు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. ఫోన్లు ఎత్తాలి. నేను ఒకసారి ఓడిపోవడానికి నాకు సెక్యూరిటీ సమస్య వల్లే. ప్రజలు ఎమ్మెల్యేకు దూరం అవ్వడానికి కారణం పీఏలు, పీఆర్వోలు అంటూ కామెంట్స్ చేశారు. -
Telangana: ఏం చేశాం.. ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: ఏడాది పాలనలో ఏం చేశాం..భవిష్యత్తులో ఏం చేద్దాం. ఆరు గ్యారంటీల అమల్లో ముందుకెళ్లేదెలా? ఏడాది పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? విజయోత్సవాలు ఆశించిన ఫలితాన్నిచ్చాయా? వచ్చే ఏడాది కాలంలో ఏయే అంశాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడిపించాలి? అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి? తదితర కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఈ ఇద్దరు నేతలు ముఖాముఖి భేటీ అయ్యారు. గత సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించడంతో పాటు ఏడాది పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు..భవిష్యత్తులో చేయాల్సిందేమిటి? తదితర అంశాలపై కూడా సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. ఆరు గ్యారంటీలకు తోడు మరోమూడు అంశాలు! కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు సానుకూల భావనతోనే ఉన్నారనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైనట్టు సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు వరకు పలు అంశాల విషయంలో ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతోందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఆరు గ్యారంటీల అమలు విషయంలో మరింత పకడ్బందీగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఆరు గ్యారంటీలకు తోడు మూడు అంశాల ప్రాతిపదికన వచ్చే ఏడాది రోడ్‌మ్యాప్ ఖరారు చేసుకున్నారని సమాచారం. ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో భూమి లేని నిరుపేదల సంక్షేమమే ఎజెండాగా పథకాలకు రూపకల్పన చేయాలని, ఉద్యోగాల కల్పన విషయంలో తొలి ఏడాది తరహాలోనే ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది పాలనలో ప్రభుత్వ శాఖల వారీగా జరిగిన పురోగతిని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని కూడా వారు నిర్ణయించినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్, బీజేపీలపై ఇక దూకుడుగానే..! ఏడాది ప్రజాపాలన విజయోత్సవాలు జరిగిన తీరుపై కూడా నేతలు సమీక్షించారు. గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు ఘనంగా జరిగాయని, సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించగలిగామని రేవంత్, భట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం ఏ పని చేపట్టినా విమర్శిస్తోన్న బీఆర్ఎస్, ఉనికి కోసం అప్పుడప్పుడూ బీజేపీ చేస్తున్న రాజకీయ ఆరోపణలను తిప్పికొట్టడంలో కొంతమేర దూకుడుగా వెళ్లాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సందర్భంగా బీఆర్ఎస్ చేసిన గొడవ, సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, పార్టీ అభిప్రాయం, ప్రభుత్వ ఉద్దేశం ప్రజల్లోకి వెళ్లిన తీరుపై వారు సమీక్షించారు. రాష్ట్రంలోని రాజకీయ స్థితిగతులు, ఈనెల 11, 12 తేదీల్లో కొత్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించనున్న శిక్షణా తరగతులపై కూడా చర్చించారు. అసెంబ్లీ ఎజెండా ఏంటి? ఈనెల 16వ తేదీన మళ్లీ ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, మూసీ ప్రక్షాళన, హైడ్రా కూలి్చవేతలు తదితర అంశాలపై ఇవ్వాల్సిన వివరణలు, ఆర్వోఆర్ కొత్త చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గల అనుకూలత, రైతు భరోసాపై సబ్ కమిటీ నివేదిక, కులగణన రిపోర్టు విషయంలో అసెంబ్లీలో వెల్లడించాల్సిన అంశాలపై కూడా ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకమైనవని, ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చూస్తున్న ప్రతిపక్షాలకు ఈ సభా వేదికగానే తగిన జవాబు చెప్పాలని నిర్ణయించినట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? లేదా?సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం రాజస్తాన్‌లోని జైపూర్ వెళ్లనున్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యుల వివాహ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోనే రెండురోజులు ఉంటారన్న వార్తల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ కూడా హస్తిన పెద్దలతో భేటీ అయితేనే విస్తరణ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు రేవంత్ మినహా మిగతా నేతల ఢిల్లీ పర్యటన ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ ఉంటుందా లేదా? అన్న దానిపై స్పష్టత లేదు. ఇలావుండగా రేవంత్ ఢిల్లీలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్మెంట్ లభించే అవకాశాన్ని బట్టి డిప్యూటీ సీఎం భట్టి కూడా హస్తిన పయనమవుతారని సమాచారం. -
రియల్ఎస్టేట్ పడిపోతే పోయేదేం లేదు: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి
సాక్షి,హైదరాబాద్: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మంగళవారం(డిసెంబర్10) ఐదు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. హైడ్రాతో పాటు రెరా,టీజీఐఐసీ,జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏల్లో కాటిపల్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఐదు కంపెనీలు చెరువులను కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై రెండు నెలల క్రితమే నేను ప్రెస్ మీట్ పెట్టాను. సరిగా నేను మాట్లాడిన 10 రోజుల తర్వాత పర్మిషన్ ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం, డిప్యూటీ సీఎం ప్రకటించారు. వీటికి పర్మిషన్ ఇచ్చిన వారు ఎవరు? పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలేందుకు లేవు ? ఈ ఐదు కంపెనీల మీద హైడ్రా రంగనాథ్‌కు ఫిర్యాదు చేశా.దీనిపై అసెంబ్లీలో మాట్లాడతాం.తప్పు చేసిన మంత్రులు అధికారులు ఎవరైనా శిక్షకు అర్హులే. ఈ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేవాలి.ఈ యాక్ట్‌తో కబ్జాల నివారణ వీలవుతుంది.దీనిపై అసెంబ్లీలో చర్చకు పట్టు పడతాం.ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకి వెళ్తాం. ల్యాండ్ గ్రాభింగ్ పై రిఫార్మ్స్ తీసుకురాకుంటే నాయకులను ప్రజలు తరిమి కొడతారు. రియల్ ఎస్టేట్ పడిపోతే నష్టం ఏమి లేదు’అని వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. -
వేతనం అడిగితే దాడి చేస్తారా?: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఆశా వర్కర్లపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని,ఈ దాడిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశావర్కర్లను మంగళవారం(డిసెంబర్10)మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,మహమూద్ అలీ,జగదీష్ రెడ్డి,ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ పరారమర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆశావర్కర్ల మీద జరిగిన దాడిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. అవసరం అయితే జాతీయ మానవహక్కుల కమిషన్‌ను కలుస్తాం. ఆశా వర్కర్లు ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాలని అడిగారు.కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీనే నెరవేర్చాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తూన్నారు.నిరసనలు చేస్తే ఆశా వర్కర్లపై దాడులు చేస్తారా. లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఆశావర్కర్లపై నిన్న జరిగిన దాడి దుశ్శాసన పర్వం. అధికారంలోకి వస్తే ఆశావర్కర్లకు గౌరవ వేతనం ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిని వెంటనే ఇవ్వాలి. ఆశా వర్కర్ల డిమాండ్లపై అసెంబ్లీలో కొట్లాడుతాం.ఉస్మానియాలో సరైన వైద్యం అందకపోతే గాయపడ్డ ఆశా వర్కర్లకు బీఆర్ఎస్ పార్టీ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తాం’అని కేటీఆర్ అన్నారు. -
‘హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకొద్దు’
సాక్షి,తెలంగాణ భవన్ : హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకొద్దు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అధినేత కేసీఆర్ పిలుపుతో తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలని ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి. ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజలు కోరుకున్నారు.ప్రభుత్వం ప్రజలను భయపెట్టడం సరికాదు. తెలంగాణ అని మేం హృదయాల్లో రాసుకుంటే రేవంత్ రెడ్డి గన్నులు ఎక్కుపెట్టారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేశాను ఎవరైనా వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే కేసులు పెడతామని అంటున్నారు. అయినా సరే హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకొద్దు. రేవంత్ పెట్టిన విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉంది’అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేసిన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లోతెలంగాణ తల్లి అంటే కేవలం విగ్రహం కాదు. తెలంగాణ తల్లి మన ఉద్యమాల కేతనం, మన స్వాభిమాన సంకేతం. తెలంగాణ తల్లి మన అస్తిత్వ ప్రతీక. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అంటే తెలంగాణ స్ఫూర్తిని అవమానించడమే. తెలంగాణ ఆత్మగౌరవంగా నిలిచి స్వరాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లిని… pic.twitter.com/SlpI3W7rc9— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 10, 2024 -
తెలంగాణ తల్లి సెంటిమెంట్ పండేనా?
తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణలో కొత్త సెంటిమెంట్ రాజుకునేందుకు కారణమవుతోందా? ఇటీవలి పరిణామాలను గమనిస్తే ఇది నిజమే కావచ్చు అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం రూపొందించిన ఈ విగ్రహం చుట్టూనే రాజకీయాలన్నీ తిరుగుతూండటం ఇందుకు కారణమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఏపీలోని తెలుగు తల్లి విగ్రహానికి పోటీగా తెలంగాణ తల్లి పేరుతో విగ్రహాన్ని తయారు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు. ఇందులో పలువురు ఉద్యమకారుల ప్రమేయం ఉన్నప్పటికీ మూల కారకుడు బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు అని చెప్పక తప్పదు. అప్పట్లో వాడవాడల్లో సుమారు ఐదు వేల విగ్రహాలను ప్రతిష్టించారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లోనూ ప్రత్యేకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమైన కార్యక్రమాలు జరిగినప్పుడల్లా తొలుత ఆ విగ్రహానికి నివాళులు అర్పించే మొదలుపెట్టేవారు. ఇది ఒక సెంటిమెంట్ గా మారింది. అయితే ఏ కారణం వల్లో బీఆర్ఎస్ ఈ విగ్రహానికి అధికారిక ముద్ర వేయలేకపోయింది. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించారు. సచివాలయం ఎదుట భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే సచివాలయం వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో, బీఆర్ఎస్ దాన్ని వ్యతిరేకించింది. తాము అధికారంలోకి రాగానే ఆ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు కూడా. ఆ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, ఇన్నాళ్లు తెలంగాణ తల్లి విగ్రహన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తూ, తామే సచివాలయంలో ఆ విగ్రహాన్ని స్థాపిస్తామని చెప్పి శంకుస్థాపన కూడా చేసేశారు. ఆ తర్వాత కొత్త డిజైన్‌తో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్ధం చేశారు. వివాదం ఇక్కడే ఆరంభమైంది. ఈ విగ్రహాన్ని ఒక సెంటిమెంట్‌గా మార్చడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన తల్లి విగ్రహం ఆకుపచ్చ చీర ధరించి ఉంటుంది. అంతేకాక మెడలో ఒకటి, రెండు నగలతోనే చిత్రీకరించారు. ఈ విగ్రహంలో తల్లి చేతిని ప్రముఖంగా ప్రదర్శిస్తుంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారిక గుర్తు అయిన చేతి గుర్తును పోలి ఉందని, ఇదంతా రాజకీయమని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విమర్శలు చేస్తున్నాయి. ఈ విగ్రహం కాంగ్రెస్ తల్లి అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ కనుక, విగ్రహంలో చేతిని ప్రొజెక్టు చేయడంలో తప్పు ఏముందని ఇంకొందరి ప్రశ్న. ఇక విగ్రహ ముఖ కవళికలపై కూడా పలు వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి వస్తున్న కామెంట్లు సమర్థనీయం కాదు. విగ్రహం ముఖ కవళికలు రేవంత్ కుటుంబ సభ్యులను పోలి ఉన్నట్లు ఉన్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇందులో నిజం ఉండదు. అయినా ఎవరి దృష్టి కోణంతో చూస్తే, వారి కోణంలోనే అలా అనిపిస్తుంటుంది. గతంలో ఎన్టీఆర్.ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాంక్బండ్ పై పలువురు తెలుగు తేజాల విగ్రహాలను ఏర్పాటు చేసి, దానిని ఒక టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ది చేశారు. అప్పట్లో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విగ్రహాల ఏర్పాటు వృథా వ్యయం అని విమర్శించేది. ఆ విగ్రహాలు అచ్చం ఎన్టీఆర్. ముఖ కవళికలతో ఉన్నట్లుగా కొన్ని పత్రికలలో కార్టూన్లు కూడా వచ్చాయి. ఉమ్మడి ఏపీలో మూడు ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ సాంస్కృతిక వేత్తలు, కవులు,కళాకారుల విగ్రహాలను ఎన్టీఆర్. ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాటిలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రముఖుల విగ్రహాలను కూల్చివేసే యత్నం జరిగింది. కొన్ని విగ్రహాలకు నల్లరంగు పులిమారు. బంజారాహిల్స్ లో ఉన్న పెద్ద పార్కుకు కేబీఆర్ పార్క్ అని పేరు పెట్టి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే, ఆయనను సమైక్యవాది అని భావించి కొందరు ఉద్యమకారులు దానిని కూడా ధ్వంసం చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి టాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలను, అలాగే కాసు విగ్రహన్ని పునరుద్దరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఆధ్వర్యంలో తయారు చేయించి ఈ ప్రాంతం అంతా వ్యాప్తి చేశారు. ఆ విగ్రహంలో తెలంగాణ తల్లి పింక్ రంగు చీర ధరించినట్లు కనిపిస్తుంది. అయితే అది బీఆర్ఎస్ రంగు పింక్ కాదని, మెరూన్ కలర్ అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. భరతమాత విగ్రహంలో ఉన్న చీర కలర్ కూడా మెరూనే అని వీరు అంటున్నారు. మెడలో నెక్ లెస్, తదితర మంచి ఆభరణాలు కనిపిస్తాయి. బతుకమ్మ ఉత్సవాలకు ప్రతీకగా దీనిని తయారు చేయించామని బీఆర్ఎస్ నేతల వాదన. తలకు కిరీటం కూడా ఉంటుంది. ఇది కూడా భరతమాతనే పోలి ఉంందని వీరి అభిప్రాయం.అయితే బీఆర్ఎస్ మహిళా నేత, కేసీఆర్ కుమార్తె కవిత ఒక సందర్భంలో తెలంగాణ తల్లి విగ్రహంలో తన పోలిక ఉందని చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యను కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం మూర్ఖత్వమని మాజీ సీఎంకేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం వి తలతిక్క ఆలోచనలని, వాటివల్ల తెలంగాణ అస్తిత్వానికి గాయం అవుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని సెంటిమెంట్ గా మార్చడానికి ఆయన ప్రయత్నించవచ్చు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నడిచింది అంతా సెంటిమెంట్ రాజకీయాలతోనే అన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో అభివృద్ది మా హక్కు అని, తెలంగాణ రాష్ట్రం మా సెంటిమెంట్ అని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రచారం చేసేవారు. కాగా కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాన్ని ఎదుర్కోవడానికి రేవంత్ సిద్దపడుతున్నారు. చాకలి ఐలమ్మ స్పూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించామని, కుడిచేతితో జాతికి అభయాన్ని ఇస్తోందని అన్నారు. ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ పంటలతో ఈ విగ్రహం తయారైందని అన్నారు. తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా విగ్రహ రూపకల్పన జరిగిందని ఆయన వాదించారు. శాసనసభలో భావుకతను కూడా ప్రదర్శిస్తూ ప్రసంగించారు. డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుతామని కూడా ప్రకటించడం విశేషం. సోనియాగాంధీ జన్మ దినం ఇదే రోజు కావడం గమనార్హం. బీఆర్ఎస్ ఇందుకు అంగీకరించదు. తెలంగాణ అవతరణ దినోత్సవ తేదీని మార్చడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బిజెపి ఆరోపించింది. దీనిని కాంగ్రెస్ విగ్రహంగా తయారు చేశారని కూడా బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా విగ్రహాలను సెంటిమెంట్‌గా పరిగణిస్తుంటారు. అవి కూడా కాలాన్ని బట్టి, రాజకీయాలను బట్టి, మారిన ప్రభుత్వాలను బట్టి కూడా ఉండవచ్చు. టాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలను ఒకప్పుడు కూల్చే యత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాటి జోలికి ఎవరూ వెళ్లలేదు. అంతవరకు మంచిదే. రష్యా లో కమ్యూనిస్టు ప్రభుత్వాల నేతలు లెనిన్, స్టాలిన్ వంటి వారి విగ్రహాలను కూడా తొలగించారు. మన దేశంలో విగ్రహాల చుట్టూ కూడా రాజకీయాలు సాగుతుంటాయి. ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలుగుదేశం సెంటిమెంట్ గా మార్చుకుంటే, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సెంటిమెంట్ గా పరిగణిస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం ఎలా సాగుతుందన్నది అప్పుడే చెప్పలేం. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ విగ్రహం ఏర్పాటు చేసింది కనుక, రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రభుత్వ స్థలాలలో ఈ విగ్రహాలను నెలకొల్పవచ్చు. కాని ఇప్పటికే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహాలు అలాగే కొనసాగవచ్చు.. బీజేపీ అధికారంలోకి వస్తే వారు కొత్త విగ్రహం తయారు చేసి చేతిలో కమలం గుర్తు పెడతారేమోనని కొందరు చమత్కరిస్తున్నారు.ఏది ఏమైనా ప్రజలు ఈ విగ్రహాల సెంటిమెంట్ రాజకీయాలకు ప్రభావితం అవుతారా?లేక రాజకీయ పార్టీల పనితీరుకు ప్రభావితం అవుతారా?అంటే అది సందర్భాన్ని బట్టి, ఆయా నాయకుల చాకచక్యాన్ని బట్టి ఉంటుందేమో! -
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం(డిసెంబర్ 9) సాయంత్రం ఆరు గంటలకు అట్టహాసంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సెక్రటేరియట్లో 20 అడుగుల తెలంగాణతల్లి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చేతిలో వరి,జొన్న, సజ్జ ధాన్యాలతో విగ్రహాన్ని రూపొందించారు.తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మన అదృష్టం: సీఎం రేవంత్మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతిరూపం తెలంగాణతల్లి4 కోట్ల ప్రజల ఆకాంక్షను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందిఉద్యమ సమయంలో టీజీని యువకులు తమ గుండెలపై రాసుకున్నారుబీఆర్ఎస్ టీజీ అని కాకుండా టీఎస్ అని మార్చింది.తమ కుటుంబం కోసమే గత ప్రభుత్వం ఆలోచించిందిఈరోజు తెలంగాణతల్లి విగ్రహం ఆవిష్కరించుకోవడం మన అదృష్టంతెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్చను: భట్టి విక్రమార్కగత ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేసిందిరూ.7 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతున్నాం ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నాంతెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్ఛను మాత్రమే -
టీ షర్ట్స్ వేసుకున్నందుకు అరెస్టు చేశారు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: రేవంత్,అదానీ వ్యవహారంపై ఎండగట్టేందుకు అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణభవన్‌లో ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా సోమవారం(డిసెంబర్ 9) కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.టీ షర్ట్స్ ధరించి అసెంబ్లీ లోపలికి రావొద్దన్న కారణంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారన్నారు. హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందన్నారు.తెలంగాణ వనరులను అదానీకి దోచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రేవంత్,అదానీల చీకటి ఒప్పందాలపై రాహుల్ గాంధీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిర్బంధాలు,దాడులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందన్నారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్ నేతల టీ షర్ట్స్పై రేవంత్ ఫొటో.. తీవ్ర ఉద్రిక్తత -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వివాదం..‘సుప్రీం’ తుది తీర్పు అప్పుడే!
సాక్షి,ఢిల్లీ: గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల వ్యవహారంలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ వేసిన పిటిషన్‌పై సోమవారం(డిసెంబర్ 9) విచారణ జరిగింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్నలతో కూడిన ధర్మాసనం కేసు విచారించింది.తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు కోర్టు వాయిదా వేసింది. ఆ రోజు తుది వాదనలు వినడంతో పాటు ఫైనల్ ఆర్డర్ ఉంటుందని తెలిపింది. దాసోజు శ్రవణ్ తరపున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు ఈ కేసులో స్టే ఇచ్చినప్పటికీ, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి ముకుల్ రోహిత్గి తీసుకువచ్చారు.కాగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్‌ను నామినేట్ చేసినప్పటికీ అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజేఎస్ చీఫ్ కోదండరాం సహా ఇతరులను పెద్దల సభకు పంపించింది.దీంతో శ్రవణ్ తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్నారు. -
కేటీఆర్‌తో మాకేం పోలిక.. కేసీఆర్ లేకపోతే ఆయనెక్కడ?: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యేవాడా? అని అన్నారు. ఇదే సమయంలో ఒకవేళ భవిష్యత్‌లో కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా.. మేము విలువ ఇవ్వమంటూ ఘాటు విమర్శలు చేశారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్లో భట్టి, మంత్రి కోమటిరెడ్డి మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. బ్రమ్మనవెల్లి ప్రాజెక్టు వల్ల వచ్చే ఐదేళ్లలో నల్గొండ జిల్లా స్వరూపం మారబోతుంది. నల్గొండ జిల్లాలో కూడా గోదావరి తరహాలో నీళ్లు పారబోతున్నాయి. భూమి ధరలు భారీగా పెరగబోతున్నాయి. నాకు, తలా ఒక ఎకరం ఇవ్వాలని కోమటిరెడ్డిని అడుగుతున్నా. రాష్ట్రంలో డైట్ చార్జీలు పెంచడం వల్ల మంచి జరిగింది . ఈ నెల 15, 16వ తేదీల్లో అన్ని హాస్టల్స్‌లో జిల్లా కలెక్టర్లు లంచ్ కార్యక్రమం ఉంటుంది. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల డైట్ చార్జీలు పెంచలేదు. రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టి విద్యార్థులకు అందిస్తే చరిత్రలో నిల్చిపోతామన్నారు.అనంతరం, మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ఏం అడిగినా ఒకే అంటున్నారు. సచివాలయానికి పని కోసం వస్తే పైసలు లేవు అంటున్నారు. వైఎస్సార్ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ ఉండేది.. మళ్ళీ ఇప్పుడు భట్టి దగ్గర కనిపిస్తోందన్నారు.అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ లేకుండా కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యేవాడా?. కేటీఆర్ మాకు పోలిక ఏంటి?. కేటీఆర్ భవిషత్లో ఒకవేళ ముఖ్యమంత్రి అయినా మేము ఆయనకు విలువ ఇవ్వం అంటూ కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసనలు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా తెలంగాణభవన్ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. రైతుబంధు గోవిందా.. తులం బంగారం గోవిందా అంటూ నినాదాలు చేస్తున్నారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా బీఆర్ఎస్ నేతలు అదానీ-రేవంత్ ఫొటోతో ఉన్న టీ షర్ట్స్ ధరించి సమావేశాలకు వచ్చారు. ఈ సందర్బంగా అసెంబ్లీ గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం, వారిని తెలంగాణ భవన్ వద్ద వదిలేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు.బీఆర్ఎస్ నేతలంతా తెలంగాణభవన్ ముందు కూర్చుని నినాదాలు చేస్తూ.. అదానీ రేవంత్ భాయ్ భాయ్..కోహినూర్ హోటల్ మే దేకో రేవంత్ అదానీ ...కొడంగల్ మే దేకో రేవంత్ అదానీ ...రామన్నపేట మే దేకో రేవంత్ అదానీ ..కాంగ్రెస్ తల్లి వద్దు తెలంగాణ తల్లి ముద్దు .. అంటూ నినాదాలు చేశారు.ఇదే సమయంలో కాంగ్రెస్ ఒచ్చి గోవిందా .. రేవంత్ ఒచ్చి గోవిందా ...కల్యాణ లక్షి గోవిందా ..తులం బంగారం గోవిందా ..బతుకమ్మ చీరలు గోవిందా ..చెపలు పెంచుడు గోవిందా ..గొర్రెలు పంచుడు గోవిందా ..రైతు బందు గోవిందా ..రైతు రుణ మాఫీ గోవిందా ... అంటూ నిరసనలు తెలుపుతున్నారు. -
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనికి బిగ్ షాక్.. హైకోర్టు ఝలక్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వంపై ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా రమేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఆయనకు 30 లక్షలు జరిమానా విధించింది.బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పౌరసత్వం విషయంలో రమేష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పదిన్నర సంవత్సరాల పాటు ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నమనేనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనల సందర్బంగా కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు తెలిపింది. రమేష్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.. ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.జర్మనీ పౌరసత్వంతోనే ఆయన అక్కడికి వెళ్లారని కోర్టు తెలిపింది. దీంతో, చెన్నమనేనికి రూ.30 లక్షలు జరిమానా విధించింది. జరిమానాలో రూ.25 లక్షలు కాంగ్రెస్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఇవ్వాలని తెలిపింది. మిగిలిన రూ.5లక్షలను హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశం. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తిచేయాలని చెన్నమనేనికి సూచించింది. -
బీఆర్ఎస్ నేతల టీ షర్ట్స్పై రేవంత్ ఫొటో.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ నేతలు.. అదానీ-రేవంత్ ఉన్న ఫొటోతో టీ షర్టులు వేసుకుని వచ్చారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారంతా రేవంత్, అదానీలు కలిసి ఉన్న ఫొటోలతో టీ షర్టీలు ధరించి అసెంబ్లీ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు నెంబర్-2 వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీ షర్టులు ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వదం జరిగింది. అనంతరం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తుతాం. రేవంత్-అదానీ ఒక్కటై తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారు. ప్రతీ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడుతాం. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను ఎండగడతాం.అనంతరం, హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్-అదానీ టీషర్టు వేసుకుని సభలోకి వస్తే ఇబ్బందేంటి?. ప్రజా ప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యం అవుతుందా?. అదానీ, రేవంత్ రెడ్డి భాయ్, భాయ్. అరెస్ట్ చేసి, గొంతు నొక్కి మమ్మల్ని ఆపలేరు. -
అది చార్జిషి ట్ కాదు..పదేళ్ల పాలన డిశ్చార్జ్ రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టడంలో ప్రజా ప్రభుత్వం విజయం సాధించిందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం, సమాచార.. పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చార్జిషీట్ అంటూ ఆ పార్టీ నివేదిక విడుదల చేసిందని, కానీ అది పదేళ్ల బీఆర్ఎస్ పాలన డిశ్చార్జ్ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు.ఆదివారం సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార..పౌరసంబంధాల శాఖల ప్రగతి నివేదికల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ ధ్వంసం చేశారని, మొత్తంగా తుగ్లక్ పాలనను తలపించి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశారని పొంగులేటి ఆరోపించారు. ప్రజల స్వేచ్ఛను హరించారని, పోలీసులను కార్యకర్తల్లా వాడుకున్నారని ధ్వజమెత్తారు. ధర్నాచౌక్‌ను ఎత్తివేసి ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు ఇంకా జ్ఞానం రాలేదన్నారు. ధరణి దరఖాస్తులన్నీ పరిష్కారమయ్యేలా చూస్తాం ‘ప్రజా ప్రభుత్వం వచి్చన వెంటనే ధరణిని ప్రక్షాళన చేసే ప్రక్రియను వేగవంతం చేశాం. పోర్టల్ నిర్వహణను గతంలో ఓ అంతర్జాతీయ సంస్థకు అప్పగించారు. దాన్ని ఈ ఏడాది డిసెంబర్ 1నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీకి అప్పగించాం. ధరణి మాడ్యూల్స్ తగ్గిస్తున్నాం. పహాణీలో ఇదివరకు 33 కాలమ్స్ ఉండేవి. వాటిని 11 నుంచి 13 వరకే పరిమితం చేస్తున్నాం. ఇకపై ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఆర్జీదారు సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం.ధరణి సమస్యల పరిష్కారానికి ఈ ఏడాది మార్చి 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. గతంలో పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులతో పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా వచ్చిన 1.38 లక్షల దరఖాస్తుల్లో చాలావరకు పరిష్కరించాం. కొత్తగా ఆర్వోఆర్–2024 చట్టం సిద్ధమైంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల్లో ఈ బిల్లును ఆమోదింపజేసి అమలు చేస్తాం.పాత వీఆర్వో, వీఆర్ఏలకు పరీక్ష పెడతాం ‘గ్రామాల్లో రెవెన్యూ పాలనకు అధికారులుండేవారు. గత ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో పెద్ద సంఖ్యలో రెవెన్యూ సమస్యలు పేరుకుపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామానికీ ఓ రెవెన్యూ అధికారిని నియమిస్తున్నాం. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలున్నాయి. సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉంటారు. ఇదివరకు పనిచేసిన వీఆర్వో, వీఆర్ఏలకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి గ్రామాలకు తిరిగి పంపిస్తాం.ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తొలివిడత 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్ఎస్ పాలనలో పూర్తికాకుండా పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రజా ప్రభుత్వం పూర్తి చేస్తుంది..’అని మంత్రి చెప్పారు, ప్రజాపాలన విజయోత్సవాల తర్వాత జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి చర్చిస్తామని, ఆ తర్వాత సీఎంతో జరిగే మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. -
ఏడాది పాలన.. ఎడతెగని వంచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన ఎడతెగని వేదనను మిగిల్చిదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ పాలన అంతా పరపీడన పరాయణత్వంలా మారిందని విమర్శించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడుతామని అధికారంలోకి వచ్చి.. ఏడాదిలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎరుగని నిర్బంధకాండను రేవంత్ ప్రభుత్వం అమలుచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పాలనపై ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ తరఫున హరీశ్‌రావు చార్జిషీట్ విడుదల చేశారు. త్వరలో ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలపై మరో చార్జిïÙట్ విడుదల చేస్తామని ప్రకటించారు. ‘సీఎం సొంత ఊరికి ఎవరైనా వెళ్లాలంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అనుమతి తీసువాల్సిన పరిస్థితి. బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూల్చి ఎమర్జెన్సీని తలపిస్తున్నాడు’అని మండిపడ్డారు. శ్వేతపత్రాల పేరిట రోత పత్రాలు.. ‘రేవంత్ పాలన ప్రతికూల దృక్పథంతో ప్రారంభం కావడంతో ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. శ్వేతపత్రాల పేరిట రోత పత్రాలు విడుదల చేసి రాష్ట్రం దివాలా తీసిందనే నెగెటివ్ ఇమేజ్ సృష్టించారు. రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. ప్రభుత్వ ౖశాఖల మధ్య సమన్వయం లేదు. సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనే పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెచ్చుమీరాయి.కృష్ణా నది ప్రాజెక్టులపై పదేండ్లు కేసీఆర్ కాపాడిన హక్కులను.. అధికారంలోకి వచ్చి నెల తిరక్కుండానే కేంద్రానికి కట్టబెట్టారు. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగితే, రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగింది. రైతు సంక్షేమానికి రాహుకాలం.. వ్యవసాయానికి గ్రహణం పట్టింది. బడిలో చదువుకోవాల్సిన పిల్లలు ఆసుపత్రుల్లో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. హైడ్రా రూపంలో రేవంత్ రెడ్డి విధ్వంసం సృష్టించారు. మూసీ ప్రక్షాళన పేరిట మూటలు వెనకేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిక్క విధానం, తిట్ల పురాణం అవలంబిస్తున్న సీఎంకు దుర్భాష దురంధరుడు అనే బిరుదు ఇవ్వవచ్చు’అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. -
ఇక నిలదీయడమే!
సాక్షి, హైదరాబాద్: పాలకుల అసమర్ధతపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ ఎస్.. ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమ యం ఇచ్చామని, సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గొంతు విప్పాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక ప్రభుత్వం కొనసాగిస్తున్న అణచివేత విధానాలను ఎండగట్టాలని చెప్పారు. ఆదివారం ఎర్రవల్లి నివాసంలో జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్షం సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు. నమ్మి ఓట్లేసిన వాళ్లను వేధిస్తున్నారు.. ‘త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. నమ్మి ఓట్లు వేసిన రైతులు, గిరిజనులు, దళితులను వేధిస్తోంది. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చింది. ఉద్యోగులకు మొండి చేయి చూపుతూ కేవలం ఒకేఒక్క డీఏను విడుదల చేసి అది కూడా 17 వాయిదాల్లో చెల్లిస్తోంది.దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన గురుకుల విద్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. విషాహారంతో పిల్లలు చనిపోవడాన్ని చూసి సభ్య సమాజం సిగ్గు పడుతోంది. గురుకుల బాట పేరిట బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీని ప్రభుత్వం అడ్డుకుంది. గురుకులాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పార్టీ కమిటీ నివేదిక ఇచ్చింది. గురుకుల విద్యా సంస్థల్లో సమస్యలపై బీఆర్ఎస్ త్వరలో కార్యాచరణ ప్రకటిస్తుంది. గురుకుల విద్యా సంస్థల్లో వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టాలి..’ అని కేసీఆర్ సూచించారు. తెలంగాణ అస్తిత్వం మీద సోయి లేదు ‘తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షల మీద సోయి లేని సీఎం కేవలం రాజకీయ స్వార్ధంతో పాటు నాపై ఉన్న కక్షతో తెలంగాణ విగ్రహం రూపురేఖలు మార్చే పిచ్చి పనులకు పూనుకుంటున్నాడు. తెలంగాణ తల్లి భావన కేవలం నాది మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ సమాజానిది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే మూర్ఖత్వంతో సీఎం వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ సమయంలో ఆంధ్రామాత అనే భావన ముందుకు తెచ్చిన అక్కడి నాయకత్వం తర్వాత తెలుగు తల్లిని తెరమీదకు తెచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని మరిపించింది.తెలుగు తల్లి విగ్రహం ఒక రకంగా తెలంగాణ ప్రజల్లో అస్తిత్వ భావనకు ఊపిరిపోసింది. ఇక్కడి ప్రజల అస్తిత్వానికి చిహ్నంగా తెలంగాణ తల్లిని భగవత్ స్వరూపంలో చేతులెత్తి మొక్కేలా రూపొందించాం. అనేకమంది మేధావులు, కవులు, కళాకారులు వేలాది గంటల పాటు చర్చించి, శ్రమించి తెలంగాణ చారిత్రక సాంస్కృతిక సామాజిక నేపథ్యంలో నుంచి ప్రస్తుత తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దారు. సమైక్య పాలనలో మరిచిపోయిన తెలంగాణ ప్రతీకలను ఉద్యమ సమయంలో పునరుజ్జీవింప చేసుకోవడానికే తెలంగాణ తల్లిని నిలుపుకున్నాం.కానీ తెలంగాణ సాంస్కృతిక వారసత్వంపై అవగాహన లేని సీఎం తెలంగాణ అస్తిత్వానికి మచ్చ తెస్తున్నారు. కొత్త రూపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ విగ్రహం ఆవిష్కరణకు నన్ను ఆహా్వనించడం వెనుక ఉన్న కోణం, ఉద్దేశం ఏదైనా ఇంటికి వచ్చిన మంత్రికి తెలంగాణ సాంప్రదాయం ప్రకారం భోజనం పెట్టి సాదరంగా గౌరవించాం..’ అని మాజీ సీఎం చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి‘కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి నేను చేపట్టిన అనేక పనులు, పథకాలను ప్రారంభిస్తున్నాడు. యాదాద్రి పవర్ ప్లాంట్ కేసీఆర్ ఆనవాలు అనే విషయం తెలియదా. వ్యవసాయ రంగాన్ని నిరీ్వర్యం చేయడంపై అసెంబ్లీలో నిలదీయాలి, రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని స్థిరీకరిచేందుకు దార్శనికతతో వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఎలాంటి పరిమితులు విధించకుండా రైతుబంధును అందజేశాం. కానీ ఎన్నికల సమయంలో రైతులకు ఆశపెట్టి ఎగవేస్తున్న ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీలో ఎండగట్టాలి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు హామీల అమలుపై నిలదీయాలి. కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికే పరిమితం కాకుండా గతంలో బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను వివరించాలి..’ అని కేసీఆర్ చెప్పారు. వచ్చే ఏడాదంతా సంస్థాగత నిర్మాణం ‘ప్రజలు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ను మాత్రమే చూస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో వరంగల్, హైదరాబాద్ కాకుండా అందరికీ అందుబాటులో ఉండే చోటును చాటుకుని భారీ జనసమీకరణతో సభ నిర్వహిద్దాం. వచ్చే ఏడాదంతా పూర్తిగా పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యవర్గాల ఏర్పాటు, సంస్థాగత శిక్షణ కార్యక్రమాలపైనే దృష్టి పెడదాం. జమిలి ఎన్నికలు జరిగే పక్షంలో పెద్దగా సమయం ఉండదు. మళ్లీ అధికారంలోకి వంద శాతం మనమే వస్తాం..’ అని బీఆర్ఎస్ అధినేత భరోసా ఇచ్చారు. ఈ సమావేశం అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని పార్టీ కమిటీ కేసీఆర్‌కు ‘గురుకుల బాట’ నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా కమిటీని కేసీఆర్ అభినందించారు. ఇలావుండగా హైదరాబాద్‌లో ఈ నెల 11న జరిగే తన పెద్ద కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ను, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహా్వనించారు. -
ఏడాదిలోనే ఎన్నో చేశాం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే ఎన్నో అంశాల్లో రికార్డులు నెలకొల్పిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఎక్స్‌లో ఆయన ఆదివారం సుదీర్ఘ ట్వీట్ పెట్టారు. ఏడాది పాలనలో సాధించిన ప్రగతిని వివరించారు. ‘మీ సొంత ప్ర భుత్వం ప్రజాపాలన మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నేను నా ప్రజలతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను.మొదటి సంవత్సరం వ్యవసాయ రుణా ల మాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో మీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. మన మహిళా సంక్షేమ పథకాలు, కుల గణన, పర్యావరణ కేంద్రీకృత పట్టణాభివృద్ధి విధానాలు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. తెలంగాణ ప్రజలందరి నమ్మకానికి నా కృతజ్ఞతలు’అని పేర్కొన్నారు.సీఎం రేవంత్‌రెడ్డి తన సందేశంలో పలు అంశాలను ప్రస్తావించారుమహిళా సంక్షేమం: ఉచిత బస్సు, గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్. రైతులు⇒ 25 లక్షల మంది రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ, రూ. 21,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ. ⇒ సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్. ⇒ రైతులకు 24/7 ఉచిత విద్యుత్. హౌసింగ్⇒ నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి. యువతకు ఉద్యోగాలు⇒ ఒక్క ఏడాదిలో యువతకు55,000లకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రైవేట్‌లో లక్షల ఉ ద్యోగాలను సృష్టించాం. గత 12 ఏళ్లలో నిరుద్యోగిత రేటును అత్యల్ప స్థాయికి తెచ్చాం. ⇒ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు. ⇒ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యుద్ధం. ⇒ యంగ్ ఇండియా స్కిల్స్ విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం స్థాపన. ఆర్థిక వృద్ధి / పట్టణాభివృద్ధి⇒ గత తొమ్మిది నెలల్లో రెట్టింపు ఎఫ్‌డిఐల సాధన. గత 11 నెలల్లో మొత్తం పెట్టుబడులు 200 శాతానికి పైగా పెరిగాయి. ⇒ వాతావరణ మార్పు సవాళ్లను ఎదుర్కొనేందుకు అర్బన్ రీ ఇమాజినేషన్ ప్రోగ్రామ్‌ను చేపట్టేందుకు భారతదేశంలో హైదరాబాద్‌ను మొదటి నగరంగా మార్చడం. ⇒ భారీ వృద్ధితోపాటు అత్యంత నివాసయోగ్యంగా మార్చేందుకు ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్, రేడియల్ రోడ్లు, మెట్రో రైల్ రెండో దశ, భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సిటీతో సహా అనేక ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టాం. కులాల సర్వే⇒ దేశంలోనే మొట్టమొదటి సమగ్ర కుల సర్వే ద్వారా తెలంగాణ పౌరుల నుంచి వివరాల సేకరణ ఇతర అంశాలు⇒ ట్రాన్స్‌జెండర్ మార్షల్స్ ద్వారా ట్రాఫిక్‌ను ని యంత్రించే భారతదేశపు మొదటి నగరంగా హైదరాబాద్ త్వరలో అవతరించబోతోంది. ⇒ ప్రజాస్వామ్య, ఉదారవాద విలువల పునరుద్ధరణ. ⇒ డిసెంబర్ 9న (సోమవారం) సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం.