breaking news
-
ఇక్కడి వాళ్లతో దావోస్‌లో ఒప్పందాలేంటి?: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై కిషన్‌రెడ్డి శుక్రవారం(జనవరి24) మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రానికి లాభం చేకూరుతంది అంటే ఎలాంటి విమర్శలు అవసరం లేదు. తెలంగాణ కంపెనీలనే దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసుకోడం ఎంటి..?. నాకు ఏం అర్ధం కాలేదు. విదేశాలు,ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడి రావాలి. కాగితాలకే ఒప్పందాలు పరిమితం కావొద్దు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్నారు.పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది. ముందు ఇళ్లు చక్కబెట్టుకోవాలి. కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో నుంచి బయటికి వద్దామనుకుంటున్నారు.వ్యాపారం చేసుకోవడానికి వేరే రాష్ట్రాలకి తరలిపోతున్నారు. గత ప్రభుత్వం కొందరు వ్యాపారవేత్తలపై పక్షపాతం చూపిస్తే ఈ ప్రభుత్వం వ్యాపారులందరినీ వేధిస్తోంది.అందుకే అనేకమంది పారిశ్రామిక వేత్తలు మహారాష్ట్ర,మధ్యప్రదేశ్‌కి వెళ్లిపోతున్నారు. వేధింపులు ఆపకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఒప్పందాలు చేసుకోవడం సరికాదు. కాంగ్రెస్ వేధించని పారిశ్రామికవేత్త లేడు’అని కిషన్‌రెడ్డి విమర్శించారు.కాగా, సీఎం రేవంత్ దావోస్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొని పలు కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.ఈ పెట్టుబడుల ఒప్పందాల్లో తెలంగాణకు చెందిన మేఘా కంపెనీ పెట్టుబడులు కూడా ఉండడం విమర్శలకు దారితీసింది. -
మంత్రి కోమటిరెడ్డిపై జగదీష్‌రెడ్డి ఫైర్
సాక్షి,నల్లగొండజిల్లా:ప్రజల్లో వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ నేతలు చిల్లర చేష్టలు చేస్తున్నారని రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.నల్గొండలో జగదీష్‌రెడ్డి శుక్రవారం(జనవరి24) మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది.ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాల కంటే ప్రజలే ఎక్కువ ఎండగడుతున్నారు.తెలంగాణలో బీజేపీ,కాంగ్రెస్ ఎంపీలు కుమ్మక్కయ్యాయి.ప్రజల సొమ్ము ,ఆస్తులను దోచుకునేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.కోర్టు ఉత్తర్వుల ప్రకారం శాంతియుతంగా రైతు మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం.మంత్రి కోమటిరెడ్డికి కోతలు తప్ప చేతలు లేవు’అని జగదీష్‌రెడ్డి విమర్శించారు.కాగా,బీఆర్ఎస్ తలపెట్టిన నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు(Telangana High Court) అనుమతినిచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్(BRS Party) భావించిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. విచారణ చేపట్టిన కోర్టు షరతులతో అనుమతి మంజూరు చేసింది.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నల్లగొండ పట్టణంలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదించడం, రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలను అమలు చేయడం లేదని, వాటిపై ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ బీఆర్ఎస్ ఈ మహాధర్నాను తలపెట్టింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా మహాధర్నాకు అనుమతి కోసం ఈ నెల 17వ తేదీన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్ పోలీసులకు దరఖాస్తు చేశారు. దాని విషయంలో పోలీసులు వెంటనే నిర్ణయం ప్రకటించలేదు. ధర్నాకు ముందు రోజైన సోమవారం ఉదయం అనుమతి ఇవ్వడం లేదని లేఖ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంది. -
కమలాపూర్‌లో ఉద్రిక్తత.. కౌశిక్‌రెడ్డిపై టమాటాలతో దాడి!
సాక్షి, కరీంనగర్: కమలాపూర్ గ్రామసభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(kaushik Reddy)పై కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు విసిరారు. ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలతో దాడి చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కరీంనగర్లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనే విధంగా మరోసారి దాడి జరిగింది. నేడు కమలాపూర్‌లో గ్రామసభ జరుగుతున్న సమయంలో అక్కడికి కౌశిక్ రెడ్డి వచ్చారు. సభలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపైకి టమాటాలు విసిరారు. దీంతో..కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల వద్ద వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలపైకి కుర్చీలు విసిరారు. దీంతో, ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. అనంతరం, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో భారీ సంఖ్యలో పోలీసులు గ్రామసభ వద్దకు చేరుకున్నారు. -
కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతృప్తిగా లేరు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గానికి చెందిన ప్రజలూ సంతృప్తికరంగా లేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు, వ్యాపారులు ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సంతృప్తికరంగా లేరన్నమాట వాస్తవం. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ లేదు.యువతకు ఇస్తామన్న రూ.4వేల నిరుద్యోగ భృతి లేదు, ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు లేదు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల ఇస్తామన్న రూ.2,500 ఆర్థిక సహాయం రాలేదు. రైతులకు చేస్తామన్న రుణమాఫీ పూర్తి చేయరు, రైతు భరోసా కూడా అరకొరే. ఆటో డ్రైవర్లు మొదలుకొని గీత కార్మికుల వరకూ కార్మికులకు ఇస్తామన్న భరోసా దొరకదు. దళితులకు ఇస్తామన్న రూ.12 లక్షలు మరిచిపోయారు. బెదిరింపులతో వ్యాపారాలకు అనువైన వాతావరణాన్ని దెబ్బ తీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలకు అంతేలేదు. సామాన్య ప్రజలు మొదలుకొని తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనలో అసంతృప్తితో ఉన్నారు..’ అని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పటాన్చెరులో ఉద్రిక్తతలు
సంగారెడ్డి, సాక్షి: పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెరుపు ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పాత కాంగ్రెస్ క్యాడర్ గురువారం నిరసనకు పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో కాట వర్గీయులు మహిపాల్ దిష్టిబొమ్మను తగలబెట్టాలని చూశారు. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్రవాగ్వాదంతో తోపులాట జరిగింది.నిరసనగా.. సీఎం చిత్రపటంతో కొందరు కార్యకర్తలు పోలీసులను దాటుకుని ఎమ్మెల్యే కార్యాలయాన్ని చేరుకున్నారు. ఆఫీస్‌ను ముట్టడించి.. లోపల సీఎం ఫొటో ఉంచారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉద్రిక్తతల నడుమ.. పటాన్చెరు చౌరస్తా వద్ద భారీగా పోలీసులు మోహరించారు.గత కొంతకాలంగా పటాన్చెరు కాంగ్రెస్‌లో పాత, కొత్త నేతల మద్య పంచాయితీ కొనసాగుతోంది. ఈ పంచాయితీని సర్దుబాటు చేయాలని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే రానురాను ఆ పరిస్థితులు మరింత ముదిరాయి. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో..బొల్లారంలో ఓ కార్యక్రమానికి హాజరైన గూడెం పాత వర్గాన్ని బూతులు తిట్టినట్లు తెలుస్తోంది. దీంతో సేవ్ కాంగ్రెస్ .. సేవ్ పటాన్చెరు స్లోగన్‌తో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఇవాళ కాంగగ్రెస్ నేతలు మెరుపు ధర్నాకు దిగడం.. పోలీసుల జోక్యం టెన్షన్ వాతావరణం నెలకొంది. -
గాంధీ భవన్లో తన్నుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. కొత్తగూడెంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పార్టీ పదవులు ఇవ్వడంపై పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అర్హత లేకున్నా కొందరిని ఎంపిక చేశారంటూ కొందరు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అక్రమంగా నియామకం చేశారని అడిగితే దాడి చేశారంటూ పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ గొడవపై అధ్యక్షుడు శివ చరణ్ స్పందించారు. ఎంపికలు నిబంధనల ప్రకారమే జరిగాయన్నారు. ‘‘ఎన్నికైన వారినే ఇవాళ సమావేశానికి ఆహ్వానించాం. ఎన్నిక కానీ వారు మీటింగ్‌లోకి వచ్చి డిస్ట్రబ్ చేశారు. ఓడిపోయిన వారు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు. వయసుకు సంబంధించిన అంశాలన్నీ చెక్ చేసిన తర్వాతే ఫలితాలు ప్రకటించారు. బయట జరిగిన గొడవ గురించి నాకు తెలియదు. ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే దానిపై సమీక్ష చేసుకుంటాం’’ అని శివచరణ్ చెప్పారు. -
సీఎం రేవంత్ కార్యాలయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి (cm revanthreddy) కార్యాలయంపై మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (etela rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కార్యాలయం నుంచి భూ మార్పిడి జరుగుతుందని ఆరోపించారు. మంగళవారం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఈటల రాజేందర్, ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో ఈటలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల జోలికి వచ్చినా, మహిళలను ఇబ్బంది పెట్టినా చీల్చి చెండాడుతాం. టైగర్ నరేంద్ర, బద్దం బాల్ రెడ్డి, బండారు దత్తాత్రేయ వరకు పేదలకి అండగా నిలిచిన పార్టీ బీజేపీ(bjp). రేవంత్ సర్కారు రావడంతోనే హైడ్రా పేరుతో పేదలపై విరుచుకుపడింది. హైడ్రా, మూసి బాధితులకు బీజేపీ అండగా నిలబడింది. రియల్టర్ల పేరుతో దౌర్జన్యానికి దిగుతున్నారని సీపీ దృష్టికి తీసుకెళ్లాం కానీ ఫలితం లేదు. కలెక్టర్, సీపీకి సమస్య వివరించినా పరిష్కారం దొరకలేదు.కబ్జా చేసి పహిల్వాన్లను పెట్టి స్థానికులను, మహిళలను బెదిరించారు. ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో వారి దౌర్జన్యాలు చూస్తే అర్ధం అవుతుంది. నేను ఎవరిని కొట్టాలని అనుకోలేదు. కానీ వ్యవస్థ విఫలమైంది. పేదల బాధ చూసి ఆవేశం వచ్చింది. పేదల జోలికి వచ్చినా, మహిళలను ఇబ్బంది పెట్టినా చీల్చి చెండాడుతాం.2005లో ఏకశిలా నగర్ రాజు, వెంకటేష్, భాస్కర్ అనే ముగ్గురు ప్లాట్లను కొన్నట్టు దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు. వాటితో లోన్లుకూడా తీసుకున్నారు. అయితే 2010లో బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన కోర్టు సైతం బాధితులకు అనుకూలంగా తీర్పిచ్చింది. హర్ష కన్స్ట్రక్షన్ కంపెనీ వెంకటేష్ ప్లాట్ల ఓనర్లను ఇంకా భయపెడుతున్నారు. ధరణి లోసుగులతో ఇష్టారీతిన ల్యాండ్లు మార్చుకున్నారు. అధికారులు కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. బాసుల మెప్పు కోసం కాదు పేదలకు న్యాయం చేసేలా అధికారులు పని చేయాలి. అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే డీవోపీటీకి ఫిర్యాదు చేస్తాం. నాడు, నేడు సీఎంల కార్యాలయాల్లోనే ఈ ల్యాండ్ మార్పిడులు జరుగుతున్నాయి. కాళేశ్వరం కాదు అంతకంటే ఎక్కువ కోట్ల అవినీతి ఈ ల్యాండ్ దందాలలో జరిగింది. కేసులకు భయపడను. తెలంగాణ ఉద్యమంలో 150 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 156 అవుతాయి’ అని సూచించారు. -
ఇంకెన్నిసార్లు అప్లై చేయాలి?.. ‘ప్రజాపాలన’పై హరీశ్‌రావు ఫైర్
సాక్షి,సిద్దిపేట: పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం(జనవరి22) సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలకు ఎన్నో షరతులు పెడుతున్నారన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా రైతులకు పూర్తి రుణమాఫీ చెయ్యకుండా ఎగ్గొట్టారని విమర్శించారు. పథకాల కోసం ప్రజాపాలనలో ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘సంక్షేమ పథకాలకు ఏడాది కిందట దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ దిక్కు లేదు, మళ్ళీ ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి. దరఖాస్తుల పేరుతో డబ్బులు వృథా అవుతున్నాయి. దరఖాస్తులతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. అబద్దాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్దాల పరంపర కొనసాగిస్తోంది. అప్పుడు అందరికీ పరమాన్నం పెడతామన్నారు. ఇప్పుడు అందరికీ పంగ నామాలు పెడుతున్నారు. రుణమాఫీ అయిందని రేవంత్‌రెడ్డి హైదారాబాద్ లో చెప్తున్నాడు దమ్ముంటే ఇక్కడికి రా చూపెడత ఎంతమందికి కాలేదనేది. వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫి చేస్తానని ఇప్పుడు మిత్తీ కట్టించుకుని పాక్షిక రుణమాఫి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు, అబద్ధాలు. దమ్ముంటే రేవంత్ రెడ్డి గ్రామ సభలకు రావాలి నేను కూడా వస్తా. పోలీసులను పెట్టి నిర్బంధాల మధ్య గ్రామ సభ నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి డమ్మీ రుణమాఫీ చెక్ ఇచ్చావు. రెండు నెలలు అయినా రేవంత్ రెడ్డి ఇచ్చిన చెక్ పాస్ కాలేదు. ఈ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు. ఈ ప్రభుత్వానికి మోసాలు తప్ప, నీతి నిజాయితీ లేదు. రుణమాఫీపై వైట్ పెపర్ రిలీజ్ చేయాలి. ఎప్పటి లోగా చేస్తారో ఎన్ని చేయాలో చెప్పాలి. రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. వానాకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారో చెప్పాలి. ఇచ్చిన మాట ప్రకారం 15వేల రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ద్రవ్యోల్బణం పెరిగినందున రేషన్ కార్డు ఇన్‌కం లిమిట్ పెంచాలి.కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే తిరుబాటు తప్పదు. అర్హులకు ఇళ్లు ఇవ్వాలి. గ్రామ సభలలో కాంగ్రెస్ ఎంఎల్ఏ ఉన్న చోట ఎమ్మెల్యే ఫొటో పెడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట ఫోటోలు పెట్టడం లేదు. ప్రోటోకాల్ పాటించడం లేదు. రేవంత్ రెడ్డి ఏడాదిలోనే ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్నారు’అని హరీశ్‌రావు విమర్శించారు. -
కాంగ్రెస్‌కు ఏటీఎంగా ‘మూసీ’: కవిత
సాక్షి,యాదాద్రిభువనగిరిజిల్లా:కాంగ్రెస్ తమ పార్టీ నేతలపై రౌడీ మూకలతో దాడులు చేయిస్తోందని,తాము తల్చుకుంటే కాంగ్రెస్ నాయకులు ఎక్కడ తిరగలేరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. యాదగిరిగుట్టలో బుధవారం(జనవరి22) కవిత మీడియాతో మాట్లాడారు.‘మూసీ నది కాలుష్యానికి కారణం కాంగ్రెస్. మూసీ నదిని శుద్ధి చేయాలని కేసీఆర్ ఆనాడే నడుం బిగించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు మూసీని ఏటీఎంగా మార్చుకున్నారు. మూసీ పేరుతో కోట్ల ప్రజాధనం లూటీ చేస్తున్నారు.లూటీ చేసిన దాంట్లో నుంచి ఢిల్లీకి కప్పం కట్టే కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. అన్ని పథకాల్లో కోతలు పెట్టారు.ధాన్యం కొనుగోళ్లలో గోల్మాల్ చేశారు. నాగార్జునసాగర్‌ను కేఆర్ఎంబీకి అప్పజెప్పారు.ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన పప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్ల కూల్చివేత చేపట్టినపుడు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు.కేటీఆర్, హరీశ్‌రావు నేతృత్వంలో పలు చోట్ల ధర్నాలు చేశారు. మూసీ ప్రక్షాళన కంటే తెలంగాణలో ప్రాధాన్యమైన పనులు ఎన్నో ఉన్నాయనేది బీఆర్ఎస్ వాదన. దీంతో పాటు ఈ ప్రాజెక్టులో భాగంగా పేదల ఇళ్లు కూల్చవద్దని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇదీ చదవండి: మేయర్‌పై అవిశ్వాసం -
ఖాకీల దౌర్జన్యాలు.. కాంగ్రెస్ లీడర్ల బెదిరింపులతో గ్రామసభలు
హైదరాబాద్, సాక్షి: సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు కోసం మరోసారి గ్రామ సభలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం(Telangana Government). అయితే ఈ పరిణామాలు చాలా చోట్ల గందరగోళానికి దారి తీసింది. అర్హత ఉన్నవాళ్లు సైతం ఇబ్బంది పడుతున్నామంటూ వాపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. మోసకారి కాంగ్రెస్ సర్కారు(Congress Government)పై ప్రజాతిరుగుబాటు మొదలైంది అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారాయన. గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయింది. అసమర్థ ముఖ్యమంత్రి అసలు స్వరూపం బట్టబయలైంది. ఇక కాలయాపనతో కాలం సాగదు. అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదు. ఈ దరఖాస్తుల దందా నడవదు. ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగదు..నమ్మించి చేసిన నయవంచనకు నాలుగుకోట్ల సమాజం ఊరుకోదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అట్టుడికిన గ్రామసభల(Grama Sabha) సాక్షిగా. గ్రామసభలా...ఖాకీల క్యాంప్ లా!?. సంక్షేమ పథకాల కోసమా.. కాంగ్రెస్ కార్యకర్తల నిర్ధారణ కోసమా!?. ఖాకీల దౌర్జన్యాలు.. కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామసభలు!. పోలీసు పహారాలో గ్రామలను నింపేసి గ్రామసభలా? ప్రశ్నించిన ప్రజలపై ఖాకీల జులుమే సమాధానమా?. ఇదా.. మీరు చెప్పిన ప్రజా పాలనా?. ఇదా.. మీరు చెప్పిన ఇందిరమ్మ పాలనా?. పోలీసుల నడుమ.. అంక్షల నడుమ పథకాలకు అర్హుల గుర్తింపట!. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గేంటి అన్నట్లు కాంగ్రెస్ పాలన! అంటూ ట్వీట్ చేశారాయన.ఇదీ చదవండి: సారూ.. మా పేర్లు ఎందుకు లేవు? -
‘పోలీస్ రాజ్యం అమలు చేస్తే చూస్తూ ఊరుకోం’
సూర్యాపేట జిల్లా: నల్లగొండలో పోలీస్ రాజ్యం నడుస్తోందని ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి(Jagadish Reddy)విమర్శించారు. పాలన ఇలానే కొనసాగితే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. అసలు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులకు ఏం పని అని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ రహిత తెలంగాణ కోసం నల్లగొండ(Nalgonda) నుండే ఉద్యమం మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చారు.ఈరోజు(మంగళవారం) సూర్యాపేటలో ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.‘ ఇక్కడ పోలీస్, కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తుంది. మంత్రి వెంకట్‌రెడ్డికి కేటీఆర్ ఫోబియా పట్టుకుంది. కేటీఆర్ ఫోటో, గులాలీ రంగు చూసినా వెంకట్‌రెడ్డికి భయమైపోతుంది. కాంగ్రెస్ఫ్లెక్సీలను వదిలి కావాలనే మున్సిపాలిటీ అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేశారు. మంత్రి వెంకట్‌రెడ్డి సోయిలో లేకుండా ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేస్తున్నారు. వెంకట్‌రెడ్డి మాటలు విని డ్యూటీ చేస్తే ఇబ్బందులు తప్పవు. భూపాల్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. గ్రామ సభల్లో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడుతుంది. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.జాబితాలో అర్హుల పేర్లు లేకపోవడంతో ప్రజలు తిరగబడుతున్నారు’ అని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు.నల్లగొండ మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తతనల్లగొండ మున్సిపాలిటి(nalgonda municipality) వద్ద బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకులు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కాస్తా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మున్సిపల్ కమిషనర్ చాంబర్లో బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కార్యకర్తలు బైఠాయించడంతో.. కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మున్సిపల్ కార్యాలయంలోకి ఎలా వస్తారంటూ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌ెడ్డి మండిపడ్డారు.అదే క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లేందుకు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. అయితే దీన్ని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడ్నుంచి తరలించారు.అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతాం..నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై కాంగ్రెస్(Congress) నేతలు మండిపడుతున్నారు. అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతామని హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వ్యతిరేకంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రస్తకే లేదన్నారు. ‘పోలీసులపై కంచర్ల భూపాల్ రెడ్డి దుర్భాషలాడారు. కంచర్ల భూపాల్ రెడ్డి పదేపదే అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. ఎన్ని రోజులు ఓపిక పట్టాం ఇకపై ఉరికిచ్చి కొడతాం.కంచర్ల భూపాల్ రెడ్డి ఒక మెంటల్ కృష్ణ’అని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు., -
‘నేను ప్రజల మనిషినయ్యా.. అందుకే వాణ్ని ..’
సాక్షి, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పర్యటనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కబ్జా రాయుళ్లు తమ భూముల్ని కాజేస్తున్నారంటూ పలువురు బాధితుల ఫిర్యాదతో ఈటల రాజేందర్ మంగళవారం ఏకశిలానగర్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పేదల భూముల్ని కబ్జా చేస్తున్నారంటూ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఈటల రాజేందర్ దాడి చేశారు. ఆ ఘటనపై తాజాగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. పోచారం మున్సిపాల్టీ పరిధిలోని కొర్రేముల 1985లో 149 ఎకరాల భూమిని 2076 మందికి విక్రయించారు. ప్రభుత్వ ఉద్యోగులు లోన్ తీసుకొని ప్లాట్లు కొనుగోలు చేశారు. 2006లో దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వ్యవసాయ భూమిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రయత్నం చేశాడు. డీపీవో అండదండతో మళ్ళీ వ్యవసాయ భూమిగా మార్చారు.ధరణి లొసుగులతో ఆప్పటి కలెక్టర్ అమాయ్ కుమార్ 9 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారి కి కట్టబెట్టే ప్రయత్నం చేశారు.రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరాయి గుండాలతో కుక్కలను పెట్టీ ఇక్కడ స్థానికులను భయపెట్టే ప్రయత్నం చేశారు. బాధితులు నా దగ్గరకు వచ్చారు. సీపీకి ఫోన్ చేశాను, కలెక్టర్‌కు చెప్పాను. రాత్రి పూట ఎంపీ వస్తే ఏం పీకు** అంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థానికులను బెదరించాడు. నలభై లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకుంటే కూల్చారని ఒక అబ్బాయి ఏడుస్తూ ఫోన్ చేశారు. దీంతో నేను బాధితుడి ఇంటికి వెళ్లా. నేను వెళ్లే సమయంలో గుండాలు తాగుతూ ఇక్కడే కూర్చున్నారు. ప్రజల మనిషిగా వాడ్ని కొట్టిన.న్యాయం కాపాడాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు అధర్మానికి అండగా అంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధితులకు పూర్తి న్యాయం చేయాలి. కాంగ్రెస్ నాయకుల అండతోనే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రెచ్చిపోతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. -
నల్లగొండ మున్సిపాలిటి వద్ద ఉద్రిక్తత
నల్లగొండ: నల్లగొండ మున్సిపాలిటి(nalgonda municipality) వద్ద బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకులు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కాస్తా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మున్సిపల్ కమిషనర్ చాంబర్లో బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కార్యకర్తలు బైఠాయించడంతో.. కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మున్సిపల్ కార్యాలయంలోకి ఎలా వస్తారంటూ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌ెడ్డి మండిపడ్డారు.అదే క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లేందుకు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. అయితే దీన్ని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడ్నుంచి తరలించారు.అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతాం..నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై కాంగ్రెస్(Congress) నేతలు మండిపడుతున్నారు. అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతామని హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వ్యతిరేకంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రస్తకే లేదన్నారు. ‘పోలీసులపై కంచర్ల భూపాల్ రెడ్డి దుర్భాషలాడారు. కంచర్ల భూపాల్ రెడ్డి పదేపదే అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. ఎన్ని రోజులు ఓపిక పట్టాం ఇకపై ఉరికిచ్చి కొడతాం.కంచర్ల భూపాల్ రెడ్డి ఒక మెంటల్ కృష్ణ’అని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు.రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఎంపీ ఈటల, అనుచరుల దాడితెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దాడి చేశారు. పేదల భూములు కబ్జా చేశారనే ఆరోపణల నేపథ్యంలో రియల్ వ్యాపారిపై ఈటల చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.పేదలను భూములను కబ్జా చేస్తున్నారని బాధితులు ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈటల నేడు.. మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో ఉన్న ఏకశిలానగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పేదల భూములను రియల్ వ్యాపారులు ఆక్రమించుకోవడంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
ఇందిరమ్మ రాజ్యం కాదు.. తోడేళ్లలా ప్రాణం తీసే సర్కార్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలనపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది.. తోడేళ్ళలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది! అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రైతుల ఆత్మహత్యలపై స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్..‘ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిది! రైతు రాజ్యం కాదిది..రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిది!. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది.. తోడేళ్ళలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది!.కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్. ఆత్మహత్యలు కాదివి ముమ్మాటికి మీరు చేసిన హత్యలు. రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలు. రైతుబంధు వేయకుండా చేసిన ఖూనీలు. ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయి. వారి కన్నీళ్లే కపట సర్కార్ ను కూల్చి వేస్తాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిది! రైతు రాజ్యం కాదిది..రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిది!ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది..తోడేళ్ళలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది!కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్ఆత్మహత్యలు కాదివి… pic.twitter.com/u70SmU5tlb— KTR (@KTRBRS) January 21, 2025మరోవైపు రైతుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ సైతం స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా..‘రైతాంగం గోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. మరో నలుగురు అన్నదాతల బలవన్మరుణం.. ఇప్పటికి రాలిన మట్టిపూలు 406 మంది. రుణమాఫీ కాక, పంట దిగుబడి రాక, పెట్టుబడులు భారమై అప్పుల బాధలో నలుగురు అన్నదాతల ఆత్మహత్య. రాష్ట్రంలో ఒక్కరోజే నాలుగు చోట్ల ఘటనలు జరిగియా.రాష్ట్రంలో రైతుల మరణమృదంగం మోగుతూనే ఉన్నది. అన్నదాతల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల్లో ఇద్దరు రైతుల బలవన్మరణం నుంచి కోలుకోకముందే సోమవారం మరో నాలుగు జిల్లాల్లో అప్పుల బాధతో నలుగురు యువ రైతులు ప్రాణాలు వదిలారు.🔴 రైతాంగం గోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. మరో నలుగురు అన్నదాతల బలవన్మరుణం.. ఇప్పటికి రాలిన మట్టిపూలు 406🔴 రుణమాఫీ కాక, పంట దిగుబడి రాక, పెట్టుబడులు భారమై అప్పుల బాధలో నలుగురు అన్నదాతల ఆత్మహత్య🔴 రాష్ట్రంలో ఒక్కరోజే నాలుగు చోట్ల ఘటనలురాష్ట్రంలో రైతుల… pic.twitter.com/UmPqslh3Ph— BRS Party (@BRSparty) January 21, 2025వేసిన పంటలు చేతికిరాక.. వచ్చిన పంటకు సరైన మద్దతు ధర లేక.. బోరు బావుల్లో నీళ్లు పడక అప్పులు భారమై ముగ్గురు, రుణమాఫీ కాక మనస్తాపంతో ఒకరు తనువు చాలించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు, వరంగల్ జిల్లా సగెం మండలం పోచమ్మతండా, వికారాబాద్ జిల్లా దోమ మండలం అయినాపూర్, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన ఈ ఘటనలు తెలంగాణలో రైతుల ప్రస్తుత దయనీయ పరిస్థితికి అద్దంపడుతున్నాయి’ అంటూ ఆరోపణలు చేసింది. -
జ్యూరిక్‌లో రేవంత్, చంద్రబాబు భేటీ
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘రైజింగ్ తెలంగాణ’బృందం సోమవారం ఉదయం ఆ దేశంలోని జ్యూరిక్ పట్టణానికి చేరుకుంది. జ్యురిక్ ఎయిర్‌పోర్టులో సీఎం బృందానికి ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. మరోవైపు దావోస్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం కూడా జ్యురిక్ చేరుకుంది. ఎయిర్‌పోర్టులోనే ఇద్దరు సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్, చంద్రబాబులతో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధి బృందాలు ఫొటోలు దిగాయి. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రతినిధి బృందం జ్యూరిక్ నుంచి రైలులో దావోస్ నగరానికి చేరుకుని ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఇందులో పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం బృందం భేటీ కానుంది. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రణాళికలను వెల్లడించనుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. -
‘అందుకే ఓడిపోయా’
సాక్షి,సంగారెడ్డి : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో సహా,ఏ నాయకుడైనా డబ్బులు తీసుకోండా పనిచేస్తున్నామని చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావే (harish rao) కారణం. సిద్దిపేటలో గెలవడానికి హరీష్ ఎంత కష్టపడ్డారో, నన్ను ఓడగొట్టడానికి అంతే కష్టపడ్డారు. నా ప్లానింగ్ అంత హరీష్ భగ్నం చేశారు. పోలింగ్‌కు మూడు రోజుల ముందు జరగాల్సిన మీటింగ్ చేసుకొనివ్వకుండా హరీష్ వ్యూహం పన్నారు. రివేంజ్ పాలిటిక్స్ ఎవరు చేసిన మంచిది కాదు. తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు గుణం ఉండదు. కక్ష సాధింపు చర్యలకు నేను వ్యతిరేకం. కాంగ్రెస్ నాయకులు రివేంజ్ పాలిటిక్స్ చేసినా మంచిది కాదు. నేను రాజకీయ యుద్ధం చేస్తాను. రివేంజ్ పాలిటిక్స్ చేయను. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి రివేంజ్ పాలిటిక్స్ చేయలేదు. రివేంజ్ పాలిటిక్స్ చేసిన రాజకీయనాయకులు ఏదో ఒకరోజు బాధపడక తప్పదు.సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నే ఫస్ట్ ప్రోటోకాల్. నా భార్య కార్పోరేషన్ ఛైర్మన్. ఆమె ప్రోటోకాల్ సెకండ్ ఉండాల్సిందే. 60 శాతం, 40 శాతంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచిస్తా. నాతో సహా ఏ రాజకీయ నాయకుడైనా డబ్బు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నామని చెప్పగలరా’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం, జగ్గారెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. -
మంత్రి కోమటిరెడ్డి Vs జగదీష్ రెడ్డి.. రాజ్‌భవన్ వద్ద సీఎం చేసిందేంటి?
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు తాజాగా జగదీష్ రెడ్డి కౌంటిరచ్చారు. కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కేటీఆర్‌ను చూస్తేనే ముఖ్యమంత్రి, మంత్రులు భయపడిపోతున్నారంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణభవన్(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో రైతులను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. కేటీఆర్‌ను చూసి సీఎం, మంత్రులు భయపడుతున్నారు. పోలీసుల సూచన మేరకు 12వ తేదీన జరగాల్సిన నల్గొండ రైతు దీక్షను వాయిదావేశాం. ఎక్కడి నుండి ఒత్తిడి వచ్చిందో పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు. కోమటిరెడ్డి వలనే పోలీసులు అనుమతి రద్దు చేశారు. నల్గొండ సభకు పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టుకు వెళ్ళాము. హైకోర్టు సూచనతో ముందుకు వెళ్తాం.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెత్త మాటలు మాట్లాడుతున్నారు. పోలీసులు లేకుండా, సెక్యూరిటీ లేకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లాలో ఎక్కడికైనా వెళ్లి రాగలరా?. ఎప్పుడు దొరుకుతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రైతుల ధాన్యం కొనే వరకు మేము కల్లాల్లోనే ఉన్నాం. మిల్లర్లతో కుమ్మక్కు అయ్యి రైతులను దళారులకు కాంగ్రెస్ నేతలు అప్పచెప్పారు.కేటీఆర్ నల్గొండ వస్తుంటే కోమటిరెడ్డికి ఎందుకు అంత భయం?. నల్గొండ క్లాక్ టవర్ వద్దనే అన్ని రాజకీయ పార్టీలు కార్యక్రమాలు చేస్తాయి. సీఎం, మంత్రులు హైదరాబాద్ నగరంలో ఈడీ ఆఫీసు, రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగలేదా?. కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధిపై నాతో చర్చ చేసే దమ్ము కోమటిరెడ్డికి ఉందా?. కాంగ్రెస్ పాపాలతోనే జిల్లాలో ఫ్లోరిన్ మహమ్మారి పుట్టింది. నేను జిల్లాలో చేసిన అభివృద్ధి చూడటానికి కోమటిరెడ్డి జీవిత కాలం సరిపోదు. సొంత నియోజకవర్గాలను కోమటిరెడ్డి అభివృద్ధి చేసుకోలేదు.యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఆపేస్తా అని కోమటిరెడ్డి చెబుతున్నారు. ఆయన స్పృహలో ఉండి మాట్లాడటం లేదు. సరైన పోటీ లేక నల్గొండలో కోమటిరెడ్డి గెలిచారు. భూపాల్‌రెడ్డి దెబ్బకు నల్గొండలో ఓటమి తప్పలేదు. మంత్రి ఎవరి దగ్గర ఎంత వసూలు చేశారో అన్ని విషయాలు నా దగ్గర ఉన్నాయి. చేతగాక పోలీసుల చేత పర్మిషన్ రద్దు చేయించారు. మీరు 20,30 ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి ఆస్తులు పెంచుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అంతకుముందు, మంత్రి కోమటిరెడ్డి.. నల్లగొండలో బీఆర్ఎస్ ధర్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేసిన నేతలు జిల్లాకు ఎలా వస్తారు?. రేసుల మొనగాడు దీక్ష చేస్తే రైతులు నమ్మే పరిస్థితిలో లేరు. మూడు ఫీట్లు ఉన్న వ్యక్తి మూడువేల ఓట్లతో గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీ బొందలగడ్డ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
కవితకు ఎంపీ రఘునందన్ కౌంటర్
సాక్షి, సంగారెడ్డి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందన్న కవిత వ్యాఖ్యలకు కౌంటిరచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి. ఇప్పటికైనా ఆమెను డాక్టర్‌కు చూపించాలి అంటూ కామెంట్స్ చేశారు.సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌కి రైతులు గుర్తుకు రాలేదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదు. అధికారం పోయాక రైతులపై కేటీఆర్‌కు ప్రేమ పెరిగి రైతు ధర్నాలు చేస్తున్నాడు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి. చెల్లె ఇప్పటికీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది. మంచి డాక్టర్‌కి చూపిస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది.కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్‌కి అవమానం జరిగింది. కాంగ్రెస్ ఐదున్నర దశాబ్దాలు అధికారంలో ఉండి ఏనాడూ అంబేద్కర్‌ని గౌరవించలేదు. కేవలం అంబేద్కర్ జయంతి, వర్థంతి తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. 1950లో నామినేటెడ్ ప్రధానిగా ఉన్నప్పుడే జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. రెండోసారి ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకువచ్చి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. గాంధీ, నెహ్రూ కుటుంబాల్లో ఐదు తరాలు రాజ్యాంగాన్ని అవమానించారు. ఆనాడు ప్రధాని మన్మోహన్‌ను కాదని యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ నిర్ణయాలు తీసుకుని రాజ్యాంగాన్ని లెక్కచేయలేదు.ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ రోడ్లపై తిరుగుతున్నారు. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి పేదలు గుర్తుకు వస్తారు. ఆనాడు అధికారంలో ఉన్న బీసీలను, పార్టీ అధ్యక్షులుగా ఉన్న దళితులను అవమానించింది కాంగ్రెస్ పార్టీనే. హస్తం పార్టీకి అధికారం ఉంటే ఒకలా ఉంటుంది.. లేకపోతే మరోలా మాట్లాడతారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఇదేనా సో కాల్డ్ ప్రజాపాలన: హరీశ్‌రావు సెటైర్లు
సాక్షి,హైదరాబాద్:ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇది ప్రజాపాలన కాదు,నిర్బంధ పాలన అన్నారు. ఈ విషయమై హరీశ్‌రావు సోమవారం(జనవరి20) మీడియాతో మాట్లాడారు.‘ఆంక్షలు,కంచెలు,అరెస్టులు,నిర్బంధాలు రేవంత్ పాలనలో నిత్యకృత్యమయ్యాయి. అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నాగర్ కర్నూల్ జిల్లా,మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన హరగోపాల్‌ను అరెస్టు చేయడం అమానుషం.దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా పాలన,ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టి,ఇప్పుడు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం అమానుషం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ..ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన. ఇందిరమ్మ రాజ్యమని చెప్పిన మీరు కంచెలు,ఆంక్షలు,అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారు. మీ సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే,రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?ప్రొఫెసర్ హరగోపాల్ సహా అరెస్టులు చేసిన ప్రజా సంఘాల నాయకులను తక్షణం విడుదల చేయాలి’అని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రేపటి బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణ
సాక్షి, నల్గొండ జిల్లా: నల్లొండలో బీఆర్ఎస్(BRS Party) రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు నల్గొండ(Nalgonda)లో కేటీఆర్(KTR) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే పోలీసులు మాత్రం ధర్నాకు నో చెప్పారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.ధర్నా కారణంగా క్లాక్ టవర్ సెంటర్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందంటూ అనుమతి నిరాకరించారు. సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతుందని పోలీసులు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే. పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కానీ పోలీసులు.. ధర్నాకు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారుహామీలను అమలు చేయాలని అడగడం తప్పా?రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమే ఇదంటూ ధ్వజమెత్తారు. కేటీఆర్ వస్తున్నారంటే రేవంత్ ప్రభుత్వం భయపడుతోంది. రేవంత్ ఇచ్చిన హామీల అమలును నిలదీయొద్దా?. హామీలను అమలు చేయాలని అడగడం తప్పా?’’ అంటూ లింగయ్య ప్రశ్నించారు.ఇదీ చదవండి: కేసీఆర్, హరీశ్, ఈటలకు సమన్లు? -
కాంగ్రెస్, బీఆర్ఎస్.. బొమ్మా బొరుసు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను ప్రజలు చూస్తున్నారని, అభివృద్ధిలో ఈ రెండు పార్టీల వైఖరి బొమ్మ, బొరుసు మాదిరి ఉందని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పలువురు యువకులు ఆదివారం కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ కాలయాపన చేస్తున్నాయని, రెండు పార్టీలు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలని ఆరోపించారు.ఈ రెండు పార్టీల నేతలు రాష్ట్ర ఖజానాను దోపిడీ చేశారని మండిపడ్డారు. విశ్వనగరమని చెబుతూ వీధుల్లో కనీసం లైట్లు కూడా లేవన్నారు. ప్రభుత్వ శాఖల్లో కిందిస్థాయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. లిక్కర్ మీద వచ్చే డబ్బులు కూడా ఇతర వాటికి మళ్లిస్తున్నారని, దీంతో లిక్కర్ కంపెనీలు కూడా రాష్ట్రానికి మద్యం ఇవ్వమని చెబుతున్నాయన్నారు. బీజేపీపై నమ్మకంతో ప్రజలు 8 పార్లమెంటు సీట్లు కట్టబెట్టారన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదని, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నా రు. రాష్ట్రంæ అప్పుల కుప్పగా మారడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని మండిపడ్డారు. అవినీతి మచ్చ లేకుండా మూడు దఫాలుగా మోదీ ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు రాహుల్ గాం«దీకి లేదన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈటల సంచలన ఆరోపణలు
సాక్షి,హైదరాబాద్:తన రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ,అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీజేపీ(Bjp) ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) విమర్శించారు. ఆదివారం(జనవరి19) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. ఆర్థిక శాఖలో కమిషన్ లేకుండా ఒక్క బిల్లు మంజూరు చేయడం లేదని, 7నుంచి10శాతం కమిషన్ లేనిదే చిన్న బిల్లు కూడా ఇవ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు.‘ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా దుకాణాలు ఓపెన్ చేశారు. మళ్లీ దొరుకుతదో దొరకదో అన్నట్లు దోచుకుంటున్న ప్రభుత్వం ఇది. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఎవరితరం కాదు. తెలంగాణలో రానున్న శకం బీజేపీది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని నెలల పాటు ‘హై డ్రా’ పేరిట పేదల ఇండ్లు కూల్చింది.కొన్ని నెలల పాటు మూసీ పేరిట ఇండ్లు కూల్చింది.ఈ మధ్య కాలంలో దేశంలోనే పెద్దదైన,అతి పురాతనమైన స్లమ్ బాలాజీనగర్,జవహర్ నగర్ స్లమ్ ఏరియాల్లో ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా వలస వచ్చిన ఎంతోమంది కూలీలు,పేదలు నివసిస్తున్నారు.ఇక్కడి ప్రజలు కబ్జా చేసుకుని ఇండ్లు కట్టుకోలేదు.డబ్బులు పెట్టి కొని కట్టుకున్నారు.బ్రిటీష్ కాలంలో ఈ భూమిని సైనికులకు కేటాయించారు.ఆ భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు..కేర్ టేకింగ్ మాత్రమే చేపట్టాలని 1951లోనే స్పష్టంచేశారు.సైనికులు కొందరు ఆ భూమిని అమ్ముకుంటే వారి నుంచి పేదలు కొనుక్కున్నారు. గతంలోనూ కాంగ్రెస్ మంత్రి కమటం రాంరెడ్డి ఆ ప్రాంతంలో ఇండ్లను కూల్చాలని మిషన్లను పంపారు.మళ్లీ ఇప్పుడు రేవంత్ కూల్చివేతలు చేస్తున్నారు.బాలీజీ నగర్లో పేదల ఇండ్లను కబ్జా చేసుకునేందుకు,అమ్మకాలు,కొనుగోలు చేసే బ్రోకర్లు ఎక్కువైపోయారు.రెవెన్యూ అధికారుల ఆగడాలు ఎక్కువైపోయాయి.డబ్బులు ఇస్తే తప్పా మీ ఇండ్లు కూల్చివేతలు ఆగవని చెబుతున్నారు.రెవెన్యూ అధికారులే బ్రోకర్లుగా మారారా? అనే సందేహాలు వస్తున్నాయి.రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు డబ్బులిస్తే తప్ప రేకుల షెడ్ వేసుకునేందుకు అవకాశం ఇవ్వడంలేదు.ఈ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదని హైకోర్డు కూడా మొట్టికాయలు వేసింది..అయినా ఎలా కూల్చుతున్నారు. మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన సీఎం రేవంత్ కు ఈ ప్రాంత ప్రజల బాధలు తెలియవా?పేదల ఇండ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోబోం..కొట్లాటకు కూడా మేం సిద్ధం.కాళేశ్వరం విచారణకు సహకరిస్తారా? అన్న అంశంపై స్పందించిన ఈటల.కాళేశ్వరం విచారణపై అవగాహన లేని వ్యక్తులు ఏదేదో మాట్లాడుతున్నారు.మిడిమిడి జ్ఞానంతో ఉన్నవారు, ప్రొటోకాల్ తెలియని వారు,అవగాహన లేని మెంటల్ గాళ్లు ఏదోదో మాట్లాడుతారు.ప్రభుత్వ పని విధానం ఎలా ఉంటుందనేది కూడా తెలియని వారు ఇలాంటి మాటలు మాట్లాడుతారు.అన్ని డిపార్ట్ మెంట్లు బిల్లులు చేసి పంపిస్తే బిల్లులు రిలీజ్ చేసిది ఆర్థికశాఖ.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అంశంపై తాను ఎలాంటి కామెంట్ చేయను’అని ఈటల అన్నారు. -
కాంగ్రెస్ పాలనలో స్ట్రీట్ లైట్స్ కూడా వెలగడం లేదు: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం(జనవరి19) కిషన్‌రెడ్డి సమక్షంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలు చూస్తున్నాం. రెండు పార్టీలు తెలంగాణను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయి. రెండు పార్టీలు బొమ్మ బొరుసులా వ్యవహరిస్తున్నాయి. రెండు పార్టీలు తెలంగాణను దోపిడీ చేస్తున్నాయి. నగరంలో వీధి లైట్లు వెలగలేక వెలవెల పోతున్నాయి. కింది స్థాయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది.లిక్కర్ మీద వచ్చే డబ్బులు కూడా మళ్లించడం ద్వారా లిక్కర్ కంపెనీలు కూడా రాష్ట్రానికి మద్యం ఇచ్చేదిలేదని చెబుతున్నాయి.బీజేపీపై ప్రజలు నమ్మకం ఉంచారు కాబట్టే ఎనిమిది పార్లమెంట్ స్థానాలను ఇచ్చారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్,కాంగ్రెస్‌లకు లేదు.తెలంగాణ అప్పుల కుప్పగా మారడానికి ఈ రెండు పార్టీలే కారణం.ఒక్క అవినీతి మచ్చ లేకుండా మూడు దఫాలుగా మోదీ దేశాన్ని పరిపాలిస్తున్నారు.తెలంగాణ అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి.డబుల్ ఇంజన్ సర్కారు ద్వారానే తెలంగాణకు న్యాయం జరుగుతుంది.ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు. రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు,విష ప్రచారాలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసింది,అవమాన పరిచింది కాంగ్రెస్ పార్టీ.రాజ్యాంగంపై అనేక కుట్రలు చేసి,అంబేద్కర్‌ను ఆనేక రకాలుగా అవహేళన చేసిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ.పంచతీర్థ పేరుతో అంబేద్కర్‌ను సగౌరవంగా గౌరవించిన పార్టీ బీజేపీ.తెలంగాణలో బీజేపీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత రాజ్యాంగ గౌరవ ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నాం. ఇంటింటికి వెళ్తాం. రాజ్యాంగంపై కాంగ్రెస్ చేసిన అవహేళన చరిత్రను ప్రజలకు తెలియజేస్తాం.రాజ్యాంగంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను బయట పెడతాం.సేవ్ తెలంగాణ పేరుతో యువత ముందుకు రావాలి’అని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
పసుపు బోర్డు.. ఎంపీ అర్వింద్‌పై కవిత సెటైర్లు
నిజామాబాద్ : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి చాటు బిడ్డంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేశారు. బీఆర్ఎస్ చేసిన కృషి వల్లే నిజామాబాద్‌లో పసుపు బోర్డ్ ప్రారంభమైందని కవిత అన్నారు.జనవరి 16న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లతో కలిసి నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించారు.పసుపు బోర్డ్ ప్రారంభ కార్యక్రమంపై ఎమ్మెల్సీ కవిత ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం. ప్రారంభ కార్యక్రమంపై మాకు అభ్యంతరం ఉంది. పసుపు బోర్డ్ ప్రారంభోత్సవం ఒక పార్టీ కార్యక్రమంలా ఉంది. మేం స్థానిక ప్రజా ప్రతినిధులం. మాకు ఆహ్వానాలు అందలేదు. 2014 నుంచి 2018 వరకూ పసుపు బోర్డు కోసం నేను పార్లమెంట్ వేదికగా పోరాటం చేశాను. పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు ఏర్పాటు కాకపోతే దిగుమతులు ఆపాలి. రూ. 15 వేల మద్దతు ధర పసుపు రైతులకు ఇవ్వాలి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెల్పూరులో ఉన్న 40 ఎకరాల స్పైసెస్ బోర్డు స్థలంలో పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.జక్రాన్ పల్లి వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్ ఎయిర్ పోర్ట్ తీసుకురావాలి. కంబోడియా మలేషియా లాంటి దేశాల నుంచి తక్కువ క్వాలిటీ ఉన్న పసుపు దిగుమతులు అవుతున్నాయి.. ఇంకా డబుల్ అయ్యింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను రెండు సార్లు కలిశాను. బోర్డుతో పాటు మద్దతు ధర ఉంటేనే రైతుకు న్యాయం జరుగుతుందని గతం నుంచి డిమాండ్ చేస్తున్నాను. ధర్మపురి అరవింద్ తండ్రి చాటు కొడుకుగా ఉండే వారు. అలాంటి వ్యక్తి తన వల్లే పసుపు బోర్డు వచ్చిందనడం హాస్యాస్పదం. స్పైసెస్ రీజినల్ కార్యాలయం తీసుకొచ్చి ఆనాడు తాను అంబాసిడర్ కారు అడిగితే ప్రధాని మోదీ బెంజ్ కారు ఇచ్చారని అన్నారు. మరి ఇప్పుడు ఏం అంటారు. పసుపు బోర్డు ఒక్కటే కాదు త్రిముఖ వ్యూహం ఉండాలి’ అని కవిత సూచించారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదకొండేళ్లుగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు విడుదల చేసిందని, ఈ దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. స్థానికంగా ఉండే కులసంఘాలు, ఇతర సంస్థలతో కలసి పనిచేస్తామన్నారు. శనివారం కిషన్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసిన విషయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించే అవకాశముందని వస్తున్న వార్తలపై స్పందించాలని విలేకరులు కోరినపుడు.. కేంద్ర మంత్రిగా ప్రజలకు, తన శాఖలో పనిచేస్తున్న వారికి సేవ చేయాలని అనుకుంటున్నానని ఆయన బదులిచ్చారు. తన బొగ్గు, గనుల శాఖ పరిధిలో 6 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి రూ.కోటి బీమా పథకాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించే అవకాశం ఉందనే ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిస్తూ.. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యే వారికి ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలని నిబంధన లేదు. బీజేపీ అధ్యక్ష పదవికి రెండు సార్లు క్రియాశీల సభ్యుడు అయి ఉండాలి. అయితే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచారు. ఆ నిబంధన ఆయనకు వర్తించదు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌ను నేతల ఏకాభిప్రాయంతో ఎంపిక చేస్తారు. నామినేషన్ పద్ధతిలో వారం తర్వాత కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు’అని తెలిపారు. మూడు ఎమ్మెల్సీ సీట్లకు జరగనున్న ఎన్నికల్లో అన్నింటిలోనూ గెలుస్తామనే నమ్మకం తమకుందన్నారు. ‘రాష్ట్రంలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు కదా’అన్న ప్రశ్నకు.. ఎన్నికలు ఉంటాయంటున్న కేటీఆర్, సుప్రీంకోర్టు జడ్జి కూడా అయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. సినీహీరో చిరంజీవి బీజేపీలో చేరతారా? అన్న ప్రశ్నకు.. ‘నా ఆహ్వానం మేరకు ఇటీవల ఆయన ఢిల్లీకి వచ్చారు, అనేక మంది సినీ ప్రముఖులకు బీజేపీతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. కొందరు పార్టీలో చేరారు. మంత్రులు అయ్యారు. కొందరు పార్టీకి ప్రచారం చేశారు. ఇకపై ఏవైనా ఫంక్షన్లకు నేను పిలిస్తే వస్తారంటే నాగార్జున, వెంకటేశ్, ఇతర హీరోలను కూడా పిలుస్తాను’అని కిషన్‌రెడ్డి బదులిచ్చారు. ఉచితాలు వద్దని ఎక్కడా చెప్పలేదు.. ‘బీజేపీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, ఉచితాల (ఫ్రీ బీస్)కు వ్యతిరేకం కాదు. ఉచితాలు వద్దు అని బీజేపీ ఎక్కడా చెప్పలేదు. రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకొని హామీలివ్వాలి’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించాం. తెలంగాణలో టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, రీజినల్ రింగ్ రోడ్ నేనే తెచ్చా. ప్రధానిని ఒప్పించి మహబూబ్‌నగర్ సభలో పసుపు బోర్డు ప్రకటన నేనే చేయించా. మూసీ సుందరీకరణకు కేంద్రం నిధులను నిబంధనల మేరకు కచ్చితంగా ఇస్తాం. హైదరాబాద్ మెట్రోకి రూ.1,250 కోట్లు కేంద్రం ఇచ్చింది. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు కచ్చితంగా సహకరిస్తాం. రీజినల్ రింగ్ రైల్ సర్వేకు కేంద్రం డబ్బులు ఇచ్చింది. అలైన్మెంట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’అని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘తెలంగాణలో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఎంఐఎం సహకరిస్తోంది. బీజేపీపై విషం చిమ్మడమే ఎంఐఎం నేతలు పనిగా పెట్టుకున్నారు. దేశంలో ముస్లింనేతగా ఎదగాలన్న ఆశతో ఆ పార్టీనేత అసదుద్దీన్ ఒవైసీ పిట్టల దొరగా మారారు’అని విమర్శించారు.