ఆ ఊర్లో 30మంది సిద్దరామయ్యలు!

Kids Share Their Names With CM Siddaramaiah In His Own Village - Sakshi

మైసూరు : కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రముఖుల పేర్లు పెట్టాలని భావిస్తారు. ఎందుకంటే తమ పిల్లలు అంతటి గొప్పవారు కావాలనే ఆకాంక్షతో అలా చేస్తారు. అదే ఆ ప్రముఖుడు తమ ఊరివాడైతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సొంత గ్రామమే నిదర్శనం. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి ఆయన ఎంత చెబితే అంత. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా కర్ణాటకలో ఆయన మాట వినాల్సిందే. అంతలా తనదైన ప్రత్యేకతను, ప్రజ బలాన్ని సంపాదించుకున్నారు సిద్దరామయ్య.

మైసూరు జిల్లాలోని సిద్దరామన్నహుండి ముఖ్యమంత్రి సిద్దరామయ్య సొంత గ్రామం. అక్కడ 30మందికి పైగా సిద్దరామయ్యలు ఉన్నారు. ఇందులో రకరకాలు వయస్సుల వారున్నారు. తమ గ్రామం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన లాగే తమ పిల్లలు కూడా వృద్ధిలోకి రావాలన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టామని వారి తల్లిదండ్రులు చెబుతారు. ఇక్కడి పిల్లలు వీధుల్లో క్రికెట్‌, హ్యాండ్‌బాల్‌ ఆడుతుంటారు. ఒక్కోసారి ఒక టీమ్‌లో మొత్తం సిద్దరామయ్యలే ఉంటారు!

సిద్దరామయ్య పేరు పెట్టుకున్న చిన్నారులందరూ ఆయనలా రాజకీయాల్లోకి వస్తామని అనటం లేదు. కొద్దిమంది మాత్రమే ఆయన అడుగు జాడల్లో నడుస్తామంటున్నారు. పోలీసు ఉద్యోగాల్లో చేరాలనుందని చాలామంది చెప్పారు. నీ పేరుతో ఉన్న ప్రముఖుడిని కలుస్తావా అని ఐదేళ్ల బాలుడిని ప్రశ్నించగా... ‘నాకు నచ్చితేనే కలుస్తా’నని సమధానమిచ్చాడు. సీఎం సిద్దరామయ్య తన పాపులారిటీని మరింత పెంచుకుంటారా, లేదా అనేది అసెంబ్లీ ఎన్నికల తర్వాత తేలిపోనుంది. 
 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top