‘పచ్చ’ పోలీసులపై చర్యలు తీసుకోండి

YSRCP complaint to the Central Election Commission Full Bench - Sakshi

కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్‌ బెంచ్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

టీడీపీ తొత్తులుగా కొంత మంది అధికారులు వ్యవహరిస్తున్నారు

ఆ అధికారులను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించండి

అప్పుడే ఎన్నికలు సజావుగా జరుగుతాయి

చట్ట విరుద్ధంగా పదోన్నతులు ఇచ్చారు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు ఉన్నతాధికారులను, సిబ్బందిని ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేసింది. వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మండలిలో విపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీనియర్‌ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా, కమిషనర్లు అశోక్‌  లావాసా, సుశీల్‌ చంద్రతో కూడిన ఫుల్‌ బెంచ్‌తో సమావేశమయ్యారు. ఎన్నికల్లో నెగ్గేందుకు అధికార తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది, రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు అధికార పార్టీకి సహకరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు.

నిబంధనలను ఉల్లంఘించి ముఖ్యమంత్రి చంద్రబాబు తమ నియామకాలకు సహకరించడంతో.. ప్రతిఫలంగా డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, వారి కింద పనిచేస్తున్న సబార్డినేట్‌ ఎస్పీలకు టీడీపీకి  సహకరించాలని ఆదేశాలిస్తున్నారని ఆధారాలతో సహా వివరించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్‌ ఓఎస్డీ యోగానంద్, శాంతిభద్రతల డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, వీరి ఆదేశాల మేరకు టీడీపీకి సహకరిస్తున్న శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల ఎస్పీలను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని, అప్పుడే రాష్ట్రంలో సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని వివరించారు. 

నాన్‌ క్యాడర్‌ ఆఫీసర్లకు పదోన్నతలు 
రాష్ట్రంలో క్యాడర్‌ ఆఫీసర్లు ఉన్నా, ఎన్నికల్లో అక్రమాలకు సహకరిస్తారన్న కారణంగా చట్ట విరుద్ధంగా నాన్‌ క్యాడర్‌ ఆఫీసర్లకు ఎస్పీలుగా పదోన్నతి కల్పించారని వైఎస్సార్‌ సీపీ నేతల బృందం ఈసీ ఫుల్‌ బెంచ్‌కు వివరించింది. శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, విజయనగరం ఎస్పీ దామోదరం ఇద్దరు నాన్‌ క్యాడర్‌ అఫీసర్లని, వీరికి చట్ట విరుద్ధంగా ఎస్పీలుగా పదోన్నతి కల్పించారని వివరించారు. నారాయణ విద్యాసంస్థల నుంచి అక్రమంగా రూ. 50 కోట్లు తరలిస్తూ పట్టుబడగా ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం రంగంలోకి దిగి ఆ డబ్బును విడిపించారని వివరించారు.

ఇలా ఎన్నికల వేళ సహకరిస్తారని చంద్రబాబు ముందుగానే తనకు కావాల్సిన వారికి చట్ట వ్యతిరేకంగా పదోన్నతులు కల్పించారని వివరించారు. డీజీపీ ఠాకూర్, ఏబీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఒక మేళా ఏర్పాటు చేసి దానికి తమ వర్గానికి చెందిన కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు, డీఎస్పీలను ఆహ్వానించారని.. ఇందులో పోలీసులను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు.. కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా, హెడ్‌ కానిస్టేబుళ్లను ఎస్‌ఐలుగా, ఎస్‌ఐలకు సీఐలుగా, సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు ప్రకటించారన్నారు. పదోన్నతలు కల్పించిన సందర్భంగా చంద్రబాబు ఎన్నికల వేళ తమకు సహకరించాలని కోరారని వివరించారు.

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై 438 అక్రమ కేసులు 
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉన్నతాధికారుల విచ్చలవిడి అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులపై 438 అక్రమ కేసులు బనాయించారని వైఎస్సార్‌ సీపీ నేతలు ఈసీ ఫుల్‌ బెంచ్‌ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అక్రమంగా 48 లక్షల దొంగ ఓటర్లను జాబితాలో చేర్చిందని, దీనికి టీడీపీపై చర్యలు తీసుకోకపోగా అక్రమాలపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌ సీపీ నేతలపై అక్రమంగా కేసులు బనాయించారని వివరించారు. అక్రమ కేసులపై ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలను వైఎస్సార్‌ సీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. 

వైఎస్సార్‌ సీపీ నేతల ఫోన్ల్ల ట్యాపింగ్‌పై ఫిర్యాదు 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలను ఎప్పటికప్పుడు అధికార పార్టీకి చేరవేసేందుకు తమ పార్టీ సీనియర్‌ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం ఫోన్లను ట్యాప్‌ చేసేందుకు హోం శాఖ ప్రధాన కార్యదర్శి ద్వారా ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వర్లు జారీ చేయించిన ఉత్తర్వులపై కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్‌ బెంచ్‌కు ఫిర్యాదు చేసినట్టు సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. ఈ వ్యవహారంపై పార్టీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి అన్ని అధారాలు సమర్పించారన్నారు. 

హెలీకాప్టర్‌ గుర్తును మార్చండి 
వైఎస్సార్‌ సీపీ ‘ఫ్యాన్‌’ గుర్తును పోలిన ప్రజాశాంతి పార్టీకి చెందిన హెలీకాఫ్టర్‌ గుర్తును రద్దు చేయాలని ఈసీ ఫుల్‌ బెంచ్‌ను కోరినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో మామూలుగా స్టిల్‌ పొజిషన్‌లో ఉన్న గుర్తులను రాజకీయ పార్టీలకు కేటాయిస్తుంటారని, అయితే ప్రజాశాంతి పార్టీకి ఇచ్చిన హెలీక్యాఫ్టర్‌ గుర్తులో దాని రెక్కలు హెలీక్యాఫ్టర్‌ ఎగురుతున్న సందర్భంలో సమాంతరంగా ఉన్న గుర్తును కేటాయించారన్నారు. మామూలుగా హెలిక్యాఫ్టర్‌ స్టిల్‌ పొజిషన్‌లో ఉంటే దాని రెక్కలు కిందికి ఒంగి ఉంటాయని, అంతేకాకుండా దాని రెక్కలు హెలీకాఫ్టర్‌ బాడీ కంటే పెద్దవిగా ఉంటాయన్నారు. అయితే ప్రజాశాంతి పార్టీ గుర్తు విషయంలో ఆ రెక్కలు చిన్నవిగా ఉన్నాయని పేర్కొన్నారు.

చంద్రబాబు, ప్రజాశాంతి పార్టీ కుమ్మక్కై పోలింగ్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌ సీపీ ఫ్యాన్‌ గుర్తు కింద హెలీక్యాఫ్టర్‌ గుర్తు వచ్చేలా కుట్ర పన్నుతున్నారని వివరించామన్నారు. దాని కోసం ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పేరు తరువాత ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి పేరు వచ్చేలా అక్షర క్రమం అనుగుణంగా పేర్లు ఉన్న అభ్యర్థులనే పోటీ చేయించే కుట్ర చేస్తున్నారని వివరించారు. తద్వారా ఫ్యాన్‌ గుర్తు, హెలీకాఫ్టర్‌ గుర్తు బ్యాలెట్‌లో ఒకదాని కింద ఒకటి వచ్చి ఓట్లు చీల్చే కుట్ర చేస్తున్నారని వివరించామన్నారు. అంతే కాకుండా తమ పార్టీ జెండాకు ఉన్న మూడు రంగులను ఉద్దేశపూర్వకంగా ప్రజాశాంతి పార్టీ కూడా ఉపయోగిస్తోందన్నారు. ఈ కారణాల వల్ల హెలీకాఫ్టర్‌ గుర్తును రద్దు చేయాలని కోరామన్నారు. తమ విజ్ఞప్తులపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు విజయసాయిరెడ్డి తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top