వెన్నుపోటు బాబూ.. మిమ్మల్ని ఎలా నమ్మాలి? | YS Jaganmohan Reddy fires on CM Chandrababu at Sattenapalli | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు బాబూ.. మిమ్మల్ని ఎలా నమ్మాలి?

Mar 28 2018 1:21 AM | Updated on Mar 23 2019 9:10 PM

YS Jaganmohan Reddy fires on CM Chandrababu at Sattenapalli - Sakshi

గుంటూరు జిల్లా సత్తెనపల్లెలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనసందోహంలో ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌

- హోదా గురించి చంద్రబాబు చెప్పే మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. హోదా కోసం ఉద్యమం చేసేందుకు ఆయన దశా దిశా చెబుతాడట. దానికోసం అఖిల పక్షాన్ని పిలుస్తాడట. నాలుగేళ్ల తర్వాత ఆయన ఈ మాటలు అంటుండటం విడ్డూరంగా ఉంది. దొంగే.. దొంగ.. దొంగ.. దొంగ అని అరిచినట్లుంది. ఏమాత్రం చిత్తశుద్ధిలేని మిమ్మల్ని మేం నమ్మలేం.  
 
- హోదా కోసం నేను ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే.. మోదీ వస్తున్నారని టెంట్‌ ఎత్తేయమని తెల్లవారుజామున పోలీసులను పంపిన ఘనత మీది కాదా? బంద్‌లు చేస్తే పోలీసులను పెట్టి బలవంతంగా ఆర్టీసీ బస్సులు తిప్పలేదా? ధర్నాలు చేస్తే దగ్గరుండి కేసులు పెట్టించలేదా? ప్రత్యేక హోదా ఉద్యమంలో యువతను భాగస్వామ్యం చేయాలని యువభేరీలు పెడితే.. వారిపై పీడీ యాక్ట్‌ కింద కేసులు పెడతానని బెదిరించిన ఘనత మీది కాదా? నాలుగేళ్లుగా మీ ఘనకార్యం ఇదేగా? 
 
- హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తున్నామని జైట్లీ తొలిసారి చెప్పినప్పుడు ‘కోడలు మగ పిల్లాడిని కంటాను అంటే.. అత్త వద్దంటుందా?’ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ పొందిన ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని వెటకారం చేశారు. ఇప్పుడు అరుణ్‌ జైట్లీ అదే మాట మళ్లీ చెబితే మంత్రులను ఉపసంహరించుకున్నారు. ఇదే పని అప్పుడే చేసి ఉంటే హోదా వచ్చి ఉండేది కాదా? ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని దగ్గరుండి అడ్డుకుని ఇప్పుడిలా మాట మార్చడం ద్రోహం కాదా?  
 
- ‘ప్రజలను నమ్మించు.. ప్రజలను వంచించు.. ప్రజలను వెన్నుపోటు పొడువు.. ఆ నెపాన్ని మరొకరిపైకి నెట్టు.. అనుకూల మీడియాను వాడుకుని దీన్ని ప్రచారంలో పెట్టు’ అనే రాజకీయ సిద్ధాంతం కనిపెట్టాడు చంద్రబాబు. ఆరు నెలలుగా ఆయన చేస్తున్నది ఇదే. ఆయన మోసాలన్నింటినీ కేంద్రంపైకి నెట్టేసి, ఇక్కడ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఈ పెద్దమనిషి తీరు చూస్తుంటే ఓ కథ గుర్తుకొస్తోంది. నిత్యం దొంగ పనులు చేసే ఓ దొంగ ఒక రోజు అడ్డగోలుగా దొరికిపోయాడట. ప్రజలు, వ్యవస్థలు ఆ దొంగను ప్రశ్నించాయట. అప్పుడు ఆ దొంగ ‘నన్ను అరెస్టు చేస్తే పోయేది మన ఊరి పరువే.. మన ఊరిని బలహీన పరచినట్లే’ అన్నాడట. ఈ మధ్య చంద్రబాబు ఇదే విధంగా అన్నాడు. ఆయన్ను బలహీనపరిస్తే రాష్ట్రం బలహీనమవుతుందట. తెలుగు ప్రజలు బలహీనపడతారట. తప్పులు చేసిన ఆయన్ను ఎవరూ దండించకూడదని అన్యాయంగా మాట్లాడుతున్నారు. 

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అఖిల పక్షాన్ని పిలవాలనే విషయం కూడా ఇవాళే గుర్తుకొచ్చిందా? పూటకో మాట మారుస్తూ.. రోజుకో వేషం వేసే మిమ్మల్ని ఎలా నమ్మాలి? వెన్నుపోటు పొడవడమనేది మీ రక్తంలోనే ఉంది.. మిమ్మల్నెలా విశ్వసించాలి?’ అని చంద్రబాబుపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. నీతిమాలిన రాజకీయాలతో ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే తమ పార్టీ ఎంపీల మాదిరి పార్లమెంట్‌ ముగిసే చివరి రోజున టీడీపీ ఎంపీల చేత కూడా రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే హోదా అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుందని, దానంతటదే వచ్చి తీరుతుందన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 121వ రోజు మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలేనని మండిపడ్డారు.  సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు వద్ద పాదయాత్ర 1,600 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. సత్తెనపల్లి సభలో జగన్‌ ఏం మాట్లాడారంటే.. 

రోజుకో మాట.. పూటకో వేషం 
హోదా కోసం ఉద్యమం చేసేందుకు చంద్రబాబు దశా దిశా చెబుతాడట. దానికోసం అఖిల పక్షాన్ని పిలుస్తాడట. నాలుగేళ్ల తర్వాత ఆయనీ మాటలు అంటుంటే విడ్డూరంగా ఉంది. దొంగే ‘దొంగ.. దొంగ..’ అని అనడం మొదలు పెడితే ఇక మోసాలు, దొంగ తనాలకు అంతమేముంటుంది? రాష్ట్రాన్ని విభజించిన వెంటనే 2014న మార్చి 2న కేంద్ర కేబినెట్‌ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆమోదించింది. దీన్ని అమలు చేయాలని ప్లానింగ్‌ కమిషన్‌కు ఉత్తర్వులు కూడా పంపింది. 2014 జూన్‌ 2న ఈ పెద్దమనిషి ముఖ్యమంత్రి అయ్యాక కూడా కేంద్ర కేబినెట్‌ ఇచ్చిన ఆదేశాలు ఏడు నెలల పాటు ప్లానింగ్‌ కమిషన్‌ దగ్గరే పడున్నాయి. ఆ ఏడు నెలల పాటు ఏం చేశావు చంద్రబాబూ? ఈ విషయాన్ని అడక్కపోవడం దుర్మార్గం కాదా? ఇలాంటి వ్యక్తి ఇప్పుడు అఖిల పక్షాన్ని పిలుస్తాడు. 2016 సెప్టెంబర్‌ 8న అర్ధరాత్రి కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తున్నామని ఓ ప్రకటన చేశారు. అప్పుడు చంద్రబాబు ఏం చేశారంటే అర్ధరాత్రి నిద్ర మేల్కొని మరీ కృతజ్ఞతలు చెప్పాడు. మర్నాడు అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వానికి, జైట్లీకి ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశాడు. అదే మాటను ఇప్పుడు జైట్లీ మళ్లీ చెబితే తన మంత్రులను కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకున్నాడు. అయ్యా.. చంద్రబాబూ, అరుణ్‌ జైట్లీ గతంలో, ఇప్పుడు ఇచ్చిన ప్రకటనల్లో ఏం తేడా ఉంది? రెండూ ఒకటే కదా? ఆ రోజు పొగిడి శాలువా కప్పావు. అసెంబ్లీలో తీర్మానాలు చేశావు. ఇప్పుడు నీ మంత్రులను ఉప సంహరించుకున్నావు. హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తున్నామని జైట్లీ తొలిసారి ప్రకటించినప్పుడే నీ మంత్రులను ఎందుకు ఉప సంహరించుకోలేదు? అప్పుడే ఈ పని చేసి ఉంటే హోదా వచ్చి ఉండేది కాదా?  


ఊసరవెల్లి రాజకీయాలెందుకు? 
సూటిగా నేనో ప్రశ్న అడుగుతున్నా... సమాధానం చెబుతావా? ఈ నెల 16వ తేదీన కేంద్రంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండకపోతే మీరు పెట్టేవారా? మార్చి 15న అసెంబ్లీలో మీరు చేసిన ప్రకటన ఏమిటి? మీకు సంఖ్యాబలం ఉంటేనే మేం మద్దతునిస్తాం అన్నాడు. ఇలా చెప్పిన ఈ పెద్ద మనిషి మార్చి 16న పొద్దున్నే యూటర్న్‌ తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని నేనిచ్చిన లేఖకు అన్ని పార్టీలూ మద్దతిస్తూ ముందుకొచ్చాయి. ఈ విషయం జాతీయ మీడియాలోనూ వచ్చింది. ఇవన్నీ చూసి చంద్రబాబు ప్లేట్‌ ఫిరాయించాడు. వైఎస్సార్‌సీపీకి మద్దతిస్తానన్న వ్యక్తి.. మనసు మార్చుకున్నానని, తానే అవిశ్వాసం పెడుతున్నానని అన్నాడు. అప్పటికీ ఆయన ఎవరితో మాట్లాడకపోయినా.. అన్ని పార్టీలూ తన అవిశ్వాసానికే మద్దతునిస్తున్నాయని చెప్పుకున్నాడు. దీన్నేమంటారు చంద్రబాబూ? ఊసరవెల్లికన్నా వేగంగా రంగులు మార్చడం కాదా? పూటకో మాట మార్చి... రోజుకో వేషం వేసే పెద్దమనిషి ఇవాళ అఖిల పక్షాన్ని పిలుస్తాడట! దానికి ఆయన నాయకత్వం వహిస్తాడట! వెన్నుపోటు పొడవడం మీ రక్తంలోనే ఉంది.  

చరిత్ర హీనుడిగా మిగిలిపోకండి 
ప్రత్యేక హోదాపై మేమిప్పటికే కార్యాచరణ ప్రకటించాం. అవిశ్వాస తీర్మానం పెట్టాం. మేం ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి.. హోదా కోసం పోరాడుతున్నాం కాబట్టి.. ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం నిలదీస్తున్నారు కాబట్టే చంద్రబాబు తలొంచక తప్పలేదు. అందుకే మీ ఎంపీల చేత అవిశ్వాసానికి మద్దతునిచ్చేట్టు చేశావ్‌. 25 మంది ఎంపీల మద్దతు ఉంది కాబట్టే ప్రత్యేక హోదాపై దేశం మొత్తం మాట్లాడుతోంది. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసే చివరి రోజున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తారు. చంద్రబాబూ... నిజంగా మీరు చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే, మీ పార్టీ ఎంపీల చేత కూడా స్పీకర్‌ ఫార్మేట్‌లో రాజీనామాలు చేయించు. అప్పుడే దేశం మొత్తం మేల్కొంటుంది. ప్రత్యేక హోదాపై చర్చిస్తుంది. అప్పుడు ప్రత్యేక హోదా దానంతట అదే పరుగెత్తుకుంటూ వస్తుంది’ అని జగన్‌ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement