కేబినెట్‌లోకి ఇద్దరు మహిళలు

Two Women Ministers Would Be Inducted Into Cabinet Says KCR - Sakshi

రాబోయే విస్తరణలో చోటు కల్పిస్తాం.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి

మహిళలంటే మాకు గౌరవం... వారి వల్లే ఎన్నికల్లో మాకు ఎక్కువ ఓట్లు

వారి మద్దతే లేకుంటే అధికారంలోకి వచ్చేవాళ్లం కాదు

నాలుగు ఎమ్మెల్సీ ఖాళీల్లో ఒకటి మహిళకే కేటాయించాం

రుణమాఫీ సొమ్మును రైతులకు చెక్కుల రూపంలో ఇస్తాం

సమూల మార్పులతో మున్సిపల్‌ చట్టాన్ని తెస్తాం

గత జూలై–ఆగస్టులోనే ముందస్తనుకున్నాం... ఈసీ సహకరించలేదు

శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై సీఎం సమాధానం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రిమండలిలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. మంత్రివర్గంలోకి గరిష్టంగా 17 మందిని తీసుకోవచ్చని, రాబోయే రోజుల్లో ఇంకా ఆరుగురిని (సీఎం కాకుండా ప్రస్తుతం 11 మంది మంత్రులు ఉన్నారు) తీసుకునేది ఉందన్నారు. అందులో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. తాము మహిళలను నిర్లక్ష్యం చేయబోమని... వారిపట్ల గౌరవం ఉందన్నారు. తమకు మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారని.. వారి మద్దతే లేకపోతే తాము అధికారంలోకి రాగలిగేవారం కాదన్నారు. తాజాగా ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలోనూ ఒక మహిళకు స్థానం కల్పించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించాలంటూ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శనివారం శాసనసభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేసిన సూచనకు సీఎం కేసీఆర్‌ తన ప్రసంగంలో ఈ మేరకు బదులిచ్చారు. అలాగే వివిధ అంశాలపై సమాధానమిచ్చారు. కేసీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 

రైతులకు రుణమాఫీ చెక్కులు... 
కేంద్రం పీఎం–కిసాన్‌ పథకం కింద ఐదెకరాల్లోపు రైతులకు ఏటా ఇచ్చే రూ.6వేల నగదుతో సంబం ధం లేకుండానే రైతుబందు కింద రైతులకు ఎకరాకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తాం. రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు అందజేసే ఆలోచన చేస్తున్నాం. రైతులకు వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు ఇస్తాం. రైతులకు 4–5 దఫాలుగా రుణమాఫీ చేస్తాం. ఈ విషయంలో రైతులు ఆందోళనకు గురికావద్దు. ఒకవేళ కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఏర్పడితే ముందుగానే మాఫీ చేస్తాం. ఈ విషయంపై రైతులకు నేనే లేఖ రాస్తా. కిందటిసారి తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడు బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టారు. రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ కాగానే లబ్ధిదారుల నుంచి బ్యాంకర్లు వడ్డీ కట్‌ చేసుకున్న సంఘటనలు కొన్నిచోట్ల జరిగాయి. మరోసారి రైతులకు అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు అందజేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రూ. 1.60 లక్షలలోపు రుణాలపై రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. ధరణి వెబ్‌సైట్‌ చూసి రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశిస్తాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ భూములను ఆక్రమించిన వారిలో అనర్హులనే ఖాళీ చేయిస్తాం. రైతులకు ఇంకొకరి అజమాయిషీ ఉండనీయం. 

కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వలేం... 
కౌలు రైతులకు రైతుబంధు పథకం అమలు చేయడం సాధ్యం కాదు. రైతుబంధు సొమ్ము తీసుకునే
రైతులే ఉదారంగా కౌలు రైతులకు ఎంతో కొంత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. పాత పాస్‌బుక్కుల్లో ఉన్న 33 అనవసర కాలమ్‌లను ఎత్తివేశాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వచ్చే ఆరు నెలల్లో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తాం. భూముల విషయంలో అటవీ, రెవెన్యూ అధికారుల మధ్య సమస్యలు ఉన్నాయి. పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. రెండు, మూడు నెలల్లో ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తాం. గంట గంటకు రికార్డులు అప్‌డేట్‌ అవుతాయి. భూపాలపల్లిలో ఒక రైతు కుటుంబం ఎమ్మార్వోకు లంచం కోసం భిక్షాటన చేయడం చూసి వెంటనే చర్య తీసుకున్నాం. 

అమెరికా అప్పులున్న దేశం కూడా! 
ప్రపంచంలో ఏదైనా అత్యంత ధనిక దేశం ఉందంటే అది అమెరికానే. అదే సమయంలో అత్యంత అప్పులున్న దేశం కూడా అదే. అటువంటి అమెరికా తెలివిలేక అప్పులు చేసిందా? మన కంటే పెద్ద దేశమైన చైనా జీఎస్‌డీపీ మన కంటే తక్కువ. 1980 వరకు చైనా మనకంటే పేదరికంలో ఉండేది. చైనాలో కరువు వస్తే ఒకేసారి 7–10 లక్షల మంది చనిపోయారు. అక్కడి పాలకుల విధానాల వల్ల 2, 3 దశాబ్దాల కాలంలోనే చైనా మన కంటే వేగంగా అభివృద్ధి చెందింది. జపాన్‌ జీఎస్‌డీపీ కంటే 300 శాతం అధికంగా అప్పులు తీసుకుంటుంది. అప్పులు తెచ్చేది తినడానికి కాదు.. అభివృద్ధి కోసం, ప్రాజెక్టులు కట్టడం కోసమే. రాష్ట్రానికి చెందిన 25 సంవత్సరాల బాండ్లు కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. తెలంగాణ బాండ్లను బ్యాంకులు పోటీపడి కొన్నాయి. 

సాగునీటి ప్రాజెక్టుల కోసమే అప్పులు చేస్తున్నాం. వాటిని తీర్చే సత్తా తెలంగాణ రాష్ట్రానికి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని ఎక్కడా దాటలేదు. అప్పుల విషయంలో ఆర్‌బీఐ నోడల్‌ ఏజెన్సీగా ఉంటుంది. ప్రభుత్వాలు చేసే అప్పులు ప్రైవేటు అప్పుల్లా ఉండవు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే సంస్థలు అప్పులు ఇస్తాయి. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన ఐదారు రోజుల్లోనే రూ. 15 వేల కోట్ల అప్పు ఇస్తామని పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లాంటి జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. రూరల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ. 50 వేల కోట్ల వరకు రుణం ఇస్తామని చెప్పింది. కాళేశ్వరం చివరి దశలో ఉన్నందున దానికి అప్పు ఇవ్వాలని కోరాం. 

దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి... 
రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.50 వేల కోట్లకుపైగా నిధులు పోతున్నా రాష్ట్రానికి రూ. 24 వేల కోట్లే తిరిగి వస్తున్నాయి. మిగిలిన రూ. 26 వేల కోట్లు కేంద్రమే ఉపయోగించుకుంటోంది. దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను గుప్పిట్లో పెట్టుకుంది. రాష్ట్రాల పరిధిలోని అనేక శాఖల అధికారాలు కేంద్రానికి ఇచ్చారు. రాష్ట్రాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాల గురించి కేంద్రం నిర్ణయం తీసుకోవాలా? రోజువారీ కూలీకి ఢిల్లీ నుంచి అనుమతి కావాలా? ప్రధాని మోదీ చెబుతున్న సహకార సమాఖ్య ఎక్కడా లేదు. నదీ జలాల వాటాపై తేల్చాలని ప్రధాని మోదీకి స్వయంగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. ఉమ్మడి జాబితాలోని అంశాలతో సమస్యలు తలెత్తుతున్నాయి. 

దళితులు, గిరిజనులు ఇప్పటికీ అభివృద్ధికి దూరంగానే ఉన్నారు. రెడ్డి, వైశ్యులు, వెలమలు కూడా కార్పొరేషన్లు కోరుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో కేంద్రం నుంచి ప్రతి నెలా ఒకటో తేదీకి నిధులు వచ్చేవి. మోదీ వచ్చాక అవి ఆలస్యమవుతూ 15వ తేదీకి వచ్చే పరిస్థితి నెలకొంది. కేంద్రం నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రాజెక్టులు కడుతున్నాం. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వచ్చాయి. రాష్ట్రం కోసం ప్రొటోకాల్‌ తక్కువ ఉన్న మంత్రులను కూడా స్వయంగా కలిశా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాకు నీరందిస్తాం. ఈ ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్‌బీఐ అవకాశం ఇచ్చింది. అసెంబ్లీ తర్వాత రుణాల రీ షెడ్యూల్‌ చేయాలని ఆదేశాలు ఇస్తాం. లోక్‌సభ ఎన్నికల తర్వాతైనా కేంద్రంలో గుణాత్మక ప్రభుత్వం ఏర్పడాలి. ఎవరితోనూ రాజీపడాల్సిన అవసరం మాకు లేదు. వచ్చే పదేళ్లలో తెలంగాణ ఖర్చు పెట్టబోయే బడ్జెట్‌ రూ. 30 లక్షల కోట్లు. 

త్వరలో కొత్త మున్సిపల్‌ చట్టం... 
మనిషి కులం మారదు. అయినా ప్రజలు పలుమార్లు కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండటం శోచనీయం. ఈ పరిస్థితి మారాలి. రాబోయే కొన్ని నెలల్లోనే పలు సంస్కరణలు అమలు కాబోతున్నాయి. పుట్టిన వెంటనే కుల ధ్రువీకరణ పత్రం జారీ చేస్తాం. సర్టిఫికెట్ల జారీలో ఉన్న లొసుగులను సరిచేస్తాం. మున్సిపాలిటీల్లో లంచం ఇవ్వకుండా పనులు జరిగే రోజులు రావాలన్నారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తాం. త్వరలోనే కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ప్రతినెలా పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేస్తాం. కంక్లూజివ్‌ టైటిల్‌ను తీసుకొస్తాం. దీనివల్ల ఆక్రమణలు జరగవు. ప్రజల ఆస్తులకు ప్రభుత్వం బాధ్యత వహించి రక్షణగా ఉంటుంది. ప్రభుత్వ శాఖల భూములను కూడా గుర్తిస్తాం. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు రాని వారు లక్ష మంది ఉన్నారు. వారందరికీ పట్టాలు ఇస్తాం. 

మొదటి విడతలోనే ఎన్నికలు పెట్టాలని కోరాం... 
లోక్‌సభ ఎన్నికలను రాష్ట్రంలో మొదటి విడతలో పెట్టాలని కోరాం. ఎందుకంటే ఎప్పుడో చివరి దశలో ఎన్నికలు పెడితే అప్పటివరకు ఎన్నికల కోడ్‌ వల్ల పనులేవీ చేయకుండా కూర్చోవాల్సి వస్తుంది. ముందే ఎన్నికలు పెడితే మున్సిపాలిటీలు, జెడ్పీ, మండల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల కోసం 4–5 వేల సిబ్బందిని భర్తీ చేసి వాటిని పరిపుష్టం చేస్తాం. ప్రతి జిల్లాలో సెషన్‌ కోర్టులు అవసరం. ఈ విషయంపై సీజేతో మాట్లాడతా. 

దేశంలో ఆరు పెద్ద నగరాలకు కేంద్రం ఏటా రూ. 5 వేల కోట్లు కేటాయించి అంతే మొత్తంలో ఆయా రాష్ట్రాలు కూడా కేటాయింపులు చేస్తే రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయి. ఈ విషయాన్ని ప్రధానికి కూడా చెప్పా. చైనాలోని బీజింగ్‌లో ఐదు ఔటర్‌ రింగ్‌రోడ్డులు ఉన్నాయి. మరొకటి కూడా కడుతున్నారు. అయినా అక్కడ ట్రాఫిక్‌జాం అవడానికి ప్రధాన కారణం బీజింగ్‌లో 70 లక్షల కార్లు ఉండటమే. ఢిల్లీలోనూ కాలుష్యం పెరుగుతోంది. హైదరాబాద్‌ ఇందిరా పార్కు లాంటి చోట్ల ఆక్సిజన్‌ సెల్లింగ్‌ సెంటర్లు వచ్చే పరిస్థితి నెలకొంది. ఒక పరిమితి దాటితే ప్రజలను పట్టణాలకు వలస రానీయకూడదా అన్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌ విషయంలో మనం జాగ్రత్త పడాల్సి ఉంది. 

ప్రతిపక్షాల నుంచి ఆశించిన సూచనలేవీ? 
ప్రతిపక్షాల నుంచి ఆశించిన సూచనలు, సలహాలు రాలేదు. నాలుగేళ్లుగా చెబుతున్నవే మరోసారి చెప్పాయి. రూ. 80,200 కోట్లను సభ మంజూరు చేయాల్సి ఉంది. బడ్జెట్‌ను గుణాత్మకంగా చూడాలి.. గణాత్మకంగా కాదు. 31 మార్చి తర్వాతే ఎకనామిక్‌ సర్వే పెడతారు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం వస్తే అప్పటి పరిస్థితినిబట్టి జూన్‌–జూలైలలో సంపూర్ణ బడ్జెట్‌ ప్రవేశపెడతాం. విపక్షాలు కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నాయి. ముందుస్తు ఎన్నికలపై శ్రీధర్‌బాబు వ్యాఖ్యలు వాస్తవం కాదు. నా అంచనా ప్రకారం గత జూలై–ఆగస్టులలోనే ఎన్నికలు జరగాల్సింది. ఎన్నికల సంఘం మాకు సహకరించలేదు. కాంగ్రెస్‌ పార్టీ రూ. 2 లక్షలు రుణమాఫీ అని చెప్పింది. మేము మాత్రం నాలుగు విడతల్లో రూ. లక్ష మాత్రమే మాఫీ చేస్తామని చెప్పాం. దానికి ఆమోదంగానే ప్రజలు మమ్మల్ని గెలిపించారు. రాజీవ్‌ స్వగృహకు సంబంధించి రుణాలను మాఫీ చేస్తానని నేను చెప్పలేదు. రాజీవ్‌ గృహకల్పకు సంబంధించి రూ. 4 వేల కోట్లు మాఫీ చేశాం.  

రైతు అంటే ఎవరు? 
ముఖ్యమంత్రి ప్రసంగం ముగిశాక కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కౌలు రైతుకు రైతుబంధు సొమ్ము ఇవ్వడానికి సాంకేతిక సమస్య ఉందంటున్న ప్రభుత్వం భూమి ఉన్నవాడే రైతా? పంట సాగు చేసే వాడు రైతా? నిర్వచనం చెప్పాలని కోరారు. దీనిపై కేసీఆర్‌ స్పందిస్తూ వ్యవసాయ భూమిని పట్టాగా హక్కున్న వాడే రైతు అన్నారు. భూటాన్‌ దేశంలో నేచురల్‌ హ్యాపినెస్‌ అంటూ శ్రీధర్‌బాబు అంటున్నారనీ, పక్క రాష్ట్రం వారు కూడా ఏదేదో చేశారంటూ ఎద్దేవా చేశారు.  

రెండు బిల్లులకు ఆమోదం... 
శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై జరిగిన చర్చ ఆమోదంతో ముగిసింది. అదేవిధంగా పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. 2018–19 సవరించిన అంచనాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top