తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు

Telangana Elections 2018 Mahakutami Promises Fills One Lakh Vacancies - Sakshi

అనంతరం ప్రతి ఏటా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో లక్ష కొలువులు

రూ. 2 లక్షల రైతు రుణమాఫీ 

సీఎంపీపై ‘కూటమి’ అంగీకారం 

అన్ని పార్టీల అధ్యక్షులకు ముసాయిదా ప్రతిపాదనలు  

రెండు రోజుల్లో అధికారిక ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌ : రానున్న ఎన్నికల్లో ప్రజల ముందుంచాల్సిన మహాకూటమి కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) రూపకల్పనలో కీలక అంకం పూర్తయింది. సీఎంపీకి సంబంధించిన ముసాయిదాను బుధవారం జరిగిన భేటీలో కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు ఖరారు చేశారు. భట్టి విక్రమార్క (కాంగ్రెస్‌), రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కని నర్సింహులు (టీడీపీ), కూనంనేని సాంబశివరావు, పశ్య పద్మ (సీపీఐ), కె.దిలీప్‌కుమార్, విద్యాధర్‌రెడ్డి (తెలంగాణ జన సమితి) బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో రెండున్నర గంటలకు పైగా సమావేశమై సీఎంపీలో చేర్చాల్సిన అంశాల గురించి చర్చించారు.

ముందుగా అన్ని పార్టీల నుంచి ప్రతిపాదనలను పంచుకున్న నేతలు వాటి నుంచి ఉమ్మడి ప్రణాళిక కోసం తీసుకోవాల్సిన అంశాలను గుర్తించి మెజార్టీ అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర సాధన ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే విషయంలో టీఆర్‌ఎస్‌ ఎక్కడ విఫలమైందో ఆయా అంశాలకే ప్రాధాన్యమిచ్చేలా ఉమ్మడి ప్రణాళిక తయారు చేసుకోవాలని నిర్ణయించారు. అన్ని పార్టీల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చిన ముసాయిదా అంశాలతో కూడిన పత్రాన్ని కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాల రాష్ట్ర అధ్యక్షులకు పంపారు. ఒకట్రెండు రోజుల్లో ఆయా పార్టీల అధ్యక్షులు వాటిని ఆమోదించి అధికారికంగా ప్రకటిస్తారని సమావేశంలో పాల్గొన్న నేతలు తెలిపారు.  

విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులే లక్ష్యం... 
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జరిగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు, నిరుద్యోగులను ఆకర్షించేలా ఉమ్మడి ప్రణాళిక తయారవుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మహాకూటమి అధికారంలో వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అంతేకాకుండా ప్రతి యేటా లక్ష ఉద్యోగాలను (ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో)¿ భర్తీ చేసేలా కేలండర్‌ ప్రకటిస్తామని సీఎంపీలో ప్రకటించనున్నారు. అలాగే యువతకు సంబంధించి వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా వారికి స్వయం ఉపాధి మార్గాలను కల్పించే అంశాన్ని చేర్చనున్నారు. రైతుల విషయానికి వస్తే అధికారంలోకి రాగానే రూ.2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తామని, రూ.10వేల కోట్లతో గిట్టుబాటు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని, ప్రకృతి వైపరీత్యాల ద్వారా సంభవించే పంట నష్టాలకు పరిహారం కోసం రూ.2 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించనున్నారు. వీటికి తోడు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అన్ని వర్గాలకు ఉచిత వైద్యం, బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రాధాన్యంతో పాటు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, మూడెకరాల భూమికి ప్రత్యామ్నాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.  

సాగునీటి ప్రాజెక్టుల అక్రమాలపై విచారణ... 
నీళ్లు, నిధులకు సంబంధించి సాగు, తాగునీటి విషయంలో అత్యవసర ప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని చెప్పనున్నారు. దీంతోపాటు టీఆర్‌ఎస్‌ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినందున తాము అధికారంలోకి రాగానే దీనిపై విచారణ చేపడతామని ప్రకటించనున్నారు. విచారణ అనంతరం తేలిన నివేదికల ఆధారంగా ఇందుకు కారణమైన వ్యక్తులు, ఏజెన్సీలు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎంపీలో ప్రజల ముందు ఉంచాలని సమావేశంలో నిర్ణయించారు.  

‘తెలంగాణ పరిరక్షణ కూటమి’గా నామకరణం!... 
అయితే, మహాకూటమికి ఏం పేరు పెట్టాలన్నదానిపై భాగస్వామ్య పక్షాల్లో స్వల్ప చర్చ జరిగింది. కూటమికి తెలంగాణ పరిరక్షణ (సేవ్‌ తెలంగాణ) కూటమి లేదా తెలంగాణ పరిరక్షణ వేదిక లేదా తెలంగాణ పరిరక్షణ సమితిగా నామకరణం చేయాలని టీజేఎస్‌ నేతలు ప్రతిపాదించారు. అయితే, ఆ సమయంలో కాంగ్రెస్‌ ప్రతినిధులు సమావేశంలో లేకపోవడంతో మరోసారి దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. దాదాపు తెలంగాణ పరిరక్షణ కూటమి అనే పేరు ఖరారయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కూటమి చైర్మన్‌గా ఎవరుండాలన్న దానిపై బుధవారం భేటీలో చర్చకు రానట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సమావేశం అనంతరం రావుల చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సీఎంపీ అమలు పర్యవేక్షణ కమిటీకి కోదండరాం చైర్మన్‌గా ఉంటారని చెప్పారు. కూటమి చైర్మన్‌గా కోదండరాం ఉంటారని టీజేఎస్‌ నేత దిలీప్‌కుమార్‌ వెల్లడించారు. అయితే, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కూటమి వర్గాలు చెబుతున్నాయి.  

ఒకట్రెండు రోజుల్లో ప్రజల ముందుకు...: భట్టి విక్రమార్క (కాంగ్రెస్‌) 
‘కూటమి పార్టీలం ఉమ్మడి ఎజెండాతో ముందుకు పోవాలని నిర్ణయించాం. వచ్చే ఎన్నికల తరువాత ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యేలా అందరం కృషి చేస్తున్నాం. భాగస్వామ్య పక్షాలతో చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అన్ని అంశాలపైనా ఏకాభిప్రాయం వచ్చింది. ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయి ఎజెండాను ప్రజల ముందు ఉంచుతాం.’ 

కాలపరిమితితో కూడిన కార్యాచరణ: కె.దిలీప్‌కుమార్‌ (టీజేఎస్‌) 
‘కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)కి సంబంధించిన ముసాయిదా ఎజెండాను పాయింట్ల వారీగా చర్చించాం. అన్ని పార్టీల ప్రతిపాదనలను పంచుకున్నాం. చర్చల అనంతరం ఏకాభిప్రాయం వచ్చిన ముసాయిదాను అన్ని పార్టీల అధ్యక్షులకు పంపిస్తాం. ఒకట్రెండు రోజుల్లో తుది నిర్ణయం వెలువడుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చేలా మా ప్రణాళిక ఉండనుంది. ఏడాదికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న టీఆర్‌ఎస్‌ నాలుగేళ్లలో భర్తీ చేసింది.. 23,500 ఉద్యోగాలే. మహాకూటమి అధికారంలోకి వస్తే తొలి ఏడాది లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మిగిలిన లక్ష ఉద్యోగాల భర్తీకి కాలపరిమితితో కూడిన కేలండర్‌ ప్రకటిస్తాం. ప్రాజెక్టుల నిర్మాణంలో ఈపీసీని పూర్తిగా రద్దు చేసి సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తాం.’ 

అన్ని వర్గాలు సంతృప్తి చెందేలా సీఎంపీ: రావుల (టీడీపీ) 
‘టీఆర్‌ఎస్‌ హయాంలో వ్యవసాయరంగం కుదేలయింది. విద్యా రంగంలో విఫలమయ్యాం. 10 లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్‌ అయ్యారు. వైద్య రంగంలో జరిగింది ప్రచారమే తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ కనిపించడం లేదు. మహాకూటమి అధికారంలోకి వస్తే కాలపరిమితితో కూడిన నిర్ధిష్ట కార్యాచరణను ప్రకటిస్తాం. సమాజంలోని అన్ని వర్గాలు సంతృప్తి చెందేలా, ప్రతి పేదవాడికి గూడు కల్పించేలా మా సీఎంపీ ఉంటుంది. టీఆర్‌ఎస్‌ తరహాలో 32 పేజీలు, 33 వాగ్దానాల్లాగా మా మేనిఫెస్టో ఉండదు. సీఎంపీ అమలును పర్యవేక్షించేందుకు కోదండరాం నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసుకుంటాం.’ 

అమరవీరుల ఆకాంక్షలు... కొత్తదనం: కూనంనేని (సీపీఐ) 
‘నీళ్లు, నిధులు, నియామకాల పునాదులపై ఏర్పడ్డ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమయిన అంశాల నుంచి మేం ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్తదనంతో కూడిన పరిపాలనను తీసుకువస్తాం. గ్రామస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తాం. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, మూడెకరాల భూమికి ప్రత్యామ్నాయాలు చూపెడతాం. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల క్రమబద్ధీకరణ, పవర్‌ టారిఫ్‌ సవరణ, ఆస్తిపన్ను విషయాల్లో కూడా కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.’ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top