పోరు గడ్డ..ఉద్దండుల అడ్డా!

Rayalaseema's Face Kurnool District Is Ready For The Election - Sakshi

సాక్షి, కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు జిల్లా మరో సార్వత్రిక సమరానికి సిద్ధమైంది. రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జిల్లాలో మరో సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆయా రాజకీయ పార్టీల నేతలు ఉత్సాహం చూపుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక పదవులు అధిరోహించి ఆ పదవులకే వన్నె తెచ్చిన నేతలు ఎందరో ఉన్నారు.

2019 ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో జిల్లాలోని ప్రధాన పార్టీలైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్, టీడీపీతో పాటు జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు సమరానికి సై అంటున్నాయి.  ఈ నెల 18వ తేదీ నుంచే నామినేషన్ల దాఖలు చేయనుండడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించాయి. నేడే, రేపో ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారో ప్రకటించే అవకాశం ఉంది.  

16 పర్యాయాలు లోక్‌సభ, 14  పర్యాయాలు శాసనసభ ఎన్నికలను చవిచూసిన కర్నూలు జిల్లా మరోసారి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఓటరు జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు తదితర వాటితో సన్నద్ధంగా ఉంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి జిల్లా రాజకీయాలను విశ్లేషించి చూస్తే 1953 ఆక్టోబర్‌ 1వ తేదీ కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఆవిర్భావించింది.

ఆ తరువాత 1956 నవంబర్‌ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ అమల్లోకి వచ్చింది. జిల్లాలో కర్నూలు, నంద్యాల లోక్‌సభ స్థానాలకు మొదటి సారిగా ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక పదవులు అధిరోహించిన నాయకులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1952లో జరిగిన ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుంచి జనరల్‌ సీటుకు పోటీ చేసి గొలుపొందిన దామోదరం సంజీవయ్య, ఆ తరువాత 1960లో రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేశారు.1952వ సంవత్సరంలో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది.

అనంతరం పలు కారణాలతో నంద్యాల నియోజకవర్గం రద్దు అయింది. తిరిగి 1967లో ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపి నంద్యాల మళ్లీ ప్రత్యేక లోక్‌సభ నియోజకవర్గంగా అవతరించింది. 1977లో నీలం సంజీవరెడ్డి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆ పార్టీకి ఎంపికైన ఏకైక అభ్యర్థిగా పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. ఆ తరువాత నీలం సంజీవరెడ్డి  భారత రాష్ట్రపతిగా కూడా ఎన్నికై ఆ పదవికి వన్నె తెచ్చారు. 1991లో నంద్యాల పార్లమెంట్‌కు ఆప్పటి భారత ప్రధానమంత్రి పీవీ నరసింహరావు పోటీ చేసి గెలుపొందారు. కాగా, 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 14 అసెంబ్లీ స్థానాలకుగాను 11లో విజయం సాధించింది. రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది.
 
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా.?
  సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ విడుదల కావడంతో  జిల్లాలో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమకు అసెంబ్లీ, పార్లమెంట్‌ టిక్కెట్‌ కేటాయించాలని పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వీరందరూ ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను తెలుసుకోవాల్సి ఉంది. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. పోటీ చేసేవారి అర్హతలు, నామినేషన్‌ వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి.. 
అసెంబ్లీ/ పార్లమెంటు నియోజకవర్గాలకు పోటీ చేసేవారు 25 ఏళ్ల వయస్సు కల్గి ఉండాలి. ఓటరు అయి ఉంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయవచ్చు. స్థానికేతరులు పోటీ చేసినప్పుడు ప్రతిపాదించేవారు మాత్రం  ఆ నియోజకవర్గానికి చెందినవారై ఉండాలి. 
- స్థానికేతర నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు ఓటు ఏ నియోజకవర్గంలో ఉందో అక్కడి రిటర్నింగ్‌ అధికారి నుంచి  అటెస్టెడ్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంది. 
-  అభ్యర్థులు నామినేషన్‌ దాఖలుకు ముందు విధిగా బ్యాంకు ఖాతా పాసుపుస్తకాన్ని నామినేషన్‌ సమయంలో రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి. 
-  ఓసీ, బీసీ అభ్యర్థులు అసెంబ్లీకి పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో రూ.10 వేలు డిపాజిట్‌ చెల్లించాలి. పార్లమెంటుకు పోటీ చేస్తే రూ.25 వేలు డిపాజిట్‌ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు మాత్రం ఇందులో సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు విధిగా కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంది. 
- గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తే సంబంధిత నియోజకవర్గానికి చెందిన ఒక్క ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. ఇతరులను మాత్రం విధిగా 10 మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంది. 
- గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరపున పోటీ చేసినప్పుడు నామినేషన్‌ గడువు సమయం ముగిసేలోపు ఆయా రాజకీయ పార్టీల  ఏ, బీ ఫారమ్‌లను ఆర్‌ఓకు సమర్పించాలి. అప్పుడే పార్టీ గుర్తు లభిస్తుంది. ఏ, బీ ఫారమ్స్‌ ఇవ్వలేకపోయినప్పుడు ప్రతిపాదించిన ఓటర్ల సంఖ్య 10 కంటే తక్కువ ఉంటే ఆ  నామినేషన్‌ పరిశీలన తిరస్కరణకు గురవుతుంది. ప్రతిపాదించిన ఓటర్లు 10 మంది ఉంటే ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గుర్తిస్తారు.
- అసెంబ్లీ లేదా పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు నామినేషన్‌ సమయంలో నోటరీ చేయించిన అఫిడవిట్‌ సమర్పించాలి. ఇందులో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు సమగ్రంగా  ఉండాలి. 
- అఫిడవిట్‌లోని అన్ని కాలమ్స్‌ను విధిగా పూర్తి చేయాలి. ఏ ఒక్క కాలమ్‌ ఖాళీగా ఉంచిన రిటర్నింగ్‌ అధికారి నోటీసు ఇస్తారు. అప్పటికి స్పందించి పూర్తి చేసేసరిలేకపోతే నామినేషన్‌ తిరస్కరిస్తారు.
    నియోజకవర్గాల వివరాలు.. 
   కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలు ఉన్నాయి.  
- 2009లో సంవత్సరంలో రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పటి వరకు కర్నూలు జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉండగా కొత్తగా మంత్రాలయం ఆవిర్భావించి ఆ సంఖ్య 14కు         చేరుకుంది.
- 2009 వరకు ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న ఆలూరు జనరల్‌ కేటగిరిగా మారింది. జనరల్‌గా కేటగిరిలో ఉన్న నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్‌గా అవతరించింది.   
కర్నూలు పార్లమెంట్‌లోని నియోజకవర్గాలు : కర్నూలు, కోడుమూరు(ఎస్సీ), మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ 
నంద్యాల పార్లమెంట్‌లోని నియోజకవర్గాలు : నంద్యాల, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన్‌  

 కోడ్‌ అమల్లోకి వచ్చింది
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అన్ని రకాల టీమ్‌లను ఏర్పాటు చేశాం. షెడ్యూల్‌ ప్రకటనతోనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. టీమ్‌లన్నీ రంగంలోకి దిగాయి. మే 23వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. రాజకీయ పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు, ఇతరత్రా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా అధికారుల అనమతి తప్పనిసరి. కొత్తగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయరాదు.  అనుమతుల కోసం సువిధ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే 48 గంటల్లో చర్యలు తీసుకుంటాం. ఎన్నికల కోడ్‌ను అన్ని రాజకీయ పార్టీలు తూచా పాటించాలి. ఓటరు నమోదుకు ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 15లోపు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరినీ ఓటరుగా నమోదు చేసి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పిస్తాం.  
 - ఎస్‌.సత్యనారాయణ, కలెక్టర్‌ 

బందోబస్తు ప్రణాళిక సిద్ధం 
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 28 గ్రామాల్లోని 71 పోలింగ్‌ కేంద్రాలను వనరబుల్‌ కేంద్రాలుగా గుర్తించాం. మరో 740 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేశాం. 19 కంపెనీల పోలీసులు బందోబస్తులో ఉంటారు.11,590మంది పోలీసులతో బందోబస్తు ప్రణాళిక సిద్ధంగా ఉంది. 14 వేల మందిపైన బైండోవర్‌ కేసులు పెట్టాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు  8,694 మందిపై బైండోవర్‌ చేశాం. జిల్లాలో 42 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం, నగదు తరలించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా నగదు తీసుకెళ్లాలంటే తగిన డాక్యుమెంట్లు, వివరాలను చూపాలి. ఇప్పటి వరకు రూ.1.37 కోట్ల వరకు నగదును సీజ్‌ చేశాం.      
– కె.ఫక్కీరప్ప,  ఎస్పీ  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top